ఆయుష్

"ఇంట్లో యోగ, కుటుంబంతో యోగ" అనే ప్రచార కార్యక్రమంతో అంతర్జాతీయ యోగ దినోత్సవం 2020 కి సన్నద్ధం అవుతున్న ఆయుష్

Posted On: 16 JUN 2020 1:13PM by PIB Hyderabad

ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి, రోజువారీ కార్యకలాపాల మందగమనం, ప్రజల కదలికలపై ఆంక్షలు దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంటోంది. యోగ దినం ద్వారా ఆరోగ్య-నిర్మాణ, ఒత్తిడి తగ్గించే అంశాలు ఈ సరి యోగ లక్ష్యంగా ఉంటుంది. దీనిని సులభతరం చేయడానికి, ఆయుష్ మంత్రిత్వ శాఖ శిక్షకుల నేతృత్వంలోని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది, ప్రజలు దీనిని అనుసరిస్తూ సంఘీభావంతో సాధన చేయడానికి జూన్ 21 న ఉదయం 6:30 గంటలకు దూరదర్శన్‌లో ప్రసారం ఆవుతుంది.

తాజా పరిస్థితుల్లో, అంతర్జాతీయ యోగ దినం (ఐడివై) పాటించడానికి కొత్త ధోరణి ముందుకొచ్చింది. అదే, ఆరోగ్యాన్ని యోగ ద్వారా పెంపొందించుకోడానికి యోగాని ఇంటి వద్దే నిర్వహించడం. ఆయుష్ మంత్రిత్వ శాఖ తన ఐడివై కార్యకలాపాలలో “ఇంట్లో యోగా, కుటుంబంతో యోగా” అనే ఇతివృత్తంతో ప్రోత్సహించడం ద్వారా ఈ ధోరణికి మద్దతు ఇస్తోంది.

ప్రతి సంవత్సరం, జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకుంటారు. మునుపటి సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజలు దేశ సంస్కృతి సాంప్రదాయం వేడుకగా స్వీకరించారు. ఈ సంవత్సరం ఐడివై ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో వస్తుంది. అందువల్ల దీని  పరిశీలన ఈసారి మంచి ఆరోగ్యం మరియు మనశ్శాంతి కోసం అన్వేషణగా మారింది. కోవిడ్-19తో ప్రపంచమంతా ఆందోళన అలుముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగ సాధన ఇపుడు ఎంతో ఔచిత్యం. అంతే కాదు యోగ ఒత్తిళ్లను ఛేదించే గొప్ప సాధనం కూడా. 

45 నిమిషాల ఉమ్మడి యోగా ప్రోటోకాల్ (సివైపి) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన యోగా కార్యక్రమాలలో ఒకటి. ఇది మొదటి నుండి ఐడివై గుండెకాయ లాంటిది. ఇది ప్రముఖ యోగా గురువులు, నిపుణుల బృందం అభివృద్ధి చేసింది. ప్రజల శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సురక్షితమైన పద్ధతులను కలిగి ఉంది. వీటిని రోజూ ఇంట్లో సాధన చేయవచ్చు. ఇది వారి వయస్సు, లింగబేధంతో సంబంధం లేకుండా మెజారిటీ ప్రజలు సులభంగా స్వీకరించే విధంగా రూపొందించారు. సాధారణ శిక్షణా కార్యక్రమాలు, ఆన్‌లైన్ తరగతుల ద్వారా నేర్చుకోవచ్చు.

యోగా పోర్టల్, దాని సోషల్ మీడియా హ్యాండిల్స్, టెలివిజన్‌ ద్వారా మంత్రిత్వ శాఖ బహిరంగంగా అందుబాటులో ఉంచిన వనరులను ఉపయోగించి కామన్ యోగా ప్రోటోకాల్ నేర్చుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజలను ప్రోత్సహిస్తోంది. ప్రసార భారతి 2020 జూన్ 11 నుండి ఉదయం 08:00 నుండి ఉదయం 08:30 వరకు డిడి భారతిపై కామన్ యోగా ప్రోటోకాల్ యొక్క రోజువారీ ప్రసారాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ఆయుష్ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా అందుబాటులో ఉంది. ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఆడియో-విజువల్ ప్రదర్శన సహాయంతో కామన్ యోగా ప్రోటోకాల్‌తో ప్రజలకు పరిచయం చేయడం దీని ఉద్దేశ్యం.

కామన్ యోగా ప్రోటోకాల్‌ ముందే తెలుసుకోవడం, ప్రజలు పూర్తిగా సిద్ధం కావడానికి, 2020 జూన్ 21 న ఉదయం 0630 గంటలకు వారి కుటుంబాలతో ఆయా ఇళ్లలో యోగా చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావడానికి సహాయపడుతుంది. ఇంకా, అదే సమయంలో మంత్రిత్వ శాఖ ఒక టెలికాస్ట్ నిర్వహిస్తుంది, ఒక శిక్షకుడు నేతృత్వంలో ప్రజలను అనుసరించడానికి, యోగా సాధన చేయడానికి వీలు కల్పిస్తుంది, దీని వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ఆకర్షణీయమైన బహుమతులతో ఒక వీడియో పోటీ (మై లైఫ్ మై యోగా వీడియో బ్లాగింగ్ పోటీ) కూడా నిర్వహించబడుతోంది, దీనిలో ప్రజలు వివిధ యోగాసనాలు ప్రదర్శించే వారి చిన్న వీడియో క్లిప్‌లను పోస్ట్ చేయమని ప్రోత్సహిస్తున్నారు.

“ఇంట్లో యోగ, కుటుంబంతో యోగ ” ఇతివృత్తాన్ని ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక సంస్థలు మరియు వ్యక్తులు స్వీకరించారు. మైసూరు యోగా సమాఖ్య సహకారంతో మైసూరు జిల్లా యంత్రాంగం కనీసం 1 లక్షల మందితో ఐడివై కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది, వారు ఆయా ఇళ్ల పై డాబాల నుండి సామరస్యపూరితంగా యోగా ప్రదర్శనలు ఇస్తారు. నేచురోపతి, యోగా ప్రమోషన్ కోసం పనిచేసే ఎన్జీఓ అయిన ఇంటర్నేషనల్ నేచురోపతి ఆర్గనైజేషన్ (ఐఎన్ఓ) తన 25 లక్షల మంది సభ్యులను వారి ఇళ్ల నుండి సివైపి ఆధారంగా శ్రావ్యంగా యోగా చేయమని ప్రోత్సహించడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. జూన్ 21 న ఉదయం 0700 గంటలకు " ఇంట్లో యోగా కుటుంబంతో యోగ" కార్యక్రమంలో 50,000 మంది అనుచరులు చేరతారని ధర్మస్థల (కర్ణాటక) ఎస్డిఎం గ్రూప్ అంచనా వేసింది. విద్యా సంస్థలతో సహా అనేక ఇతర సంస్థలు కూడా ఈ కార్యకలాపాల కోసం వివరణాత్మక ప్రణాళికలను ఖరారు చేశాయి. ఈ నిర్వాహకులు చాలా మంది సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అవలంబిస్తున్నారు.

 

***


(Release ID: 1631917) Visitor Counter : 264