గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ప్రధాని వన్ ధన్ యోజన 18 నుంచి 50 వేల స్వయం సహాయక బృందాలకు విస్తరింపు

గిరిజనుల వాటా మూడింతలు పెరిగి 10 లక్షలకు చేరిక

Posted On: 15 JUN 2020 9:14PM by PIB Hyderabad

కోవిడ్ - 19 విసిరిన సవాలుతోబాటు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి భిన్నమైన, వినూత్నమైన వైఖరి అవలంబించటం తప్పనిసరి. ప్రస్తుత సంక్షోభ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్నది గిరిజనులే. ఇలాంటి సమయంలో గిరిజన వ్యవహారాల ఆధ్వర్యంలో ట్రైఫెడ్ సంస్థ చేపట్టిన పథకం కింద ఏర్పాటైన వన్ ధన్ స్టార్టప్స్ ఒక ఆశాకిరణంలా ఉంది. అడవులలో వివిధ ఉత్పత్తులు సేకరించేవారు, సంచార జాతులు, స్వగ్రామాలకు తిరిగి చేరుకున్న కార్మికులు, హస్తకళాకారులకు ఇదొక ఉపాధి కల్పించే మార్గంగా తయారైంది.

ప్రజలలో దీని పట్ల మరింత అవగాహన కల్పించటానికి, వన్ ధన్ స్టార్టప్స్ సాధించిన పురోగతికి తెలియజెప్పి ఈ సరికొత్త ధోరణి పట్ల సానుకూల వైఖరి కల్పించటానికి ట్రైఫెడ్ ఆధ్వర్యంలో వెబినార్ ద్వారా ఈ మీడియా సమావేశం ఏర్పాటైంది. "వన్ ధన్: భారత్ లో గిరిజన స్టార్టప్స్ వికాసం" పేరుతో నడిచిన ఈ వెబినార్ కు సంస్థ ఎండీ శ్రీ ప్రవీర్ కృష్ణ అధ్యక్షత వహించారు. పిఐబి ఎడిజి కుమారి నానూ భాసిన్, మైగవ్ సీఈవో శ్రీ అభిషేక్ సింగ్ సహా దాదాపు 40 మంది ఈ వెబినార్ లో పాల్గొన్నారు.   ట్రైఫెడ్ బృందంలో అన్ని విభాగాధిపతులు, సీనియర్ అధికారులు ఉన్నారు.

శ్రీ ప్రవీర్ కృష్ణ తన స్వాగతోపన్యాసంలో వన్ ధన్ యోజన్ ను స్థూలంగా పరిచయం చేశారు. సాధించదలచుకున్న లక్ష్యాలు, ప్రస్తుత సంక్షోభ సమయంలో దాని పనితీరు వివరించారు. 22 రాష్ట్రాల్లోని 18 వేల స్వయం సహాయక బృందాలకు, 3.6 లక్షల మంది అటవీ ఉత్పత్తుల సేకరణ దారులకు ఉపాధి కల్పించటం కోసం 1205  గిరిజన వ్యాపార సంస్థలు నెలకొల్పినట్టు తెలియజేశారు. "స్థానిక ఉత్పత్తులకోసం ఎలుగెత్తి చాటండి" అనే నినాదం ఈ కష్ట కాలంలో ఒక మంత్రంగా తయారైందని, అదే ఇప్పుడు "గిరిజనుల కోసం ఎలుగెత్తి చాటండి" అనే నినాదంగా మారి "నా వనం , నా ధనం నా పరిశ్రమ " గా రూపుదిద్దుకుందని అన్నారు.  గిరిజన సంక్షేమ మంత్రిత్వశాఖ ఆర్టికిల్ 275(I) కింద కోవిడ్ -19 సహాయ పథకం కింద అటవీ ఉత్పత్తుల సేకర్తలైన  10 లక్షలమంది గిరిజనులను మూడు రెట్లు చేయటమే స్టార్టప్ పథకం లక్ష్యమని వివరించారు. రాష్ట్రాలవారీగా పురోగతిని కూడా ఈ కార్యక్రమంలో వివరించారు. 2019 లో ప్రారంభమైన స్టార్టప్స్ తక్కువ కాలంలోనే 22 రాష్ట్రాలకు విస్తరించటమే కాకుండా ఈ కార్యక్రమ ప్రాధాన్యాన్ని రాష్ట్రాలు గుర్తించటంతో పోటీలా తయారైందని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితిని స్థూలంగా వివరించిన తరువాత నాగాలాండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎదురైన నిజజీవిత ఉదాహరణలను శ్రీ కృష్ణ ప్రస్తావించారు. గిరిజనుల జీవనోపాధికి ఇది ఎంతగా ఉపయోగ పడుతుందో చెప్పారు. గిరిజన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి అమ్మటంతోబాటు ఆ ఫలాలు నేరుగా గిరిజనులకే అందించటానికి సాయపడటంలో దీని ప్రాధాన్యాన్ని కూడా చెప్పారు. గిరిజన ఉత్పత్తులకు పాకేజింగ్, మార్కెటింగ్ లాంటి అదనపు విలువ జోడించటం ద్వారా లబ్ధి పొందుతున్న విధానాన్ని చర్చించారు. అదే విధంగా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో విజయగాధలు, వన్ ధన్ వికాస కేంద్రాల సమాచారం, అక్కడ అమ్ముడవుతున్న ఉత్పత్తుల జాబితా ఈ సందర్భంగా ప్రదర్శించారు.  దేశవ్యాప్తంగా మొత్తం 2000 ఉత్పత్తులను గుర్తించినట్టు చెబుతూ వాటిని విహంగ వీక్షణంలా పరిచయం చేశారు. అడవి తేనె, చీపుర్లు, కాఫీ లాంటి అనేక ఉత్పత్తుల శాంపిల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికోసం ప్రదర్శించారు. వలస వెళ్ళి తిరిగి సొంతగూటికి చేరుకున్న గిరిజనులలో, హస్తకళానిపుణులలో ఆశాకిరణం మెరిసేలా గిరిజన వ్యవహారాల శాఖ ఈ వన్ ధన్ స్టార్టప్స్ ను రూపుదిద్దుతోంది.

ఈ మొత్తం ప్రక్రియ ప్రత్యేకత ఏంటంటే ఇది మార్కెట్ తో అనుసంధానం చేయటంలో విజయం సాధించింది. ఆ విధంగా అటవీ ఉత్పత్తుల సేకర్తలను వ్యాపారులుగా మార్చగలిగింది. ఈ గిరిజన వ్యాపార సంస్థలలో ఎక్కువభాగం మార్కెట్లతో అనుసంధానం కావటం వల్ల ఇప్పటికే చాలా ఆర్డర్లు వచ్చాయి. మణిపూర్ లోని స్టార్టప్స్  పాకేజింగ్, కొత్తదనం, శిక్షణ విషయంలో యావద్దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఆ విధంగా మణిపూర్ సాధించిన విజయం ఒక నమూనాగా నిలిచిందని, తగిన సహకారం ఉంటే గిరిజన వ్యాపార సంస్థలు గిరిజనులకు ఎంత విస్తృతంగా లబ్ధి చేకూర్చగలుగుతాయో తేలిందని ఆయన అన్నారు.

అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువ జోడించటం కోసం మణిపుర్ లో  77 వన్ ధన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ కేంద్రాలు 2019 సెప్టెంబర్ నుంచి 49.1 లక్షల మేరకు ఉత్పత్తులను అమ్మినట్టు తేలింది. మణిపూర్ లో మరో విశేషం ఏంటంటే ఈ 77 కేంద్రాలు ఆహార భద్రతలోనూ, పరిశుభ్రతా ప్రమాణాలలోనూ ప్రత్యేకత చాటుకున్నాయి. ఉసిరి రసం, చింతపండు చాక్లెట్ లాంటి ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల ఆకర్షణీయమైన పాకేజింగ్ సరికొత్త పద్ధతిలో వాటిని బ్రాండింగ్ చేయటం, మార్కెట్ చేయటం అదనపు ప్రత్యేకతలు. ఒక జిల్లాలో ఈ ఉత్పత్తుల అమ్మకం కోసం ఒక మొబైల్ వాహనాన్ని నడపటం కూడా గమనించవచ్చు.

ఇలాంటి చెప్పుకోదగిన విజయాలను ప్రస్తావించిన తరువాత ఆయన వన్ ధన్ స్టార్టప్ పథకం విషయంలో తదుపరి చర్యలగురించి సంక్షిప్తంగా వివరించారు. ఈ పథకాన్ని ఇప్పుడున్న 18,000 స్వయం సహాయక బృందాలనుంచి 50,000  వన్ ధన్ స్వయం సహాయక బృందాలకు విస్తరించటం మొదటి అడుగుగా ఉండబోతున్నదన్నారు. ఆర్టికిల్ 275(I) కింద కోవిడ్ -19 సహాయ పథకం లో భాగంగా అటవీ ఉత్పత్తులు సేకరిస్తూ ప్రస్తుతం ఈ పథకం కింద ఉన్న 10 లక్షలమంది గిరిజనులను మూడు రెట్లు చేయటం కూడా మరో లక్ష్యమని వివరించారు. అముల్ విప్లవం తరహాలో దేశ వ్యాప్తంగా వన్ ధన్ యోజన ద్వారా గిరిజనుల జీవితాలనే సమూలంగా మార్చివేయటం అంతిమలక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇతర మంత్రిత్వశాఖలతో, సంస్థలతో కలిసిపనిచేస్తూ ఫలితాలు సాధించటానికి పథక రచన చేస్తున్నామని చెప్పారు. 


స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులు, హస్తకళాకారులు జీవనోపాథి విషయంలో సమస్యలు ఎదుర్కోకుండా చూడటానికి వన్ ధన్ వికాస్ కేంద్రాలు సమర్థంగా పనిచేసే అవకాశం ఉందని ట్రైఫెడ్ ఎండీ వివరించారు. అటవీ ఉత్పత్తుల సేకరణ సహా అన్నిటికీ డిజిటల్ వేదికలు వాడుకోగలిగేలా చేస్తే ఒక దారి చూపినట్టవుతుందని అభిప్రాయపడ్దారు. ఈ క్రమంలో https://trifed.tribal.gov.in/ పేరుతో ట్రైఫెడ్ సంస్థ ఒక వెబ్ సైట్ ఈ రోజు ప్రారంభించింది. అయితే, జూన్ 30  వరకు ప్రయోగాత్మకంగా నడిపిన తరువాత కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖామంత్రి దీన్ని లాంఛనంగా ఆవిష్కరిస్తారు. ఉత్పత్తుల సేకరణ కోసం మరో వెబ్ సైట్ ను జులై 30నాటికి అందుబాటులోకి తెస్తారు. దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న వన్ ధన్ యోజన పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి ఈ వెబ్ సైట్ చూడవచ్చు:  https://trifed.tribal.gov.in/vdvk/auth/login.php

ఒక్కో వన్ ధన్ వికాస్ కేంద్రానికి  కేంద్ర ప్రభుత్వం రూ.15  లక్షల చొప్పున కేటాయించిందని శ్రీ కృష్ణ వివరించారు. అందులో 25% -30% గ్రాంట్ ను ఇప్పటికే ముడి సరకు కొనుగోలు, లేబర్ ఖర్చులకోసం వెచ్చించారు. దేనికి ఎంతెంత వాడాలో నిర్ణయించుకునే అధికారం ఆయా కేంద్రాలకే అప్పగించారు.నాగాలాండ్ విషయానికొస్తే దాదాపు మూడున్నర కోట్ల రూపాయల మేరకు అమ్మకాలు జరిగాయి. ఈ పథకం విషయంలో మిగిలిన రాష్ట్రాలు కూడా వేగం పుంజుకుంటే ఒక్కో రాష్ట్రం సగటున కోటి రూపాయల అమ్మకాలు చెయ్యటం కొద్ది నెలల్లోనే సాధ్యం.

ఈ వెబినార్ సిరీస్ లో తదుపరి సమావేశం గిరిజన సమూహాల జీవితాలను దగ్గరగా గమనించటం మీద, వారి జీవితాలు సుఖమయం చేయటం మీద ఉంటుందని శ్రీ కృష్ణ ప్రకటించారు. మీడియా సమక్షంలో జూన్ 18 న ఈ వెబినార్ ఉంటుందని, గిరిజన భారతంలో అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర మీద చర్చిస్తామని చెప్పారు. 

***



(Release ID: 1631848) Visitor Counter : 249