PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 09 JUN 2020 6:36PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • గత 24గంటల్లో 4,785 మందిసహా 1,29,214 మందికి కోవిడ్‌-19 వ్యాధి నయమైంది. దీంతో కోలుకునేవారి శాతం 48.47గా నమోదైంది.
  • 1,29,917 యాక్టివ్‌ కేసులు వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి.
  • కోవిడ్‌-19 నియంత్రణ చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించింది.
  • కోవిడ్‌-19 కేసులు అధికంగాగల 50కిపైగా పురపాలికలకు కేంద్ర బృందాల నియామకం.
  • కోవిడ్ అత్యవసర రుణవసతి ఎంఎస్‌ఎంఈలకే కాకుండా అన్ని కంపెనీలకూ వర్తింపు: ఆర్థికమంత్రి.
  • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కానికి 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో మునుపెన్న‌డూ లేనివిధంగా రూ.1,01,500 కోట్లు; ఇప్పటికే రూ.31.943 కోట్లు విడుదల; 6.69 కోట్లమందికి ఉపాధి కల్పన.

 

Image

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; కోవిడ్‌-19 నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై మంత్రుల ఉప‌సంఘం స‌మీక్ష‌

ఈ ఉన్న‌త‌స్థాయి మంత్రుల ఉప‌సంఘం 16వ స‌మావేశాన్ని ఇవాళ దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా నిర్వ‌హించ‌గా, దీనికి చైర్మ‌న్ హోదాలో కేంద్ర ఆరోగ్య‌-కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ సంద‌ర్భంగా దేశంలో కోవిడ్‌-19 తాజా పరిస్థితులు, స్పందన-నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులు వివరించారు. అలాగే దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల మెరుగుదల గురించి తెలియజేశారు. ఈ మేరకు 2020 జూన్‌ 9నాటికి మరింత బలోపేతమైన నేపథ్యంలో ప్రస్తుతం 958 కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పడ్డాయి. వీటిలో 1,67,883 ఏకాంత చికిత్స పడకలు, 21,614 ఐసీయూ పడకలు, 73,469 ప్రాణవాయు మద్దతు పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇక 2,313 కోవిడ్‌ ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల్లో 1,33,037 ఏకాంత చికిత్స పడకలు, 10,748 ఐసీయూ పడకలు, 46,635 ప్రాణవాయు మద్దతు పడకలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా 7,525 కోవిడ్‌ సంరక్షణ కేంద్రాల్లో మరో 7,10,642 పడకలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు కోవిడ్‌ పడకల కోసం 21,494 వెంటిలేటర్లు కూడా సిద్ధంగా ఉండగా కేంద్ర ప్రభుత్వం అదనంగా 60,848 వెంటిలేటర్ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. ఇక ఐసీఎంఆర్‌ పరీక్ష నిర్ధారణ సదుపాయాలు కూడా పెరిగాయి. ఈ మేరకు ప్రస్తుతం 553 ప్రభుత్వ, 231 ప్రైవేటు (మొత్తం 784) ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. రెండు రంగాల్లోని ప్రయోగశాలలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 49 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించారు. ఇందులో గత 24 గంటల్లో పరీక్షించిన నమూనాల సంఖ్య 1,41,682గా ఉంది.

దేశంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,29,214కు చేరింది. వీరిలో గడచిన 24 గంటల్లో 4,785 మందికి కోవిడ్‌-19 వ్యాధి నయమైంది. ఈ నేపథ్యంలో కోలుకునేవారి శాతం 48.47గా నమోదైంది. ప్రస్తుతం 1,29,917 యాక్టివ్‌ కేసులు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630544

కోవిడ్‌-19 కేసులు అధికంగాగల 50కిపైగా పురపాలికలకు కేంద్ర బృందాల నియామకం

దేశంలో కోవిడ్ -19 వ్యాప్తి అత్య‌ధికంగాగ‌ల 15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 జిల్లాలు/పుర/న‌గ‌ర‌పాలిక‌ల‌లో ప‌రిస్థితుల ప‌ర్య‌వేక్ష‌ణ కోసం కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రత్యేక బృందాలను నియమించింది. కోవిడ్‌-19 నియంత్ర‌ణ దిశ‌గా ఈ బృందాల్లో స‌భ్యులైన బహుళ రంగ నిపుణులు ఆయా ప్రభుత్వాలకు అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తారు. ఈ మేర‌కు మహారాష్ట్ర (7 జిల్లాలు/పురపాలిక‌లు), తెలంగాణ (4), తమిళనాడు (7), రాజస్థాన్ (5),  అసోం (6), హర్యానా (4), గుజరాత్ (3), కర్ణాట‌క (4), ఉత్తరాఖండ్ (3), మధ్యప్రదేశ్ (5), పశ్చిమబెంగాల్ (3), ఢిల్లీ (3), బీహార్ (4), ఉత్తరప్త్రదేశ్ (4), ఒడిశా (5)లకు ఈ బృందాల‌ను నియమించింది. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టిస్తూ ఆయా రాష్ట్రాల పరిధిలోని జిల్లాలు/నగరాల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు వెళ్లి కేసులకు ప్రభావవంతమైన చికిత్స/వైద్య నిర్వహణతోపాటు కోవిడ్ నిరోధం, నియంత్ర‌ణ‌ చర్యలను సమర్థంగా అమలు చేయడంలో రాష్ట్ర ఆరోగ్యశాఖకు సహాయపడతాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630473

కోవిడ్ అత్యవసర రుణవసతి ఎంఎస్‌ఎంఈలకే కాకుండా అన్ని కంపెనీలకూ వర్తింపు: ఆర్థికమంత్రి

కోవిడ్ అత్యవసర రుణ వ‌స‌తి సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు మాత్ర‌మే ఉద్దేశించిన‌ది కాద‌ని, ఇది అన్ని కంపెనీలకూ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ‌ మంత్రి శ్రీ‌మతి నిర్మలా సీతారామన్ స్ప‌ష్టం చేశారు. ఆమె ఇవాళ భారత పారిశ్రామిక-వాణిజ్య మండళ్ల సమాఖ్య (FICCI) జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశంలో ప్రసంగించారు. భారతీయ వాణిజ్యానికి మద్దతు, ఆర్థిక వ్యవస్థల పునరుద్ధర‌ణ లక్ష్యంగా ప్రభుత్వ పారిశ్రామిక రంగానికి శ‌క్తివంచన లేకుండా సహాయం అందిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా శ్రీ‌మతి సీతారామన్ హామీ ఇచ్చారు. మీ సమాఖ్యలో సభ్యత్వం ఉన్న ఎవ‌రికైనా సమస్య ఎదురైతే త‌గిన మ‌ద్ద‌తు/చొరవ తీసుకునేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబడి ఉందిఅని చెప్పారు. అలాగే బకాయిల చెల్లింపు సమస్య పరిష్కారంపై ప్రభుత్వంలోని ప్రతి శాఖకూ ఆదేశాలిచ్చామ‌ని, దీనికి సంబంధించిన స‌మ‌స్య‌లేవైనా ఉన్నా పరిశీలిస్తామని ఆమె చెప్పారు. కొత్త పెట్టుబడులపై 15 శాతం కార్పొరేట్‌ పన్ను సదుపాయం వినియోగించుకునే గడువును పొడిగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆర్థికశాఖ మంత్రి తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630348

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కానికి 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎన్న‌డూ లేనిరీతిలో రూ.1,01,500 కోట్లు; ఇప్పటికే రూ.31.943 కోట్లు విడుదల

“మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం” కోసం ప్రస్తుత 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ప్ర‌భుత్వం రూ.1,01,500 కోట్లు కేటాయించింది. ఈ ప‌థ‌కానికి మునుపెన్న‌డూ ఇంత భారీస్థాయిలో కేటాయింపులు లేక‌పోవ‌డం ఈ సంద‌ర్భంగా గ‌మ‌నార్హం. ఇక ఈ నిధుల‌లో 2020-2021కిగాను ఇప్పటికే రూ.31,493 కోట్ల‌దాకా ప్రభుత్వం విడుద‌ల చేసింది. తదనుగుణంగా 60.80 కోట్ల తలసరి పనిదినాలు సృష్టించి, 6.69 కోట్ల మందికి ఉపాధి కల్పించబడింది. ఇక 2020 మే నెల‌లో రోజుకు స‌గ‌టున 2.51 కోట్ల‌మందికి ప‌ని దొరికింది. మొత్తంమీద ఈ 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 10 లక్షల పనులు పూర్తయ్యాయి. జ‌ల సంరక్షణ-నీటి పారుదల, మొక్క‌ల‌ పెంపకం, ఉద్యాన సాగు, జీవనోపాధిని ప్రోత్స‌హించే వ్యక్తిగత ప్ర‌యోజ‌న ప‌నులు వంటివి చేపట్టడానికి ప్రాధాన్యం ఇవ్వబడింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630371

రాష్ట్రాలు కోరితే 24 గంట‌ల్లో శ్రామిక్ స్పెష‌ల్ రైలు సిద్ధం: భార‌త రైల్వేశాఖ

భారత రైల్వేశాఖ ఇప్పటిదాకా 4,347 శ్రామిక్ స్పెష‌ల్ రైళ్ల‌లో దాదాపు 60 ల‌క్ష‌ల మందిని వారి సొంత రాష్ట్రాలకు చేర్చింది. కాగా, శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లు 2020 మే 1వ తేదీనుంచి దేశంలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కోరితే 24గంట‌ల్లోగా శ్రామిక్ స్పెష‌ల్ రైలు సిద్ధంగా ఉంటుంద‌ని రైల్వేశాఖ ప్ర‌భుత్వాలకు స‌మాచార‌మిచ్చింది. తద‌నుగుణంగా రాష్ట్రాలు త‌మ అవ‌స‌రం మేర‌కు ఎన్ని రైళ్లు కావాలో తెల‌ప‌డంతోపాటు వాటిద్వారా తగుసంఖ్య‌లో ప్ర‌యాణికుల‌ను పంపేవిధంగా ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌ని రైల్వే మంత్రి సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630477

దిగ్బంధం సమయంలో 36.02 లక్షల అభ్యర్థనలు పరిష్కరించిన ఈపీఎఫ్‌వో

దేశవ్యాప్తంగా దిగ్బంధం ఆంక్షలు అమలులో ఉన్నా కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 2020 ఏప్రిల్‌, మే నెలల్లో అత్యంత భారీస్థాయిలో 36.02 లక్షల అభ్యర్థనలను పరిష్కరించి చందాదారులకు రూ.11,540 కోట్లు పంపిణీ చేసింది. వీటిలో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో భాగంగా ఇటీవల ప్రకటించిన కోవిడ్‌-19 అడ్వాన్స్‌ కింద 15.54 లక్షల అభ్యర్థనల పరిష్కారం ద్వారా రూ.4,580 కోట్లు విడుదల చేసింది. ఇక వేతన శ్లాబు వివరాల ప్రకారం చూస్తే అభ్యర్థనదారులతో 74 శాతానికిపైగా రూ.15,000 లోపు వేతనం పొందుతున్నవారే కావడం గమనార్హం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630549

మోటారు వాహన పత్రాల చెల్లుబాటు 2020 సెప్టెంబరు 30వరకూ పొడిగింపు

దేశంలోని మోటారు వాహనాల పత్రాలు చెల్లుబాటును 2020 సెప్టెంబరు 30వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్ర రహదారి రవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ ఇవాళ ప్రకటించారు. తదనుగుణంగా మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం పంపింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్టం-1988 లేదా ఇతర చట్టాల కింద అందుబాటులోగల నిబంధనలకు తగినట్లు దీన్ని అమలు చేయాలని కోరింది. అసాధారణ కోవిడ్‌-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయా చట్టాలు, నిబంధనల పరిధిలో పర్మిట్‌, ఫీజు, పన్నులు, పర్మిట్ల నవీకరణ/జరిమానా తదితరాలపై సడలింపులను పరిశీలించాలని సూచించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630540

నెలవారీ ‘శూన్య వస్తుసేవల పన్ను’ (NIL GST) రిటర్నులు ఎస్‌ఎంఎస్‌ద్వారా సమర్పించే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం

పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు దిశగా ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి ‘ఫామ్‌ జీఎస్‌టీఆర్‌-3బి’లో నెలవారీ ‘శూన్య వస్తుసేవల పన్ను’ (NIL GST) రిటర్నులు ఎస్‌ఎంఎస్‌ద్వారా సమర్పించే వీలు కల్పించింది. దీంతో 22 లక్షలకుపైగా నమోదిత పన్ను చెల్లింపుదారులు వస్తుసేవల పన్ను చట్టం ప్రకారం నడుచుకునే అవకాశం గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ సదుపాయం కల్పించని పక్షంలో ప్రతినెలా వీరంతా ఉమ్మడి పోర్టల్‌లోని తమ ఖాతాల్లోకి ప్రవేశించి తమ రిటర్నులను అప్‌లోడ్‌ చేయాల్సి వచ్చేది. కానీ, ఇకపై శూన్య వస్తుసేవల పన్ను బాధ్యతగల పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ పోర్టల్‌ద్వారా కాకుండా ఎస్‌ఎంఎస్‌ రిటర్నులు దాఖలు చేయవచ్చు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630343

దేశంలో చక్కెర రంగం సంబంధిత సమస్యలపై శ్రీ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ సమీక్ష

కేంద్ర ఆహార-ప్రజాపంపిణీ-వినియోగదారు వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ఆహార-ప్రజాపంపిణీ విభాగం సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో చక్కెర ఉత్పత్తి, చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, ఇథనాల్‌ ఉత్పత్తి తదితర అంశాలపై వారితో ఈ సందర్భంగా చర్చించారు. రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించేలా తగిన మార్గదర్శకాలు జారీచేయాలని శ్రీ పాశ్వాన్‌ అధికారులను ఆదేశించారు. కాగా, ఈ ఏడాది చక్కెర ఉత్పత్తి 270 లక్షల టన్నులకు చేరగలదని అధికారులు మంత్రికి వివరించారు. కాగా, ప్రస్తుత చక్కెర సీజన్‌లో చక్కెర పరిశ్రమకు సహకారం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630351

స‌వ‌రించిన క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌‌కు సూక్ష్మ అట‌వీ ఉత్ప‌త్తుల కొనుగోలు; రాష్ట్రాలు స‌కాలంలో శ్ర‌ద్ధ చూపటంతో జోరందుకున్న గిరిజ‌న ఆదాయార్జన కార్య‌క‌లాపాలు

కోవిడ్ -19 మహమ్మారి ప్రభావంతో ఒడుదొడుకుల్లో పడిన పేదలు, అట్టడుగు వ‌ర్గాల ప్ర‌జ‌లు తమ కాళ్ల‌పై తాము నిల‌బ‌డ‌టంలో ప్రభుత్వం తనవంతు చేయూత అందిచేందుకు కృషి చేస్తోంది. ఈ దిశగా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కూడా తమవంతుగా ఉత్సాహపూరిత సానుకూల స్పందన కనబరుస్తున్నాయి. ఈ మేరకు 17 రాష్ట్రాల్లు దాదాపు రూ.50 కోట్లకుపైగా విలువైన సూక్ష్మ అట‌వీ ఉత్ప‌త్తులను క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌తో కొనుగోలు చేశాయి. అలాగే 7 రాష్ట్రాల్లో ప్రైవేటు సంస్థలు కూడా రూ.400 కోట్లకుపైగా విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేశాయి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ సకాలంలో కనీస మద్దతు ధరలపై చర్యలు చేపట్టి వాటిని స‌వ‌రించింది. దీంతో మంత్రిత్వశాఖతోపాటు శాఖ పరిధిలోని ‘ట్రైఫెడ్‌’ ఉమ్మడి కృషితో గిరిజనులు మార్కెట్‌లో తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను మించి అధిక విలువను కూడా పొందగలిగారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630468

రేపు ‘దూరదర్శన్‌ న్యూస్‌’ ఐడీవై-2020 ప‌రిచ‌య కార్య‌క్ర‌మం  ప్రసారం

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం (IDY)-2020పై ప‌రిచ‌య కార్య‌క్ర‌మాన్ని జూన్ 10న దూర‌ద‌ర్శ‌న్ న్యూస్ చానెల్ రాత్రి 7:00 నుంచి 8:00 గంట‌ల‌దాకా ప్ర‌సారం చేస్తుంది. మొరార్జీ దేశాయ్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా స‌హ‌కారంతో ఆయుష్ మంత్రిత్వ‌శాఖ రూపొందించిన ఈ కార్య‌క్రమాన్ని మంత్రిత్వ‌శాఖ ఫేస్‌బుక్ పేజీద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మరో 10 రోజుల్లో నిర్వహించబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం-2020కి కార్యక్రమం అధికారిక కౌంట్‌డౌన్‌గా పరిగణించబడుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630470

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: బాపుధామ్ కాలనీ నివాసితులను ఆందోళనకు గురిచేయవద్దని, వారు సమాజంలో మమేకమయ్యేలా వారికి పూర్తి అవకాశాలివ్వాలని నగర పాలనాధికారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివిధ ప్రైవేటు సంస్థలలో పెండింగ్‌ వేతనాలు చెల్లించి, ఉద్యోగావకాశాలు పెరిగేలా యాజమాన్యాలతో చర్చలు చేపట్టాల్సిందిగా కార్మిక మంత్రిత్వ శాఖను ఆయన ఆదేశించారు.
  • పంజాబ్: కోవిడ్‌-19 పరిస్థితుల నడుమ ఏర్పడిన కార్మికశక్తి కొరత సమస్యను అధిగమించే దిశగా పంజాబ్ రైతులు ఈ ఏడాది సంప్రదాయక వరి నారుపోసే పద్ధతికి బదులు నేరుగా నాట్లు చేపట్టారు. ఈ కొత్త సాంకేతిక పద్ధతివల్ల మొత్తం విస్తీర్ణంలో దాదాపు 25 శాతం వరిసాగు ఈ పద్ధతిలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా నీరు, కార్మికశక్తి కొరతపరంగా శ్రమ, సాగు వ్యయం తగ్గుతాయని భావిస్తున్నారు. రైతులను ఈ కొత్త సాంకేతికతవైపు భారీఎత్తున  ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ 40 నుంచి 50 శాతందాకా సబ్సిడీపై రైతులకు 4000 డిఎస్ఆర్ యంత్రాలను, 800 వరి నాట్ల యంత్రాలను మంజూరు చేసింది.
  • హర్యానా: రాష్ట్రంలో దిగ్బంధ విముక్తి తొలివిడత సందర్భంగా క్రీడా మైదానాలను కొన్ని షరతులతో తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతించినట్లు హర్యానా క్రీడా-యువజన వ్యవహారాల మంత్రి చెప్పారు. అయితే, ఈ సందర్భంగా వ్యక్తిగత శరీర దృఢత్వంపై దృష్టి సారించడంతోపాటు సామాజిక దూరం నిబంధనలను పాటించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, రాష్ట్రంలోని ఆటగాళ్లు, శిక్షకులు మళ్లీ తమ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారని, ఈ మేరకు గత నష్టం భర్తీకి కృషి చేస్తామని వివరించారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో సోమవారం 2,553 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 88,528కు చేరింది. వీటిలో 44,374 యాక్టివ్‌ కేసులుకాగా హాట్‌స్పాట్‌ ముంబైలో 1,314 కొత్త కేసులు వచ్చాయి. దీంతో ముంబై మహానగర పరిధిలో మొత్తం కేసులు 49,863కు చేరాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3,510 యాక్టివ్ నియంత్రణ జోన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 17,895 బృందాలు 66.84 లక్షలమంది వ్యక్తులపై పరిశీలన ప్రక్రియను పూర్తి చేశాయి.
  • గుజరాత్: రాష్ట్రంలోని 19 జిల్లాలనుంచి 477 కొత్త కేసుల నమోదుతో కేసుల సంఖ్య 20,574కు చేరింది. వీటిలో 5,309 యాక్టివ్‌ కేసులు కాగా, గత 24 గంటల్లో 31మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1280కి పెరిగింది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 144 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 10,876కు చేరింది. వీరిలో  8,117 మంది కోలుకోగా 246మంది మరణించారు. ఆరోగ్య శాఖ రోజూ 25వేల కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహణ లక్ష్యాన్ని సాధించింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 5,18,000 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం 15 జిల్లాల్లో 25చోట్ల కోవిడ్ నమూనాలను పరీక్షిస్తున్నారు. త్వరలో ఈ సదుపాయాన్ని మరో 10 జిల్లాలకు విస్తరించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రఘు శర్మ తెలిపారు. ఇక రాజస్థాన్‌లో కోలుకునేవారి శాతం 74.6కు పెరిగింది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 237 కొత్త కేసులతో మొత్తం కేసులు 9638కు పెరిగాయి. వీటిలో 2688 యాక్టివ్‌ కేసులు కాగా, ఇప్పటిదాకా 414మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లోని 52 జిల్లాలకుగాను 51 జిల్లాల్లో కరోనావైరస్ కేసులు నమోదవగా, అయితే ప్రస్తుతం 27 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాకపోవడం విశేషం.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో సోమవారం 104 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1197కు చేరగా, యాక్టివ్‌ కేసులు 885గా ఉన్నాయి. నిన్నటివరకూ రాష్ట్రంలో 92,598 పరీక్షలు నిర్వహించారు.
  • గోవా: గోవాలో 30 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 330కి పెరిగింది. వీటిలో 263 యాక్టివ్‌ కేసులు కాగా, రాష్ట్రంలో ఇప్పటిదాకా 67 మంది కోలుకున్నారు.
  • కేరళ: రాష్ట్రంలో రెండున్నర నెలల దిగ్బంధం తర్వాత మాల్స్, రెస్టారెంట్లు, ప్రార్థన స్థలాలు ఇవాళ ఉదయం నుంచి తిరిగి తెరుచుకున్నాయి. గురువాయూర్‌లోని శ్రీకృష్ణ దేవాలయంసహా వివిధ ఆలయాలు, కొన్ని చర్చిలు, మసీదులను తిరిగి తెరిచారు. కాగా, రాష్ట్రంలో ఆలయాలను తిరిగి తెరవాలన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నిర్ణయంపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళధరన్ తీవ్ర విమర్శలు చేశారు. దేవస్వం బోర్డు కిందగల ఆలయాలను తిరిగి తెరిచే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, మతపెద్దలతో చర్చల తర్వాతే మతపరమైన ప్రార్థన స్థలాలను తిరిగి తెరవాలని నిర్ణయించినట్లు దేవస్వం మంత్రి కడకంపల్లి సురేంద్రన్ చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోపాటు అన్ని భద్రత చర్యలను ఆరాధన కేంద్రాల్లో కచ్చితంగా పాటిస్తున్నట్లు తెలిపారు. కాగా గల్ఫ్‌ దేశాల్లో కోవిడ్‌-19కు మరో ముగ్గురు కేరళీయులు బలయ్యారు. నిన్న రాష్ట్రంలో 91 కొత్త కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 16కాగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,174గా ఉంది.
  • తమిళనాడు: రాష్ట్రంలోని మదురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో కోలుకున్న కోవిడ్‌ రోగుల రక్తజీవ ద్రవ్యం (ప్లాస్మా)తో ప్రయోగాత్మక చికిత్స ఇవాళ ప్రారంభమైంది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడులో 10వ తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసింది. దీనిపై ప్రతిపక్షాలు కూడా హర్షం వ్యక్తంచేశాయి. మరోవైపు రాష్ట్రంలో పడకల కొరతపై వదంతులను ఆరోగ్యశాఖ మంత్రి తోసిపుచ్చారు. రాష్ట్రంలో కోలుకుంటున్నవారు 56 శాతంకాగా, ప్రస్తుతం కేవలం ఆరుగురు రోగులు మాత్రమే వెంటిలేటర్‌ సహాయంతో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. నిన్న 1562 కొత్త కేసులు నమోదవగా 528 మంది కోలుకున్నారు; 17 మరణాలు నమోదయ్యాయి. చెన్నైనుంచి 1149 కొత్త కేసులతో మొత్తం: 33229కి చేరాయి. ఇందులో యాక్టివ్ కేసులు: 15413, మరణాలు: 286, డిశ్చార్జ్: 17527. చెన్నైలో యాక్టివ్ కేసులు 11817గా ఉన్నాయి.
  • కర్ణాటక: దిగ్బంధ విముక్తి తొలి విడతను దశలవారీగా అమలు చేసే సందర్భంగా అంతర్రాష్ట్ర ప్రయాణికులను కర్ణాటకలోకి అనుమతించడంపై విధివిధానాలను రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ జారీచేసింది. రాష్ట్రంలో ప్రవేశించే ముందు ప్రయాణికులందరూ సేవా సింధు పోర్టల్‌లో స్వయంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, ప్రవేశమార్గాల వద్ద ప్రతి వ్యక్తికీ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. మరోవైపు కోవిడ్ సమయంలో స్థానిక సంక్షేమ సంఘాలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కూడా మంత్రిత్వశాఖ జారీచేసింది. రాష్ట్రంలో 308 కొత్త కేసులు నమోదవగా, 387 మంది డిశ్చార్జి అయ్యారు. మరోవైపు నిన్న 3 మరణాలు నమోదయ్యాయి. నిన్నటి వరకు మొత్తం కేసులు: 5760, యాక్టివ్ కేసులు: 3175, మరణాలు: 64, కోలుకున్నవి: 2519గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పథకాలను సకాలంలో అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ‘స్పందన’ కార్యక్రమంపై ఇవాళ ముఖ్యమంత్రి సమీక్షించారు. మరోవైపు ఇసుక తవ్వకాలను పునఃప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. తెలుగు సినిమారంగం ప్రతినిధి బృందం ఇవాళ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైంది. రాష్ట్రంలో నిన్న 125 కొత్త కేసులు రాగా 34 మంది డిశ్చార్జి అయ్యారు. నిన్నటి వరకు మొత్తం కేసులు: 3843. యాక్టివ్: 1381, రికవరీ: 2387, మరణాలు: 75గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో మరణించినవారి నమూనాలను సేకరించి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. చనిపోయిన వారందరికీ ఈ పరీక్ష నిర్వహణ దిశగా కొన్ని రోజుల కిందట హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, జూన్ 8నాటికి రాష్ట్రంలో మొత్తం నిర్ధారిత కోవిడ్-19 కేసులు 3742 కాగా, వీటిలో వలసదారులు, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారు 448 మంది ఉన్నారు.

FACT CHECK

******



(Release ID: 1630560) Visitor Counter : 308