ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్ అత్యవసర రుణ సదుపాయం ఎమ్మెస్ ఎమ్ఈలకు మాత్రమే కాదు. అన్ని కంపెనీలకూ: ఆర్థిక మంత్రి.

Posted On: 08 JUN 2020 6:29PM by PIB Hyderabad

  కోవిడ్ అత్యవసర రుణ సదుపాయం కేవలం సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకే కాక (ఎమ్మెస్ ఎమ్ఈలకే కాక)  అన్ని కంపెనీలకూ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోజు  చెప్పారు. భారత పారిశ్రామిక, వాణిజ్య మండలుల  సమాఖ్య (ఫిక్కీ) జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ,..పారిశ్రామిక రంగానికి సాధ్యమైనంతవరకూ అన్ని విధాలా ప్రభుత్వం సహాయపడుతుందన్నారు.  భారతీయ వాణిజ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆమె అన్నారు. “మీ సమాఖ్యలో సభ్యత్వం కలిగిన వారెవరికైనా ఎలాంటి సమస్య ఉన్నా చొరవ తీసుకుని తగిన మద్దతు ఇవ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం” అని చెప్పారు.

  ఏదైనా కంపెనీ ఆస్తి అసలు ధరను కోల్పోకుండా, తేలిగ్గా నగదుగా మారే సదుపాయం (లిక్విడిటీ) కల్పించే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఈ సమస్యను చాలా స్పష్టంగా, చక్కగా పరిష్కరించామని,  లిక్విడిటీ సదుపాయం ఇపుడు అందుబాటులో ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా, వాటి పరిష్కారించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని ఆమె అన్నారు. బకాయిల చెల్లింపు  సమస్యను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వంలోని ప్రతి శాఖకూ సూచించామని, ఇందులో ఏదైనా ఇబ్బంది ఉన్నా విషయాన్నీ పరిశీలిస్తామని సీతారామన్ అన్నారు.

   కొత్త పెట్టుబడులపై 15శాతం కార్పొరేట్ పన్నుకు సంబంధించి ఇచ్చిన గడువును కంపెనీలు వినియోగించుకునేందుకు వీలుగా సదరు గడువును పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కూడా కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు. “పరిశ్రమల ప్రయోజనాలకోసం ఏం చేయగలమో చూస్తాను. కొత్త పెట్టుబడులపై 15శాతం కార్పొరేట్ పన్ను రేటుతో పరిశ్రమలకు తగిన ప్రయోజనం చేకూరాలన్నదే మా కోరిక. ఇందుకు సంబంధించి 2023వ సంవత్సరం మార్చి 31వరకూ విధించిన గడువును పొడిగించాలన్న మీ సూచనను పరిగణనలోకి తీసుకుంటాను”. అని సీతారామన్ చెప్పారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు,  సెక్యూరిటీస్, ఎక్సేజీ బోర్డు (సెబీ) గడువుకు సంబంధించిన సిఫార్సులను తమకు సమర్పించాలని సీతారామన్ పారిశ్రామికరంగానికి సూచించారు. తద్వారా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని అన్నారు.

 

  తీవ్రంగా దెబ్బతిన్న రంగాలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గించాలన్న అంశంపై ఆమె మాట్లాడుతూ,  “జీఎస్టీ రేటు తగ్గింపు అంశాన్ని జీఎస్టీ మండలి పరిశీలనకు వెళ్తుంది. అయితే, జీఎస్టీ కూడా ఆదాయం గురించి చూస్తోంది. అయితే,..ఏ రంగానికైనా జీఎస్టీ రేటు తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకోవలసింది జీఎస్టీ మండలి మాత్రమే" అని ఆమె అన్నారు.

  కేంద్ర ఆర్థిక, రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే మాట్లాడుతూ, కార్పొరేట్లకు ఆదాయం పన్ను రీఫండ్ చేయడం ఇప్పటికే మొదలైందని, గత కొన్ని వారాల్లోనే 35వేల కోట్ల రూపాయల మేర ఆదాయం పన్ను రీఫండ్ కు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆయన ఫిక్కీ సభ్యులకు సూచించారు.

 

  సమావేశానికి వ్యయ వ్యవహారాల శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేశ్ వర్మ, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి దేవాశీస్ పాండా, ఆర్థిక వ్యవహారాల ముఖ్య సలహాదారు డాక్టర్ కేవీ సుబ్రమణియన్ హాజరయ్యారు.

   దేశంలో కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రకటించిన చర్యల అమలుకోసం వివిధ ప్రభుత్వ శాఖలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉన్నామని ఫిక్కీ అధ్యక్షురాలు డాక్టర్ సంగీతా రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రికి తెలిపారు. “ఉమ్మడి లక్ష్యమైన ఆత్మ నిర్భర భారత్ ను సాధించేందుకు ఫిక్కీ కట్టుబడి ఉంది. పథకం విస్తృతంగా అమలయ్యేలా చూసేందకు ఫిక్కీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తోంది” అని డాక్టర్ సంగీతా రెడ్డి చెప్పారు. (Release ID: 1630348) Visitor Counter : 55