ఆయుష్

రేపు డీడీ న్యూస్‌లో 'అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం-2020' పై కర్టెన్ రైజర్ ప్ర‌సారం

Posted On: 09 JUN 2020 12:52PM by PIB Hyderabad

మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా వారి సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ 'అంతర్జాతీయ యోగా దినోత్స‌వం-2020' కు సంబంధించి ముంద‌స్తు ప‌రిచ‌యానికి ఒక టెలివిజన్ కార్యక్రమాన్ని ప్ర‌సారం చేయ‌నుంది. రేపు (జూన్ 10 న) సాయంత్రం 07:00 నుండి 08:00 గంటల వరకు దూర్‌ద‌ర్శ‌న్ (డీడీ) న్యూస్‌లో ఈ కార్య‌క్ర‌మం ప్రసారం కానుంది. ఇది ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క ఫేస్‌బుక్ పేజీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇదే కార్య‌క్ర‌మం ఆయుష్ ఫేస్‌బుక్ పేజీలో కూడా ప్ర‌సారం కానుంది. 'అంతర్జాతీయ యోగా దినోత్స‌వం-2020 యొక్క ముంద‌స్తు ప‌రిచ‌య క‌ర్ట‌న్ రైజ‌ర్‌ కార్య‌క్ర‌మం 10 రోజుల అధికారిక కౌంట్‌డౌన్‌ను సూచిస్తుంది. ఆయుష్ శాఖ స‌హాయ మంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్, ప్ర‌ధాన మంత్రి కార్యాల‌య‌పు స‌హాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో పాటుగా భారత సాంస్కృతిక సంబంధాల మండలి అధ్యక్షుడైన‌ డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా దేశాన్ని ఉద్దేశించి కార్య‌క్ర‌మంలో ప్రసంగించనున్నారు. వీరితో పాటుగా ఆయుష్ వైద్య రాజేష్ కోటేచ కార్య‌ద‌ర్శి ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు.
“నా జీవితం, నా యోగా” వీడియో బ్లాగింగ్ పోటీ..
కోవిడ్ -19 కారణంగా దేశంలో కొనసాగుతున్న ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నేప‌థ్యంలో ఈ ఏడాది  'అంతర్జాతీయ యోగా దినోత్స‌వం'‌ డిజిటల్ విధానంలో అంత‌ర్జాతీయంగా వెళ్లనుంది. క‌రోనా వైర‌స్ అత్యంత అంటువ్యాధి స్వభావం క‌లిగిన‌ది అయినందున ప్రజలు వారి ఇండ్ల‌ వద్దనే యోగా సాధన చేసుకోవాల‌ని మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ సాధారణ ప్రజల కోసం “నా జీవితం, నా యోగా” అనే వీడియో బ్లాగింగ్ పోటీని కూడా ప్రకటించారు. కర్టెన్ రైజర్ తర్వాత 10 రోజులలో (అనగా జూన్ 11, 2020 నుండి జూన్ 20, 2020 వరకు) డీడీ భారతి / డీడీ స్పోర్ట్స్ ఛాన‌ల్స్ కామన్ యోగా ప్రోటోకాల్ పై శిక్షణా సమావేశాలు ప్ర‌సారం కానున్నాయి. ఉదయం 08:00 నుండి 08:30 వరకు ఈ స‌మావేశాలు ఉంటాయి.
యోగా ప్రాముఖ్య‌త‌ను వివ‌రించ‌నున్న ప్ర‌ముఖులు..
దేశంలోని ప్రధాన యోగా బోధనా సంస్థ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా, న్యూ ఢిల్లీ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహిస్తుంది. యోగ గురువులు స్వామి శ్రీ రామ్‌దేవ్ గారు, శ్రీశ్రీ రవిశంకర్జీ, సద్గురు జగ్గీ వాసుదేవ్‌జీ, డాక్టర్ హెచ్‌ఆర్ నాగేంద్రజీ, శ్రీ కమలేష్ పటేల్ జీ (డాజీ), సిస్టర్ శివానీ మరియు స్వామి భారత్ భూషణ్జీ మన జీవితాల్లో యోగా యొక్క ప్రాముఖ్యతను ఇందులో వివరిస్తారు. దీనికి తోడు రోగనిరోధక శక్తిని, మానసిక ఆరోగ్యాన్ని, శ్రేయస్సును పెంచుకొనేందుకు గాను యోగాను ఎలా ఉపయోగించుకోవ‌చ్చో వివ‌రించ‌నున్నారు.
కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత క్లిష్ట సమయాల్లో ప్రజలు ఇంట్లో ఉంటూ యోగా చేయటానికి వీలుగా మంత్రిత్వ శాఖ తీసుకున్న కొన్ని కీలక చర్యలను ప్ర‌ధానంగా తెలియ‌జేస్తూ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖులు ప్రసంగించ‌నున్నారు. ఎయిమ్స్ డైరెక్ట‌ర్ , ఏఐఐఏ డైరెక్టర్ మ‌రియు ఎండీఎన్ఐవై డైరెక్ట‌ర్‌తో పాటుగా నిపుణుల బృందం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు.
ఇళ్ల‌ నుండే యోగాలో పాల్గొనేలా చ‌ర్య‌లు..
ప్రపంచం కోవిడ్‌-19 గుప్పిట్లో చిక్కుకొని ఇబ్బందులో ఉన్న వేళ ఈ ఏడాది 'అంతర్జాతీయ యోగా దినోత్స‌వం' రావ‌డం జ‌రిగింది. ఈ పరిస్థితుల‌‌లో ప్రజలు త‌మ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవ‌డం మరియు ఒత్తిడి త‌గ్గించుకొనేందుకు గాను యోగాభ్యాసనాలు చాలా ముఖ్యం. అందువ‌ల్ల 'అంతర్జాతీయ యోగా దినోత్స‌వం-2020 పుర‌స్క‌రించుకొని  ప్రజలు సామాజిక దూరం నిబంధనలకు అనుగుణంగా తమ ఇండ్ల‌ నుండే యోగాలో పాల్గొనడం మరియు నేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. 'అంతర్జాతీయ యోగా దినోత్స‌వం' కు సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు అనేక ఇతర భాగ‌స్వామ్యపు సంస్థలు తమ పోర్టల్స్ మరియు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు యూట్యూబ్‌తో సహా ఇత‌ర సోషల్ మీడియాకు చెందిన‌ హ్యాండిల్స్‌లో వివిధ డిజిటల్ వనరులను అందిస్తున్నాయి. వీటిని వాడుకొని ల‌బ్ధిపొందేందుకు గాకు ప్రజలు సిద్ధం కావాల‌ని ప్ర‌భుత్వం కోరింది. జూన్ 21 న ఉదయం 7 గంటలకు ప్రపంచవ్యాప్తంగా యోగా అనుచరులు సంఘీభావంతో కలిసి వారి ఇళ్ల నుండి కామన్ యోగా ప్రోటోకాల్ యొక్క శ్రావ్యమైన ప్రదర్శనలో పాల్గొంటారు.

 



(Release ID: 1630470) Visitor Counter : 326