PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 03 JUN 2020 6:57PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 1,00,303; కోలుకున్నవారి సంఖ్య మెరుగుపడి 48.31 శాతానికి చేరిక
 •  దేశంలో 2.80 శాతానికి తగ్గిన కరోనా మరణాలు.
 • ప్రధాని అధ్యక్షతన మంత్రిమండలి భేటీ; గ్రామీణ భారతానికి చారిత్రక ఉత్తేజం; నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణ.
 • పెట్టుబడుల ఆకర్షణకు కార్యదర్శుల సాధికార బృందం, శాఖలలో అభివృద్ధి విభాగాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
 • ‘పీఎంజీకేపీ’ కింద పేదలకు రూ.53,248 కోట్ల ఆర్థిక సహాయం; ‘పీఎం-కిసాన్‌’ కింద తొలివిడతగా 8.19 కోట్ల మంది రైతులకు రూ.16,394 కోట్లు చెల్లింపు.
 • నిర్దిష్ట వర్గ విదేశీయుల భారత ప్రయాణానికి అనుమతి దిశగా వీసా, ప్రయాణ ఆంక్షల సడలింపు
 • వందే భారత్‌ మిషన్‌ కింద స్వదేశం చేరే పౌరుల నైపుణ్య వర్గీకరణ-నమోదుకు సరికొత్త పథకం ‘స్వదేశ్‌’కు శ్రీకారం.

 

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; దేశవ్యాప్తంగా కోలుకునేవారి శాతం 48.31కి పెరుగుదల; 2.80 శాతానికి తగ్గిన మరణాలు

దేశంలో గడచిన 24 గంటల్లో 4,776 మందికి కోవిడ్‌-19 నయం కాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,00,303కు, కోలుకునేవారి శాతం 48.31కి పెరిగాయి, ప్రస్తుతం 1,01,497 యాక్టివ్‌ కేసులు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి. ఇక మరణాల శాతం 2.80కు దిగివచ్చింది. దేశంలో 480 ప్రభుత్వ, 208 ప్రైవేటు ప్రయోగశాలల (మొత్తం 688) ద్వారా పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెరిగిన నేపథ్యంలో ఇప్పటిదాకా మొత్తం 41,03,233 నమూనాలను పరీక్షించారు. కాగా, నిన్న ఒక్కరోజే 1,37,158నమూనాలు పరీక్షించబడ్డాయి.

   దేశంలో 952 కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రులతోపాటు 1,66,332 ఏకాంత చికిత్స, 21,393 ఐసీయూ, 72,762 ప్రాణవాయు సదుపాయంగల పడకలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 2,391 కోవిడ్‌ ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల్లో 1,34,945 ఏకాంత చికిత్స, 11,027 ఐసీయూ, 46,875 ప్రాణవాయు సదుపాయంగల పడకలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/కేంద్రీయ సంస్థలకు 125.28 లక్షల ఎన్‌95 మాస్కులు, 101.54 లక్షల వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ)ని కేంద్ర ప్రభుత్వం అందజేసింది.

 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629022

ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి భేటీ; గ్రామీణ భారతానికి చారిత్రక ఉత్తేజం

కేంద్రమంత్రి మండలి ఇవాళ నిత్యావసర వస్తువుల చట్టానికి చారిత్రక సవరణను ఆమోదించింది. పరివర్తనాత్మక వ్యవసాయం, రైతుల ఆదాయం పెంపు దిశగా ఇదొక దూరదృష్టిగల ముందడుగు. నిత్యావసరాల చట్టానికి ఈ సవరణతో తృణధాన్యాలు, పప్పుదినుసులు, నూనెగింజలు, వంటనూనెలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు నిత్యావసర వస్తువుల జాబితానుంచి తొలగించబడతాయి. విపరీత నియంత్రణాత్మక జోక్యంపై ప్రైవేటు పెట్టుబడిదారులలోగల భయాలను ఈ సవరణ పోగొడుతుంది. ఆ మేరకు ఉత్పత్తి, నిల్వ, రవాణా, పంపిణీ, సరఫరాలకు వీలు కలుగుతుంది. తద్వారా భారీ ఆర్థిక కార్యకలాపాల సంధానంతోపాటు వ్యవసాయ రంగంలో ఆకర్షణీయ ప్రైవేటురంగ/విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. అలాగే శీతల గిడ్డంగుల నిర్మాణం, ఆహార సరఫరా శృంఖలం ఆధునికీకరణలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. మొత్తంమీద ఈ చరిత్రాత్మక నిర్ణయాలు రైతులకు లబ్ధి చేకూర్చడమేగాక వ్యవసాయ రంగంలో పరివర్తన తెస్తాయి. కాగా, రాష్ట్రంలో, రాష్ట్రాల మధ్య అవరోధాలంటూ లేని వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని ప్రోత్సహించే ఆర్డినెన్సుకూ మంత్రిమండలి ఆమోదం లభించింది. అలాగే ఆహార తయారీదారులు, సంధానకర్తలు, టోకు వ్యాపారులు, పెద్ద చిల్లర వర్తకులు, ఎగుమతిదారులతో సంబంధాలు నెరపడంలో రైతులకు సాధికారత లభిస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629153

పెట్టుబడుల ఆకర్షణకు “కార్యదర్శుల సాధికార బృందం, శాఖలలో ప్రాజెక్టు అభివృద్ధి విభాగాల” ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం.

“దేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్యదర్శుల సాధికార బృందంతోపాటు మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో ప్రాజెక్టు అభివృద్ధి విభాగాల” ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ 2024-25నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరాలన్న ఆకాంక్షను ఈ కొత్త యంత్రాంగం ఇంకా బలోపేతం చేస్తుంది. ప్రస్తుత కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల నడుమ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దేశంలోకి రప్పించే అవకాశం... ప్రత్యేకించి పెద్ద కంపెనీలు తమ పెట్టుబడులను కొత్త భౌగోళిక ప్రాంతాల్లోకి మళ్లించి ముప్పుల నుంచి ఉపశమనం పొందాలని చూస్తున్న నేపథ్యంలో భారత్‌ ముందుకొచ్చింది. తదనుగుణంగా పెట్టుబడిదారులకు భారత్‌లో పెట్టుబడులు పెట్టేవిధంగా సదుపాయాలు, ప్రోత్సాహం కల్పించి, ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో వృద్ధికి ఊతమిచ్చేందుకే ‘కార్యదర్శులతో సాధికార బృందం’ (EGoS) ఏర్పాటుకు ఆమోదం ఇవ్వబడింది. అలాగే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో పెట్టుబడులకు అవకాశమున్న ప్రాజెక్టుల అభివృద్ధి, దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనువుగా ప్రాజెక్టు ప్రణాళికల లభ్యత కోసం ప్రతి మంత్రిత్వశాఖ/డిపార్ట్‌మెంట్లలో ‘ప్రాజెక్టు అభివృద్ధి విభాగం’ ఏర్పాటుకూ ఆమోదం లభించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629168

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ- ఇప్పటివరకూ ప్రగతి వివరాలు

దేశవ్యాప్త దిగ్బంధం నేపథ్యంలో రూ.1.70 లక్షల కోట్లతో రూపొందించిన ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ’ (PMGKP)కింద పేదలకు ఉచిత ఆహారధాన్యాల పంపిణీతోపాటు మహిళలు-వృద్ధులు-రైతులకు నగదు చెల్లింపు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర పర్యవేక్షణలో ఈ ప్యాకేజీ చురుగ్గా అమలవుతోంది. ఈ మేరకు పీఎంజీకేపీ కింద ఇప్పటిదాకా 42 కోట్లమంది పేదలకు రూ.53,248 కోట్ల ఆర్థిక సహాయం అందింది. అలాగే పీఎం-కిసాన్‌ (PM-KISAN) పథకం కింద 8.19 కోట్లమంది లబ్ధిదారులకు తొలివిడత చెల్లింపులో భాగంగా రూ.16,394 కోట్లు విడుదల కాగా, 20.05 కోట్లమంది (98.33%) మహిళల జన్‌ధన్‌ ఖాతాలలో రూ.10,029 కోట్లు జమ చేయబడింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628940

నిర్దిష్ట వర్గ విదేశీయుల భారత ప్రయాణానికి అనుమతి దిశగా వీసా, ప్రయాణ ఆంక్షల సడలింపు

భారత్‌ రావాల్సిన అవసరాలుగల విదేశీయులలో నిర్దిష్ట వర్గాలవారికి వీసా, ప్రయాణ ఆంక్షల సడలింపును కేంద్ర ప్రభుత్వం  పరిశీలించనుంది. ఆ మేరకు విదేశీ వాణిజ్యవేత్తలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఆరోగ్యరంగ పరిశోధకులు, ఇంజనీర్లు సాంకేతిక నిపుణులుసహా విదేశీ ఇంజనీరింగ్‌, మేనేజీరియల్‌, డిజైన్‌ తదితర నిపుణులు, విదేశీ ప్రత్యేక సాంకేతిక విజ్ఞాన నిపుణులు-ఇంజనీర్లు వంటి వర్గాలవారికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పైన పేర్కొన్న వర్గాలవారు విదేశాల్లోని భారత రాయబార, దౌత్య కార్యాలయాల నుంచి సముచిత తాజా వ్యాపార లేదా ఉపాధి వీసాను ముందుగా పొందాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629222

భారత ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుడి మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం అమెరికా అధ్యక్షుడు గౌరవనీయ డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్‌ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా జి-7 దేశాల కూటమికి అమెరికా అధ్యక్ష బాధ్యతలు వహించడంపై ట్రంప్‌ మాట్లాడారు. అలాగే భారత్‌సహా మరికొన్ని ముఖ్యమైన దేశాలకు సభ్యత్వంద్వారా కూటమిని మరింత విస్తరించాలన్న తన ఆకాంక్షను వ్యక్తంచేశారు. ఈ మేరకు అమెరికా నిర్వహించనున్న జి-7 తదుపరి సమాశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. అధ్యక్షుడు ట్రంప్‌ దూరదృష్టిని, సృజనాత్మకతను ప్రధాని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. కోవిడ్‌ అనంతర ప్రపంచంలో ఆవిష్కృతం కానున్న వాస్తవాలకు  ఈ విస్తరణ అనుగుణంగా ఉంటుందన్న వాస్తవాన్ని అంగీకరించారు. ప్రతిపాదిత శిఖరాగ్ర సదస్సు విజయవంతం దిశగా అమెరికా, తదితర దేశాలతో కలసి పనిచేయడానికి భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధాని అన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628902

విదేశాలనుంచి వచ్చే భారత పౌరుల నైపుణ్య వర్గీకరణ చేపట్టనున్న ప్రభుత్వం

ప్రస్తుత కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల కారణంగా విదేశాల్లోని అనేకమంది భారత పౌరులు స్వదేశానికి తిరిగివస్తున్నారు. ఈ నేపథ్యంలో మన మానవనైపుణ్య శక్తిని అత్యుత్తమంగా వాడుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశ్‌’ (Skilled Workers Arrival Database for Employment Support) పేరిట వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వందేభారత్‌ మిషన్ కింద తిరిగివస్తున్న పౌరుల నైపుణ్యాలను వర్గీకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన, పౌర విమానయాన, విదేశాంగ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఈ బాధ్యతను స్వీకరిస్తాయి. తద్వారా నైపుణ్యం-అనుభవం ప్రాతిపదికన భారతపౌరుల సమాచార నిధి రూపొందడంతోపాటు దేశవిదేశీ కంపెనీల అవసరాల మేరకు అవకాశాలను అందిపుచ్చుకునే వీలుంటుంది. సాపేక్ష ఉపాధి అవకాశాలను పొందగలిగేలా వారికి సాధికారత కల్పించాలన్నది ‘స్వదేశ్‌’ పథకం లక్ష్యం. ఇలా సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల సంఘాలు, యాజమాన్యాల వంటి భాగస్వాములతో పంచుకోవడంద్వారా చర్చలకు వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628902

మాధ్యమికోన్నత (11, 12) తరగతులకు ప్రత్యామ్నాయ విద్యా కేలండర్‌ విడుదల చేసిన హెచ్‌ఆర్‌డీ మంత్రి

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (MHRD) మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్‌’ ఇవాళ న్యూఢిల్లీలో మాధ్య‌మికోన్న‌త (11, 12) తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ విద్యా కేలండ‌ర్‌ను ఆవిష్క‌రించారు. కోవిడ్‌-19 కారణంగా ఇళ్లలోనే ఉంటున్న విద్యార్థులు- తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల తోడ్పాటుతో అర్థవంతమైన విద్యా కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యేవిధంగా ఎంహెచ్‌ఆర్‌డీ మార్గదర్శకాల మేరకు జాతీయ విద్యా-పరిశోధన-శిక్షణ మండలి (NCERT) ఈ కేలండర్‌ను రూపొందించింది. ఈ సందర్భంగా హెచ్‌ఆర్‌డీ మంత్రి మాట్లాడుతూ-  విద్యార్థులకు ఆహ్లాదం, ఆసక్తి కలిగించేలా విద్యనందించడంలో ఉపాధ్యాయులు సాంకేతిక సాధనాలను, సామాజిక మాధ్యమ ఉపకరణాలను వినియోగించడంపై ఈ కేలండర్‌ మార్గనిర్దేశం చేస్తుందన్నారు. ఈ సదుపాయాన్ని అభ్యాసకులతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఇళ్లనుంచే వాడుకోవచ్చునని వివరించారు. కాగా, కేలండర్‌ రూపకల్పనలో విద్యార్థులకు మొబైల్, రేడియో, టెలివిజన్, ఎస్సెమ్మెస్‌సహా సామాజిక మాధ్యమాలవంటి వేదికలు, ఉపకరణాల లభ్యత స్థాయిని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.

 

Image

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628948

ఆపరేషన్‌ సముద్ర సేతు- కొలంబోనుంచి భారతీయులను ట్యుటికోరిన్‌ చేర్చిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ

‘ఆపరేషన్‌ సముద్ర సేతు’ కింద శ్రీలంక రాజధాని కొలంబోనుంచి 685మంది భారతీయులతో బయల్దేరిన భారత నావికాదళ నౌక ‘ఐఎన్‌ఎస్‌ జలాశ్వ’ 2020 జూన్‌ 2న తమిళనాడులోని ట్యుటికోరిన్‌ రేవుకు చేరింది. శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం అక్కడ చిక్కుకున్న భారత పౌరులను ఈ నౌకద్వారా పంపే ఏర్పాటు చేసింది. వీరందరికీ నిర్దేశిత వైద్య పరీక్షలు నిర్వహించాక నౌకలో ప్రవేశించేందుకు అనుమతించారు. అలాగే సముద్రంలో ప్రయాణం సందర్భంగానూ కోవిడ్‌ సంబంధిత విధివిధానాలను పాటించారు. స్వదేశం చేరుకున్న వీరిని ట్యుటికోరిన్‌లో స్థానిక అధికార యంత్రాంగం సాదర స్వాగతం పలికింది. అనంతరం తిరిగి ఆరోగ్య పరీక్షలు, వలస కార్యాలయ ప్రక్రియలు, రవాణా తదితర కార్యక్రమాలు పూర్తయ్యాక వారిని నిర్దేశిత ప్రాంతాలకు పంపారు. ఈ తరలింపుతో ప్రస్తుత మహమ్మారి సంక్షోభ సమయంలో భారత నావికాదళం ఇప్పటిదాకా 2,173మంది భారతీయులను స్వదేశం చేర్చింది. ఈ మేరకు మాల్దీవ్స్‌ నుంచి 1,488 మందిని, శ్రీలంక నుంచి నిన్న 685 మందిని తీసుకొచ్చింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628896

ఎంఎస్‌ఎంఈల వర్గీకరణపై కొత్త విధానం అమలుకు సిద్ధమవుతున్న మంత్రిత్వశాఖ

దేశంలోని సూక్ష్మ-చిన్న-మధ్యతరహా సంస్థల (MSME) నిర్వచనం, స్వభావం ఉన్నతీకరణ నిబంధనల అమలుకు ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ అధికార ప్రకటన జారీ చేసింది. స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీలో భాగంగా 2020 మే 13న కొత్త నిర్వచనం, స్వభావాల సవరణ గురించి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సవరించిన నిర్వచన, స్వభావాల అమలు 2020 జూలై 1 నుంచి ప్రారంభమవుతుంది. దీని ప్రకారం... రూ.కోటి పెట్టుబడి, రూ.5 కోట్ల వార్షిక వ్యాపార పరిమాణం (టర్నోవర్‌)గల ‘తయారీ-సేవల’ సంస్థలు ‘సూక్ష్మ’ పరిధిలోకి వస్తాయి. అలాగే రూ.10 కోట్ల పెట్టుబడి, రూ.50 కోట్ల వార్షిక వ్యాపార పరిమాణం ఉన్నవి ‘చిన్న’ సంస్థలుగా, రూ.20 కోట్ల పెట్టుబడి, రూ.100 కోట్ల వార్షిక వ్యాపార పరిమాణంగల సంస్థలు ‘మధ్య’తరహా పరిశ్రమలుగా పరిగణించబడతాయి. అయితే, ఎంఎస్‌ఎంఈ నిర్వచనాన్ని మరింత ఉన్నతీకరించాలని కేంద్ర ప్రభుత్వం 01.06.2020న నిర్ణయించింది. ఈ మేరకు ఇకపై మధ్యతరహా పరిశ్రమల గరిష్ఠ పెట్టుబడి పరిమితిని రూ.50 కోట్లకు, వార్షిక వ్యాపార పరిమాణాన్ని రూ.250 కోట్లకు పెంచింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628993

‘ఈపీఎఫ్‌వో’లో 2020 ఏప్రిల్‌ 1 నుంచి 52.62 లక్షలమంది చందాదారుల వ్యక్తిగత వివరాల నవీకరణ

కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కీలకమైన ఆన్‌లైన్‌ సేవలను అందరికీ అందించేలా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) 2020 ఏప్రిల్‌-మే నెలల్లో 52.62 లక్షలమంది చందాదారుల సంపూర్ణ వ్యక్తిగత వివరాల (KYC)ను నవీకరించింది. ఈ మేరకు 39.97 లక్షల మంది ఆధార్‌ విశిష్ట సంఖ్యను, 9.87 లక్షలమంది (విశిష్ట ఖాతా సంఖ్య-UAN) ఫోన్‌ నంబర్లను, 11.11 లక్షలమంది బ్యాంకు ఖాతా వివరాలను అనుసంధానించింది. చందాదారుల వ్యక్తిగత గుర్తింపు తనిఖీలో సహాయపడేందుకు వారి విశిష్ట ఖాతా సంఖ్యతో వ్యక్తిగత వివరాలను అనుసంధానించడంలో భాగంగా ‘కేవైసీ’ ప్రక్రియను ఒకసారి పాటిస్తే సరిపోతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628957

సినీ నిర్మాతలు, ప్రదర్శకులు, పరిశ్రమ ప్రతినిధులతో కేంద్రమంత్రి సమావేశం

కేంద్ర సమాచార-ప్రసారశాఖ మంత్రి శ్రీ ప్రకాష్‌ జావడేకర్‌ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సినీ నిర్మాతల సంఘం, ప్రదర్శకుల-పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కోవిడ్‌-19 నేపథ్యంలో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై విజ్ఞాపనలు అందిన నేపథ్యంలో వారితో చర్చించేందుకు మంత్రి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సినిమా నిర్మాణ కార్యకలాపాల పునఃప్రారంభంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రామాణిక విధాన ప్రక్రియలను జారీచేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇక జూన్‌ నెలలో కోవిడ్‌-19 పరిస్థితిని సమీక్షించిన తర్వాతే సినిమా థియేటర్లను తిరిగి తెరిచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని సినీరంగ ప్రతినిధులకు మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628839

‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు భారీ ఉత్తేజం; 156 ఉన్న‌తీక‌రించిన ‘బిఎమ్‌పి పదాతిదళ పోరాట వాహనాల’ కోసం ఓఎఫ్‌బీకి రూ.1,094 కోట్ల ఆర్డ‌ర్ ఇచ్చిన ర‌క్ష‌ణశాఖ

కేంద్ర ప్రభుత్వ ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మం ‘మేక్ ఇన్ ఇండియా’కు భారీ ఉత్తేజం క‌ల్పిస్తూ- ర‌క్ష‌ణ మంత్రిత్వశాఖ (MoD) ప‌రిధిలోని కొనుగోళ్ల విభాగం మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆమోదంతో ఉన్న‌తీక‌రించిన 156 ‘బిఎమ్‌పి 2/2‌కె ప‌దాతిద‌ళ పోరాట వాహ‌నాల’ (ICV) సరఫరా కోసం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (OFB)కు దాదాపు రూ.1,094కోట్ల విలువైన ఆర్డ‌ర్ ఇచ్చింది. ఈ మేర‌కు తెలంగాణలోని మెదక్‌లోగ‌ల ఓఎఫ్‌బీ కర్మాగారం భారత సైన్యంలోని యాంత్రిక విభాగం బ‌ల‌గాల కోసం ఈ వాహ‌నాల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628743

దేశ‌ంలో 2020 జూన్ 3 (ఉదయం 09:00)దాకా 4,197 ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లద్వారా 58ల‌క్ష‌ల మందికిపైగా ప్ర‌యాణికుల‌ను సొంత రాష్ట్రాలకు చేర్చిన భారత రైల్వేశాఖ

భార‌త రైల్వేశాఖ 2020  జూన్ 3 వరకూ  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మ‌ధ్య 4,197 ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లను న‌డిపింది. కాగా, ఇవాళ ఉద‌యం 9:00 గంట‌ల స‌మ‌యానికి 81 రైళ్లు ఇంకా న‌డుస్తున్నాయి. ఈ మేర‌కు నేటివ‌ర‌కూ 34 రోజుల వ్య‌వ‌ధిలో 58 లక్షల మందికిపైగా వ‌ల‌స‌దారుల‌ను వారి సొంత రాష్ట్రాల‌కు చేర్చింది. ఈ 4,197రైళ్లు వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి న‌డుస్తున్న నేప‌థ్యంలో అత్య‌ధికంగా గుజరాత్ (1026), మహారాష్ట్ర (802), పంజాబ్ (416), ఉత్తరప్రదేశ్ (294), బీహార్ (294) రాష్ట్రాలనుంచి బ‌య‌ల్దేరాయి. ఇక ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లతోపాటు రైల్వేశాఖ ఇప్పటికే న్యూఢిల్లీవైపు నడిచే 15 జతల రాజధాని తరహా రైళ్లను నడుపుతుండగా, జూన్‌ 1 నుంచి నియమిత కాల పట్టికలతో 200 రైళ్ల రాకపోకలను పునఃప్రారంభించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629170

భారతీయ ఔషధ-హోమియో వైద్య‌విధానాల‌పై ఆయుష్ మంత్రిత్వశాఖకు అనుబంధంగా ఫార్మకోపియా కమిషన్ ఏర్పాటుకు మంత్రిమండ‌లి ఆమోదం

భారతీయ ఔషధ, హోమియో విధానాల కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఫార్మకోపియా కమిషన్ (PCIM&H) ఏర్పాటుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఘజియాబాద్‌లో 1975లో ఏర్పాటైన రెండు కేంద్రీయ ప్ర‌యోగ‌శాల‌లు- భారతీయ ఔషధాల  ఫార్మకోపియా లేబరేటరీ, హోమియోపతిక్ ఫార్మకోపియా లేబరేటరీల‌ను విలీనం చేసింది. ప్ర‌స్తుతం PCIM&H స్వ‌తంత్ర సంస్థ‌గా ఉన్న నేప‌థ్యంలో  తాజా విలీనంతో ఆయుర్వేద, యునాని, హోమియో... మూడు విభాగాల మౌలిక వసతులను, సాంకేతిక మానవ వనరులను, ఆర్థిక వనరులను గరిష్ఠంగా వాడుకునే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా వాటి సమర్థ నియంత్ర‌ణ‌స‌హా నాణ్యత పరిరక్షణ, ఫలితాల ప్ర‌మాణీక‌ర‌ణ‌కు వీలు క‌లుగుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629157

శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ అధ్యక్షతన కేంద్రీయ ఉపాధి హామీ మండలి 21వ సమావేశం

కేంద్ర గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్‌, వ్యవసాయ-రైతు సంక్షేమశాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ అధ్యక్షతన కేంద్రీయ ఉపాధి హామీ మండలి 21వ సమావేశం దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా 02.06.2020న జరిగింది. పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం దిశగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నదని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఆ మేరకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కార్మికుల 100 శాతం వేతనాలను బ్యాంకు ఖాతాలలో జమచేసేలా చూస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా పనులపై సామాజిక తనిఖీ కూడా 100 శాతం ఉంటుందని వివరించారు. మునుపెన్నడూ లేని విధంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం రూ.61.500 కోట్లు కేటాయించింది. అలాగే స్వయం సమృద్ధ భారతం కార్యక్రమం కింద కోవిడ్‌-19 సంక్షోభం ఫలితంగా కష్టాలు ఎదుర్కొంటున్న కార్మికులను ఆదుకునేందుకు అదనంగా మరో రూ.40,000కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటికే రూ.28,000 కోట్లు విడుదల చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628599

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • చండీగఢ్‌: అంతర్రాష్ట్ర సరిహద్దులో యాదృచ్ఛిక తనిఖీ కొనసాగేలా చూడాలని నగర పాలనాధికారి డీజీపీని ఆదేశించారు. ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌తోపాటు స్వీయ పర్యవేక్షణ దిశగా సందర్శకుల్లో చైతన్యం కల్పించాలని స్పష్టం చేశారు. కొన్ని వారాలుగా ఎదురుచూస్తున్న రోగులకు సకాలంలో చికిత్స అందించేలా OPD సదుపాయాలను పెంచాలని 3 వైద్య సంస్థల అధిపతులకు సూచించారు,
 • పంజాబ్: రాష్ట్రంలో గృహావసరాల విద్యుత్‌ చార్జీలను తగ్గించాలన్న పంజాబ్‌ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ సంస్థ నిర్ణయంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్ దిగ్బంధంవల్ల ఇప్పటికే విద్యుత్‌ రాబడిని కోల్పోయినప్పటికీ కమిషన్‌ నిర్ణయాన్ని ఆయన స్వాగతించడం గమనార్హం. మరోవైపు దీనివల్ల ప్రజా ప్రయోజనాల రీత్యా ముందడుగు వేయడంద్వారా విద్యుత్‌ చార్జీలు హేతుబద్ధం కాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. సుదీర్ఘ దిగ్బంధంతోపాటు కరోనావైరస్ మహమ్మారి ఫలితంగా ఆదాయం భారీగా కోల్పోయిన నేపథ్యంలో జూన్‌ 1 నుంచి మద్యంపై ‘కోవిడ్‌ సుంకం’ విధించేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. దీనివల్ల రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.145 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.
 • హర్యానా: ప్రజా రవాణా సౌలభ్యం కోసం టాక్సీ, క్యాబ్‌ల నిర్వహణ సంస్థలు, మాక్సి క్యాబ్, ఆటో రిక్షా డ్రైవర్లకు సంబంధించి హర్యానా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మేరకు  డ్రైవర్‌తోపాటు గరిష్టంగా ఇద్దరు ప్రయాణికులతో టాక్సీలు, క్యాబ్ నిర్వహణ సంస్థల వాహనాలు నడిపేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు రవాణా శాఖ తెలిపింది. ఇక మాక్సి క్యాబ్స్ గరిష్టంగా సగం సీట్ల సామర్థ్యంతో నడుస్తాయి. ఆటో రిక్షాలు, ఇ-రిక్షాలలో డ్రైవర్‌తోపాటు ఇద్దరు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారు. అలాగే ద్విచక్ర వాహనాలపై వెనుక ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే, ఇద్దరూ హెల్మెట్లు, మాస్కులు, చేతి తొడుగులు ధరించడం తప్పనిసరి. ఇక మనుషులు లాగే రిక్షాలలో ఇద్దరికి మించి ప్రయాణించకూడదు. డ్రైవర్లు, ప్రయాణికులు మాస్కు ధరించాలి లేదా వస్త్రంతో కప్పుకోవాలి. మోటారు వాహనాలకు క్రమం తప్పకుండా రోగకారక నిర్మూలన చేయాలి. డ్రైవర్లు, ప్రయాణికులు క్రమం తప్పకుండా శానిటైజర్లను వాడాలి. ప్రతి ఒక్కరూ సదా సామాజిక దూరం పాటించాలి.
 • అరుణాచల్ ప్రదేశ్: పీఎంకేఎస్‌వై కింద రాష్ట్రంలో 67,998మంది రైతులు కేంద్రంనుంచి రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా మరో రూ.1,000 వంతున అందుకున్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కోవిడ్‌-19 కేసుల సంఖ్య 28గా ఉంది.
 • అసోం: రాష్ట్రంలో 51 కొత్త కేసులు నమోదవగా, వీటిలో ధుబ్రి 28, దరాంగ్ 13, కరీమ్‌గంజ్ 5, సోనిత్‌పూర్ 3, లఖింపూర్ 2 వంతున ఉన్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1672కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
 • మణిపూర్: రాష్ట్రంలో ఇవాళ 13 మందికి వ్యాధి నయమై ఇళ్లకు వెళ్లడంతో మణిపూర్‌లో కోలుకున్నవారి సంఖ్య మెరుగుపడి 25 శాతానికి చేరింది. ప్రస్తుతం 102 కేసులకుగాను 76 యాక్టివ్‌గా ఉన్నాయి.
 • మేఘాలయ: తమిళనాడు నుంచి మే 19న మేఘాలయకు తిరిగివచ్చిన రాష్ట్రంలోని వెస్ట్ గారో హిల్స్ జిల్లావాసి నిర్బంధ వైద్య పర్యవేక్షణలో ఉండగా, అతడికి నిర్వహించిన పరీక్షలో కోవిడ్‌-19 వ్యాధి సోకలేదని తేలింది. కాగా, రాష్ట్రంలో 13 మంది కోలుకోగా ప్రస్తుతం 16 యాక్టివ్‌ కేసులున్నాయి.
 • మిజోరం: రాష్ట్రంలో 2020 మే 31న జారీచేసిన దిగ్బంధం 5.0 మార్గదర్శకాలలో ఎటువంటి మార్పులు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. కాగా, ఇటీవల రాష్ట్రంలో 13 కొత్త కేసులు నమోదయ్యాయి.
 • నాగాలాండ్: కోవిడ్‌-19 పోరులో ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కొరత తీర్చేదిశగా ప్రభుత్వం 27 మంది డాక్టర్లను నియమించింది. కాగా, దిమాపూర్‌లో సాధారణ వ్యాపార కార్యకలాపాలపై ఆంక్షలు తొలగించాలని వ్యాపారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
 • సిక్కిం: దిగ్బంధం కారణంగా రాష్ట్ర పర్యాటక రంగానికి రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సిక్కిం ఆర్థిక పునరుజ్జీవన కమిటీ చైర్మన్ పేర్కొన్నారు.
 • త్రిపుర: రాష్ట్రంలో ఇవాళ 821 నమూనాలను పరీక్షించగా 49 మందికి కోవిడ్‌-19 నిర్ధారణ అయింది. వీరిలో చాలా మందికి ప్రయాణ చరిత్ర, పరిచయాలు ఉన్నాయి.
 • కేరళ: ఒక పాస్టర్‌ మరణానంతరం కోవిడ్‌-19 సోకినట్లు తేలడంతో ఆయనకు చికిత్స అందించిన వారిలో సుమారు 15మంది ఆరోగ్య సిబ్బందిని వైద్య పర్యవేక్షణలో ఉంచారు. కాగా, దిగ్బంధం నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణపై దుబాయ్నుంచి నెడుంబసేరి విమానాశ్రయానికి చేరుకున్న ఎయిరిండియా మహిళా పైలట్‌పై కొచ్చిలో ఫిర్యాదు దాఖలైంది. పాఠశాల విద్యార్థుల కోసం ప్రయోగాత్మక ఆన్‌లైన్ తరగతుల నిర్వహణను  వారంపాటు పొడిగించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలోని పొరుగు జిల్లాలకు బస్సు సర్వీసులు ఇవాళ్టినుంచి మొదలయ్యాయి. రేపటినుంచి గురువాయూర్ ఆలయంలో వివాహాలకు అనుమతి ఉంటుంది. ఇక గల్ఫ్‌లో మరో ఏడుగురు రాష్ట్రవాసులు కోవిడ్‌కు బలికావడంతో విదేశాల్లో మరణించిన కేరళీయుల సంఖ్య 210 దాటింది. అలాగే న్యూఢిల్లీలో ఒక మలయాళీ నర్సు ఇవాళ ప్రాణాలు కోల్పోయింది. రాష్ట్రంలో నిన్న 86 మందికి రోగ నిర్ధారణ కాగా, ప్రస్తుతం 774 మంది చికిత్స పొందుతున్నారు.
 • తమిళనాడు: పుదుచ్చేరిలోని జిప్మెర్‌లో ఆరుగురు ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కేసుల సంఖ్య 90కి చేరింది. కాగా, శ్రీలంకలో చిక్కుకున్న 686 మంది భారతీయులను 'ఆపరేషన్ సముద్ర సేతు' కింద ఐఎన్ఎస్ జలాశ్వ నౌక ఈ ఉదయం తమిళనాడులోని తూత్తుకుడిలోని వి.ఓ.చిదంబరనార్ నౌకాశ్రయానికి చేరింది. ఇక రైతులు తమ ఉత్పత్తులను రాష్ట్రమంతటా విక్రయించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేసింది. నిన్న రాష్ట్రంలో 1,091 కేసులు నమోదు కాగా, తమిళనాడులో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొత్త కేసులలో ఒక్క చెన్నైలోనే 806 నమోదయ్యాయి. ఇప్పటివరకూ మొత్తం కేసులు: 24,586, యాక్టివ్ కేసులు: 10680, మరణాలు: 197, డిశ్చార్జ్: 13,706. చెన్నైలో యాక్టివ్ కేసులు 7,880.
 • కర్ణాటక: నిసర్గ తుఫాను ఉత్తర కన్నడలో తీరందాటింది. దీంతో అన్ని తీరప్రాంత జిల్లాల్లో అప్రమత్తత ప్రకటించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇకపై కాగితపు ఫైళ్లు ఉండవు. అన్ని పైళ్లకూ ఇకమీదట ఇ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌లోనే ఉంటాయి. రాష్ట్రంలో జూలై 1 నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించే అవకాశాలపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాగా, ప్రవేశ ప్రక్రియ జూన్ 8లోగా మొదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో పీయూసీ పరీక్ష నిర్వహణ కోసం సవరించిన కేంద్రాల తాత్కాలిక జాబితా, విద్యార్థుల వివరాలను అధికారులు ప్రకటించారు. గృహనిర్బంధ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇవాళ 388 కొత్త కేసులు నమోదవగా వీటిలో 367 అంతర్రాష్ట్ర కేసులున్నాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 3796, యాక్టివ్‌: 2339, మరణాలు: 52, కోలుకున్నవి: 1403గా ఉన్నాయి.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలపై అధికార పార్టీ రంగులను నాలుగు వారాల్లోగా తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పునర్విచారణ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆజా ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ కింద విచారణ తప్పదని హెచ్చరించింది. ఇక రాష్ట్రంలో భూముల రీసర్వేకు, ‘భూధార్‌’ నంబరు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 8,066 నమూనాలను పరీక్షించిన తర్వాత గత 24 గంటల్లో 79 కొత్త కేసులురాగా, 35 మంది డిశ్చార్జి అయ్యారు. మరో నలుగురు మరణించారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 3279. యాక్టివ్: 967, రికవరీ: 2244, మరణాలు: 68. వలసదారులు 573 మందికి రోగ నిర్ధారణ కాగా, 362 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక విదేశాలనుంచి వారిలో 119 కేసులకుగాను 118 యాక్టివ్‌గా నమోదయ్యాయి.
 • తెలంగాణ: కోవిడ్‌-19 స్వల్ప లక్షణాలున్నవారికి ఇంట్లో చికిత్స చేయవచ్చని ఐసీఎంఆర్ రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో ఒకే కుటుంబంలోని సభ్యులకు వ్యాధి సోకి ఉంటేనే వారికి ఇంట్లోనే చికిత్స చేస్తామని ఆరోగ్యశాఖ తెలిపింది. వలస కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక విధానాన్ని రూపొందించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన మరో ఐదుగురు పీజీ వైద్యులకు కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో వైద్య కళాశాలలో నిర్ధారిత రోగుల సంఖ్య 12కు చేరింది. నిన్న రాష్ట్రంలో 99 కొత్త కేసులు నమోదవగా వీటిలో 87 స్థానికంగా సంక్రమించినవిగా తేలింది. మరో 12 ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసకార్మికులలో నమోదయ్యాయి. జూన్ 2నాటికి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,891, అందులో 446 మంది వలసదారులు, విదేశాలనుంచి తిరిగి వచ్చినవారు ఉన్నారు.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో ఇవాళ 2287 కొత్త కేసులు నమోదవగా మొత్తంకేసుల సంఖ్య 72,300కు చేరింది. వీటిలో 38,493 యాక్టివ్‌ కేసులున్నాయి. హాట్‌స్పాట్ ముంబైలో మంగళవారం 1109 కొత్త కేసులు నమోదయ్యాయి.
 • గుజరాత్: రాష్ట్రంలో నిన్న 415 కొత్త కేసుల నమోదుతో మొత్తం రోగుల సంఖ్య 17,632కు పెరిగింది. ఇక నిన్న 29 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1092కు చేరింది. పూర్తిస్థాయిలో కోలుకున్న 1,014 మందిని ఆసుపత్రి నుంచి ఇళ్లకు పంపినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
 • రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయం వరకు 102 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 9,475కు పెరిగింది. వీరిలో 6506 మంది రోగులు కోలుకోగా 5977 మంది వివిధ ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇవాళ్టి కొత్త కేసులలో అత్యధికం జైపూర్‌లో నమోదయ్యాయి.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 137 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 8420కి చేరింది. వీటిలో 2835 యాక్టివ్‌ కేసులు కాగా, కొత్త కేసులలో అత్యధికంగా ఇండోర్ నుంచి రాగా, నీముచ్ జిల్లా తర్వాతి స్థానంలో ఉంది. ఇవాళ నీముచ్‌లో 23 మంది, భోపాల్‌లో 35మంది, జబల్పూర్‌లో ఆరుగురు వంతున కోలుకున్నారు.
 • ఛత్తీస్‌గఢ్‌: తాజా సమాచారం ప్రకారం... 9 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 564కు చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసులు 433గా ఉన్నాయి. కొత్త కేసులలో ఎక్కువగా బలోదాబాజార్, కోర్బా బలోద్ నుంచి నమోదయ్యాయి. ప్రస్తుతం, రాష్ట్రంలో 51,588 మందిని గృహనిర్బంధంలో ఉంచారు.
 • గోవా: గోవాలో ఇవాళ 6 కొత్త కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. వాటిలో 22 యాక్టివ్‌ కేసులు కాగా, మంగళవారం 13 మంది కోలుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

 

PIB FACT CHECK

 

 

******(Release ID: 1629232) Visitor Counter : 41


Read this release in: English , Urdu , Hindi , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam