ప్రధాన మంత్రి కార్యాలయం

భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) వార్షిక సమావేశం ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

Posted On: 02 JUN 2020 6:35PM by PIB Hyderabad

నమస్కారం. 125 సంవ‌త్స‌రాలు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మీకంద‌రికీ తొలుత నా శుభాకాంక్ష‌లు. 125 సంవత్స‌రాల ప్ర‌యాణం అంటే సుదీర్ఘ‌మైన‌ది. ఆ ప్ర‌యాణంలో ఎన్నో మైలు రాళ్లుండి ఉంటాయి. అలాగే మీరంద‌రూ ఎన్నో ఎగుడుదిగుడులు కూడా చ‌వి చూసి ఉంటారు. ఒక సంస్థ‌ను 125 సంవ‌త్స‌రాల కాలం న‌డ‌ప‌డం అంటే అతి పెద్ద స‌వాలు. అప్ప‌టికి, ఇప్ప‌టికీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్ర‌ధానంగా వ్య‌వ‌స్థ‌లు ఎంతో మారిపోయాయి. ఈ 125 సంవ‌త్స‌రాల ప్ర‌యాణంలో సిఐఐని ప‌టిష్ఠం చేయ‌డానికి కృషి చేసిన దిగ్గ‌జాలంద‌రికీ మొదట శుభాకాంక్ష‌లు తెలియ‌చేయాల‌నుకుంటున్నాను. అలాగే  ప్ర‌స్తుతం మన మ‌ధ్యన భౌతికంగా లేని వారంద‌రికీ నా నివాళి. భ‌విష్య‌త్తులో సార‌థ్య ప‌గ్గాలు చేప‌ట్ట‌బోయే వారంద‌రికీ శుభ కామ‌న‌లు.
క‌రోనా మ‌హ‌మ్మారి  ప్ర‌భావం వ‌ల్ల ఆన్ లైన్ కార్య‌క‌లాపాలు కొత్త అల‌వాటుగా మారిపోయాయి.  క‌ష్టాలు ఎదురైన‌ప్పుడ‌ల్లా ప్ర‌జ‌లు వాటిని అధిగ‌మించే మార్గాల కోసం అన్వేషిస్తారు. వారి అతి పెద్ద బ‌లం ఇదే. ఈ రోజున కూడా ఒక‌ప‌క్క వైర‌స్ ను అదుపు చేయ‌డానికి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటూనే మ‌రోప‌క్క ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌నుగ‌డ‌కు కూడా కృషి చేస్తున్నాం. దేశ‌వాసుల ప్రాణాల‌ను ర‌క్షించ‌డంతో పాటు ఆర్థిక కార్య‌క‌లాపాల్లో స్థిర‌త్వం తేవ‌డం, ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో వేగం పెంచ‌డానికి కూడా కృషి చేయాలి. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో మీరంద‌రూ వృద్ధిని పున‌రుద్ధ‌రించ‌డం గురించి మాట్లాడుతున్నారు. అది అభినంద‌నీయం. మ‌నం వృద్ధిని తిరిగి సాధారణ స్థాయికి తీసుకురాగ‌ల‌మ‌ని నేను న‌మ్మ‌కంగా చెబుతున్నాను. ప్ర‌స్తుత సంక్షోభ స‌మ‌యంలో నేను ఇంత న‌మ్మ‌కంగా ఎలా చెప్ప‌గ‌లుగుతున్నాన‌ని మీకంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌వ‌చ్చు.

నా న‌మ్మ‌కానికి ఎన్నో కార‌ణాలున్నాయి. భార‌త‌దేశానికి గల సామ‌ర్థ్యాలు, విప‌త్తు నిర్వ‌హ‌ణ‌పై నాకు న‌మ్మ‌కం ఉంది. భార‌త‌దేశంలో గల ప్ర‌తిభ, సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ను నేను విశ్వ‌సిస్తాను. న‌వ‌క‌ల్ప‌న‌లు, మేథ‌స్సుల‌ను నేను న‌మ్ముతాను. రైతులు, ఎంఎస్ఎంఇ పారిశ్రామికుల‌నపై నాకు న‌మ్మ‌కం ఉంది. మీ వంటి పారిశ్రామిక దిగ్గ‌జాలను నేను విశ్వ‌సిస్తాను. అందుకే వృద్ధిని తిరిగి తీసుకురాగ‌ల‌మ‌ని నేను చెప్ప‌గ‌లుగుతున్నాను. భార‌త‌దేశం త‌నదైన వృద్ధిరేటును తిరిగి పొంద‌గ‌లుగుతుంది.

మిత్రులారా, 
మన అభివృద్ధి రేటును క‌రోనా మంద‌గింప‌చేసి ఉండ‌వ‌చ్చు. కాని ఇప్పుడే లాక్ డౌన్ ద‌శ‌ను భార‌త్ అధిగ‌మించ‌డంతో పాటు కొత్త‌గా అన్ లాక్ దశలో ప్రవేశించింది. అన్ లాక్ తొలి ద‌శ‌లోనే ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ప‌లు విభాగాల‌ను తెర‌వ‌గ‌లిగాం. జూన్ 8 నుంచి ఇంకా ఎన్నో ఓపెన్ కాబోతున్నాయి. ఆ ర‌కంగా వృద్ధిని తిరిగి తీసుకురావ‌డం ఇప్పుడే ప్రారంభ‌మ‌యింది. 

క‌రోనా వైర‌స్ క్ర‌మంగా విస్త‌రిస్తూ తన కోర‌ల‌ను ప్ర‌పంచం చుట్టూ వ్యాపింప‌చేస్తున్న త‌రుణంలోనే భార‌త‌దేశం రంగంలోకి దిగి స‌కాలంలో స‌రైన చ‌ర్య‌లు తీసుకుంది. ఇతర దేశాల‌తో ప‌రిస్థితిని పోల్చితే భార‌త‌దేశం ప్ర‌క‌టించిన లాక్ డౌన్ ప్ర‌భావం ఎంత విస్తృతంగా ఉన్న‌ది మ‌నం చూడ‌గ‌లుగుతాం. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో భార‌త‌దేశం భౌతిక వ‌న‌రుల‌ను సిద్ధం చేసుకోవ‌డ‌మే కాదు, మానవ వ‌న‌రుల‌ను కూడా ప‌రిర‌క్షించుకుంది. ఈ వాతావ‌ర‌ణంలో త‌ర్వాత ఏమిటి?  అనే ప్ర‌శ్న త‌లెత్తుతుంది. పారిశ్రామిక రంగం నాయ‌కులుగా మీ అంద‌రి మ‌దిలో ఒక‌టే ప్ర‌శ్న మెదులుతుంది, అదే ఇప్పుడు ప్ర‌భుత్వం ఏం చేయ‌బోతోంద‌నేది. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప్ర‌చారంపై కూడా మీలో కొన్ని ప్ర‌శ్న‌లుండ‌వ‌చ్చు. అది అత్యంత స‌హ‌జం, త‌ప్పు కూడా కాదు.

మిత్రులారా,   
క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు కొత్త శ‌క్తిని క‌ల్పించ‌డం అత్యంత ప్ర‌ధాన‌మైన అంశాల్లో ఒక‌టి. అందుకోస‌మే త‌క్ష‌ణం తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం చేప‌ట్టింది. పైగా దీర్ఘ‌కాలంలో దేశానికి ఉప‌యోగ‌క‌రంగా ఉండే నిర్ణ‌యాలు ప్ర‌భుత్వం తీసుకుంది. 

మిత్రులారా, 
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పేదలకు తక్షణ ప్రయోజనం కల్పించడానికి ఎంతో సహాయకారిగా ఉంది.  ఈ పథకం కింద 74 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ అందించడం జరిగింది. వలస కార్మికులకు ఉచిత రేషన్ కూడా అందచేశాం. అంతేకాదు, ఇప్పటివరకు నిరుపేద కుటుంబాలకు రూ.50 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించాం. మహిళలు, దివ్యాంగులు, కార్మికులు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ దాని వల్ల లబ్ధి పొందారు. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం 8 కోట్ల గ్యాస్ సిలిండర్లు పేదలకు ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేసింది. అంతే కాదు, ప్రైవేటు రంగాల్లోని 50 లక్షల మందికి పైగా ఉద్యోగుల ఖాతాలకు ప్రభుత్వం 24 శాతం ఇపిఎఫ్ చందా అందించింది. వారి ఖాతాల్లో రూ.800 కోట్ల వరకు జమ చేయడం జరిగింది.

మిత్రులారా,  
స్వయంసమృద్ధ భారత్ నిర్మాణం, భారత ఆర్థిక వ్యవస్థను వేగవంతమైన అభివృద్ధిలో తిరిగి ప్రవేశపెట్టడానికి ఐదు అంశాలు - నిశ్చయం, సమ్మిళితత్వం, పెట్టుబడి, మౌలిక వసతులు, నవకల్పనలు- అత్యంత ప్రధానం. ఆ దిశగా మేం ఇటీవల తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వివరాలు మీ ముందుంచుతున్నాను. ఈ నిర్ణయాలతో్ ప్రతీ ఒక్క రంగాన్ని మేం భవిష్యత్ అవసరాలకు దీటుగా తయారుచేయగలిగాం. ఈ రోజున భారత్ వృద్ధి ఆధారిత భవిష్యత్తు దిశగా పెద్ద అడుగు వేయడానికి సిద్ధంగా ఉంది.

మిత్రులారా, 
సంస్కరణలంటే మాకు ఎంపిక ప్రాతిపదికన తీసుకునే చర్య కానేకాదు. మా వరకు సంస్కరణలంటే ఒక క్రమపద్ధతి, ప్రణాళికాబద్ధత, సమన్వయం, పరస్పర అనుసంధానం, భవిష్యత్ దృక్కోణం కలిగి ఉండాలి.

మా దృష్టిలో "సంస్కరణ" అంటే నిర్ణ‌యాలు తీసుకోగల, వాటికి తార్కిక‌మైన ముగింపు ఇవ్వగల సాహ‌సం క‌లిగి ఉండ‌డ‌మే. ఐబిసి, బ్యాంకు విలీనాలు, జిఎస్ టి, ఫేస్ లెస్ ఆదాయపు పన్ను అసెస్ మెంట్ విధానం అన్నింటిలోనూ ప్రభుత్వ జోక్యం తగ్గించే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి ప్రైవేటు రంగానికి అవకాశాలు పెంచగల వాతావరణం కల్పనకు మేం ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే ప్రభుత్వం విధానపరమైన సంస్కరణలు చేపట్టింది. వ్యవసాయ రంగం విషయానికే వస్తే స్వాతంత్ర్యం సిద్ధించిన కాలంలో రూపొందించిన విధానాలు, నిబంధనల కారణంగా రైతులను మధ్యదళారీల కరుణాకటాక్షాలకు ఎదురు చూసే పరిస్థితిని కల్పించాయి. దశాబ్దాల కాలంలో రైతులకు జరిగిన అన్యాయాన్ని తొలగించేందుకు మా ప్రభుత్వం కట్టుబాటుతో ముందుకు కదిలింది.

ఎపిఎంసి చట్టంలో మార్పులు చేసిన తర్వాత ఇప్పుడు రైతులు కూడా హక్కులు పొందారు. రైతాంగం ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎవరికి అమ్మాలనుకుంటే వారికి తమ ఉత్పత్తులు విక్రయించవచ్చు. ఈ రోజున రైతు దేశంలోని ఏ రాష్ర్టానికైనా తన పంట దిగుబడిని తీసుకుపోయి విక్రయించుకోవచ్చు. తమ వ్యవసాయ దిగుబడులు గిడ్డంగుల్లో భద్రపరుచుకుని ఎలక్ర్టానిక్ ట్రేడింగ్ ద్వారా విక్రయించవచ్చు. ఒక్క సారి ఆలోచించండి, అగ్రి బిజినెస్ కు ఎన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయో. అలాగే మిత్రులారా, మన కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మిక సంస్కరణలు చేపట్టడం ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాం.
ప్రైవేటు రంగం భాగస్వామి కాగల వ్యూహాత్మకం కాని రంగాలను పెట్టుబడులకు తెరిచాం. ఎన్నో సంవత్సరాలుగా పెండింగులో ఉన్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” బాటలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం.

మిత్రులారా, 
భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా బొగ్గు నిల్వలున్న మూడో దేశం. అలాగే మీ వంటి సాహసోపేతులైన, కష్టించి పని చేయగల వ్యాపారవేత్తలు భారతదేశానికి ఉన్నారు. అలాంటప్పుడు వెలుపలి నుంచి బొగ్గు ఎందుకు దిగుమతి చేసుకోవాలి?   కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం, మరికొన్ని సందర్భాల్లో విధానాలు అడ్డుగా నిలుస్తున్నాయి. అందుకే బొగ్గు రంగాన్ని ఈ అవరోధాల నుంచి విముక్తం చేసే కృషి ప్రారంభించాం. 

ఇప్పుడు బొగ్గు రంగంలో వాణిజ్యపరమైన తవ్వకాలను అనుమతించాం. పాక్షికంగా అన్వేషించిన కోల్ బ్లాక్ లను కూడా అలాట్ చేసేందుకు అనుమతులు మంజూరు చేశాం. అలాగే ఖనిజాల తవ్వకం కూడా స్వేచ్ఛాయుతం చేశాం. ఇప్పుడు ఖనిజాల అన్వేషణతో పాటు తవ్వకాలు కూడా చేపట్టవచ్చు. ఆ రంగంతో సంబంధం ఉన్న వారికి ఈ నిర్ణయాల దీర్ఘకాలిక ప్రభావాల గురించి బాగా తెలుసు.

మిత్రులారా, 
ప్రభుత్వం కదులుతున్న క్రమాన్ని బట్టి గనుల రంగం, ఇంధన రంగం, పరిశోధన, టెక్నాలజీ ఏ రంగమైనా కావచ్చు...ప్రతీ ఒక్క రంగంలోనూ యువతకు, పరిశ్రమకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అవే కాదు, ఇప్పుడు వ్యూహాత్మక రంగాల్లో కూడా ప్రైవేటు భాగస్వామ్యం వాస్తవంలోకి రాబోతోంది. మీరు అంతరిక్షంలో పెట్టుబడి పెట్టాలనుకున్నా లేదా అణుఇంధన రంగంలో కొత్త అవకాశాలు అన్వేషించాలనుకున్నా అద్భుతమైనన అవకాశాలు మీకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి.

మిత్రులారా, 
మీ అందరికీ బాగా తెలుసు, దేశంలోని లక్షలాది ఎంఎస్ఎంఇ యూనిట్లు ఆర్థిక రంగానికి చోదక శక్తులు. మన భారత జిడిపికి వారు ఎంతో పెద్ద వాటా అందిస్తున్నారు. వారందించే వాటా 30 శాతం వరకు ఉంది. ఎంఎస్ఎంఇల నిర్వచనంపై స్పష్టత ఇవ్వాలని ఎంతో కాలంగా కోరుతున్నారు. ఆ ఆకాంక్ష ఇప్పటికి నెరవేరింది. ఇప్పుడు ఎంఎస్ఎంఇలు ఎలాంటి చింత లేకుండా అభివృద్ధి చెందవచ్చు. ఎంఎస్ఎంఇ హోదాను నిలబెట్టుకునేందుకు మార్గాల కోసం అన్వేషించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రూ.200 కోట్ల వరకు విలువ గల ముడిపదార్ధాల సమీకరణకు ఇక అంతర్జాతీయ టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఇలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఎంతో లాభం చేకూరుస్తుంది. చిన్న పరిశ్రమలకు  ఈ చర్య ఎన్నో అవకాశాలను ఆవిష్కరిస్తుంది. ఒక రకంగా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజి ఎంఎస్ఎంఇ రంగానికి ఇంధనంగా నిలుస్తుంది.

మిత్రులారా, 
ఈ నిర్ణయాల ప్రాధాన్యం తెలుసుకోవాలంటే నేటి ప్రపంచ పరిస్థితిని తెలుసుకోవలసిన, అవగాహన చేసుకోవలసిన ప్రాధాన్యం ఉంది. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ ఒక దాని మద్దతు కోసం మరొకటి ఆధారపడుతున్నాయి. వాటిలో మరో దేశం కూడా అందుబాటులోకి రావలసిన అవసరం ఉంది. ఒక్కసారి పాత ఆలోచనలు, పాత విధానాలు, పాత ఆచారాలు ఎంత సమర్థవంతంగా ఉన్నాయో కూడా ఆలోచనకు వస్తుంది. అప్పుడు నేటి విధానాలపై సహజంగానే ఆలోచన వెళ్తుంది. అలాంటి సందర్భాల్లో భారతదేశంపై ప్రపంచం అంచనాలు మరింతగా పెరిగాయి.  ఈ రోజున భారతదేశంపై ప్రపంచ విశ్వాసం ఎంతగానో పెరిగింది. మీరు చూసే ఉంటారు, కరోనా సంక్షోభం సమయంలో ఒక దేశానికి మరో దేశం సహాయం చేయడం అత్యంత కష్టంగా ఉన్న వాతావరణంలో భారతదేశం 150కి పైగా దేశాలకు వైద్యసరఫరాలు అందించింది.

మిత్రులారా, 
నమ్మకస్తుడైన, ఆధారనీయ భాగస్వామిగా ప్రపంచం యావత్తు భారత్ ను పరిగణిస్తోంది. మనకి ఆ సామర్థ్యం, బలం, శక్తి ఉన్నాయి. 

భార‌త‌దేశంపై ప్ర‌పంచం పెంచుకున్న న‌మ్మ‌కం నుంచి పూర్తి స్థాయిలో లాభం పొందేందుకు ఈ రోజున భారత పారిశ్రామిక రంగం సిద్ధం కావాలి. మీ అంద‌రి బాధ్యత అది. "భార‌త్ లో త‌యారీ" అంటే న‌మ్మ‌కం, నాణ్యత, పోటీ సామ‌ర్థ్యం అని నిరూపించ‌డం ఒక సంస్‌ిగా సిఐఐ బాధ్యత అది. మీరు రెండడుగులు ముందుకేస్తే మీకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం నాలుగు అడుగులు ముందుకేస్తుంది. మీ అందరి వెంట నేనుంటానని ప్రధానమంత్రిగా నేను హామీ ఇస్తున్నాను. భారత పరిశ్రమ సమయానికి అనుగుణంగా కదలాల్సిన తరుణం ఇది. నన్ను నమ్మండి, "వృద్ధిని పునరుద్ధరించడం" అంత కష్టమేమీ కాదు. ఇప్పుడు భారత పారిశ్రామిక రంగానికి ముందున్న స్పష్టమైన బాట ఆత్మనిర్భర్ భారత్. అదే స్వయం సమృద్ధ భారత్. స్వయం  మరింత శక్తివంతమైన, ప్రపంచాన్ని హత్తుకోగల భారతదేశమే సమృద్ధ భారత్. 

స్వయంసమృద్ధ భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పూర్తిగా అనుసంధానం కాగలుగుతుంది, మద్దతుగా నిలవగలుగుతుంది. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, స్వయంసమృద్ధ భారత్ అంటే వ్యూహాత్మక రంగాల కోసం కూడా మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. స్వయం సమృద్ధ భారత్ అంటే అత్యంత శక్తివంతమైన, ప్రపంచ శక్తిగా అవతరించగల పరిశ్రమల అభివృద్ధి...ఉపాధి అవకాశాలు పెంచడం, ప్రజలను సాధికారం చేయడం, దేశ భవిష్యత్తుకు అవసరం అయిన పరిష్కారాల కోసం అన్వేషించడం. మనం ఇప్పుడు స్థానిక అవసరాలు తీర్చగల, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత వాటా పెంచగల అత్యంత శక్తివంతమైన సరఫరా వ్యవస్థను నిర్మించేందుకు పెట్టుబడి పెట్టాలి. సిఐఐ వంటి దిగ్గజ వ్యవస్థలు ఈ ప్రచారోద్యమంలో సరికొత్త పాత్ర పోషించేందుకు  ముందుకు రావాలి. దేశీయ ఆశలకు ఇంధనంగా నిలవగల చాంపియన్లుగా తయారుకావాలి. దేశీయ పరిశ్రమల పునరుజ్జీవానికి మీరు సహాయకారి కావాలి.

వృద్ధిలో కొత్త అంచెకు చేరడానికి అవసరమైన సహాయం, మద్దతు అందించాలి. ప్రపంచ మార్కెట్ కు విస్తరించడానికి పరిశ్రమలకు మీరు సహాయం అందించాలి.
మిత్రులారా,   
అలాంటి వస్తువులన్నీ ఈ రోజున దేశంలోనే తయారుచేయాలి  “మేడ్ ఇన్ ఇండియా”; ప్రపంచం కోసం తయారుచేయాలి- “మేడ్ ఫర్ ద వరల్డ్”. దిగుమతులను దేశం ఎలా తగ్గించుకోవాలి?  ఎలాంటి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలి?  అన్ని రంగాల్లో ఉత్పాదకత పెంచే విధంగా మనం లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. దేశానికి మీ నుంచి అలాంటి అంచనాలే ఉన్నాయి, ఈ రోజున ఇదే సందేశం పరిశ్రమకి ఇవ్వాలని నేను భావిస్తున్నాను.  

మిత్రులారా, 
భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చడానికి, ప్రధాన ఉపాధి కల్పన శక్తిగా తీర్చి దిద్దడానికి మేక్ ఇన్ ఇండియాను ఒక మాధ్యమంగా చేసుకుని మీ వంటి సంస్థలతో చర్చించిన అనంతరం పలు ప్రాధాన్యతా రంగాలను గుర్తించడం జరుగుతుంది. ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్లు, లెదర్, పాదరక్షల రంగాల్లో పని ఇప్పటికే ప్రారంభం అయింది. ఎయిర్ కండిషనర్లకు దేశీయ డిమాండులో30 శాతం మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఆ దిగుమతులను వీలైనంతగా తగ్గించుకోవాలి. లెదర్ ఉత్పత్తుల్లో రెండో పెద్ద ఉత్పత్తి దేశం అయినప్పటికీ ప్రపంచ ఎగుమతుల్లో మన వాటా చాలా తక్కువగా ఉంది. 

మిత్రులారా, 
మనం ఎంతో చక్కని పురోగతి సాధించగల రంగాలెన్నో ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో మీ వంటి మిత్రుల సహాయంతో వందే భారత్ వంటి ఆధునిక రైళ్ల కోచ్ లు దేశంలోనే నిర్మించుకున్నాం. ఈ రోజున మన దేశం మెట్రో కోచ్ లను కూడా ఎగుమతి చేస్తోంది. అలాగే మొబైల్ ఫోన్లు కావచ్చు, రక్షణ ఉత్పత్తులు కావచ్చు అన్నింటిలోనూ దిగుమతి ఆధారనీయత తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం మూడే నెలల వ్యవధిలో మీరు వందల కోట్ల రూపాయల విలువ గల వ్యక్తిగత సంరక్షణ పరికరాల (పిపిఇ) పరిశ్రమను అభివృద్ధి చేశారన్న విషయం చెప్పడానికి ఈ రోజున నేను గర్విస్తున్నాను.  మూడు నెలల క్రితం వరకు దేశంలో ఒక్క పిపిపి కిట్ కూడా తయారయ్యేది కాదు. ఈ రోజున భారతదేశం రోజుకి 3 లక్షల పిపిఇ కిట్లు ఉత్పత్తి చేస్తోంది.  మన పరిశ్రమ అంత శక్తివంతమైనది. ప్రతీ ఒక్క రంగంలోనూ మీకు ఆ సామర్థ్యం ఉంది. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గల పెట్టుబడి అవకాశాలన్నింటినీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని, రైతులతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఆగ్రో ఉత్పత్తుల క్లస్టర్లు అభివృద్ధి చేయడానికి అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నాం. సిఐఐ సభ్యులందరికీ అలాంటి అవకాశాలెన్నో ఉన్నాయి.

మిత్రులారా, 
వ్యవసాయం, మత్స్యరంగం, ఫుడ్ ప్రాసిసెంగ్, పాదరక్షలు, ఫార్మా ఒక్కటేమిటి భిన్న రంగాల్లో కొత్త అవకాశాలు మీ కోసం తెరుచుకుని ఉన్నాయి. నగరాల్లోని వలస కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన అద్దె వసతి నిర్మాణంలో మీ అందరి చురుకైన భాగస్వామ్యాన్ని నేను ఆహ్వానిస్తున్నాను.

మిత్రులారా, 
మా ప్రభుత్వం దేశాభివృద్ధి పయనంలో్ ప్రైవేటు రంగాన్ని కీలక భాగస్వామిగా పరిగణిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ ప్రచారోద్యమంలో మీ అందరి పాత్ర ఎంతో కీలకం. నేను మీ అందరితోనూ, ఇతర భాగస్వాములతోనూ నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉంటాను, ఇది కొనసాగుతుంది. ప్రతీ ఒక్క రంగానికి చెందిన సవివరమైన అధ్యయనంతో మీరు ముందుకు రండి, ఏకాభిప్రాయాన్ని సాధించండి, కొత్త కాన్సెప్ట్ లు అభివృద్ధి చేయండి,  పెద్దగా ఆలోచించండి. మనందరం కలిసికట్టుగా దేశగతిని మార్చగల మరిన్ని వ్యవస్థాత్మక సంస్కరణలు చేపడదాం. 

క‌లిసిక‌ట్టుగా మనం  స్వ‌యంస‌మృద్ధ భార‌త్ నిర్మిద్దాం. మిత్రులారా, రండి...దేశాన్ని స్వ‌యంస‌మృద్ధం చేస్తామ‌నే ప్ర‌తిజ్ఞ చేయండి. ఆ సంక‌ల్పం సాకారం చేయ‌డానికి మీ శ‌క్తి అంతా ఉప‌యోగించండి. ప్ర‌భుత్వం మీతో నిలుస్తుంది. మీరంద‌రూ ఈ ల‌క్ష్యాల సాధన విష‌యంలో ప్ర‌భుత్వంతో నిల‌వాలి. మీరు విజ‌యం సాధిస్తారు, మ‌నం విజ‌యం సాధిస్తాం, దేశం కొత్త శిఖ‌రాల‌కు చేరుతుంది, స్వ‌యం స‌మృద్ధం అవుతుంది. మ‌రోసారి నేను 125 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా సిఐఐని అభినందిస్తున్నాను. ధ‌న్య‌వాదాలు. 
 



(Release ID: 1628902) Visitor Counter : 360