కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

రెండు నెలల్లో 52.62 లక్షల మంది కేవైసీ అప్‌డేట్‌ చేసిన ఈపీఎఫ్‌వో

ఆన్‌లైన్‌ ద్వారా క్లెయిముల పరిష్కారం, అడ్వాన్సుల జారీ వేగవంతం
లక్షలాది మంది ఖాతాదారుల వివరాల్లో తప్పులను సరిదిద్దిన ఈపీఎఫ్‌వో
కేవైసీ అప్‌డేషన్లు, సిబ్బందికి ఆరోగ్య భద్రత విషయంలో ద్విముఖ వ్యూహం

Posted On: 03 JUN 2020 12:36PM by PIB Hyderabad

కొవిడ్‌-19 కారణంగా ఆన్‌లైన్‌ సేవల ఆవశ్యకత పెరిగింది. ఖాతాదారులకు మరింతగా అందుబాటులో ఉండేలా, అందరికీ ఆన్‌లైన్‌ సేవలు అందించేలా, వారి కేవైసీ సమాచారాన్ని ఈపీఎఫ్‌వో అప్‌డేట్‌ చేసింది. 2020 ఏప్రిల్‌, మే నెలల్లో 52.62 లక్షల మంది ఖాతాదారుల కేవైసీ అప్‌డేట్‌ చేసింది. ఇందులో, 39.97 లక్షల మంది ఆధార్‌ అనుసంధానం, 9.87 లక్షల మంది ఫోన్‌ నంబర్ల (యూఏఎన్‌ యాక్టివేషన్‌) అనుసంధానం, 11.11 లక్షల మంది బ్యాంక్‌ అకౌంట్ల అనుసంధానం ఉన్నాయి. కేవైసీ అనేది ఒకేసారి జరిగే ప్రక్రియ. ఖాతాదారుల వివరాలను యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌) తో అనుసంధానించే సమయంలో వారి గుర్తింపును కేవైసీ సులభతరం చేస్తుంది. 

    లాక్‌డౌన్‌ సమయంలోనూ భారీ స్థాయిలో కేవైసీలు అప్‌డేట్‌ చేయడానికి, ఖాతాదారుల వివరాల్లో లోపాలను సరిదిద్దేందుకు ఈపీఎఫ్‌వో పెద్ద కసరత్తు చేసింది. 4.81 లక్షల మంది పేర్లను, 2.01 లక్షల మంది పుట్టిన తేదీలను, 3.7 లక్షల మంది ఆధార్‌ నంబర్ల అనుసంధానంలో లోపాలను ఈ రెండు నెలల్లో సరిదిద్దింది.

    ఒకవైపు కేవైసీ అప్‌డేషన్లు చేపట్టడానికి, మరొకవైపు సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పించడానికి ద్విముఖ వ్యూహాన్ని ఈపీఎఫ్‌వోఅనుసరించింది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించింది. కేవైసీ అప్‌డేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తూ, ఖాతాదారుల వివరాల్లో లోపాలను సరిచేశారు. పెండింగ్‌ పనులను పూర్తి చేశారు. ఉద్యోగులు తమ ఆధార్‌ నంబర్ల అనుసంధానం కోసం సంస్థ యజమానిపై ఆధారపడకుండా చేయటం; పుట్టిన తేదీల్లో మూడేళ్ల వరకు ఉన్న తేడాలను సరిదిద్దేందుకు ఆధార్‌ కార్డును రుజువుగా అంగీకరించడం వంటి చర్యలు కేవైసీ ప్రక్రియను వేగవంతం చేశాయి. 

    ఖాతాదారులు మెంబర్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ సేవలను పొందేందుకు కేవైసీ అప్‌డేషన్‌ వీలుకల్పిస్తుంది. దీనిద్వారా, తను దాచుకున్న పూర్తి మొత్తాన్ని ఖాతాదారులు తీసుకోవచ్చు. లేదా, కొంతమొత్తాన్ని అడ్వాన్స్‌లుగా తీసుకోవచ్చు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ఇటీవల ప్రవేశపెట్టిన కొవిడ్‌-19 అడ్వాన్స్‌ను కూడా ఖాతాదారులు పొందవచ్చు. ఉద్యోగులు సంస్థలు మారినప్పుడు వారి ఖాతాను ఆన్‌లైన్‌ ద్వారా కొత్త సంస్థ పరిధిలోకి బదిలీ చేయడంలో ఇబ్బందులు తలెత్తకుండా కేవైసీ చేస్తుంది. కేవైసీ సభ్యులు కంప్యూటర్ల ద్వారా లేదా ఉమాంగ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ సేవలను పొందవచ్చు.

    ఆన్‌లైన్‌ పద్ధతిని స్వీకరించిన ఈపీఎఫ్‌వో, కొవిడ్‌-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉన్నా ఖాతాదారుల ఇంటి వద్దకే సేవలను అందించి నిబద్ధత చాటుకుంది. క్లెయిముల పరిష్కారం, ఈపీఎఫ్‌ అడ్వాన్సులు, పీఎఫ్‌ బదిలీ, పింఛన్ల ప్రక్రియలో సమయం వృథాను అరికట్టి... పరిమాణపరంగా, నాణ్యతపరంగా సేవలను మెరుగుపరుచుకోవడానికి ఆన్‌లైన్‌ విధానం ఈపీఎఫ్‌వోకు సాయపడింది. 


(Release ID: 1628957) Visitor Counter : 312