హోం మంత్రిత్వ శాఖ

విదేశీయులు భారత్‌ రావడానికి వీసా, ప్రయాణ నిబంధనల్లో మార్పులు

భారత్‌ తప్పనిసరిగా రావలసిన అవసరం మేరకు వివిధ వర్గాలుగా విభజన
పాత వీసాలను మళ్లీ చెల్లుబాటు అయ్యేలా ధృవీకరించుకోవాలని ఆదేశం
భారత సంస్థల ఆహ్వానం ఉంటేనే మనదేశంలోకి విదేశీయులకు అనుమతి

Posted On: 03 JUN 2020 3:44PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ దృష్ట్యా, విదేశీ ప్రయాణాలను భారత ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. అయితే, భారతదేశానికి తప్పకుండా రావాల్సిన అవసరం ఉన్న విదేశీయుల విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. భారత్‌కు రావలసిన అవసరం మేరకు విదేశీయులను వివిధ వర్గాలుగా విభజించి, వీసా, ప్రయాణ నిబంధనలను సరళీకరించింది. ఈ క్రింది వర్గాల విదేశీయులు భారత్‌ రావడానికి అనుమతి ఇచ్చింది:

    బిజినెస్‌ వీసా (క్రీడల కోసం ఇచ్చే బీ-3 వీసా కాకుండా) మీద షెడ్యూల్‌ కాని లేదా చార్టర్డ్‌ విమానాల్లో భారత్‌ వచ్చే విదేశీ వ్యాపారస్తులు.

    విదేశీ ఆరోగ్య నిపుణులు, ఆరోగ్య పరిశోధకులు, ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రయోగశాలలు, ఫ్యాక్టరీలు మొ. వాటిలో సాంకేతిక పనిపై వచ్చే ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు. గుర్తింపు పొందిన, నమోదైన ఆరోగ్య రంగ సంస్థలు, ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి వీరు ఆహ్వాన లేఖ పొందివుండాలి.

    భారత్‌లో ఏర్పాటయిన విదేశీ సంస్థల తరపున వచ్చే విదేశీ ఇంజినీరింగ్‌, నిర్వహణ, డిజైన్‌ లేదా ఇతర రంగాల నిపుణులు. అన్ని ఉత్పత్తి యూనిట్లు, డిజైన్‌ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌, ఐటీ యూనిట్లు, ఆర్థిక రంగ సంస్థలు ( బ్యాంకింగ్‌, నాన్‌-బ్యాంకింగ్‌ ఆర్థిక రంగ సంస్థలు)   ఇందులోకి వస్తాయి.

    మన దేశ సంస్థల్లో విదేశీ యంత్రాలు లేదా సామగ్రి ఏర్పాటు, మరమ్మతులు, నిర్వహణ కోసం వచ్చే విదేశీ సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లకు అనుమతి. నమోదైన భారతీయ వ్యాపార సంస్థ నుంచి వీరికి ఆహ్వానం ఉండాలి. ఈ ఆహ్వానం.. సామగ్రి సంస్థాపన లేదా వారంటీ ప్రకారం లేదా అమ్మకం తర్వాత సేవలు లేదా వాణిజ్యపర మరమ్మతుల కోసమై ఉండాలి.

    పై కేటగిరీలకు చెందిన విదేశీయులు నిబంధనలను అనుసరించి కొత్తగా బిజినెస్‌ వీసా లేదా ఎంప్లాయిమెంట్‌ వీసా పొందాలి. చెల్లుబాటులో ఉన్న దీర్ఘకాలిక బిజినెస్‌ వీసా (క్రీడల కోసం ఇచ్చే బీ-3 వీసా కాకుండా) కలిగివున్న విదేశీయులు.. అవి మళ్లీ చెల్లుబాటు అయ్యేలా విదేశాల్లోని సంబంధింత భారత అధికార వర్గాల నుంచి అనుమతి పొందాలి. గతంలోనే ఎలక్ట్రానిక్‌ వీసాలు పొంది, వాటి ద్వారా  రావాలనుకునే విదేశీయులను భారత్‌లోకి అనుమతించరు.

    అధికారిక పత్రం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.(Release ID: 1629222) Visitor Counter : 341