PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 26 MAY 2020 6:36PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 నుంచి కోలుకున్నవారి శాతం క్రమేణా మెరుగుపడి 41.61కి చేరింది; ఈ మేరకు వ్యాధి నయమైన/కోలుకున్నవారి సంఖ్య 60,490గా నమోదైంది.
 • భారతదేశంలో కోవిడ్‌-19 నిర్ధారణ కోసం ప్రస్తుతం రోజూ 1.1 లక్షల నమూనాలను పరీక్షిస్తున్నారు.
 • వలసదారుల రాకతో కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న 5 రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సమీక్ష.
 • దేశవ్యాప్తంగా 3,274 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లద్వారా 44 లక్షలమంది సొంత రాష్ట్రాలకు చేరవేత; నేడు ఎలాంటి రద్దీ లేకుండా నడుస్తున్న రైళ్లు.
 • ఆమోదిత/వర్గీకృత హోటళ్లు, ఇతర వసతిగృహాల చెల్లుబాటు వ్యవధిని పొడిగించిన పర్యాటక మంత్రిత్వశాఖ

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

దేశంలో కోవిడ్‌-19 నిర్ధారణ కోసం నేడు దాదాపు 1.1 లక్షల నమూనాలను పరీక్షిస్తున్నారు. ప్రయోగశాలల సంఖ్యసహా షిఫ్టులు, ఆర్టీ-పీసీఆర్‌ యంత్రాలు, మానవశక్తిని పెంచడంతో పరీక్షల నిర్వహణ సామర్థ్యం ఇనుమడించింది. దేశంలో నేడు కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించే 612 ప్రయోగశాలలకుగాను 430 ఐసీఎంఆర్‌ నిర్వహణలో ఉండగా, ప్రైవేటు రంగంలో 182 నడుస్తున్నాయి. దీంతోపాటు అధికశాతం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలు జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద కోవిడ్‌-19 నిర్ధారణ కోసం ‘ట్రూనాట్‌’ యంత్రాలను వినియోగిస్తున్నాయి. అలాగే దేశీయంగా ఆర్టీ-పీసీఆర్‌ కిట్లు, వీటీఎం, స్వాబ్‌/ఆర్‌ఎన్‌ఏ సేకరణ కిట్లు తయారుచేసే యూనిట్లను గుర్తించడంతోపాటు కొన్ని నెలలుగా వాటి ఉత్పాదనను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

   దేశంలో వ్యాధినుంచి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమేణా పెరుగుతూ నేడు 41.61 శాతానికి చేరింది. తదనుగుణంగా ఇప్పటివరకూ 60,490 మందికి వ్యాధి నయంకాగా, దేశంలో మరణాల శాతం తగ్గుముఖం పడుతూ 3.30 శాతం (ఏప్రిల్‌ 15నాటికి) నుంచి నేటికి 2.87శాతానికి దిగివచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మరణాల శాతం 6.45 కాగా, దానితో పోలిస్తే ఇదే అత్యల్పం. మరణాలపై ఒక విశ్లేషణ మేరకు- దేశంలో ప్రతి లక్ష జనాభాకూ మరణాల సగటు 0.3కాగా, ప్రపంచవ్యాప్త సగటు ప్రతి లక్ష జనాభాకూ 4.4 కావడం గమనార్హం. ప్రతి లక్ష జనాభాకూ అతి తక్కువ మరణాల సగటుతోపాటు కేసుల సంఖ్యతో పోలిస్తే మరణాల శాతం తక్కువగా ఉండటాన్నిబట్టి సకాలంలో కేసులు గుర్తింపు, సమర్థ వైద్యనిర్వహణకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.

 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627086

వలసదారుల రాకతో కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న 5 రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సమీక్ష

కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్‌ ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్యశాఖ కార్యదర్శులు, ఎన్‌హెచ్‌ఎంల డైరెక్టర్లతో కోవిడ్‌-19 పరిస్థితిపై సమీక్షించారు. దిగ్బంధం ఆంక్షల సడలింపుతోపాటు వలసదారుల అంతర్రాష్ట్ర ప్రయాణానికి అనుమతి తర్వాత గడచిన మూడు వారాల్లో ఈ రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసుల సంఖ్యలో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని నిర్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రాలుసహా ఐసీయూ/వెంటిలేటర్‌/ఆక్సిజన్‌ అందుబాటు పడకలున్న ఆస్పత్రుల వంటి మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంది. అంతేకాకుండా రాబోయే రెండు నెలల అవసరాలకు తగినరీతిలో వాటిని మరింత బలోపేతం చేసుకోవాలి. ఇక కోవిడేతర అత్యవసర ఆరోగ్య సేవలపైనా రాష్ట్రాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేంద్రం సూచించింది. ఆ మేరకు క్షయ, కుష్ఠు, సీవోపీడీ, అసాంక్రమిక వ్యాధులైన అధిక రక్తపోటు, మధుమేహం, గాయాలకు చికిత్స, ప్రమాద క్షతగాత్రులకు వైద్యం వంటివాటిని నిరంతరాయంగా కొనసాగించాల్సి ఉందని స్పష్టం చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627041

దేశవ్యాప్తంగా 3,274 ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లద్వారా 44 లక్షలమందికిపైగా వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేరవేసిన భారత రైల్వేశాఖ

దేశవ్యాప్తంగా 2020 మే 25దాకా భారత రైల్వేశాఖ 3,274 “శ్రామిక్‌ స్పెషల్‌” రైళ్లను నడిపింది. ఈ రైళ్లద్వారా 44 లక్షల మందికిపైగా ప్రయాణికులు తమ సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. ఇందులో భాగంగా 25.05.2020న వివిధ రాష్ట్రాల నుంచి 223 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లు 2.80 లక్షల మంది ప్రయాణికులతో బయల్దేరాయి. శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లలో ప్రయాణించిన వలస కార్మికులకు ఐఆర్‌సీటీసీ 74 లక్షలకుపైగా ఆహార పొట్లాల, కోటికిపైగా మంచినీటి సీసాలను పంపిణీ చేసింది. కాగా, ఇవాళ రైలు మార్గాల్లో ఎలాంటి రద్దీలేకుండా ఈ రైళ్లు నడవడం గమనార్హం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626952

దేశవ్యాప్తంగా 2020 మే 25 (10:00గం॥)దాకా 25 రోజుల్లో 3,060 ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లద్వారా 40 లక్షలమందికిపైగా వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేరవేసిన భారత రైల్వేశాఖ

దేశంలోని వివిధ రాష్ట్రాలకు 2020 మే 25 (ఉదయం 10:00గం॥)దాకా భారత రైల్వేశాఖ 3,060 “శ్రామిక్‌ స్పెషల్‌” రైళ్లను నడిపి, 40 లక్షల మందికిపైగా వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు చేరవేసింది. కాగా, 2020 మే 23/24 తేదీల్లో దాదాపు అన్ని మార్గాల్లోనూ రద్దీ కనిపించగా, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడం విశేషం. కాగా- ఈ రైళ్లలో మూడింట రెండు వంతులకుపైగా రైళ్లు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల మధ్య మార్గాల్లో పరస్పరం దాటాల్సిన సమయంలో ఆ రద్దీ పరిస్థితి ఏర్పడింది. అంతేగాక ఆయా రాష్ట్రాల పరిధిలో ఆరోగ్య పరీక్షల విధివిధానాల పాటింపు నిమిత్తం వ్యవధి అవసరమవడం కూడా మరొక కారణం. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ అధికారులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చురుగ్గా సంప్రదింపులు సాగించి, అనువైన మార్గాల్లో రైళ్లను నడిపించేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626860

ఆమోదిత/వర్గీకృత హోటళ్లు, ఇతర వసతిగృహాల చెల్లుబాటు వ్యవధిని 2020 జూన్‌ 30దాకా పొడిగించిన పర్యాటక మంత్రిత్వశాఖ

వివిధ వ‌ర్గాల ప‌ర్యాట‌కుల అంచ‌నాలకు త‌గిన ప్ర‌మాణాల ప్ర‌కారం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దేశంలోని హోటళ్లకు న‌క్ష‌త్ర గుర్తింపునిచ్చి వ‌ర్గీక‌రించింది. ఈ వ‌ర్గీక‌ర‌ణ‌/ధ‌్రువీక‌ర‌ణ వ్య‌వ‌ధి ఐదేళ్ల‌పాటు అమ‌లులో ఉంటుంది. త‌ద‌నుగుణంగా ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని హోటళ్లు, ఇతర వసతి గృహాల ప్రాజెక్ట్ ఆమోదాలు/‌పునరామోదాలుస‌హా వ‌ర్గీక‌ర‌ణ/పు‌నర్ వ‌ర్గీక‌ర‌ణ గ‌డువు పెంపున‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు (మార్చి 24 నుంచి జూన్‌ 29మధ్య) గ‌డువు ముగిసిన‌/ముగిసే అవ‌కాశంగల ఆయా ఆమోదాలు/‌పునరామోదాలతోపాటు వ‌ర్గీక‌ర‌ణ/‌పు‌నర్ వ‌ర్గీక‌ర‌ణల గ‌డువును జూన్ 30వ తేదీ వ‌ర‌కు పొడిగించింది. అంతేకాకుండా దేశంలోని ట్రావెల్ ఏజెంట్లు, ప‌ర్యట‌న‌ల నిర్వాహ‌కులు, సాహ‌స ప‌ర్యాట‌క నిర్వాహ‌కులు, దేశీయ  ప‌ర్య‌ట‌న‌ల నిర్వాహ‌కులు, ప‌ర్యాట‌క ర‌వాణాదారులు త‌దిత‌రుల కార్య‌క‌లాపాల అనుమ‌తి గడువుల‌ను కూడా పెంచేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళికి సిద్ధం చేసింది. కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో 2020 మార్చి నుంచి దేశ‌వ్యాప్త దిగ్బంధం అమ‌లులో ఉన్నందున తనిఖీల‌ వాయిదాతోపాటు దరఖాస్తుల‌ పరిశీలన చేప‌ట్ట‌లేదు. ఈ కారణంగా అన్ని వర్గాల (నిర్దేశిత‌, దేశీయ‌, సాహ‌స‌‌) ప‌ర్యాట‌క నిర్వాహ‌కుల‌కు కొన్ని ష‌ర‌తుల‌కు లోబ‌డి ఆరు నెలల సడలింపు లేదా పొడిగింపు ఇవ్వాల‌ని అనుమతించాలని పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626957

అబుధాబి యువరాజుతో ప్రధానమంత్రి టెలిఫోన్‌ సంభాషణ

అబుధాబి యువరాజు మాననీయ షేక్‌ మొహమద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌నహ్యాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంగా యూఏఈ ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో రెండుదేశాల మధ్య సమర్థ సహకారంపై నాయకులిద్దరూ సంతృప్తి వ్యక్తంచేశారు. కాగా, యూఏఈలోని భారత పౌరుల సంక్షేమంపై శ్రద్ధతో వారికి సంపూర్ణ మద్దతునిచ్చినందుకుగాను యువరాజుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626803

గణతంత్ర బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి గౌరవనీయురాలైన షేక్‌ హసీనాతో భారత ప్రధానమంత్రి టెలిఫోన్‌ సంభాషణ

గణతంత్ర బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి గౌరవనీయురాలైన షేక్‌ హసీనాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల నడుమ రెండుదేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సహకారంపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కొనడంలో బంగ్లాదేశ్‌కు భారత్‌ సదా అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626805

కోవిడ్‌-19 పరిస్థితులకు ఉపశమనంపై ఆస్ట్రేలియా రక్షణ మంత్రితో టెలిఫోన్‌ ద్వారా భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంభాషణ

భారత రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ టెలిఫోన్‌ద్వారా ఆస్ట్రేలియా రక్షణ మంత్రి లిండా రేనాల్డ్స్‌తో మాట్లాడారు. కోవిడ్‌-19 మహమ్మారిపై తమతమ దేశాల్లో ప్రభుత్వ ప్రతిస్పందనాత్మకత గురించి రక్షణ మంత్రులిద్దరూ ఈ సందర్భంగా చర్చించారు. మహమ్మారిపై ప్రపంచదేశాల పోరులో భారత్‌ పోషిస్తున్న పాత్ర గురించి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆమెకు వివరించారు. అలాగే మహమ్మారి నిరోధంపై అంతర్జాతీయ కృషి దిశగా పరస్పర సహకారం గురించి వారిద్దరూ చర్చించారు. కోవిడ్‌-19 సంబంధిత సవాళ్లనుంచి బయటపడటంలో ఇతర దేశాలతో కలసి కృషిచేయడంలో భారత-ఆస్ట్రేలియాల వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక మంచి ఆధారవేదిక కాగలదని వారిద్దరూ అంగీకరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626965

వ్య‌క్తిగ‌త రక్ష‌ణ సామ‌గ్రి (పీపీఈ) క‌వ‌రాల్స్ ప్ర‌ధాన న‌మూనాలను ప‌రీక్షించి‌, నాణ్య‌తను ధ్రువీకరిస్తున్న 9 అధీకృత ప్రయోగశాలలు

కోవిడ్‌-19పై పోరాటంలో ముందువ‌రుస‌లోగ‌ల వైద్య నిపుణుల ఆరోగ్య భ‌ద్ర‌త ప్ర‌ధానంగా దేశంలో వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ సామ‌గ్రి (పీపీఈ) క‌వరాల్స్‌ ఉత్పత్తి అవుతున్నాయి. త‌ద‌నుగుణంగా కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమశాఖ నిర్దేశిత సాంకేతిక ప్రమాణాలకు ఇవి అనుగుణంగా ఉన్న‌దీ/లేనిదీ నిర్ధారించే దిశ‌గా వీటి ప్ర‌ధాన న‌మూనాల‌ను 9 అధీకృత ప్రయోగశాలలు పరీక్షించి, ధ్రువీక‌రిస్తున్నాయి. కోవిడ్‌-19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన మార్గదర్శకాలకు లోబ‌డి, ఐఎస్‌వో-16603 వ‌ర్గీక‌ర‌ణ‌-3 ప్రకారం, "సింథటిక్ బ్లడ్ పెనెట్రేషన్ రెసిస్టెన్స్ టెస్ట్" ప్రమాణాల మేర‌కు ఉన్నాయా/లేదా అన్న అంశాన్ని ఈ సంస్థ‌లు నిర్ధారిస్తాయి. పీపీఈలలోకి ఏరోసోల్ అణువులు, స్రావాలు ప్ర‌వేశించ‌కుండా వీటిని ధ‌రించే వ్య‌క్తులకు పూర్తి భ‌ద్ర‌త క‌ల్పించేలా వీటికి రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626963

కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌తో లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ శ్రీ ఆర్‌.కె.మాథుర్‌ సమావేశం; ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కోవిడ్‌ పరిస్థితి, ప్రగతి కార్యకలాపాలపై చర్చ

కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌తో లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ శ్రీ ఆర్‌.కె.మాథుర్‌ సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పడిన ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కోవిడ్‌ పరిస్థితులతోపాటు అభివృద్ధి కార్యక్రమాల పునఃప్రారంభం గురించి ఆయనతో చర్చించారు. కాగా, కోవిడ్‌-19 మహమ్మారి నియంత్రణలో పాలనయంత్రాంగం నిరంతర శ్రద్ధ చూపుతూ, విజయవంతం కావడాన్ని ప్రభుత్వం ప్రశంసించినట్లు ఈ సందర్భంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు డాక్టర్‌ జితేంద్ర సింగ్‌  అధికారికంగా తెలిపారు. ఇరాన్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న/వచ్చిన వారిద్వారా కరోనా కేసుల ఆకస్మిక పెరుగుదల, వ్యాప్తి గురించి దేశాన్ని అప్రమత్తం చేసింది లద్దాఖ్‌ ప్రాంతమేనని మంత్రి  పేర్కొన్నారు. అయితే, కరోనా వైరస్‌ దాడినుంచి క్రమంగా బయటపడిన దేశంలోని వివిధ ప్రాంతాల్లో లద్దాఖ్‌ ప్రథమస్థానంలో ఉందని, ఈ ఘనత తప్పకుండా పాలన యంత్రాంగంతోపాటు ఇక్కడి పౌర సమాజానిదేనని మంత్రి కొనియాడారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626988

చిన్నతరహా పరిశ్రమలకు అండగా నిలిచే కొత్త ఆర్థిక సహాయ సంస్థలకోసం ప్రభుత్వ అన్వేషణ: శ్రీ నితిన్‌ గడ్కరీ

దేశంలోని చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థిక మద్దతునివ్వగల కొత్త ఆర్థిక సహాయ సంస్థల కోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నదని కేంద్ర ఎంఎంస్‌ఎంఈ, రోడ్డురవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఈ మేరకు బ్యాంకింగేతర ఆర్థిక సహాయ సంస్థలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని శ్రీ గడ్కరీ తెలిపారు. తద్వారా రాబోయే రోజుల్లో అవి చిన్నతరహా వర్తక-వాణిజ్యాలకు సరళ రుణ సదుపాయం కల్పించగలవన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626823

కరోనా పోరాట యోధులకు పౌష్టికాహార సరఫరా కోసం ‘తాజ్‌శాట్స్‌’తో సంధానం ఏర్పరచుకున్న ‘ఆర్‌ఈసీ లిమిటెడ్‌’

న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి పౌష్టికాహార ప్యాకెట్ల సరఫరా కోసం ‘సీఎస్‌ఆర్‌’ విభాగం ‘ఆర్‌ఈసీ లిమిటెడ్‌’ ఆధ్వర్యంలోని ‘ఆర్‌ఈసీ ఫౌండేషన్‌’ తాజాగా ‘తాజ్‌శాట్స్‌’ (ఐహెచ్‌సీఎల్‌-శాట్స్‌ లిమిటెడ్‌ సంయుక్త సంస్థ)తో సంధానం ఏర్పరచుకుంది. ఈ మేరకు కరోనా పోరాట యోధులకు కృతజ్ఞతగా రోజూ 300 ఆహారప్యాకెట్లను అందజేస్తున్నారు. ఈ వినూత్న చర్యద్వారా న్యూఢిల్లీలో 18,000కుపైగా భోజనాలను సరఫరా చేస్తారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626872

‘ఆర్టీ-ల్యాంప్‌’ ఆధారిత కరోనా వైరస్‌ పరీక్ష పద్ధతికి సీఎస్‌ఐఆర్‌-ఐఐఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంయుక్త రూపకల్పన

కరోనావైరస్‌ సోకినట్లు నిర్ధారించడంలో ‘ఆర్టీ-ల్యాంప్‌’ అనేది వేగంగా, కచ్చితమైన ఫలితం ఇచ్చే ఒక చౌకైన పరీక్ష విధానం. పూర్తి దేశీయ ఉపకరణాలతో కనీస నైపుణ్యం- పరికరాల సాయంతో ఈ పరీక్ష నిర్వహణ సదుపాయాన్ని కల్పించుకోవచ్చు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626931

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • కేరళ: రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులతో ముఖ్యమంత్రి ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాలనుంచి తిరిగివచ్చిన వారిలో అనేకమందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అవుతున్నదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌పై రాష్ట్రం చేస్తున్న పోరుకు పూర్తి మద్దతివ్వాలని వారందరినీ కోరారు. ఇక వాయిదాపడిన ఎస్‌ఎస్‌ఎల్‌సి, హయ్యర్ సెకండరీ పరీక్షలను అత్యంత పటిష్ఠ కోవిడ్ రక్షణ చర్యలతో ఇవాళ్టినుంచి పునఃప్రారంభించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల నిమిత్తం వర్చువల్ క్యూ నిర్వహణ సంబంధిత యాప్‌కు గూగుల్ ఆమోదం తెలపడంతో ఈ వారంలోనే మద్యం విక్రయం తిరిగి మొదలు కానుంది. మరోవైపు గల్ఫ్‌ దేశాల్లో మరో ముగ్గురు కేరళవాసులు కోవిడ్‌-19కు బలికావడంతో విదేశాల్లో మరణించిన కేరళీయుల సంఖ్య 120 దాటింది. ఇక రాష్ట్రంలో నిన్న ఆరో కోవిడ్ మరణంసహా 49 కొత్త కేసులు నమోదయ్యాయి.
 • తమిళనాడు: పుదుచ్చేరి ఇవాళ రెండో కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 34కు పెరిగింది. ఇక తమిళనాడు మత్స్యకారులకు ఉపశమనం కలిగిస్తూ, వార్షిక చేపలవేట నిషేధాన్ని ఈసారి 14రోజులు ముందుగానే అంటే మే 31న ప్రభుత్వం తొలగించనుంది. కోవిడ్‌ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ అయ్యాక మరణించిన 118 మందిలో 84 శాతం ఇతరత్రా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారేనని ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. నిన్న ఒకేరోజు అత్యధికంగా 805 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు: 17,082, యాక్టివ్ కేసులు: 8230, మరణాలు: 118, డిశ్చార్జ్: 8731. చెన్నైలో యాక్టివ్ కేసులు 5911.
 • కర్ణాటక: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు 100 కొత్త కేసులు రాగా, 17మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులలో... చిత్రదుర్గ 20, యాదగిరి 14, హసన్ 13, బెళగావి 13, దావణగేరె, 11, బీదర్ 10, బెంగళూరు 7, విజయపుర 5, ఉడిపి, కోలార్‌లలో రెండేసి, బళ్లారి, కొప్పల, చిక్కబళ్లాపూర్‌లలో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 2282కు పెరిగిన నేపథ్యంలో యాక్టివ్‌ కేసులు: 1,514, కోలుకున్నవి: 722, మరణాలు: 44గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు బోధన కుంటుబడకుండా ఆన్‌లైన్ వేదికలను గరిష్టంగా వాడుకోవాలని అధికారులకు సూచించారు. కాగా, రాష్ట్రంలో ఆయుష్ వైద్యుల డిమాండ్లను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో రైతులకు అన్ని కష్టాలనుంచి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ‘రైతు భరోసా’ పథకంకింద రైతులకు రూ.13,500 వంతున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో దేశీయ విమాన ప్రయాణం పునఃప్రారంభానికి ప్రభుత్వం సమ్మతించడంతో ఇవాళ బెంగళూరు నుంచి 79మంది విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, ఆరు ప్రదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంస్థాగత నిర్బంధవైద్య పర్యవేక్షణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో 48 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 8148 నమూనాలను పరీక్షించిన తర్వాత గత 24 గంటల్లో 55 మంది డిశ్చార్జ్ కాగా, ఒక మరణం నమోదైంది. మొత్తం కేసులు: 2719. యాక్టివ్: 759, రికవరీ: 1903, మరణాలు: 57. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో మొత్తం కేసుల సంఖ్య 153కుగాను వీటిలో యాక్టివ్‌ కేసులు 47 కాగా, విదేశాల నుంచి వచ్చినవారిలో మొత్తం నిర్ధారిత కేసులు 111గా ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు ఈ నెలలో పూర్తి వేతనంపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే పాఠశాలలు తిరిగి ప్రారంభించే తేదీపైనా తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో మే 26నాటికి మొత్తం కేసులు 1920కాగా, నిన్నటివరకు 159మందివరకూ వలసదారులకు, విదేశాల నుంచి వచ్చినవారిలో 38 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.
 • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 పరిస్థితులున్నంత కాలం క్షౌరశాలలు/సెలూన్లలో ఆరోగ్య సూత్రాల అనుసరణ/పరిశుభ్రతపై పంజాబ్ ఆరోగ్యశాఖ సమగ్ర సూచనపత్రం జారీచేసింది. ఈ మేరకు సదరు షాపుల, దుకాణాలలో పనిచేసే సిబ్బందికి కోవిడ్‌-19 లక్షణాలు (జ్వరం, పొడిదగ్గు, శ్వాసలో ఇబ్బంది మొదలైనవి) ఉన్నట్లయితే వారు పనిలోకి రాకుండా చూడాలని యజమానులను ఆదేశించింది. వారు తగిన వైద్యచికిత్సతోపాటు ఇంటిదగ్గరే ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అదేవిధంగా వ్యాధి లక్షణాలున్న ఖాతాదారులు కూడా దుకాణాలు/షాపులకు వెళ్లకూడదని నిర్దేశించింది.
 • హర్యానా: కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా హర్యానాలో చిక్కుకున్న వలసకార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపడానికి ప్రభుత్వం నిత్యం వివిధ స్టేషన్లనుంచి ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లను నడుపుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటివరకూ 2.90 లక్షల మందిని 77 ప్రత్యేక రైళ్లు, 5,500 బస్సులద్వారా వారి సొంత రాష్ట్రాలకు పంపించామని ఆయన గుర్తుచేశారు దీంతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి 11,534మంది హర్యానా రాష్ట్రానికి తిరిగివచ్చారు. ఈ వలసకార్మికుల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం వారిని ఉచితంగా సొంత రాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
 • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం దిశగా నిర్బంధవైద్య పర్యవేక్షణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి రాష్ట్ర పౌరులందరికీ విజ్ఞప్తిచేశారు. సామాజిక మాధ్యమాలలో కనిపించే కోవిడ్‌-19 సంబంధిత సమాచారంలోని వాస్తవాలను నిర్ధారించుకోకుండా ప్రాచుర్యంలో పెట్టరాదని ఆయన ప్రతి ఒక్కరినీ కోరారు.
 • మహారాష్ట్ర: మహారాష్ట్రలో 2,436 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 52,667కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 35,178కాగా, నేటిదాకా పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 15,786గా నమోదైంది. ఇక హాట్‌స్పాట్ ముంబైలో 1430 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా ధారవి మురికివాడల సముదాయంలో కేసుల రెట్టింపు వ్యవధి 3 రోజులనుంచి 19 రోజుల స్థాయికి పెరగడాన్ని ఒక శుభ పరిణామంగా భావించవచ్చు. దీంతో వ్యాధి వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపట్టిన వ్యూహం ఫలితమిస్తున్నదని రుజువవుతోంది.
 • గుజరాత్: రాష్ట్రంలో తాజా సమాచారం ప్రకారం... 20 జిల్లాల నుండి 405 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 14,468కి చేరింది. ఇక యాక్టివ్‌ కేసులలో 109 మంది రోగులు విషమ స్థితిలో వెంటిలేటర్ మద్దతుతో చికిత్స పొందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో దిగ్బంధం నడుమ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 29 వేలకుపైగా అభివృద్ధి పనుల్లో సుమారు 6.80 లక్షల మందికి ఉపాధి లభించింది. కాగా, అత్యధికంగా 1.06 లక్షల మందికి ఉపాధితో గిరిజనుల ఆధిక్యంగల దాహోద్‌ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది.
 • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 75 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 7,376కు పెరిగింది. వీరిలో 1,844 మంది ఇటీవల ఇతర రాష్ట్రాలనుంచి తిరిగివచ్చిన వలసదారులు కావడం గమనార్హం. ఇక ఇప్పటిదాకా జైపూర్‌లో అత్యధికంగా 1,844 కేసులు నమోదవగా, జోధ్‌పూర్ 1,271, ఉదయపూర్ 505 కేసుల వంతున తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా, రాష్ట్రంలోని రెడ్‌ జోన్లలో ఇవాళ్టినుంచి పరిమిత సంఖ్యలో టాక్సీలు, ఆటోలు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, ఆసుపత్రుల నుంచి మాత్రమే వీటిని నడుపుతున్నారు.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 194 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,859కి పెరిగింది.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో నిన్న 40 కొత్త కేసుల నమోదుతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 220కి చేరింది. కొత్త కేసులకుగాను ముంగేలిలో అత్యధికంగా 30 నమోదు కావడం గమనార్హం.
 • గోవా: ఇప్పటిదాకా నమోదైన 67 నిర్ధారిత కేసులకు మరొకటి చేరడంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 48కి పెరిగింది.
 • అసోం: ఇతర రాష్ట్రాల నుంచి అసోం వచ్చేవారికి సంస్థాగత నిర్బంధవైద్య పర్యవేక్షణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కోవిడ్‌-19 నిరోధం దిశగా గృహ నిర్బంధవైద్య పర్యవేక్షణకు అనుమతించరాదని ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి తీర్మానించింది. రాష్ట్రం వెలుపల చిక్కుకున్న 3.6 లక్షలమంది రాష్ట్ర పౌరులకు ‘అసోం కేర్‌’ పథకంకింద ఏప్రిల్ నుంచి జూన్‌దాకా నెలకు రూ.2000 వంతున అందజేయాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది.
 • మణిపూర్: రాష్ట్రంలో పశ్చిమ ఇంఫాల్‌కు చెందిన ముగ్గురికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39కి చేరగా, యాక్టివ్‌ కేసులు 35గా ఉన్నాయి.
 • మిజోరం: కోవిడ్‌-19 కారణంగా రాష్ట్రంలో చిక్కుకుపోయిన రాజస్థాన్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు తగినవిధంగా సహాయం చేస్తామని రాజ్‌భవన్‌లో సమావేశం అనంతరం మిజోరం గవర్నర్ హామీ ఇచ్చారు.
 • నాగాలాండ్: రాష్ట్రంలో పాఠశాలలను తిరిగి తెరవడానికి ప్రభుత్వంవద్ద తక్షణ ప్రణాళికేదీ లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అభ్యాసం దెబ్బతినకుండా టీవీలు, ఇతర డిజిటల్ వేదికలద్వారా బోధన కొనసాగించే ఏర్పాట్లు చేస్తున్నారు. నాగాలాండ్‌లో ప్రవేశించే ప్రతి ఒక్కరికీ తొలిరోజునే వ్యాధి  నిర్ధారణ పరీక్షను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
 • సిక్కిం: కేరళ నుంచి ఇవాళ న్యూ జల్పాయ్‌గురి స్టేషన్‌ చేరుకున్న ‘శ్రామిక్‌ స్పషల్‌’ రైలులో 79 మంది సిక్కిమ్‌ పౌరులు రాష్ట్రానికి తిరిగివచ్చారు. వీరందర్నీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులద్వారా వారివారి సొంత జిల్లాలకు తరలించారు.

 

PIB FACT CHECK

 

******(Release ID: 1627089) Visitor Counter : 40