సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్. కె. మాథుర్ భేటీ; కేంద్రపాలిత ప్రాంతంలో కోవిడ్ పరిస్థితి మరియు అభివృద్ధి కార్యకలాపాలపై చర్చ
Posted On:
26 MAY 2020 5:35PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్. కె. మాథుర్ మంగళవారం ఢిల్లీలో సమావేశమై కోవిడ్ పరిస్థితిపై మరియు కొత్తగా ఏర్పాటు చేసిన లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో అభివృద్ధి కార్యకలాపాల పునరుద్ధరణ తదితర అంశాలపై చర్చలు జరిపారు. రోజువారీ కార్యకలాపాలతో పాటు కోవిడ్ మహమ్మారి కాలంలో కేంద్ర సహాయం అందించడంలో మద్దతు ఇచ్చినందుకు అయన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా జాగరూకతతో వ్యవహరించి అదుపు చేయడంలో విజయం సాధించినందుకు కేంద్ర ప్రభుత్వం తరపున డాక్టర్ జితేంద్ర సింగ్ కేంద్రపాలిత ప్రాంత పరిపాలకవర్గాన్ని ప్రశంసించారు. ఇరాన్ యాత్రకు వెళ్లి వచ్చినవారివల్ల లద్దాఖ్ లో ఉన్నట్టుండి కరోనా పాజిటివ్ కేసులు పెరగడం మొత్తం దేశ ప్రజలను కలవరపెట్టిందని అయితే పరిపాలకవర్గం మరియు పౌర సమాజం సావధానంతో వ్యవహరించడం వల్ల దేశంలో అందరికన్నా ముందుగా లద్దాఖ్ క్రమంగా కరోనా దాడినుంచి బయట పడిందని మంత్రి అన్నారు.

లద్దాఖ్ మరియు ఈశాన్య భారతం చుట్టూ ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వవలసిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి డాక్టర్ జితేంద్ర సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ఆదేశాల ఫలితంగా లాక్ డౌన్ అమలు చేయడానికి ముందే ఆ ప్రాంతాలకు విమానాల ద్వారా సరుకులను రవాణా చేయడం మొదలైంది. దాని ఫలితంగా ఇప్పుడు రేషన్, కూరగాయలు, పళ్ళు మామూలుగా ఈ సమయంలో లద్దాఖ్ లో ఉండవలసిన నిల్వలకన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్నాయని ఆయన అన్నారు.
లేహ్ , కార్గిల్ డిప్యూటీ కమిషనర్లు, ఆ రెండు జిల్లాల ఎస్ ఎస్ పీల పనితీరును కూడా మంత్రి ప్రశంసించారు. వివిధ సమస్యలపై రోజువారీ పరిస్థితిని గురించి వారు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం వల్ల సమన్వయంతో వైద్య పరికరాలు సరఫరా చేయడం మరియు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం సాధ్యమైందని మంత్రి వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితిని గురించి శ్రీ మాథుర్ మంత్రికి వివరించారు. ఇప్పుడు అభివృద్ధి పనులను పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. కోవిడ్ మహమ్మారి కారణంగా జాప్యమైన విద్యుత్ ఉత్పత్తి మరియు నిర్మాణ పనులకు సంబంధించిన ప్రాజెక్టులను గురించి కూడా ఆయన చర్చించారు. వాటిని త్వరలో పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు.
లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం కోసం ప్రతిపాదిత ప్రాజెక్టులలో శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలి (సి ఎస్ ఐ ఆర్) ప్రణాళిక సిద్ధం చేసిన 'లేహ్ బెర్రీ' ల ప్రాసెసింగ్ ప్రాజెక్టు కూడా ఉంది.
(Release ID: 1626988)
Visitor Counter : 269