సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
చిన్నతరహా పరిశ్రమలకు రుణాలిచ్చే సంస్థలకోసం ప్రభుత్వం చూస్తోంది: శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
25 MAY 2020 7:20PM by PIB Hyderabad
చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించగలిగే సరికొత్త ఆర్థిక సంస్థలకోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నదని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖామంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు వెల్లడించారు. రానున్న కాలంలో చిన్న వ్యాపారాలకు సులభంగా రుణాలిచ్చే నాన్ బాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ( ఎన్ బి ఎఫ్ సి ) లను బలోపేతం చేయటానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కలకత్తా వాణిజ్య మండలి సభ్యులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మీద కోవిడ్-19 ప్రభావాన్ని, ఎదురవుతున్న సవాళ్ళకు దీటుగా తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించారు.
కోవిడ్-19 మీద, దాని పర్యవసానంగా వచ్చిన ఆర్థిక అస్థిరతమీద పోరాడుతున్న ప్రస్తుత సమయం చాలా కష్టకాలమని, శ్రీ గడ్కరీ సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తూ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి అందరూ కలసికట్టుగా పనిచేయాలని, పరిశ్రమ రంగం సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
మాస్కులు, శానిటైజర్లవంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు వాడాలసిన అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. వ్యక్తిగత జీవితంలోను, పనిచేసే చోటకూడా భౌతిక దూరం పాటించటం లాంటి నియమాలకు కట్టుబడాలని సూచించారు.
ఇటీవల ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక పాకేజ్ : ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ గురించి చెబుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సహాయం కోసం ప్రకటించిన అనేక నిర్ణయాలను ప్రస్తావించారు. వాటంతట అవే వచ్చే హామీలేని రుణాలు, మూతబడ్డ సంస్థలకోసం నిధి ఏర్పాటు లాంటి చర్యలను గుర్తు చేశారు. ఇప్పుడు ఎదురవుతున్న ఆర్థిక సవాళ్ళనన్నిటినీ ఎదుర్కోవటానికి ఈ చర్యలన్నీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలెకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
6 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పునర్నిర్మాణం సాగుతోందని డిసెంబర్ 2020 నాటికి అదనంగా మరో 25 లక్షల సంస్థలను కూడా అందులో చేర్చాలని మంత్రిత్వశాఖ లక్ష్యంగా నిర్ణయించుకున్నదని చెప్పారు. ప్రస్తుతం ఎగుమతుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వాటా 48% ఉండగా అది 60% వరకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్దారు. ప్రస్తుతం ఈ రంగం 11 కోట్లమందికి ఉద్యోగాలు కల్పించగా అది మరో 5 కోట్లు పెరగవచ్చునన్నారు.
ఇప్పుడున్న పరిస్థితిలో ఎగుమతుల పెంపుదల అత్యంత ఆవశ్యకమని మంత్రి చెప్పారు. ఆర్థికంగా గిట్టుబాటు కావాలంటే ఉత్పత్తి వ్యయాన్ని, రవాణా ఖర్చులను కూడా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. గడిచిన మూడేళ్ళ కాలంలో జరిగిన ఎగుమతులు, దిగుమతులమీద తమ మంత్రిత్వశాఖ రెండు పుస్తకాలు రూపొందించే పనిలో ఉందని కూడా శ్రీ గడ్కరీ చెప్పారు.
ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన సూచనలలో కొన్ని: చెల్లింఫులు ఆలస్యంగా జరపటం మీదా దృష్టిపెట్టటం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడటం, వడ్డీరేట్లమీద ఇచ్చిన 4% సబ్సిడీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతునిచ్చేలా చూసి అవి నిరర్థక ఆస్తులుగా మారకుండా చూడటం. ప్రతిపాదించిన చర్యలన్నీ సజావుగా అమలు జరిగేలా బాంకులకు తగిన ప్రోత్సాహకాలివ్వటం తదితరాలున్నాయి.
వాణిజ్య మండలి ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీ గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం వైపు నుంచి తగిన సాయం ఉంటుందని హామీ ఇచ్చారు.
*****
(Release ID: 1626823)
Visitor Counter : 1282