PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 18 MAY 2020 6:33PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • దేశంలో ప్రస్తుతం కోవిడ్‌-19 యాక్టివ్‌ కేసులు 56,316; ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారు 36,824మంది; కోలుకునేవారు 38.29 శాతంగా నమోదు.
 • రెడ్‌/ఆరెంజ్‌/గ్రీన్‌ జోన్ల వర్గీకరణకు కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు. ఇందులో నిర్దేశిత పరిమితులకు లోబ‌డి స్థానికాంశాల విశ్లేషణ ప్రాతిపదికన జిల్లా లేదా పుర/నగరపాలిక లేదా ఇంకా దిగువస్థాయిలో రాష్ట్రాలు రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను విభజించుకునే వీలుంటుంది.
 • దేశవ్యాప్తంగా మే 31దాకా  దిగ్బంధం పొడిగింపు; జోన్లు-వాటిలో కార్యకలాపాలపై నిర్ణయం రాష్ట్రాలదే; నిర్దేశిత కార్యకలాపాలపై మాత్రం దేశమంతటా  నిషేధం.
 • మేమిచ్చిన మార్గదర్శకాల్లోని ఆంక్షల సడలింపు కుదరదు: రాష్ట్రాలకు దేశీయాంగ శాఖ స్పష్టీకరణ.
 • సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల మిగిలిన పరీక్షల నిర్వహణకు తేదీల ప్రకటన.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

దేశంలో ప్రస్తుతం కోవిడ్‌-19కు చికిత్స పొందుతున్న (యాక్టివ్‌) రోగుల సంఖ్య 56,316 కాగా, ఇప్పటిదాకా 36,824 మందికి వ్యాధి నయమైంది. వీరిలో గడచిన 24 గంటల వ్యవధిలోనే 2,715మందికి నయంకాగా కోలుకునేవారి శాతం 38.29కి పెరిగింది. దేశ జనాభాపరంగా నిర్ధారిత కేసుల సంఖ్య దాదాపు ప్రతి లక్షమందికి 7.1 కాగా, ప్రపంచం మొత్తంమీద ఇది ప్రతి లక్షమందికి 60గా ఉండటం గమనార్హం.

రాష్ట్రాల్లో రెడ్‌/ఆరెంజ్‌/గ్రీన్‌ జోన్ల వర్గీకరణ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదలివేస్తూ కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 17.05.2020న కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఇందులో నిర్దేశించిన పరిమితులకు లోబ‌డి స్థానికాంశాల విశ్లేషణ ప్రాతిపదికన జిల్లా లేదా సబ్‌-డివిజన్‌, పుర/నగరపాలిక లేదా ఇంకా దిగువన వార్డుస్థాయిలోనైనా రాష్ట్రాలు రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను విభజించుకునే వీలుంటుంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ సూచించిన ప్రకారం... మొత్తం యాక్టివ్‌ కేసులు/లక్ష జనాభా ప్రాతిపదికన కేసుల సంఖ్య, రెట్టింపయ్యే (గత వారం రోజుల ప్రాతిపదికన) వ్యవధి, మరణాల శాతం, పరీక్షల/నిర్ధారిత కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలి. అదేవిధంగా నియంత్రణ, అదనపు జాగ్రత్త వహించాల్సిన జోన్ల విషయంలో పూర్తి వివేచనతోనే నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ రెండింటి పరిధి నిర్ణయంలో వ్యాధి సమీప ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా తగినంత దూరం ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. అదనపు పరిధి నిర్దేశించిన ప్రాంతాల్లోనూ విస్తృత నిఘాలో భాగంగా ఆస్పత్రులలో ఉన్న ‘ఐఎల్‌ఐ/సారి’ (ILI/SARI) కేసుల పర్యవేక్షణతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624984

దిగ్బంధం 2020 మే 31దాకా పొడిగింపు; వివిధ జోన్లు-వాటిలో కార్యకలాపాలపై రాష్ట్రాలదే నిర్ణయం; నిర్దేశిత కార్యకలాపాలపై దేశమంతటా నిషేధం కొనసాగింపు

కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణలో 2020 మార్చి 24 నుంచి అమలు చేస్తున్న దిగ్బంధ చర్యలు గణనీయ ఫలితమిచ్చాయి. ఈ నేపథ్యంలో 2020 మే 31దాకా దిగ్బంధాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జారీచేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను విభజించుకోవచ్చు. జిల్లా లేదా పుర/నగరపాలిక లేదా సబ్‌-డివిజన్‌ వగైరాలవంటి ఇంకా దిగువస్థాయిలోని ప్రాంతాలను జోన్లుగా విభజించుకునే వీలుంది. దానికి తగినట్లు రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో నియంత్రణ, అదనపు పరిధులను అక్కడి స్థానిక పాలన యంత్రాంగాలు కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలకు తగినట్లు నిర్ణయించుకోవచ్చు. నియంత్రణ జోన్లలో నిత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మొత్తంమీద దేశవ్యాప్తంగా నిర్దిష్ట కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుంది. అలాగే రాత్రి 7:00 నుంచి ఉదయం 7:00 గంటలదాకా వ్యక్తులు సంచారం, అత్యవసరంకాని కార్యకలాపాలపై కర్ఫ్యూ నిబంధనలు కొనసాగుతాయి.

మరిన్ని వివరాలకు... http://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624800

నాలుగో విడత దిగ్బంధం- మేమిచ్చిన మార్గదర్శకాలను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సడలించే వీల్లేదు; స్థానిక పరిస్థితుల అంచనా మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలకు లోబడి మరింత కఠినతరం చేయవచ్చు: దేశీయాంగ శాఖ

కోవిడ్‌-19 నియంత్రణ దిశగా దేశీయాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ 17.05.2020న నవీకృత మార్గదర్శకాలను జారీచేసింది. దిగ్బంధాన్ని 31.05.2020దాకా పొడిగించిన నేపథ్యంలో సంబంధిత ఆంక్షలలో విస్తృత సడలింపులు ఇచ్చింది. నవీకరించిన మార్గదర్శకాలలో దిగ్బంధం ఆంక్షలను విస్తృతంగా సడలించినందున వాటిని మరింత సరళం చేయడం కుదరదని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు దేశీయాంగ శాఖ స్పష్టం చేసింది. స్థానికంగా పరిస్థితుల అంచనా ప్రాతిపదికన అవసరమైన మేరకు నిర్దేశిత కార్యకలాపాలను నిషేధించే లేదా మరిన్ని ఆంక్షలు విధించే వెసులుబాటు ఉంటుందని వివరించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624883

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల విద్యార్థులకు మిగిలిన పరీక్షల తేదీలను ప్రకటించిన హెచ్‌ఆర్‌డి మంత్రి

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల విద్యార్థులకు మిగిలిన పరీక్షల తేదీలను కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ ‘నిషాంక్‌’ ఇవాళ న్యూఢిల్లీలో ప్రకటించారు. పదో తరగతి పరీక్షలను కేవలం ఈశాన్య ఢిల్లీ విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తారని, ఇక ఈశాన్య ఢిల్లీసహా దేశవ్యాప్తంగా 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటలమధ్య నిర్వహిస్తారని వివరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624899

‘ఒకే దేశం-ఒకే డిజిటల్‌ వేదిక’; ‘ఒకే తరగతి-ఒకే చానెల్‌’ ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకూ నాణ్యమైన విద్యావ్యాప్తి: హెచ్‌ఆర్‌డి మంత్రి

దేశంలో విద్యారంగానికి ఉత్తేజమిచ్చే అనేక చర్యలను మే 17వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీలో ప్రకటించారు. ఇందులో భాగమైన ‘ఒకే దేశం-ఒకే డిజిటల్‌ వేదిక’; ‘ఒకే తరగతి-ఒకే చానెల్‌’ మార్గాల్లో దేశంలోని మారుమూల ప్రాంతాలకూ నాణ్యమైన విద్య, విద్యా సామగ్రి అందుబాటులోకి వస్తాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ ‘నిషాంక్‌’ అన్నారు. అంతేగాక రానున్న రోజుల్లో విద్యావకాశాల అందుబాటు, సమాన లభ్యతసహా విద్యార్థుల స్థూల నమోదు కూడా మెరుగుపడుతుందని చెప్పారు. అలాగే ఈ చర్యల్లో భాగంగా దివ్యాంగులైన పిల్లలకు సడలింపులవల్ల నవభారత నిర్మాణం దిశగా వినూత్న మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624979

నవ్య ఆర్థిక సంస్కరణలతో భారత అంతరిక్ష-అణుశక్తి రంగాల్లో సంపూర్ణ సామర్థ్య ఆవిష్కరణకు విశిష్ట అవకాశం: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీవల్ల వైద్య ఐసోటోపులతో కేన్సర్‌ చికిత్స, అణు ఇంధనశాఖ (డీఏఈ) ఆధ్వర్యాన ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రత్యేక రియాక్టర్‌ ఏర్పాటుసహా ఇతరత్రా అంశాలకు ప్రోత్సాహం లభిస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624799

కోవిడ్-19పై పోరులో జాతి కృషిని ఇనుమ‌డింప‌జేసే ప‌రిజ్ఞానాల‌కు సాంకేతిక‌ అభివృద్ధి బోర్డు ఆమోదం

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి నిరోధం, నియంత్ర‌ణ‌లో శాస్త్రవేత్త‌లు, సాంకేతిక నిపుణులు, వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలు చేస్తున్న కృషికి కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ‌శాఖ (డీఎస్‌టీ) పరిధిలోని అధికారిక సంస్థ సాంకేతిక అభివృద్ధి బోర్డు (టీడీబీ) క్రియాశీల తోడ్పాటునిస్తోంది. ఆ మేర‌కు సంబంధిత ప‌రిజ్ఞానాల వాణిజ్యీక‌ర‌ణ‌కు వీలుగా ఆర్థిక మ‌ద్ద‌తు అందిస్తోంది. అంతేకాకుండా ప్ర‌పంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సంరక్షణ రంగ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డంలో దేశం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు మ‌ద్ద‌తుగా న‌వ్య ప‌రిష్కారాలను టీడీబీ అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని వారాల‌నుంచీ తన మూల్యాంకన ప్రక్రియ ద్వారా  వివిధ రంగా‌ల్లోని అనేక అనువర్తితాలను విశ్లేషించింది. త‌ద‌నుగుణంగా నేటిదాకా థర్మల్ స్కానర్లు,  వైద్య పరికరాలు,  మాస్కులు, రోగ నిర్ధారణ కిట్లు త‌దిత‌ర ఆరు ప్రాజెక్టుల వాణిజ్యీక‌ర‌ణ‌కు ఆమోదం తెలిపింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624832

కరోనా నేర్పిన పాఠాలతో నవ్య జీవనశైలి దిశగా ప్రజలకు ఉప రాష్ట్రపతి పిలుపు

ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో నవ్య జీవనశైలిని అలవరచుకోవాల్సిన అవసరం గురించి ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ శ్రీ ఎం.వెంకయ్యనాయుడు నొక్కిచెప్పారు. ఈ మేరకు కరోనా మహమ్మారి నేర్పిన పాఠాల ఆధారంగా వైరస్‌తో సహ జీవనం దిశగా 12 అంశాలతో కూడిన నవ్య విధాన చట్రాన్ని సూచించారు. తొలుత భావించినదానికి భిన్నంగా వైరస్‌ ఉనికి సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలు ఉన్నందున జీవితంతోపాటు మానవాళి విషయంలో కొత్త వైఖరులను అలవరచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624884

‘దేఖో అప్నాదేశ్‌’ సిరీస్‌లో భాగంగా “ఉత్తరాఖండ్‌ సింప్లీ హెవెన్‌” శీర్షికన 20వ వెబినార్‌ నిర్వహించిన కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624885

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • పంజాబ్: రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠ‌శాల‌లు 2019-20లో వసూలు చేసినదానిక‌న్నా 2020-21లో అధిక ఫీజులు వ‌సూలు చేయ‌వ‌ద్ద‌ని పంజాబ్ ప్రభుత్వం సూచించింది. ఈ మేర‌కు అన్ని ప్రైవేట్, అన్-ఎయిడెడ్ పాఠశాలల యాజ‌మాన్యాలు/ప్రిన్సిపాళ్ల‌కు లేఖ రాసింది. నాలుగు రోజులుగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో మే 31దాకా దిగ్బంధం స్థానే క‌ఠిన క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తామ‌ని ప్రకటించారు, అయితే, ప్రజా రవాణాను పరిమిత స్థాయిలో పునఃప్రారంభిస్తామ‌ని, 18వ తేదీనుంచి నియంత్ర‌ణేత‌ర ప్రాంతాల్లో గరిష్ఠ సడలింపులు ఉంటాయ‌ని పేర్కొన్నారు.
 • హర్యానా: కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించిన రూ.20 ల‌క్ష‌ల ఆర్థిక ప్యాకేజీ చివ‌రి విడ‌త చ‌ర్య‌ల‌పై హర్యానా  ముఖ్యమంత్రి హ‌ర్షం వ్య‌క్తంచేశారు. ఈ  ప్యాకేజీద్వారా రాష్ట్రాల రుణ పరిమితిని రాష్ట్ర స్థూలోత్ప‌త్తిలో 3 శాతంనుంచి 2020-21లో 5శాతానికి పెంచినందుకుగాను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా  కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణ‌యంద్వారా రాష్ట్ర ప్రభుత్వాల‌కు అదనపు వనరులు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. కోవిడ్‌-19వ‌ల్ల ప్ర‌భావిత‌మైన వివిధ రంగాల‌కు నిర్దేశించిన ల‌క్ష్యాలను చేరుకునేలా హర్యానా ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ నిర్ణ‌యం మ‌రింత వేగ‌వంతం చేస్తుంద‌ని పేర్కొన్నారు.
 • హిమాచల్ ప్రదేశ్: స్వ‌యం స‌మృద్ధ భార‌తం ప్యాకేజీ కింద 5వ విడ‌త చ‌ర్య‌ల‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌పై ముఖ్యమంత్రి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం రూ.61,000 కోట్లుగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం 2020-21 బడ్జెట్ కేటాయింపులను రూ.40,000 కోట్ల మేర పెంచ‌డాన్ని కొనియాడారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ప్రజలకు మరింత భరోసా కల్పిస్తుంద‌ని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రాల రుణాల పరిమితిని జీఎస్‌డీపీలో ప్రస్తుత 3 శాతం నుంచి 5 శాతానికి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ముఖ్యమంత్రి స్వాగతించారు. రాష్ట్రం సొంత వనరులను సృష్టించుకోవ‌డంలో ఈ నిర్ణ‌యం సహాయపడుతుందని ఆయన అన్నారు.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో ఇవాళ ఒకేరోజు 2,347 కోవిడ్-19 కేసులు న‌మోదు కావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 33,053కు చేరింది. ప్రస్తుతం 24,161 యాక్టివ్ కేసులుండగా, తాజా నివేదిక ప్ర‌కారం నేటివ‌ర‌కూ 7688 మంది కోలుకున్నారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల సిబ్బందిని చేర‌వేస్తున్న త‌మ‌కు అర‌కొర స‌దుపాయాలు క‌ల్పిస్తున్నార‌ని ఆరోపిస్తూ- ‘బెస్ట్’ ఎంప్లాయీస్ యాక్షన్ కమిటీ తన డ్రైవర్లకు తగిన సదుపాయాలు లేవని నిరస‌న‌కు దిగింది. అయితే, రాష్ట్ర రవాణా సంస్థ‌ బస్సులు ఇప్పటికీ నడుస్తున్నందున ఈ ఆందోళనవ‌ల్ల‌ రోడ్డు రవాణా రంగం ప్ర‌భావితం కాబోద‌ని ‘బెస్ట్‌’ యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. కాగా, కోవిడ్-19 కేసుల పెరుగుద‌ల‌తో గత సోమవారం మూసివేసిన నవీ ముంబైలోని వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల మార్కెట్ ఇవాళ పునఃప్రారంభ‌మైంది.
 • గుజరాత్: రాష్ట్రంలో 391 కొత్త కేసుల న‌మోదుతో మొత్తం కేసుల సంఖ్య 11,379కు చేరింది. నేటిదాకా కోలుకున్న రోగుల సంఖ్య 4,499గా ఉంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతున్నప్పటికీ, కోలుకునేవారి శాతం కూడా మెరుగుపడి 39.53కు చేరింది. కాగా, రాష్ట్రంలోని నియంత్ర‌ణ‌, నియంత్ర‌ణేత‌ర జోన్ల‌లో ప‌రిస్థితిపై స‌మ‌గ్ర స‌మీక్ష‌లో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇవాళ జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, డీడీవోలు తదిత‌ర‌ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
 • రాజస్థాన్: ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు 173 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల‌ సంఖ్య 5375కు చేరుకుంది. దుంగార్‌పూర్‌లో ఇవాళ 64 కొత్త కేసులు న‌మోదు కాగా, ఇవాళ్టివ‌ర‌కూ కోలుకున్న రోగుల సంఖ్య 3,072; మ‌రో 2718 మంది డిశ్చార్జ్ అయ్యారు.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 187 కొత్త కేసుల న‌మోదుతో మొత్తం కేసులు 4,977కు చేరాయి. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2403 వరకు ఉంది. తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2,326 క్రియాశీల కేసులున్నాయి.
 • గోవా: నిన్న 9 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 22కి చేరింది. ఈ కొత్త రోగులలో 8 మంది మహారాష్ట్ర నుంచి, ఒక‌రు క‌ర్ణాట‌క నుంచి రోడ్డుమార్గాన గోవాకు వ‌చ్చారు. ఈ రోగులందరూ ఇఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో ఇవాళ మరో 19 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86కు చేరింది. అయితే, రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత‌ మరణాలేవీ న‌మోదు కాలేదు.
 • కేరళ: రాష్ట్రంలో దిగ్బంధం నిబంధ‌న‌లను ప్ర‌భుత్వం స‌డ‌లించింది. రెడ్ జోన్లు మిన‌హా జిల్లాల్లో స్వల్ప దూర బస్సు సర్వీసులు, ఆటోల‌కు అనుమ‌తి ఉంటుంది. అయితే, అంతర్-జిల్లా రవాణాకు అధికారుల నుంచి పాస్ పొందాల్సి ఉంటుంది. ‘బెవ్కో’ బెవ‌రేజ్ దుకాణాలు, బార్లలో ప్రత్యేక కౌంటర్లు, బీరు-వైన్ పార్లర్లను బుధవారం నుంచి తెరుస్తారు; మద్యం కొనుగోలుకు మొబైల్ యాప్‌ద్వారా టోకెన్లు జారీచేస్తారు. కాగా రాష్ట్రంలోని ఎస్‌ఎస్‌ఎల్‌సి, ఇంట‌ర్ బోర్డు పరీక్షలను జూన్‌లో నిర్వహిస్తారు. ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన వలస కార్మికులతో కోట్ట‌యం నుంచి తొలి రైలు ఈ సాయంత్రం బ‌య‌ల్దేరింది. ఇక‌ అబుదాభి, దోహా నుంచి రెండు విమానాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 101 కోవిడ్ కేసులుండ‌గా, 23 హాట్‌స్పాట్లు ఉన్నాయి.
 • తమిళనాడు: రాష్ట్రంపై అంఫ‌న్ తుఫాను ప్ర‌భావం ఉండ‌బోద‌ని ప్రభుత్వం తెలిపింది. అయిన‌ప్ప‌టికీ భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌తో క‌ల‌సి ప‌రిస్థితిని నిరంత‌రం పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలో 639 కొత్త కేసులతో పాటు రాష్ట్రానికి తిరిగివ‌చ్చిన‌వారిలో 81 మందికి వ్యాధి నిర్ధార‌ణ కావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య‌ 11,224 దాటింది. కాగా, నిన్న నాలుగు మరణాలు కూడా న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 6,971కాగా, వీటిలో 6750 చెన్నైలో ఉన్నాయి.
 • కర్ణాటక: ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు 84 కొత్త కేసులు నమోదవ‌గా మొత్తం కేసుల సంఖ్య 1231కి చేరడంతోపాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా 37కు పెరిగింది. ఇక కోలుకున్న‌వారి సంఖ్య 521 కాగా, యాక్టివ్ కేసులు 672గా ఉన్నాయి. దిగ్బంధం నిబంధనలను ప్ర‌భుత్వం స‌డలించింది. కాగా, రేపు 30 శాతం సామర్థ్యంతో రేపు అన్ని రాష్ట్ర రోడ్డుర‌వాణా సంస్థ‌ల‌, బీఎంటీసీ బ‌స్సులు న‌డుస్తాయి. ఇక ఆటోలు, క్యాబ్‌లు కూడా ఇద్దరు ప్రయాణికుల‌తో అనుమతించబడతాయి, సెలూన్లు తెరుచుకోనుండ‌గా, ఉదయం 7 నుంచి 9 వరకు; సాయంత్రం 5 నుంచి 7 గంట‌ల‌వరకు పార్కులు కూడా తెరుస్తారు. కాగా, మాల్స్, బహిరంగ సభలపై ఆంక్ష‌లు, రాత్రివేళ క‌ర్ఫ్యూ కొన‌సాగుతాయి.
 • ఆంధ్రప్రదేశ్: కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం మే 31 వరకు దిగ్బంధాన్ని పొడిగించింది. రెడ్ జోన్ల‌లో మ‌రింత క‌ఠిన చ‌ర్య‌లు చేపడ‌తారు. ఇక ఎంఎస్‌ఎంఈలకు ప్ర‌క‌టించిన ప్యాకేజీలో తొలి వాయిదా కింద రూ.904.89 కోట్లు మే 22న విడుదల కానున్నాయి. రాష్ట్రంలో 52 కొత్త కేసులు రాగా, గత 24 గంటల్లో 94 మంది డిశ్చార్జ్ అయ్యారు; మ‌ర‌ణాలేవీ న‌మోదు కాలేదు. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చినవారిలో 150 మందికి వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ కాగా, 125 మంది యాక్టివ్ కేసుల జాబితాలో ఉన్నారు. ఇక ఇద్ద‌రు రోగులు కోలుకోవ‌డంతో డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం మొత్తం కేసులు: 2282. యాక్టివ్: 705, రికవరీ: 1527, మరణాలు: 50. కేసుల సంఖ్య ‌రీత్యా కర్నూలు (615), గుంటూరు (417), కృష్ణా (382) తొలి మూడు ‌స్థానాల్లో ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో వైద్య‌సేవ‌లు ప్రారంభం కానుండ‌గా; గాంధీ, ఛాతీ ఆస్పత్రులు మాత్రం నోడల్ కోవిడ్-19 చికిత్స‌ కేంద్రాలుగా కొనసాగుతాయి. మంచిర్యాల్ జిల్లాలో ఏడుగురు వ‌ల‌స కార్మికుల‌కు కోవిడ్ -19 నిర్ధార‌ణ కాగా, రాజన్న-సిరిసిల్లలో ముంబై తిరిగి వచ్చిన ఇద్ద‌రికి ఇవాళ వ్యాధి సోకిన‌ట్లు తేలింది. ఈ 9 మంది వలసదారులు రోగుల జాబితాలో చేర‌డంతో మొత్తం కేసుల సంఖ్య 1551కి చేరింది.
 • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్ర రవాణా సంస్థ‌ బస్సులు నేటి నుంచి జిల్లాల మ‌ధ్య మాత్ర‌మే ప్రయాణిస్తున్నాయి. అలాగే మొత్తం బ‌స్సుల‌లో 50 శాతం మాత్ర‌మే న‌డుపుతారు.
 • అసోం: రాష్ట్రంలో కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ కోవిడ్‌-19 బారిన‌ప‌డి ముంబై నుంచి తిరిగివ‌చ్చిన ఒక వ్యక్తి మ‌ర‌ణించారు. ఇక గోలాఘాట్ వద్ద మరో ఇద్దరు వ్యక్తులకు వ్యాధి నిర్ధార‌ణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 104కు చేరింది. యాక్టివ్ కేసులు 58 కాగా, 3 మరణాలు న‌మోద‌య్యాయి.
 • మణిపూర్: మణిపూర్‌లో 1208 మంది ప్రభుత్వ నిర్బంధ వైద్య‌ప‌ర్య‌వేక్ష‌ణ‌ కేంద్రంలో, 4165 మంది సామాజిక కేంద్రాల్లో వైద్య ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు.
 • మేఘాలయ: మేఘాలయలో ఏకైక కోవిడ్ కేసుకు సంబంధించి రెండోసారి పునఃప‌రీక్ష నిర్వ‌హించ‌గా వ్యాధి సోక‌లేద‌ని తేలింది. దీంతో రోగి కోలుకున్నట్లు ప్రకటించే వీలుంద‌ని ముఖ్య‌మంత్రి కాన్రాడ్ సంగ్మా అన్నారు.
 • మిజోరం: మిజోరంలో ఇప్ప‌టిదాకా దిగ్బంధం/కర్ఫ్యూ ఉల్లంఘ‌న‌పై 131 సంఘటనలు న‌మోద‌య్యాయి. వీటికి సంబంధించి 19 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా 87 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
 • నాగాలాండ్: ఇవాళ్టినుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వారందరికీ 14 రోజుల సంస్థాగత నిర్బంధం, ఆ త‌ర్వాత మ‌రో 14 రోజుల‌ వైద్య ప‌ర్య‌వేక్ష‌ణను త‌ప్ప‌నిస‌రి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కాగా, దిమాపూర్ డీసీలోని ఇద్గా మదర్సా, జైన్‌ భవన్, హిందూ మందిర్ కమ్యూనిటీ హాల్, గురుద్వారా లాడ్జ్-దుర్గా మందిర్ లాడ్జిల‌ను నిర్బంధ వైద్య‌ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రాల కోసం అప్పగించాలని  అభ్య‌ర్థ‌న‌ అందింది.
 • సిక్కిం: దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సిక్కిం వాసుల‌ తరలింపు పురోగతిని సమీక్షించడం కోసం ఇవాళ  నిర్వ‌హించిన రాష్ట్ర కార్యాచ‌ర‌ణ బృందం స‌మావేశానికి ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించారు.
 • త్రిపుర: చెన్నైలో చిక్కుకున్న వారితో అక్క‌డినుంచి బ‌య‌ల్దేరిన ‘శ్రామిక్ స్పెష‌ల్’ రైలు ఇవాళ అగర్త‌ల చేరుకోగా, బెంగ‌ళూరునుంచి మరో రైలు కూడా రాష్ట్ర రాజ‌ధానికి చేరుకుంది.

PIB FACTCHECK

*****(Release ID: 1624989) Visitor Counter : 36


Read this release in: Punjabi , English , Urdu , Hindi , Marathi , Assamese , Manipuri , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam