హోం మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ 4.0 - ఎమ్.హెచ్.ఏ. మార్గదర్శకాలలో విధించిన నిబంధనలను రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు సడలించకూడదు, స్థానిక స్థాయి అంచనా మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ఆధారంగా వాటిని కఠినతరం మాత్రమే చేయవచ్చు : ఎమ్.హెచ్.ఏ.

Posted On: 18 MAY 2020 1:43PM by PIB Hyderabad

కోవిడ్ -19 కట్టడి కోసం, కేంద్ర దేశీయవ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎమ్.హెచ్.ఏ.) 2020 మే నెల 17వ తేదీన సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్ డౌన్ ను 2020 మే నెల 31వ తేదీ వరకు పొడిగించిన సందర్భంగా నిబంధనలలో భారీగా సడలింపులు ఇవ్వడం జరిగింది. 

ఈరోజు నుండి అమలులోకి వచ్చే కొత్త మార్గదర్శకాల కింద, కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ (ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ) 2020 మే నెల 17వ తేదీన జారీచేసిన సవరించిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లను నిర్దేశిస్తాయి. రెడ్ / ఆరంజ్ జోన్లలో, కంటైన్మెంట్ మరియు బఫర్ జోన్లను, స్థానిక స్థాయి సాంకేతిక సమాచారం, ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ఆధారంగా స్థానిక అధికార యంత్రాంగం గుర్తిస్తుంది. 

కంటైన్మెంట్ జోన్ల పరిధిలో గతంలో పాటించినట్లు ఖచ్చితమైన సరిహద్దులను నిర్ణయించి, కేవలం అత్యవసర కార్యకలాపాలను మాత్రమే అనుమతించాలి. దేశవ్యాప్తంగా పరిమిత కార్యకలాపాల నిషేధం కొనసాగుతుంది. ఎమ్.హెచ్.ఏ. మార్గదర్శకాల కింద ప్రత్యేకంగా నిషేధించిన కార్యకలాపాలు తప్ప, మిగిలిన ఇతర కార్యకలాపాన్నింటినీ అనుమతిస్తారు. 

ఈ అంశాల దృష్ట్యా, సవరించిన మార్గదర్శకాల కింద విస్తృతమైన సడలింపులు జారీ చేసినప్పటికీ, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు ఎమ్.హెచ్.ఏ. మార్గదర్శకాలలో విధించిన నిబంధనలను మరింతగా సడలించకూడదని ఎమ్.హెచ్.ఏ. పునరుద్ఘాటించింది.  క్షేత్ర స్థాయి విశ్లేషణ ఆధారంగా వారు అవసరమైన కొన్ని ఇతర కార్యకలాపాలను నిషేధించవచ్చు లేదా అదనపు నిబంధనలను విధించవచ్చు. 

దీనితో పాటు, స్థానిక స్థాయిలో జోన్లను నిర్దేశించేటప్పుడు, ఎమ్.ఓ.హెచ్.‌ఎఫ్.‌డబ్ల్యూ. జారీ చేసిన సవరించిన మార్గదర్శకాలలో సూచించిన బెంచ్‌మార్క్/పరిమితులను  రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు పరిగణనలోకి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం/ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు స్థానికంగా ప్రజల సౌలభ్యం కోసం విస్తృత ప్రచారం కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్రాలకు / కేంద్రపాలితప్రాంతాలకు జారీ చేసిన అధికారిక ప్రకటన కోసం ఇక్కడ నొక్కండి:   

 

*****



(Release ID: 1624883) Visitor Counter : 193