శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 పై పోరాటాన్ని పెంచేందుకు అవసరమైన సాంకేతిక విధానాలను ఆమోదించిన టెక్నాలజీ అభివృద్ధి బోర్డు (టి డి బి )

Posted On: 17 MAY 2020 6:01PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిచెందకుండా అదుపుచేయడంలో శాస్త్రజ్ఞులు,  టెక్నాలజిస్టులు,  వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలు చేస్తున్న ప్రయత్నాలకు  కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (డి ఎస్ టి) పరిధిలోని టెక్నాలజీ అభివృద్ధి బోర్డు  క్రియాశీలక మద్దతును ఇస్తోంది.  మహమ్మారిని అదుపుచేసే టెక్నాలజీలను వాణిజ్య సరళిలో వినియోగించడానికి అవసరమైన ఆర్ధిక మద్దతు ఇవ్వడం ద్వారా వారికీ తోడ్పాటు అందజేస్తోంది.  

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆరోగ్య సంరక్షణ ఎమర్జెన్సీని ఎదుర్కోవడానికి  దేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా టి డి బి  కొత్త  పరిష్కారాలను కనుగొనేందుకు అన్వేషిస్తోంది.  

గడచిన కొన్ని వారాలలో  టి డి బి  తన మూల్యాంకన ప్రక్రియ ద్వారా  వివిధ డొమైన్లలోని అనువర్తితాల పనితీరును  విశ్లేషించింది.   ఇప్పటివరకు  ఆరు ప్రాజెక్టులను  వాణిజ్యసరళిలో అమలు చేయడానికి  ఆమోదం తెలిపింది.   వాటిలో థర్మల్ స్కానర్లు,  వైద్య పరికరాలు,  మాస్కులు మరియు రోగ నిర్ధారణ కిట్లు ఉన్నాయి.  

థర్మల్ స్కానర్లు :  

ఇప్పుడు కోవిద్ -19  వ్యాధి సోకిందా లేదా తెలుసుకోవడానికి భద్రతా సిబ్బంది,   ఆరోగ్య సేవకులు చేతిలో పట్టుకునే ధర్మో మీటర్ల ద్వారా పరీక్షలు చేస్తున్నారు.  వీటిని ఉపయోగించడం వల్ల భద్రతా సిబ్బంది,   ఆరోగ్య సేవకులకు వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది.  ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అమలులో ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తే వారికి వ్యాధి విపత్తు ఎక్కువవుతుంది.    

అందువల్ల దూరం నుంచి,   గుంపులో ఉన్నప్పుడు వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోగలిగే టెక్నాలజీ ఇప్పటి అవసరం.  ఈ సమస్యకు  ఈ రకమైన వినూత్న పరిష్కారాన్ని  అందించే రెండు  బెంగళూరు కంపెనీలకు  టి డి బి  ఆర్ధిక సహాయాన్ని ఆమోదించింది.  ఆ సంస్థల పేర్లు  కోకోస్లాబ్స్ ఇన్నోవేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్  &  అడ్వాన్స్ మెకానికల్ సర్వీసెస్ ప్రైవేట్  లిమిటెడ్.

కోకోస్లాబ్స్ ఇన్నోవేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తక్కువ ఖర్చుతో అసాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న వ్యక్తులను గుర్తించే సాధనాన్ని వాణిజ్య సరళిలో అందుబాటులోకి తేవడానికి యోచిస్తోంది.  ఈ సాధనం ఒక గుంపులో అసాధారణ ఉష్ణోగ్రత ఉన్న వ్యక్తిని గుర్తించి  ఆ సమాచారాన్ని అధికారుల ఫోన్ మరియు ల్యాప్టాప్ పైన తెలియజేసి అప్రమత్తం చేస్తుంది.  వీడియో అనలిటిక్స్ ప్లాటుఫామ్ పై  కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్ తో రూపొందిన  ఈ పరిష్కారం వాస్తవ సమయంలో అప్రమత్తం చేస్తుంది.  తక్కువ ఖర్చుతో తయారయ్యే ధర్మల్ కెమెరా (మౌలిక కెమెరాకు తాపమానిని జోడించడం) తో పాటు   జి పి యు  సర్వర్లను ఉపయోగించి  జనం ఎక్కువగా ఉండే బహిరంగ స్థలాలలో  అసాధారణ ఉష్ణోగ్రత ఉన్న ఎక్కువ మందిని గుర్తించవచ్చు.  

ఈ సాధానానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే  ఎవరైనా వ్యక్తి మాస్కు ధరించాడా లేదా?   ఆ వ్యక్తి  వయస్సు,  లింగం,  జాతి,  ఉష్ణోగ్రతలు  మరియు ముఖాన్ని గుర్తించడం  ఇవన్నీ ఒకే సాధనంలో ఉంటాయి.   దానితో వాస్తవ సమయంలో అనేక మంది జాడ తీయవచ్చు.  

అడ్వాన్స్ మెకానికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పరారుణ తాపమాపనరేఖపై ఆధారపడిన ఉష్ణోగ్రత స్కానర్ ను  వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.   దీని ద్వారా  వీడియో అనలిటిక్స్ ప్లాటుఫామ్ తో పాటు  మైక్రోబోలోమీటర్ ను ఉపయోగించి  వాస్తవ సమయంలో ఉష్ణోగ్రతలను వేగంగా కొలిచి నిర్ణయాలు తీసుకోవచ్చు.   కృత్రిమ మేధ,  ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి  దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ స్కానర్  వాస్తవ సమయంలో  విశ్లేషణాత్మక సమాచారం అందించడంతో  పాటు అప్రమత్తం చేస్తుంది.  

వైద్య పరికరాలు

కోయంబత్తూరుకు చెందిన లాటోమ్ ఎలెక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు  టి డి బి  ఆర్ధిక సహాయాన్ని ఆమోదించింది.    ఐ సి యులు,  రోగులను ఏకాంతంగా ఉంచే వార్డులలో ఉపయోగించడానికి అనువైన బ్యాటరీ ఆధార,  సులభంగా తీసుకెళ్లగలిగే  ఎక్స్ రే యంత్రాలను  వాణిజ్య సరళిలో తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది.   తేలికగా ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే ఈ యంత్రాన్ని రోగి మంచం పక్కెనే ఉంచడం వల్ల అతనికి  సేవలు చేస్తున్న వైద్య సిబ్బందికి వ్యాధి సోకే అవకాశాలు తగ్గిపోతాయి.   బ్యాటరీతో నడవడం వల్ల విద్యుత్ అవసరం లేకుండా నిరంతరం పనిచేస్తుంది.    తేలికగా తీసుకెళ్లే  ఎక్స్ రే యంత్రంలో డిజిటల్ చిత్రాలను చూసే అవకాశం ఉన్నందు వల్ల ఇది  కోవిడ్ -19  రోగుల చికిత్సకు ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులలో,  ఐ సి యు లలో ఎక్కువ ఉపయోగకరం.  

మాస్కులు
పూణేకు చెందిన థింకర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆర్ధిక సహాయం సమకూర్చారు.   ఈ సంస్థ మాస్కులపై  కరోనా వైరస్ సోకకుండా  వైరస్ నాశక పదార్ధాలను పూయడం(కోటింగ్)తో  పాటు 3డి ప్రింటింగ్ కూడా చేస్తుంది.    మాస్కులపై కోటింగ్ కోసం  సోడియం ఓలెఫిన్ సల్ఫోనేట్ ఆధార మిశ్రమాన్ని పూస్తుంది.   ఇది బంకగా ఉండి సబ్బువలె నురగ వస్తుంది.   ఒకవేళ వైరస్ దానిపైన పడితే అది  దానిని విచ్ఛిన్నం చేస్తుంది.   దానిలో వాడే పదార్ధాలను  అలంకరణ సామగ్రిలో ఉపయోగిస్తారు.  ఇవి  గృహ ఉష్ణోగ్రతలో స్థిరంగా ఉంటాయి.  

రోగనిర్ధారణ కిట్లు
మలేరియా,  డెంగ్యూ, గర్భం,  టైఫాయిడ్ మొదలగు వ్యాధులను సత్వరం నిర్ధారణ చేసే  కిట్లను తయారు చేస్తున్న న్యూ ఢిల్లీకి చెందిన మెడ్జోమ్ లైఫ్ సైన్సెస్ సంస్థ అనుదీప్త ఆధార కోవిడ్ -19 నిర్ధారణ కిట్లను తయారు చేయాలని అభిలషిస్తోంది.    2-3 నెలల్లో వాటిని వాణిజ్య సరళిలో  తయారు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు.     ఈ కిట్లు ఎన్నో రేట్లు సున్నితమైనవి.   నాణ్యమైన ఫలితాలు ఇస్తాయి.  

ఇంతకు ముందు ఫ్లూ వంటి లక్షణాలు ఉన్న వారికి  రోగ నిర్ధారణ పరీక్షలు చేసే కిట్ల తయారీకి  పూణేకు చెందిన  మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ సంస్థకు ఆర్ధిక వనరులు సమకూర్చడానికి ఆమోదం తెలిపింది.   ఈ కిట్ సహాయంతో   రోగుల నమూనాలను పరీక్షించి  నిర్ధారణ చేస్తారు.  

"అందుబాటులో ఉన్న దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాణిజ్య సరళిలో ఉపయోగించడానికి  ఇప్పటి కోవిడ్ -19 కాలం మనకు ఎన్నో దారులను చూపింది.  సాంకేతిక పరిజ్ఞానం  విద్యావేత్తలు,   ప్రయోగశాలల నుంచి సరైన స్పష్టత, సాంగత్యంతో,  పారదర్శకత, అంకితభావం, సహకారం, జవాబుదారీతో  మార్కెట్ వర్గాలకు చేరుతోంది.  సాంకేతిక అభివృద్ధి బోర్డు అందిస్తున్న సత్వర మద్దతు  వినూత్న పోకడలకు ఉదాహరణ. దాని లక్ష్యం స్వావలంబన మిషన్ -  స్వయం సమృద్ధ భారత్ కు సేవలు అందించడం"  అని  డి ఎస్ టి కార్యదర్శి  ప్రొఫెసర్ ఆశుతోష్ శర్మ తెలిపారు.    

(మరిన్ని వివరాలకోసం   దయచేసి  :   కమాండర్ నవనీత్ కౌశిక్,  సైన్టిస్ట్ 'ఇ';  టెక్నాలజీ అభివృద్ధి బోర్డు,   navneetkaushik.tdb[at]gmail[dot]com 
మొబైల్:   +91-9560611391)  


(Release ID: 1624832) Visitor Counter : 321