PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
10 MAY 2020 6:23PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- మొత్తం 62,939 కోవిడ్-19 కేసులకుగాను 19,357 మందికి నయంకాగా- కోలుకున్నవారి శాతం 30.76కు చేరింది. కాగా, గడచిన 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 1,511గా నమోదైంది.
- నిన్నటినుంచి దేశవ్యాప్తంగా 3,277 కొత్త కేసులు నమోదయ్యాయి.
- కేసులు పెరుగుతున్న, అధికంగా ఉన్న 10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపనున్న ఆరోగ్య మంత్రిత్వశాఖ.
- డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ప్రయాణానికి ఎక్కడా ఆటంకాలు ఉండరాదని, కరోనా యోధుల రక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి సూచన.
- వివిధ రాష్ట్రాలకు ఇప్పటిదాకా 366 “శ్రామిక్ స్పెషల్” రైళ్లను నడిపిన రైల్వేశాఖ.
- సీబీఎస్‌ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కోసం 3000 పాఠశాలలకు అనుమతి మంజూరు.
కోవిడ్-19పై నియంత్రణకు దేశంలో సముచిత పరిమాణంలో ఆరోగ్య మౌలిక వసతులు, ఇతర సదుపాయాలు సిద్ధం
దేశంలో కోవిడ్-19 నియంత్రణకు తగినన్ని ఆరోగ్య మౌలిక వసతులు, ఇతర సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు కోవిడ్ కేసుల నిర్వహణ కోసం ప్రత్యేకించిన ప్రజారోగ్య వసతులను మూడు రకాలుగా వర్గీకరించారు. కాగా, 2020 మే 10వ తేదీనాటికి అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 483 జిల్లాల్లో 7,740 ఆరోగ్య సదుపాయాలు గుర్తించబడ్డాయి. వీటిలో రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన ఆస్పత్రులు, ఇతర సదుపాయాలు కూడా ఉన్నాయి. వీటిలో 6,56,769 ఏకాంత చికిత్స పడకలు; కోవిడ్ నిర్ధారిత కేసుల కోసం3,05,567 పడకలు; అనుమానిత కేసుల కోసం 3,51,204 పడకలు; అలాగే 99,492 ప్రాణవాయువు సరఫరా మద్దతుగల పడకలు; 1,696 పైప్‌లైన్‌ద్వారా ఆక్సిజన్ అందే పడకలు; 34,076 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయి. కాగా, దేశంలో మొత్తం 19,357 మందికి వ్యాధి నయంకాగా, వీరిలో గడచిన 24 గంటల్లో కోలుకున్నవారు 1,511 మంది ఉన్నారు. దీంతో కోలుకున్నవారి శాతం 30.76కు చేరింది. ఇక దేశంలో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 62,939 కాగా, నిన్నటి నుంచి 3,277 కేసులు కొత్తగా నమోదయ్యాయి.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622685
కోవిడ్-19 నిర్వహణలో మద్దతు కోసం 10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
దేశంలో కోవిడ్-19 బాధితులు అధికంగాగల, కేసులు పెరుగుతున్న 10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కోవిడ్-19 వ్యాప్తి నిర్వహణలో ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖలకు కేంద్ర బృందాలు తోడ్పాటు అందిస్తాయి. ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సీనియర్ అధికారితోపాటు సంయుక్త కార్యదర్శి హోదాగల ఒక నోడల్ అధికారి, ఒక ప్రజారోగ్య నిపుణుడు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఆయా రాష్ట్రాల్లోని కోవిడ్ ప్రభావిత జిల్లాలు/నగరాల్లో నియంత్రణ చర్యల అమలులో ఈ బృందం అక్కడి ఆరోగ్యశాఖ అధికారులకు మద్దతునిస్తుంది.
కోవిడ్-19 నిర్వహణపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులతో కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన సమీక్ష సమావేశం
దేశంలోని వివిధ రాష్ట్రాలకు 3.5 లక్షల మంది వలస కార్మికులను తరలించేందుకు రైల్వేశాఖ 350 “శ్రామిక్ ప్రత్యేక” రైళ్లు నడుపుతున్నదని కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి వివరించారు. మరిన్ని శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖతో సహకరించాల్సిందిగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వందేభారత్ మిషన్ కింద విదేశాలనుంచి భారతీయులను తీసుకురావడంలో రాష్ట్రాల తోడ్పాటును ఈ సందర్భంగా కొనియాడారు. అలాగే కరోనా యోధులైన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. దీంతోపాటు వారికి రక్షణ కల్పించేందుకు అన్నిరకాల చర్యలూ తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా, ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితి గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమాచారం అందజేశారు. కోవిడ్ నుంచి రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలను కూడా క్రమక్రమంగా ఉత్తేజితం చేయాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి సమావేశం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఐదోసారి సమావేశం కానున్నారు. ఈ మేరకు 2020 మే 11వ తేదీన మధ్యాహ్నం 3:00 గంటలకు దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా వారితో వివిధ అంశాలపై చర్చిస్తారు.
దేశవ్యాప్తంగా 2020 మే 10వ తేదీవరకూ 366 ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్ల (1500 గంటలు)ను నడిపిన భారత రైల్వేశాఖ
భారత రైల్వేశాఖ 2020 మే 10వ తేదీనాటికి దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య 366 ‘శ్రామిక్ ప్రత్యేక’ రైళ్లను నడిపింది. వీటిలో 287 రైళ్లు ఇప్పటికే తమ గమ్యస్థానాలకు చేరగా, మరో 79 రైళ్లు మార్గమధ్యంలో ఉన్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు చేరిన రైళ్ల సంఖ్య ఇలా ఉంది... ఆంధ్రప్రదేశ్ (1), బీహార్ (87), హిమాచల్ ప్రదేశ్ (1), జార్ఖండ్ (16), మధ్యప్రదేశ్ (24), మహారాష్ట్ర (3), ఒడిశా (20), రాజస్థాన్ (4), తెలంగాణ (2), ఉత్తర ప్రదేశ్ (127), పశ్చిమ బెంగాల్ (2) వంతున ఉన్నాయి. ఈ శ్రామిక్ స్పెషల్ రైళ్లలో గరిష్ఠంగా 1200మంది సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ ప్రయాణించవచ్చు. రైలు ఎక్కే ముందు ప్రయాణికులకు సముచిత ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. ప్రయాణ సమయంలో వారికి ఉచిత భోజనం, నీరు అందజేస్తారు.
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం కోసం 3000 అనుబంధ పాఠశాలలు తెరిచేందుకు దేశీయాంగ శాఖ అనుమతి
జవాబుపత్రాల మూల్యాంకనానికి అనుమతి మంజూరు చేసిన దేశీయాంగ మంత్రిత్వశాఖకు కేంద్ర హెచ్‌ఆర్‌డి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా 3000 సీబీసీఈ అనుబంధ పాఠశాలలను మూల్యాంకన కేంద్రాలుగా గుర్తించినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తదనుగుణంగా ఈ పరిమిత ప్రయోజనం దిశగా ఆ పాఠశాలలు తెరిచేందుకు ప్రత్యేక అనుమతి ఇస్తామని చెప్పారు.
అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, ఇతర భారత ప్రభుత్వ న్యాయాధికారులతో కేంద్ర న్యాయశాఖ మంత్రి సమీక్ష సమావేశం
కేంద్ర చట్ట-న్యాయశాఖల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ఇవాళ న్యాయాధికారుల బృందంతో సమావేశమయ్యారు. ప్రపంచ మహమ్మారి విజృంభణను ఎదుర్కొనడం ఎంతో సంక్లిష్టం, సున్నితమైన సవాళ్లతో కూడినదని మంత్రి ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. అయినప్పటికీ పాలన వ్యవస్థ సముచితంగా స్పందించిందని గుర్తుచేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయ ప్రక్రియపై విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశం ఎన్నో సవాళ్లతో కూడిన ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో అత్యుత్సాహంతో దాఖలవుతున్న ప్రజాహిత వ్యాజ్యాలను తప్పించాలని న్యాయశాఖ మంత్రి సూచించారు. కాగా, ప్రస్తుత సవాలును అవకాశంగా మలచుకుని న్యాయప్రదానాన్ని ఉత్తేజితం చేసేదిశగా డిజిటల్ వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేకంగా అభ్యర్థించారు.
మిషన్ సాగర్ - 2020 మే 10
దేశంలో ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నడుమ భారత ప్రభుత్వ ఔదార్యపూరిత చర్యల్లో భాగంగా భారత నావికాదళ నౌక ‘కేసరి’ ఆహార వస్తుసామగ్రి, హెచ్‌సీక్యూ మాత్రలు, ప్రత్యేక ఆయుర్వేద ఔషధాలుసహా కోవిడ్ నియంత్రణ సంబంధిత మందులను వివిధ దేశాలకు అందించేందుకు 2020 మే 10వ తేదీన బయల్దేరింది. ఈ మేరకు మాల్దీవ్స్, మారిషస్, సీషెల్స్, మడగాస్కర్, కొమొరోస్ తదితర దేశాల ప్రజలకు ఈ నౌకలో వెళ్లిన వైద్య సహాయ బృందాలు సేవలందిస్తాయి. ఈ సహాయ చర్యలకు ‘మిషన్ సాగర్’గా నామకరణం చేశారు. ఈ ప్రాంతంలోని సమస్యలపై తొలుత స్పందించే దేశంగా భారత్ తన బాధ్యతను నెరవేరుస్తోంది. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సంబంధిత కష్ట సమయంలో ఇబ్బందులు పడుతున్న దేశాలను ఆదుకుంటూ అద్భుత స్నేహసంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోంది.
చిల్లర వర్తకులు, భవన-నిర్మాణరంగ నిపుణులను ఎంఎస్‌ఎంఈ పరిధిలో నమోదు చేయడంపై విజ్ఞప్తిని పరిశీలిస్తాం: శ్రీ గడ్కరీ
దేశవ్యాప్తంగాగల చిల్లర వ్యాపారులు, భవన-నిర్మాణరంగ నిపుణులు తమను ఎంఎంస్‌ఎంఈ పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు భారత చిల్లర వర్తకుల సంఘంతోపాటు ఇంజనీర్లు, వాస్తు-పట్టణ ప్రణాళిక నిపుణుల సంఘం సమర్పించిన విజ్ఞాపనను సత్వరం పరిశీలిస్తామని కేంద్ర ఎంఎస్‌ఎంఈ, రోడ్డురవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఇవాళ హామీ ఇచ్చారు. ఈ సంస్థలు ఉపాధి సృష్టికర్తలుగా తమవంతు పాత్ర నిర్వర్తిస్తున్న దృష్ట్యా వారి విజ్ఞప్తిని అంగీకరంచే మార్గాన్వేషణ చేయాల్సి ఉందని ఆయన అన్నారు. తదనుగుణంగా ఆయా సంస్థల ఉద్యోగులు, కార్మికులకు బీమా, వైద్య, పింఛన్ వగైరా సదుపాయాల కల్పనపై పరిశీలించాల్సి ఉందన్నారు. కాగా, ప్రస్తుత కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ ఇళ్లకు వస్తువుల సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని చిల్లర వర్తకులకు గడ్కరీ సూచించారు. అలాగే ఖాతాదారులు/ఉద్యోగులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, అన్ని చిల్లర దుకాణాల్లో మాస్కులు వినియోగించేలా చూడాలని కోరారు.
కోవిడ్-19తో కఠిన దిగ్బంధం ఆంక్షలున్నప్పటికీ 2020 ఏప్రిల్‌లో 71 శాతానికి పెరిగిన నేషనల్ ఫెర్టిలైజర్స్ సంస్థ అమ్మకాలు
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- హిమాచల్ ప్రదేశ్: గోవాలో చిక్కుకున్న హిమాచల్ ప్రదేశ్ వాసుల రాకకు వీలుగా తివిమ్/మార్గోవా/ కరమాలి (గోవా)నుంచి ఉనా నగరానికి ప్రత్యేక రైలు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు హిమాచల్ వాసులను వారి రాష్ట్రం తీసుకెళ్లేందుకు మే 13, 14 తేదీల్లో గోవా నుంచి ప్రత్యేక రైలు బయల్దేరుతుంది.
- పంజాబ్: రాష్ట్రంలో పాఠశాల విద్యాబోర్డు పరిధిలోని పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని, వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారిని పై తరగతికి పంపుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, అనూహ్య కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో దీర్ఘకాలిక దిగ్బంధం/కర్ఫ్యూ పరిస్థితులు కొనసాగాయి. ఈ కారణంగా పంజాబ్ పాఠశాల విద్యా విధానం పరిధిలో 5 నుంచి 10 తరగతులవరకూ విద్యార్థులందర్నీ ఎటువంటి పరీక్ష లేకుండా తదుపరి తరగతికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే, రాష్ట్రంలోని 11, 12 తరగతుల విద్యార్థుల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్నే రాష్ట్రంలో అమలు చేస్తామని ఆయన చెప్పారు.
- హర్యానా: రాష్ట్రంలోని దివ్యాంగుల రక్షణ, భద్రత దిశగా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు చేపట్టాల్సిన నివారణ చర్యలపై హర్యానా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. కార్యాలయాల్లో విధులు నిర్దేశించే సమయంలో తీవ్ర వైకల్యంగల ఉద్యోగులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా చూడాలని అన్ని ఆఫీసుల-విభాగాల అధిపతులకు సూచించింది. కాగా, రాష్ట్రంలో విద్యార్థుల చదువు కొనసాగేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ఇందులో భాగంగా వార్షిక పాఠ్యాంశాలను 5 డీటీహెచ్ చానెళ్లద్వారా ప్రసారం చేస్తుండగా, హర్యానా ఎడ్యుశాట్ ద్వారా రాష్ట్ర కేబుల్ ఆపరేటర్లు 4 చానెళ్లను ప్రసారం చేస్తున్నారు.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,228కి పెరిగింది, గత 24 గంటల్లో 1,165 తాజా కేసులు నమోదుకాగా, 48 మరణాలు సంభవించాయి. ఒక్క ముంబై నగరంలోనే ఇప్పటిదాకా 12,864 కేసులకుగాను 489 మంది మరణించారు.
- గుజరాత్: రాష్ట్రంలో కోవిడ్-19 మరణాలు ఎక్కువగా ఉండటంపై ఢిల్లీలోని ఎయిమ్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా విశ్లేషించారు. ప్రస్తుతం అహ్మదాబాద్ నగరంలో పర్యటిస్తున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ- వ్యాధి సోకిందన్న అవమానం, ఆందోళన ఫలితంగా రోగులను ఆలస్యంగా ఆసుపత్రిలో చేర్చడంతోపాటు కొందరికి అప్పటికే మధుమేహం, రక్తపోటు, గుండె-మూత్రపిండాల వ్యాధులు వంటి అనారోగ్యాలు ఉండటంవల్ల అధిక సంఖ్యలో మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,747 కాగా, మరణాల సంఖ్య 452గా ఉంది.
- రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 33 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 3,741కి చేరింది. కాగా, కోలుకున్న వారి శాతం సుమారు 60గా నమోదు కావడం గమనార్హం. ఈ మేరకు ఇప్పటికే 2,176 మంది కోలుకోగా- 1,917 మంది ఆసుపత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 273 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,614కు చేరింది. ఇప్పటిదాకా 1,676 మంది కోలుకోగా, 215 మంది మరణించారు.
- గోవా: కర్మాగారాల చట్టం-1948 కింద కార్మిక చట్టాలను సడలించిన రాష్ట్రాల జాబితాలో గోవా కూడా చేరింది. ఈ మేరకు సడలింపులతోపాటు కోవిడ్ మహమ్మారివల్ల వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేసుకోవడంలో భాగంగా మూడు నెలలపాటు 12 గంటల రోజువారీ షిఫ్టుకు అనుమతించింది. కాగా, నిర్ణీత పనివేళలకు మించి పనిచేసిన కార్మికులకు ఓవర్ టైం వేతనం చెల్లించబడుతుంది.
- కేరళ: తమిళనాడు సరిహద్దులోగల వాలయార్ చెక్‌పోస్టువద్ద నిన్నటినుంచి చిక్కుకుపోయిన వారికి ఏక పరిష్కారంలో భాగంగా ఇ-పాస్ జారీచేయాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాస్ పొందకుండా రావద్దని ప్రభుత్వం హెచ్చరించినా అనేకమంది కేరళవాసులు సరిహద్దు ప్రాంతాల వద్దకు చేరుకున్నారు. కాగా, ఐఎన్‌ఎస్ జలాశ్వద్వారా మాల్దీవ్స్ నుంచి తరలించిన 698 మంది ఈ ఉదయం కోచ్చి రేవుకు చేరుకున్నారు. వీరిలో 440 మంది కేరళకు చెందినవారు కాగా, 156 మంది తమిళనాడువాసులు, మిగిలిన వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. లక్షద్వీప్ నుంచి మరో 121 మంది కూడా ఇవాళ “ఎం.వి. అరేబియన్ సీ” నౌకలో కోచ్చి రేవుకు చేరుకున్నారు. మరోవైపు దోహా నుంచి 182 మంది ప్రయాణికులతో ఒక విమానం ఈ రాత్రికి తిరువనంతపురం చేరుతుంది.
- తమిళనాడు: వలస కార్మికులను ప్రయాణ వ్యయాన్ని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. కాగా, మొత్తం మహిళా సిబ్బందితో కూడిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం 177 మంది భారతీయులను మలేషియా నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి చేర్చింది. చెన్నైలో ఈ వారం మరిన్ని కోవిడ్ -19 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రత్యేకాధికారి జె.రాధాకృష్ణన్ చెప్పారు. కాగా, సోమవారం నుంచి కోవిడ్-19 దిగ్బంధాన్ని మరింత సడలించనున్నారు. నిన్నటిదాకా మొత్తం కేసులు: 6,535, యాక్టివ్ కేసులు: 4,664, మరణాలు: 44, డిశ్చార్జ్ అయినవారు: 1824. చెన్నైలో యాక్టివ్ కేసులు 3,330.
- కర్ణాటక: రాష్ట్రంలోని కోవిడ్ -19 రోగులలో 76 శాతానికిపైగా ఎలాంటి లక్షణాలూ కనిపించనివారేనని తేలింది. కాగా, రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు నాలుగు శ్రామిక్ ప్రత్యేక రైళ్లు బయల్దేరుతాయి. కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాదృచ్ఛిక నమూనా సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, రాష్ట్రంలో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 53 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక మే 7న ఒక 56 ఏళ్ల మహిళ మరణించడంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 31కి చేరింది.
- ఆంధ్రప్రదేశ్: విదేశాల నుంచి తెలుగువారిని తరలిస్తూ ముంబై-హైదరాబాద్ మార్గమధ్యం నిలిచిపోయిన తొలి ఎయిరిండియా విమానం సోమవారం ఉదయం విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనుంది. ఆ తర్వాత ప్రయాణికులకు విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించి, 14 రోజుల నిర్బంధ వైద్య పర్యవేక్షణకు పంపుతారు. కాగా, ఇవాళ రాష్ట్రంలో 50 కోవిడ్-19 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 38 మంది డిశ్చార్జ్ కాగా, ఒక మరణం నమోదైంది. మొత్తం కేసులు 1,980కి చేరగా, యాక్టివ్ కేసులు: 1,010, కోలుకున్నవారు: 925 మంది, మరణాలు: 45. కాగా, కేసుల సంఖ్యరీత్యా కర్నూలు (566), గుంటూరు (382), కృష్ణా (339) జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్రం నుంచి స్వస్థలాలకు వెళ్లడానికి ఎదురుచూస్తున్న లక్షలాది వలస కార్మికులు మరికొద్ది రోజులు ఓపిక పట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని కొన్ని కేంద్రాల్లో ప్రయాణ నమోదుకు నగర పోలీసులు కొన్ని అభ్యంతరాలు చెబుతుండటమే ఇందుకు కారణం. కాగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,163, యాక్టివ్ కేసులు: 382, డిశ్చార్జ్ అయినవారు: 751, మరణాలు 30.
- అసోం: రాష్ట్రంలో కోవిడ్-19పై సామాజిక నిఘా కార్యక్రమం ప్రగతిపై ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ ఇవాళ అందరు డిప్యూటీ కమిషనర్లతో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశంద్వారా సమీక్షించారు.
- మణిపూర్: రాష్ట్రానికి చెందిన పౌరులతో చెన్నై నుంచి జిరిబామ్ రానున్న ప్రత్యేక రైలు ఈ సాయంత్రం బయల్దేరింది. ఈ రైలులో వచ్చేవారిని నిర్బంధ వైద్య పర్యవేక్షణ కేంద్రాలకు తరలిస్తారు.
- మిజోరం: రాష్ట్రంలో కోవిడ్ -19 నియంత్రణ, నిరోధం ఆర్డినెన్స్-2020 నిబంధనల ఉల్లంఘనపై ఇప్పటిదాకా 1,323 మందికి పోలీసులు జరిమానా విధించారు.
- నాగాలాండ్: రాష్ట్రంలో తగినంత ఆహార, ఔషధ, ఇతర నిత్యావసర నిల్వలున్నాయి. అలాగే వాణిజ్య వాహనాలు, నిత్యావసరాలు సరఫరాచేసే సేవా ప్రదాతలపై ఎలాంటి నిషేధం లేదు. కాగా, దిమాపూర్‌లో మే 11 నుంచి హార్డ్‌వేర్ దుకాణాలను మూడు గంటలపాటు తెరిచేందుకు జిల్లా యంత్రాంగం అనుమతించింది. అయితే, వీటిని ఉదయం 6 గంటలకు తెరచి, 9 గంటలకు మూసివేయాలని ఆదేశించింది.
FACT CHECK


******
(Release ID: 1622811)
|