PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 09 MAY 2020 6:26PM by PIB Hyderabad

 

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • మొత్తం 59,662 కోవిడ్‌-19 కేసులకుగాను 17,847 మందికి నయంకాగా- మరణాలు 1,981గా ఉన్నాయి.
  • గడచిన 24 గంటల వ్యవధిలో 3,320 కొత్త కేసులు నమోదయ్యాయి.
  • ఈశాన్యభారతంలో అసోం, త్రిపుర మినహా గ్రీన్‌జోన్‌లో అధికశాతం రాష్ట్రాలు.
  • దేశంలో పరీక్షా సామర్థ్యం రోజుకు 95,000 స్థాయికి చేరగా- ఇప్పటిదాకా 15.25 లక్షల పరీక్షలు జరిగాయి.
  • ప్రస్తుత కోవిడ్‌-19 పరిస్థితుల నడుమ కేంద్ర సాయుధ పోలీసు బలగాల కృషికి దేశీయాంగ శాఖ ప్రశంసలు.
  • కోవిడ్‌-19  సంబంధిత అంశాలపై సామాజిక భాగస్వాములతో కేంద్ర కార్మికశాఖ చర్చలు; దేశ ఆర్థిక వ్యవస్థ, కార్మికలోకంపై దాని ప్రభావ ఉపశమనానికి ప్రణాళికల రూపకల్పన.
  • కోవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో తమవంతు తోడ్పాటునిస్తున్న అల్ప సంఖ్యాకవర్గాలు: శ్రీ నఖ్వీ ప్రకటన.

కోవిడ్‌-19పై నియంత్రణ చర్యలు, నిర్వహణ సన్నద్ధతపై ఈశాన్య రాష్ట్రాలతో డాక్టర్‌ హర్షవర్ధన్‌ సమీక్ష సమావేశం

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇవాళ ఈశాన్య భారత రాష్ట్రాల్లో కోవిడ్‌-19పై నియంత్రణ చర్యలు, నిర్వహణ సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌ త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. కోవిడ్‌-19పై దేశం సాగిస్తున్న పోరాటంలో అన్ని రాష్ట్రాల నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. “ఈశాన్య భారత రాష్ట్రాల్లో అధికశాతం గ్రీన్‌జోన్‌లో ఉండటం ఎంతో ఊరటనిస్తోంది” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అసోం, త్రిపుర రాష్ట్రాలు మాత్రమే కోవిడ్‌-19 కేసుల నమోదు జాబితాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్‌జోన్‌లోగల రాష్ట్రాలు మరింత జాగ్రత్త వహించాలని, తదనుగుణంగా ఇతర రాష్ట్రాల నుంచి తిరిగివచ్చే వలసకార్మికులు, విద్యార్థులతోపాటు విదేశాలనుంచి వచ్చేవారికి నిర్దేశిత విధివిధానాల మేరకు నిశిత పరీక్షలు నిర్వహించి, అవసరమైతే నిర్బంధ వైద్య పర్యవేక్షణకు పంపాలని సూచించారు.

   దేశవ్యాప్తంగా 2020 మే 9వ తేదీవరకూ మొత్తం కోవిడ్‌-19 కేసుల సంఖ్య 59,662 కాగా, వీరిలో 17,847 మందికి వ్యాధి నయమైందని, ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 1,981గా ఉందని డాక్టర్‌ హర్షవర్ధన్‌ వివరించారు. గడచిన 24 గంటల వ్యవధిలో 3,320 కొత్త కేసులు నమోదవగా, ఇదే వ్యవధిలో కోలుకున్నవారి సంఖ్య 1,307గా ఉందని తెలిపారు. ఆ మేరకు మరణాల శాతం 3.3 కాగా, కోలుకునేవారి శాతం 29.9గా ఉందని చెప్పారు. ఇక మొత్తం రోగులలో నిన్నటిదాకా ఐసీయూలో ఉన్నవారు 2.41 శాతంగానూ, వెంటిలేటర్‌పై ఉన్నవారు 0.38 శాతంగానూ, ప్రాణవాయువు పొందుతున్నవారు 1.88 శాతంగానూ ఉన్నట్లు వెల్లడించారు. కాగా, దేశంలో రోగనిర్ధారణ పరీక్షల సామర్థ్యం రోజుకు 95,000 స్థాయికి చేరిందని, తదనుగుణంగా 332 ప్రభుత్వం, 121 ప్రైవేటు ప్రయోగశాలలు సంయుక్తంగా ఇప్పటివరకూ 15,25,631 నమూనాలను పరీక్షించినట్లు తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622577

తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కోవిడ్‌-19 నియంత్రణ, తదుపరి సన్నద్ధతలపై సమీక్షించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

దేశవ్యాప్తంగా కోవిడ్‌-19పై పోరాటంలో కేంద్ర-రాష్ట్రాల సమన్వయంతో సముచిత చర్యలు తీసుకున్నట్లు డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఆ మేరకు కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రుల సంఖ్య తగుమేర పెరిగిందని, ఏకాంత చికిత్స-ఐసీయూ పడకల సంఖ్య పెరుగుదలతోపాటు నిర్బంధ వైద్య పర్యవేక్షణ కేంద్రాల ఏర్పాటు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. కోవిడ్‌-19 నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇప్పటిదాకా సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కేంద్రం నుంచి కూడా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/కేంద్ర సంస్థలకు తగు పరిమాణంలో మాస్కులు, వ్యక్తిగత రక్షణ సామగ్రి, వెంటిలేటర్లు వగైరా సరఫరా అవుతున్నాయని ఆయన తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622170

శ్రీ అమిత్‌ షా అధ్యక్షతన కేంద్ర సాయుధ పోలీసు బలగాల డైరెక్టర్‌ జనరళ్లతో సమీక్ష

దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్-19 నిర్వహణ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర సాయుధ పోలీసు దళాల కృషి ప్రశంసనీయమని కేంద్ర దేశీయాంగ శాఖ మంత్రి అభినందించారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికేగాక కేంద్ర సాయుధ పోలీసు దళాల భద్రత, శ్రేయస్సు కోసం కూడా మోదీ ప్రభుత్వం అన్నివిధాలా కృషిచేస్తున్నదని శ్రీ షా పేర్కొన్నారు.  వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర సాయుధ పోలీసు దళాలు వేటికవి చేపట్టిన వినూత్న చర్యలగురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే ముందుజాగ్రత్తలపై అవగాహన-శిక్షణసహా   మెస్‌ల ఏర్పాట్లలో మార్పులు, బ్యారక్‌లలో బస సదుపాయాలు,  ఆయుష్ మంత్రిత్వశాఖ మార్గదర్శకాల మేరకు రోగనిరోధకత పెంపు, భద్రత సిబ్బంది వయస్సు-వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది సముచిత నిర్వహణ తదితరాలపై వారు సూచనలు-సలహాలపైనా సమావేశం లోతుగా చర్చించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622377

భారత, ఇటలీ ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

భారత, ఇటలీ ప్రధానమంత్రులు శ్రీ నరేంద్ర మోదీ, గౌరవనీయ గిసెప్పీ కాంటే టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇటలీలో భారీ ప్రాణనష్టం సంభవించడంపై ఈ సందర్భంగా ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. రెండుదేశాల ఆర్థిక, ఆరోగ్య రంగాల్లోనేగాక అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ మహమ్మారి సవాలును ఎదుర్కొనే చర్యలపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల నడుమ పరస్పర సంఘీభావ ప్రకటనతోపాటు రెండు దేశాల్లో చిక్కుకుపోయిన పౌరుల విషయంలో పరస్పర సహకారంపై వారిద్దరూ పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. ఇటలీకి అవసరమైన మందులు, ఇతర వస్తుసామగ్రి సరఫరాలో ఎలాంటి కొరత రానివ్వబోమని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622307

దిగ్బంధంవల్ల పరిశ్రమలు, కార్మికులకు ఎదురైన సమస్యల పరిష్కారానికి  వీలైనన్ని చర్యలు తీసుకుంటాం: కేంద్ర కార్మిక-ఉపాధికల్పన మంత్రిత్వశాఖ

కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తివల్ల తలెత్తిన పరిణామాలపై కేంద్ర కార్మిక-ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ సామాజిక భాగస్వాములతో చర్చలు చేపట్టింది. తదనుగుణంగా ఆర్థిక వ్యవస్థతోపాటు కార్మికశక్తిపై దాని ప్రభావాన్ని ఉపశమింపజేసే వ్యూహాలు, విధాన నిర్ణయాలపై ప్రణాళికలు రూపొందించనుంది. ఇందులో భాగంగా యాజమాన్య సంస్థల సంఘాలతో కేంద్ర కార్మిక-ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి (ఇన్‌చార్జి) శ్రీ సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ వెబినార్‌ నిర్వహించారు. పరిశ్రమల అవసరాలపై తమ శాఖ సానుకూలమేనని, ఆ మేరకు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, పరిశ్రమలకు పునరుత్తేజం కోసం అవసరమైన తోడ్పాటునిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలు... ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఈల రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత ఇతర మంత్రిత్వ శాఖలతోనూ కార్మిక-ఉపాధి కల్పన శాఖ సంప్రదిస్తున్నదని ఆయన వెల్లడించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622380

కొన్ని సంస్థల రిజిస్ట్రేషన్‌, ఆమోదం తదితరాలపై కొత్త విధానం 2020 అక్టోబరు 1వరకు వాయిదా

అనూహ్య ఆర్థిక-మానవతావాద సంక్షోభం పరిస్థితుల దృష్ట్యా కొన్ని సంస్థలకు సంబంధించి ఆమోదం/రిజిస్ట్రేషన్‌/నోటిఫికేషన్‌ తదితరాలపై అమలు చేయదలచిన కొత్త విధానాన్ని 2020 అక్టోబరు 1వరకూ వాయిదా వేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు-సీబీడీటీ నిర్ణయించింది. ఆ మేరకు ఆదాయపు పన్ను చట్టం-1961 లోని సెక్షన్లు 10(23సి), 12ఎఎ, 35, 80జి కింద ఆమోదం/రిజిస్ట్రేషన్‌/నోటిఫికేషన్‌ పూర్తయిన సంస్థలు 2020 అక్టోబరు 1 నుంచి 3 నెలల్లోగా సమాచార పత్రం దాఖలు చేయవచ్చు. అంతేకాకుండా కొత్త సంస్థల ఆమోదం/రిజిస్ట్రేషన్‌/నోటిఫికేషన్‌లకు సంబంధించి సవరించిన విధానం కూడా 2020 అక్టోబరు 1 నుంచి వర్తిస్తుందని సీబీడీటీ పేర్కొంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622427

ఆదాయపు పన్ను చట్టం-1961 కింద ‘నివాస నిర్ధారణ’కు సంబంధించి వివరణ

ఒక వ్య‌క్తి నివాస నిర్ధార‌ణ‌కు సంబంధించి ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్ష‌న్ 6 కింద నిబంధ‌న‌లున్నాయి. ఆ మేర‌కు స‌ద‌రు వ్యక్తి భారతదేశంలో నివసిస్తున్నాడా లేక ప్ర‌వాస భార‌తీయుడా లేక స్వ‌త‌హాగా నివాసి కాదా త‌దితర అంశాలు ఇతర విషయాలతోపాటు ఒక ఏడాది కాలంలో ఆ వ్య‌క్తి  ఎంత‌కాలం భారతదేశంలో నివ‌సించారనే దానిపై ఆధారపడి ఉంటాయి. కాగా, 2019-20లో నిర్దిష్ట కాలంపాటు భారత్‌లో బ‌స‌చేసిన చాలామంది వ్యక్తులు ఆ ఏడాది ముగియ‌క‌ముందే వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. “ప్ర‌వాస భార‌తీయులు, స్వ‌త‌హాగా నివాసి కానివారు” అన్న హోదాను నిల‌బెట్టుకునేందుకే వారు ఆ విధంగా భావించారు.  అయితే, న‌వ్య కరోనా వైరస్ (కోవిడ్ -19) వ్యాప్తి నేప‌థ్యంలో దిగ్బంధం ప్ర‌క‌టించ‌డంస‌హా అంతర్జాతీయ విమాన‌యానం కూడా నిషేధించ‌బ‌డింది. దీంతో వారు అనివార్యంగా భార‌త‌దేశంలోనే  బ‌స ‌చేయాల్సి వ‌చ్చింది. దీనివ‌ల్ల తమ ప్ర‌వాస భార‌తీయ హోదా దానంత‌ట అదే ర‌ద్దవుతుంద‌ని వారు ఆందోళ‌న ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో నిజాయితీగా ఇలా ఉండిపోవాల్సి వ‌చ్చిన‌వారి ఇబ్బందుల‌పై కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు ఒక స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ ఇచ్చింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622506

కోవిడ్‌-19పై పోరాటంలో సమాజంలోని అన్నివర్గాలతో సమానంగా కృషి చేసిన అల్పసంఖ్యాకవర్గాలు: శ్రీ ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ

కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం కింద శిక్షణ పొందిన సుమారు 1,500 మందికిపైగా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు కరోనా వ్యాధిపీడితులకు సేవలందించడంలో పూర్తిస్థాయి సహయసహకారాలు అందిస్తున్నారని ఆ శాఖ మంత్రి శ్రీ ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సేవలందిస్తున్న ఈ కార్యకర్తలలో 50 శాతం యువతులున్నారని మంత్రి వివరించారు. మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాల వక్ఫ్‌ బోర్డులు అనేక మత, సామాజిక, విద్యా సంస్థల తోడ్పాటుతో ‘ప్రధానమంత్రి/ముఖ్యమంత్రి సహాయ నిధు’లకు రూ.51 కోట్ల విరాళం ఇచ్చినట్లు వెల్లడించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622509

కోవిడ్-19పై దిగ్బంధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా 684 టన్నుల నిత్యావసరాలు, వైద్య సామగ్రిని రవాణా చేసిన లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు

‘లైఫ్‌లైన్‌ ఉడాన్‌’ కింద ఎయిరిండియా, అలయెన్స్‌ ఎయిర్‌, ఐఏఎఫ్‌, ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ఇప్పటిదాకా 490 విమానాలను నడిపాయి. ఈ మేరకు 2020 మే 8వ తేదీన 6.32 టన్నుల సామగ్రిని రవాణా చేయగా, మొత్తం చేరవేసిన సామగ్రి 848.42 టన్నుల స్థాయికి చేరింది. కాగా, 2020 మే 8వ తేదీన అలయెన్స్‌ ఎయిర్‌ సంస్థ 2 విమానాలను, భారత వాయుసేన 8 విమానాలను నడిపాయి. ఈ కర్తవ్య నిర్వహణలో భాగంగా లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు 4,73,609 కిలోమీటర్లు ప్రయాణించాయి. కాగా, కోవిడ్‌-19పై భారత్‌ పోరాటానికి మద్దతుగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు నిత్యావసరాలు, అత్యవసర వైద్య సామగ్రిని చేరవేసేందుకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ లైఫ్‌లైన్‌ విమానాలను నడుపుతోంది. ఇక జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, ద్వీప ప్రాదేశికాలు, ఈశాన్య భారత ప్రాంతంలోని మారుమూల ప్రదేశాలకు పవన్‌హన్స్‌ లిమిటెడ్‌ సంస్థసహా పలు హెలికాప్టర్‌ సర్వీసులు వైద్య సామగ్రితోపాటు కోవిడ్‌-19 రోగులను కూడా తీసుకెళ్లాయి. ఇందులో భాగంగా 2020 మే 8వ తేదీదాకా పవన్‌హన్స్‌ సంస్థ హెలికాప్టర్లు 8,001 కిలోమీటర్లు ప్రయాణించి 2.32 టన్నుల వస్తుసామగ్రిని చేరవేశాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622508

కోవిడ్‌-19 మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కొంటూనే ‘సుఫల’ ఎన్‌పీకే ఎరువుల విక్రయాలను 35 శాతం మేర పెంచిన ఆర్‌సీఎఫ్‌

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622566

 

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అరుణాచల్ ప్రదేశ్: కోవిడ్‌-19 నిరోధం దిశగా ఏ లక్షణాలు లేనివారుసహా రాష్ట్రంలో ప్రవేశించే ప్రతి ఒక్కరికీ రోగనిర్ధారణ పరీక్ష నిర్వహణను తప్పనిసరి చేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
  • మణిపూర్: కోల్‌కతాలోని ఐదు ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేస్తున్న 22మంది నర్సులు సొంత రాష్ట్రం మణిపూర్‌కు తిరిగిరాగా, ప్రభుత్వం వారందర్నీ నిర్బంధ వైద్య పర్యవేక్షణ కేంద్రాలకు తరలించింది.
  • మేఘాలయ: రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో మరో వ్యక్తికి కోవిడ్‌-19 నిర్ధారణ అయింది. ఇంతకుముందు ఒక వ్యక్తికి ముందుజాగ్రత్త చర్యగా రెండోసారి పరీక్ష నిర్వహించగా, అతడికి వ్యాధి నిర్ధారణ అయింది. కాగా, ప్రస్తుతం వ్యాధి సోకిన వ్యక్తి సదరు రోగివద్ద పనిచేస్తున్నట్లు తేలింది. సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని, వ్యాధి లక్షణాలేవీ ఇప్పుడు కనిపించడం లేదని ముఖ్యమంత్రి ట్వీట్‌ చేశారు.
  • మిజోరాం: మిజోరం రాష్ట్రం కోవిడ్‌ విముక్తం కావడంతోపాటు శిశుమరణాల శాతం 10 పాయింట్ల మేర తగ్గినందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిని అభినందించారు.
  • నాగాలాండ్: రాష్ట్రం వెలుపలి ప్రాంతాల్లో కోవిడేతర తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు తిరిగి వచ్చేందుకు సమర్పించే దరఖాస్తుతోపాటు సదరు రాష్ట్రం వెలుపలి ఆస్పత్రి నుంచి అంగీకార ధ్రువీకరణ పత్రం జతచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రాష్ట్రం వెలుపల చిక్కుకున్న 33 మంది తిరిగి రావడానికి ఇ-పాస్‌ల కోసం దరఖాస్తు చేయగా, రాష్ట్రంలో ప్రవేశించేందుకు ఏర్పాటు చేయాలని మరో 7,015 మంది అభ్యర్థించారని నాగాలాండ్ ప్రణాళికశాఖ మంత్రి చెప్పారు.
  • సిక్కిం: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనంపై చర్చించడం కోసం గవర్నర్ శ్రీ గంగా ప్రసాద్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో  వ్యాధి నిరోధానికి చేపట్టిన కఠినచర్యల గురించి ఆయనకు వివరించారు.
  • త్రిపుర: దేశంలోని 11 రాష్ట్రాల్లో చిక్కుకున్న 17,000 మంది త్రిపుర రాష్ట్ర ప్రజలు తిరిగి రావడం కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ద్వారా పేర్లు నమోదు చేసుకున్నారు. కాగా, త్రిపుర నుంచి 33,000మంది వలస కార్మికులను వారివారి రాష్ట్రాలకు ప్రభుత్వం పంపించనుంది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో మరో 1,089 కొత్త కేసులు నమోదవంతో మొత్తం  కేసులు సంఖ్య 19,063కు చేరింది. గత 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 731కి పెరిగింది. ముంబైలో గత 24 గంటల్లో 748 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదవడంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 11,967కు పెరిగింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 714మంది పోలీసు సిబ్బందికి కూడా వ్యాధి నిర్ధారణ కావడం గమనార్హం.
  • గుజరాత్: కోవిడ్-19 చికిత్స విధివిధానాలపై సలహాలివ్వడం కోసం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇవాళ అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌లో వైద్యులతో సమావేశమయ్యారు. కాగా,  రాష్ట్రంలో ఇవాళ 24 మరణాలు నమోదవడంతో మృతుల సంఖ్య 449కి చేరుకోగా, మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 7,403గా ఉంది. మొత్తంమీద జాతీయ స్థాయిలో మహారాష్ట్ర తరువాత గుజరాత్‌ రెండోస్థానంలో ఉండటం గమనార్హం.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 57 కొత్త కరోనావైరస్ కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 3,636కు పెరిగింది. ఇప్పటిదాకా వ్యాధి సోకినవారిలో 1,916 మంది కోలుకోగా, 101 మంది మరణించారు.
  • మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలో ఈ ఉదయం 8:00 గంటల సమయానికి 89 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,341కి చేరింది. ఇప్పటిదాకా 1,349మంది కోలుకోగా 200మంది మరణించారు. రాష్ట్రంలో వరుసగా మూడు రోజుల నుంచీ కొత్త కేసులకన్నా, కోలుకుంటున్నవారి శాతం అధికంగా నమోదవడం విశేషం.
  • ఛత్తీస్‌గఢ్‌: కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభ పరిష్కారానికి రూ.30,000 కోట్ల ప్యాకేజీ కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ భూపేశ్ భగెల్ లేఖ రాశారు. కాగా, రాష్ట్రంలో 60 కేసులు నమోదైనప్పటికీ ఒక్క మరణం కూడా లేకపోవడం గమనార్హం. మొత్తంమీద దేశంలో కోవిడ్‌ ప్రభావం అతి తక్కువగాగల రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్‌ రికార్డులకెక్కింది.
  • కేరళ: దేశంలోని రెడ్‌జోన్‌ ప్రాంతాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి తిరిగి వచ్చే కేరళవాసులకు ప్రభుత్వం తిరిగి పాసులు మంజూరు చేస్తోంది. కాగా, పాస్ లేనందువల్ల  ప్రస్తుతం చాలామంది కేరళవాసులు సరిహద్దు జిల్లాల తనిఖీ కేంద్రాలవద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. తమిళనాడులో రెడ్‌జోన్‌లోగల తిరువళ్లూరు జిల్లానుంచి తిరిగివచ్చి నిర్బంధ వైద్య పర్యవేక్షణ నుంచి తప్పించుకు తిరుగుతున్న 34 మంది విద్యార్థులను గుర్తించడానికి కోట్టయం జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. కాగా- వందే భారత్ మిషన్ కింద మస్కట్, కువైట్, దోహాల నుంచి మరో మూడు విమానాలు ఈ రాత్రి కోచ్చి చేరుకోనున్నాయి. రాష్ట్రంలో నిన్న కోవిడ్-19నుంచి 10 మంది కోలుకోగా, ఒక్క కొత్త కేసు మాత్రమే నమోదైంది. మరో 16మంది రోగులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాడు: రాష్ట్రంలో కౌంటర్లద్వారా మద్యం అమ్మకంపై హైకోర్టు నిషేధించిన నేపథ్యంలో ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మరోవైపు కేంద్రం రూపొందించిన విద్యుత్తు చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి కోరారు. ఇక వందే భారత్‌ మిషన్‌ కింద దుబాయ్‌ నుంచి 359 మంది ప్రయాణికులతో రెండు ఎయిరిండియా విమానాలు ఈ తెల్లవారుజామున చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నాయి. అలాగే మలేషియా నుంచి 168 మంది ప్రయాణికులతో మరో విమానం ఇవాళ తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తుంది. నిన్నటివరకు రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసులు: 6,009, యాక్టివ్ కేసులు: 4,361, మరణాలు: 40, డిశ్చార్జ్ అయినవారు: 1,605 మందికాగా, 1589 కేసులు కోయంబేడు మార్కెట్‌తో ముడిపడినవే కావడం గమనార్హం.
  • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 36 కొత్త కేసులు నమోదవగా; బెంగళూరు 12, ఉత్తర కన్నడ జిల్లాలో 7, దావణగేరె 6, చిత్రదుర్గలో 3 వంతున; బీదర్, దక్షిణ కన్నడ, తుమ్‌కూరు, విజయపురలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 789కాగా, ఇప్పటివరకు 30మంది మరణించారు. మరో 379 మంది నయమై ఇళ్లకు వెళ్లారు.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో అక్రమ మద్యం, ఇసుక రవాణాను అరికట్టడానికి ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు మద్యం దుకాణాల సంఖ్యను 3500 నుంచి 2,934కు తగ్గించాలని ఆదేశాలు జారీఅయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,930కి చేరగా, 45 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా, 8,388 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో గడచిన 24గంటల్లో 43 కొత్త కేసులు నమోదవగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. యాక్టివ్‌ కేసులు: 999, కోలుకున్నవి: 887, మరణాలు: 44 కాగా, కేసుల సంఖ్యరీత్యా కర్నూలు (553), గుంటూరు (376), కృష్ణా (338), అనంతపురం (102) జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
  • తెలంగాణ: తెలంగాణలోని కోవిడ్-19 రోగులపై ఆరు నెలలపాటు రక్త జీవద్రవ్య (ప్లాస్మా థెరపీ) ప్రయోగాత్మక చికిత్సల నిర్వహణకు రాష్ట్రంలోని ఇఎస్ఐ, గాంధీ ఆస్పత్రులకు ఐసిఎంఆర్ అనుమతి ఇచ్చింది. కాగా, మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే రూ.1000 జరిమానా విధింపును రాష్ట్రం అమలుచేయడం ప్రారంభించింది. మరోవైపు గచ్చిబౌలీలోని ఒక నిర్మాణ స్థలంలో కొందరు వలస కార్మికుల బృందం తమను స్వస్థలాలకు పంపాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. కాగా, రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ కేసులు 1,132; యాక్టివ్‌ కేసులు: 376, మరణాలు: 29, డిశ్చార్జ్ అయినవారు: 727 మంది.
  • చండీగఢ్‌: వలస కార్మికులను స్వీకరించే రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌ పాలనాధికారి ఇవాళ డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు, ఆ మేరకు సొంత రాష్ట్రాలకు వెళ్లాలని కోరే కార్మికులు, ఇతర వ్యక్తులకు అవసరమైన వైద్య పరీక్షల తర్వాత పంపాలని సూచించారు. మరోవైపు విదేశాలనుంచి చండీగఢ్‌కు చెందినవారు, ప్రవాస భారతీయులు దాదాపు 5,000 మంది విమానంలో తిరిగి రానున్నారు.
  • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆహారం, ఇతర నిత్యావసరాల భద్రతపై పంజాబ్ ప్రభుత్వం సలహాపత్రం జారీచేసింది. ఈ మేరకు దుకాణాల యజమానులు, సరఫరా సిబ్బంది, వినియోగదారులు అన్నివేళలా వస్త్రతయారీ మాస్కులు ధరించాలని సూచించింది. కిరాణా కొనుగోలు లేదా ఆర్డర్ సేకరణకు స్వల్ప వ్యవధి పట్టినా మాస్కు తీయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే వినియోగదారులు/ఖాతాదారులు వస్తువుల కొనుగోలుకు వస్త్ర సంచులు తీసుకెళ్లాలని ప్రత్యేక ఆదేశాల్లో సూచించింది. అటుపైన దాన్ని ఇంటికిరాగానే సబ్బు, నీటితో శుభ్రంగా కడగాలని పేర్కొంది.
  • హర్యానా: వలస కార్మికులకు హర్యానా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తమతమ రాష్ట్రాలకు తిరిగి వెళ్లదలచేవారిని రానున్న 7 రోజుల్లో 5,000 బస్సులు, 100 రైళ్ల ద్వారా ప్రభుత్వం ఉచితంగా పంపనుంది. వారిని తిప్పి పంపేందుకు అయ్యే మొత్తం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాగా, ప్రస్తుత పరిస్థితుల నడుమ, దిగ్బంధం సమయంలో ప్రతి వలస కార్మికుడికీ ఆహారం, ఆశ్రయం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు సొంత రాష్ట్రాలకు సుదూరంగా ఉన్నామన్న భావన వారిలో కలగకుండా చూడాలని రాష్ట్ర, జిల్లాస్థాయి యంత్రాంగాలకు సూచించారు.

 

FACT CHECK

******


(Release ID: 1622580) Visitor Counter : 299