మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కోవిడ్19 కు వ్యతిరేకంగా పోరాటంలో సమాజంలోని ప్రజలందరితోపాటు మైనారిటీలు కూడా సమానంగా కృషి చేస్తున్నారు -- ముఖ్తార్ అబ్బాస్ నక్వీ.
"మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కు చెందిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం క్రింద శిక్షణ పొందిన 1500 మందికి పైగా ఆరోగ్య పరిరక్షణ సహాయకులు కరోనా రోగుల చికిత్స, శ్రేయస్సు కోసం సహాయపడుతున్నారు"
దేశవ్యాప్తంగా ఉన్న 16 హజ్ హౌస్ లను కరోనా సోకినవారి క్వారంటైన్, ఐసోలేషన్ సౌకర్యాలకోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది -- ముఖ్తార్ అబ్బాస్ నక్వీ.
కరోనా రోగుల చికిత్స కోసం ఏ.ఎం.యు. వైద్య కళాశాల వంద పడకలను ఏర్పాటు చేసింది. కరోనా టెస్టులకు కూడా నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 9000 పరీక్షలు నిర్వహించారు.
Posted On:
09 MAY 2020 2:07PM by PIB Hyderabad
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కు చెందిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం క్రింద శిక్షణ పొందిన 1500 మందికి పైగా ఆరోగ్య పరిరక్షణ సహాయకులు కరోనా రోగుల చికిత్స, శ్రేయస్సు కోసం సహాయపడుతున్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్బాస్ నక్వీ ఈ రోజు చెప్పారు.
ఈ ఆరోగ్య పరిరక్షణ సహాయకుల్లో 50 శాతం మంది బాలికలు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రులు, ఆరోగ్య పరిరక్షణ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు వీరు సహాయపడుతున్నారు. ఈ ఏడాది మరో 2000 మందికి పైగా ఆరోగ్య పరిరక్షణ సహాయకులకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలోని ప్రముఖ ఆసుపత్రులు, వివిధ ఆరోగ్య సంస్థల ద్వారా ఆరోగ్య పరిరక్షణ సహాయకులకు మంత్రిత్వ శాఖ ఒక ఏడాది శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధులకు దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డులు వివిధ మత, సామాజిక, విద్యా సంస్థల సహకారంతో 51 కోట్ల రూపాయల విరాళం అందజేశాయి. దీనితో పాటు, అవసరమైన వారికి ఆహారం పంపిణీ చేయడంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను వక్ఫ్ బోర్డులు పంపిణీ చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న 16 హజ్ హౌస్ లను కరోనా వ్యాధి సోకినవ్యక్తులకు అవసరమైన క్వారంటైన్ మరియు అసోలేషన్ సౌకర్యాలను కల్పించేందుకు ఇచ్చినట్లు శ్రీ నక్వీ చెప్పారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలోని హజ్ హౌస్ లను అక్కడి అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటున్నారు.
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం "పి.ఎం.-కెర్స్" నిధికి 1.40 కోట్ల రూపాయలు విరాళంగా అందజేసినట్లు శ్రీ నక్వీ తెలియజేశారు. ఏ.ఎమ్.యు. వైద్య కళాశాల కూడా కరోనా రోగుల చికిత్స కోసం 100 పడకలను ప్రత్యేకంగా కేటాయించింది. ఏ.ఎమ్.యు వైద్య కళాశాల కూడా కరోనా పరీక్షలకు ఏర్పాట్లు చేసి, ఇంతవరకు 9,000 వేలకు పైగా టెస్టులు చేసింది.
అజ్మీర్ షరీఫ్ దర్గా వద్ద ఖ్వాజా మోడల్ స్కూల్ మరియు కాయద్ విశ్రంస్థలి లో కరోనా సోకిన రోగుల కోసం క్వారంటైన్, ఐసోలేషన్ సదుపాయాలు ఏర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 4,500 మందికి పైగా జయరిన్ లకు లాక్ డౌన్ సమయంలో ఆహారం, వసతి, వైద్య సదుపాయాలూ కల్పించారు. ఈ సదుపాయాలను దర్గా కమిటీ, దర్గా ఖాదిమ్స్ మరియు సజ్జదా-నశిన్ లు ఏర్పాటు చేశారు. ప్రజలు వారి రాష్ట్రాలకు తిరిగి పంపించడానికి దర్గా కమిటీ మరియు ఇతర అనుబంధ సంస్థలు కోటి రూపాయల విలువైన సౌకర్యాలు కల్పించారు.
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన "సీఖో ఔర్ కమావ్" నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం కింద భారీ సంఖ్యలో ఫేస్ మాస్కులు తయారుచేయడం జరిగిందని శ్రీ నక్వీ తెలియజేసారు. అవసరమైనవారికి ఈ మాస్కులను పంపిణీ చేశారు. కరోనా నుండి రక్షణ కోసం సామాజిక దూరం వంటి ఇతర మార్గదర్శకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ "జాన్ భీ, జహాన్ భీ" అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి దేశంలోని ప్రజలందరూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ విజ్ఞప్తి మేరకు ఐక్యంగా, బలంగా పనిచేస్తున్నారని శ్రీ నక్వీ పేర్కొన్నారు. కోవిడ్19 కు వ్యతిరేకంగా పోరాటంలో సమాజంలోని ప్రజలందరితోపాటు మైనారిటీలు కూడా సమానంగా కృషి చేస్తున్నారు.
***
(Release ID: 1622509)
Visitor Counter : 247
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam