కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19ని అదుపు చేయడానికి విధించిన లాక్ డౌన్ సందర్భంగా పారిశ్రామిక రంగం, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సాధ్యమైనంత వరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ హామీ

కార్మిక సంఘాలతో సమావేశం అయిన అనంతరం యజమానుల సంఘంతో వెబినార్ నిర్వహించిన శ్రీ గంగ్వార్

Posted On: 08 MAY 2020 8:08PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితిపై కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ సామాజిక భాగస్వాములతో చర్చిస్తూ ఆర్థిక వ్యవస్థ, కార్మకులపై దాని ప్రభావం తగ్గించేందుకు వ్యూహాలు, విధానపరమైన చర్యలను చేపట్టింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు, యాజమాన్యాల సంఘాల ప్రతినిధులతో వెబినార్ లు ఇప్పటికే నిర్వహించింది. 6వ తేదీన సిటియు ప్రతినిధులతో ప్రత్యేకంగా మరో వెబినార్ నిర్వహించారు. ఆ ప్రక్రియను మరింతగా కొనసాగిస్తూ కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ న్యూఢిల్లీలోని తన కార్యాలయం నుంచి యాజమాన్య సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మరో వెబినార్ నిర్వహించారు. ఈ వెబినార్ లో  చర్చించిన అంశాల్లో  (i) కోవిడ్-19 నేపథ్యంలోకార్మికులు, వలసకార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు చర్యలు, (ii) ఉపాధికల్పన చర్యలు, (iii) ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించడానికి తీసుకోవలసిన చర్యలు, (iv) కార్మిక చట్టాల కింద ఎంఎస్ఎంఇలు విధులు నిర్వర్తించేందుకు వీలుగా పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకోవలసిన చర్యలు ఉన్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, యాజమాన్య సంఘాల ప్రతినిధులు ఈ వెబినార్ లో పాల్గొన్నారు.

కోవిడ్-19 తరహా సంక్షోభం నుంచి కార్మికులను కాపాడేందుకు, వారికి అన్ని రకాల సహాయం అందించేందుకు తీసుకున్న ఇఎస్ఐసి, ఇపిఎఫ్ నిబంధనల సడలింపు వంటి చర్యలను గురించి మంత్రి వివరించారు. పారిశ్రామిక రంగం అవసరాల పట్ల తమ మంత్రిత్వ శాఖ పూర్తి సానుభూతితో ఉన్నదని, పరిశ్రమల వ్యవస్థ, ఆర్థిక రంగాలు తిరిగి తెరిచేందుకు అన్ని రకాల సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పారిశ్రామిక రంగం ప్రత్యేకించి ఎంఎస్ఎంఇ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ సంబంధిత మంత్రిత్వ శాఖలన్నింటితోనూ సంప్రదింపులు జరుపుతున్నదని ఆయన చెప్పారు. ప్రస్తుత పరస్థితిలో తీసుకోవలసిన చర్యల గురించి సలహాలు అందించాలని ఆయన యాజమాన్యాల ప్రతినిధులను కోరారు. వారి సలహాల ఆధారంగా ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాల్లో భాగస్వాములందరి ప్రయోజనాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.

మంత్రి అభ్యర్థన మేరకు యాజమాన్య సంఘాలు ఈ దిగువ సలహాలు అందించాయి...

(i)  లాక్ డౌన్ కాలాన్ని లేఆఫ్ గా పరిగణించేందుకు వీలుగా పారిశ్రామిక వివాదాల చట్టం నిబంధనలు సడలించాలి.
(ii) పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నగదు లభ్యత సమస్యలను పరిగణనలోకి తీసుకుని కార్మికులకు చెల్లించిన వేతనాను సిఎస్ఆర్ నిధులుగా పరిగణించే అవకాశం క‌ల్పించాలి.
(iii) వస్తువులు, సేవల ఉత్పత్తి గరిష్ఠ స్థాయిలో ఉంచడానికి వీలుగా ఫ్యాక్టరీలు తెరిచిన అనంతరం కార్మిక శక్తి వినియోగంపై విధించిన 33 శాతం గరిష్ఠ పరిమితి 50 శాతానికి పెంచాలి.
(iv)  నెలకి రూ.15 వేల కన్నా తక్కువ వేతనాలు పొందుతున్న వారిలో 90 శాతం మందికి పిఎంజికెవై వర్తించేందుకు, అధిక శౄతం మందికి కవరేజి కల్పించేందుకు వీలుగా నిబంధనలు సవరించాలి.
(v)  ప్రస్తుత సంక్షోభం నుంచి పరిశ్రమ గట్టెక్కడానికి వీలుగా కనీస వేతనాలు, బోనస్, చట్టబద్ధమైన చెల్లింపులు మినహా ఇతర కార్మిక చట్టాలన్నింటినీ 2 నుంచి 3 నెలల పాటు రద్దు చేయాలి.
(vi)  పని గంటలు రోజుకి 12 గంటలకు పెంచాలి.
(vii)  వ్యాపారాలు నిలదొక్కుకునేందుకు, ఉపాధి నష్టం లేకుండా నివారించేందుకు వీలుగా పరిశ్రమలకు ఒక ప్యాకేజి ప్రకటించాలి.
(viii) పరిశ్రమలకు సబ్సిడీ రేట్లకు విద్యుత్ సరఫరా చేయాలి.
(ix)  వలస కార్మికుల స్థితిగతులు అత్యంత ఆందోళన  కలిగించే అంశం. కోవిడ్-19పై వారి భయాలు తొలగిపోయేందుకు వీలుగా కౌన్సెలింగ్ చేపట్టి వారందరూ స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఒక కార్యక్రమం చేపట్టాలి. వారి రవాణాకు, ఆరు నెలల పాటు వారి కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలి.
(x)  వలసకార్మికులపై డేటా బ్యాంక్ తయారుచేయాలి. అవ్యవస్థీకృత రంగం కార్మికులు, రోజువారీ వేతనాలు పొందే వారికి సహాయం చేసేందుకు జాతీయ విపత్తు నిధి ఒకటి ఏర్పాటు చేయాలి.
(xi)  ఉద్యోగులు, యజమానులపై సామాజిక భద్రతా వ్యయాలు తగ్గించాలి.
(xii) కార్మికులు, వస్తువులు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ప్రస్తుతం అనుసరిస్తున్న రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లకు బదులుగా కట్టడి జోన్ లు, కట్టడి లేని జోన్ల పేరిట రెండు జోన్లు మాత్రమే అమలుపరచాలి. కట్టడి లేని జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలను అనుమతించాలి.

సమావేశాన్ని ముగిస్తూ యాజమాన్యాలు సూచనలందించినందుకు  కార్మిక శాఖ కార్యదర్శి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక, ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు వీలుగా పారిశ్రామిక రంగాన్ని, ఆర్థిక రంగాన్ని తిరిగి పూర్తి స్థాయిలో తెరవాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. పారిశ్రామిక రంగానికి అవసరమైన చేయూత అందించేందుకు, కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉన్నదని ఆయన పునరుద్ఘాటించారు.


(Release ID: 1622380) Visitor Counter : 395