PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 08 MAY 2020 6:48PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • మొత్తం 56,342 కోవిడ్‌-19 కేసులకుగాను 16,540మందికి నయంకాగా- కోలుకున్నవారి శాతం 29.36.
  • నిన్నటినుంచి 3,390 కొత్త కేసులు నమోదయ్యాయి.
  • దేశంలోని 216 జిల్లాల్లో కోవిడ్‌ కేసులేవీ నమోదు కాలేదు. గడచిన 28 రోజుల వ్యవధిలో 42 జిల్లాల్లో; 21 రోజుల వ్యవధిలో 29 జిల్లాల్లో; 14 రోజుల వ్యవధిలో 36 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదవలేదు.
  • కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారిపై భారత్‌ స్పందనాత్మకతకు, ప్రజారోగ్యంపై సన్నద్ధత బలోపేతానికి మద్దతుగా 500 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయంపై ఏఐఐబీతో ఒప్పందంమీద భారత్‌ సంతకాలు.
  • దేశంలో దిగ్బంధం కొనసాగుతున్నప్పటికీ జోరుగా ఆహారధాన్యాల సేకరణ.
  • దేశవ్యాప్తంగాగల ప్రయోగశాలలకు కోవిడ్‌-19 పరీక్ష కిట్లను చేరవేసిన భారత తపాలా శాఖ.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం

దేశవ్యాప్తంగా 216 జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక్క కోవిడ్‌-19 కేసు కూడా నమోదు కాలేదు. ఇక గడచిన 28 రోజుల వ్యవధిలో 42 జిల్లాల్లో కొత్త కేసులేవీ రాలేదు. అదేవిధంగా 21 రోజుల వ్యవధిలో 29 జిల్లాల్లోనూ; 14 రోజుల వ్యవధిలో 36 జిల్లాల్లోనూ; 7 రోజుల వ్యవధిలో 46 జిల్లాల్లోనూ నిర్ధారిత కేసు ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. కాగా, నేటివరకూ మొత్తం 16,540 మందికి వ్యాధి నయంకాగా, వీరిలో గడచిన 24 గంటల వ్యవధిలో కోలుకున్నవారి సంఖ్య 1,273గా ఉంది. దీంతో మొత్తం కోలుకున్నవారి శాతం 29.36కు చేరింది. ఇక నిన్నటినుంచి 3,390 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 56,342కు చేరింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలలో కోవిడ్‌-19 నిరోధం, నియంత్రణ చర్యలద్వారా చేసిన కృషి, తదుపరి సన్నద్ధతలపై ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. మరోవైపు కోవిడ్‌-19 వ్యాధి ఒక మోస్త‌రుగా ఉన్న‌పుడు దానితో ముడిప‌డిన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను పరిమితం చేయడానికి వీలుగా కోలుకున్న‌వారి ర‌క్త‌జీవ ద్ర‌వ్యంతో (ప్లాస్మా) చికిత్స‌కుగ‌ల సామ‌ర్థ్యం, భ‌ద్ర‌త‌ల అంచ‌నా కోసం ‘ప్లాసిడ్‌’ ప్ర‌యోగం పేరిట బ‌హుళ‌కేంద్ర‌ వైద్య ప్ర‌యోగాలను ఐసీఎంఆర్ చేప‌ట్టింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622245

దేశంలో కోవిడ్‌-19పై పోరుకు మద్దతుగా 500 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయంపై భారత ప్రభుత్వం-ఏఐఐబీ మధ్య ఒప్పందంపై సంతకాలు

కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారిపై భారత్‌ స్పందనాత్మకత, ప్రజారోగ్యం బలోపేతంపై సన్నద్ధతకు మద్దతుగా ‘ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు’ (ఏఐఐబీ) 500 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు “కోవిడ్‌-19 అత్యవసర ప్రతిస్పందన-ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధత పథకం” కింద భారత ప్రభుత్వం-ఏఐఐబీ మధ్య ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. భారతదేశానికి ఆరోగ్య రంగంలో ఈ బ్యాంకు నుంచి ఇలాంటి సహాయం అందడం ఇదే తొలిసారి. దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోగల కోవిడ్‌ పీడితులు, ముప్పున్నవారు, వైద్య-అత్యవసర సిబ్బందితోపాటు సేవాప్రదాతలు, చికిత్స-పరీక్ష సదుపాయాలు, జాతీయ-పశు ఆరోగ్య సంస్థలు తదితర అవసరాలకు ఈ పథకం కింద మద్దతు లభిస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622280

దిగ్బంధం నడుమ జోరందుకున్న ఆహారధాన్యాల సేకరణ

కేంద్ర నిల్వల కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న 400 లక్షల టన్నుల గోధుమ సేకరణ లక్ష్యంలో ఇప్పటికే 50శాతానికిపైగా పూర్తయింది. అలాగే 45 లక్షల టన్నుల ధాన్యం సేకరణ పూర్తికాగా, ఇందులో 30 లక్షల టన్నులు ఒక్క తెలంగాణనుంచే కొనుగోలు చేయడం గమనార్హం. కాగా, పీఎంజీకేవై కింద 3 నెలలకు కేటాయించిన ఆహారధాన్యాల్లో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే 70 లక్షల టన్నుల (58శాతం) మేర స్వీకరించాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621948

పీఎం-జీకేఏవై కింద దేశవ్యాప్తంగా సుమారు 80కోట్లమందికి ఆహారధాన్యాలు, పప్పుదినుసుల ఉచిత పంపిణీకి కసరత్తు: కేంద్ర ఆహార-ప్రజాపంపిణీ శాఖ మంత్రి

భారత ఆహార సంస్థ ఇప్పటిదాకా 2,641 గూడ్సురైళ్లద్వారా 74 లక్షల టన్నుల ఆహారధాన్యాలను పంపిందని శ్రీ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. దేశంలోని సుమారు 19.50 కోట్ల కుటుంబాలకు మూడు నెలలపాటు ఆహార ధాన్యాల ఉచిత పంపిణీకి నాఫెడ్‌ భారీ కార్యక్రమం చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ‘ఒకే దేశం ఒకే కార్డు’ పథకం కింద జాతీయ కూటమిలో చేరాల్సిందిగా మరో 5 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించినట్లు చెప్పారు. ఈ కూటమిలో ఇప్పటికే 12 రాష్ట్రాలున్నాయని, కొత్తగా చేరేవాటితో కలిపి 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు జాతీయ/అంతర్రాష్ట్ర మార్పిడి సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు. తద్వారా ఆయా రాష్ట్రాల్లో జాతీయ ఆహారభద్రత చట్టం పరిధిలోగల 60 కోట్లమంది లబ్ధిదారులు తమ ప్రస్తుత రేషన్ కార్డుతోనే ఏ చౌకధరల దుకాణంలోనైనా తమ ఆహార ధాన్యాల కోటాను పొందే వీలుంటుందని వివరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622333

కష్టకాలంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు ప్రశంసనీయం: డాక్టర్‌ హర్షవర్ధన్‌

‘ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం’ సందర్భంగా న్యూఢిల్లీలో ఇవాళ నిర్వహించిన భారత రెడ్‌క్రాస్‌ సొసైటీ శతాబ్ది వేడుకలలో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సేవాసంస్థ(ఎన్జీవో)లు, సాధారణ పౌరులు పెద్దసంఖ్యలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జన్మదినం/వివాహ వార్షికోత్సవం వంటి సందర్భాలకు మరింత ప్రత్యేకతను ఆపాదించేలా ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారి రక్తదానం చేయాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల రక్తం అవసరమైనవారిని ఆదుకున్న ప్రాణదాతలుగా మిగిలిపోతారని, దీనివల్ల ఎంతో ఆత్మసంతృప్తి లభిస్తుందని చెప్పారు. కాగా, కరోనా యోధులైన డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తదితరులను, వ్యాధిబారిన పడిన, కోలుకున్నవారిని అంటరానివారిలా చూడతగదన్న అవగాహన ప్రజల్లో కల్పించాలని భారత రెడ్‌క్రాస్‌ సొసైటీని ఆయన కోరారు. ఆ మేరకు ముందువరుసన నిలిచి యుద్ధం చేస్తున్న వీరులను మరింత ప్రోత్సహించే వాతావరణ కల్పించాలని సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622262

భారత నావికాదళం రూపొందించిన వ్యక్తిగత రక్షణ సామగ్రికి ఇన్‌మాస్‌ ఆమోదం

భారత నావికాదళం రూపకల్పన-తయారీ వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ)కి రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) పరిధిలోని న్యూఢిల్లీలోగల ‘ఇన్‌మాస్‌’ (అణువైద్య-అనుబంధ శాస్త్రాల సంస్థ)నుంచి ధ్రువీకరణ లభించింది. ఈ మేరకు దేశంలో ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల రీత్యా ఈ పీపీఈ కిట్లను భారీస్థాయిలో తయారుచేసేందుకు ఆమోదముద్ర వేసింది. కాగా, దేశీయంగా తయారయ్యే పీపీఈలను పరీక్షించి, నాణ్యతను నిర్ధారించే బాధ్యతను ఇన్‌మాస్‌ నిర్వర్తిస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621951

ఐసీఎంఆర్‌ ప్రాంతీయ డిపోలనుంచి కోవిడ్‌-19 పరీక్షకిట్లను దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరవేసిన భారత తపాలాశాఖ

దేశవ్యాప్తంగాగల కోవిడ్‌-19 ప్రత్యేక ప్రయోగశాలలకు పరీక్ష కిట్లను చేరవేసేందుకు భారత తపాలాశాఖ భారత వైద్య పరిశోధన మండలి-ఐసీఎంఆర్‌తో జట్టుకట్టింది. ఈ మేరకు మండలికి చెందిన 16 ప్రాంతీయ డిపోలనుంచి మారుమూల ప్రాంతాల్లోని మరో 200 ప్రయోగశాలలకు పరీక్ష కిట్లను అందజేసింది. కాగా, రోజుకు లక్ష కిట్ల వంతున సరఫరా చేసేవిధంగా తపాలా శాఖకు ఐసీఎంఆర్‌ లక్ష్యం నిర్ణయించింది. ఈ కీలక కర్తవ్య నిర్వహణలో భాగంగా తపాలాశాఖ తన 1,56,000 కార్యాలయాలద్వారా మారుమూల ప్రాంతాలకు సేవలందిస్తూ కోవిడ్‌-19పై తన పోరాట పటిమను మరోసారి రుజువు చేసుకుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622264

ఐరోపా మండలి అధ్యక్షుడు గౌ॥ చార్లెస్‌ మైకేల్‌తో ప్రధానమంత్రి ఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఐరోపా మండలి అధ్యక్షుడు గౌరవనీయ చార్లెస్‌ మైకేల్‌తో ఫోన్‌లో సంభాషించారు. భారత్‌, ఐరోపా సమాఖ్య దేశాల్లో కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి పరిస్థితి, స్పందనాత్మక చర్యలపై నాయకులిద్దరూ చర్చించుకున్నారు. రెండు దేశాల మధ్య అత్యవసర సామగ్రి, ఔషధ ఉత్పత్తుల సరఫరాలుసహా ప్రపంచ మహమ్మారిపై పోరాటంలో సహకారంపై వారిద్దరూ పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్‌-19 ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనడంపై ప్రాంతీయ, అంతర్జాతీయ సమన్వయానికిగల ప్రాముఖంపై వారిద్దరూ అంగీకారానికి వచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621950

కోవిడ్‌-19 ఉపశమన చర్యలపై ఫోన్‌లో భారత, జపాన్‌ రక్షణశాఖ మంత్రుల చర్చ

కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారిపై రెండు దేశాల్లో చేపట్టిన చర్యల గురించి రక్షణశాఖ మంత్రులు చర్చించుకున్నారు. కాగా, కోవిడ్‌-19పై పోరులో అంతర్జాతీయ కృషికి భారత్‌ తోడ్పాటు గురించి గౌరవనీయ కోనో టారోకు శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు. అదే సమయంలో ప్రపంచ మహమ్మారిపై అంతర్జాతీయ యుద్ధంలో పరస్పర సహకారం గురించి వారు చర్చించారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 సంబంధిత భవిష్యత సవాళ్ల పరిష్కారం దిశగా ఉభయపక్షాలూ ఇతర దేశాలతో కలసి పనిచేయడంలో భారత-జపాన్‌ ప్రత్యేక, వ్యూహాత్మక-అంతర్జాతీయ భాగస్వామ్యం ప్రాతిపదికగా ఉంటుందని వారిద్దరూ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622249

సందర్భనిర్వహణ-వినోద పరిశ్రమతోపాటు చిన్న‌త‌ర‌హా ఆర్థిక సహాయసంస్థలు సానుకూల దృక్పథంతో ప్రస్తుత పరిస్థితినుంచి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి: కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ

కేంద్ర ఎంఎస్‌ఎంఈ, రోడ్డు ర‌వాణా-జాతీయ ర‌హ‌దారులశాఖ మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ‘సందర్భం నిర్వహణ-వినోద పరిశ్రమ సంఘం, ఆర్థిక సహాయ పరిశ్రమ అభివృద్ధి మండలి’ ప్రతినిధులతో సమావేశమై వారి రంగాలపై కోవిడ్-19 ప్ర‌భావం గురించి చర్చించారు. ప్రస్తుత సంక్షోభంలోనూ ఈ రంగాలు అద్భుతంగా ప‌నిచేస్తున్నాయని, వారి దార్శనికతకు విస్తృత గుర్తింపు లభిస్తున్నదని శ్రీ గ‌డ్క‌రీ ఈ సంద‌ర్భంగా కొనియాడారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622267

‘దేఖో అప్నా దేశ్‌'  పరంపరలో భాగంగా "గోవా-క్రూసిబుల్ ఆఫ్ కల్చర్" పేరిట 16వ వెబినార్ నిర్వహించిన పర్యాటక మంత్రిత్వశాఖ

"దేఖో అప్నా దేశ్" పరంపరలో భాగంగా 2020 మే 7న, "గోవా-క్రూసిబుల్ ఆఫ్ కల్చర్" పేరిట కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ 16వ వెబినార్‌ను నిర్వహించింది. భారత్‌లో అత్యంత ఆకర్షణీయ పర్యాటక గమ్యం ‘గోవా’లో ఇప్పటిదాకా ‘అంతగా తెలియని’, ‘అసలు తెలియని’ ప్రయాణానుభవాల గురించి ఇందులో వివరించింది. గోవాలో ఇంకా అన్వేషించదగిన అందమైన, అజ్ఞాత ప్రదేశాలగురించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి ముఖాముఖి తెలిపింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622180

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో వలసదారులు/ప్రయాణికుల రవాణా సందర్భంగా రాష్ట్ర రోడ్డురవాణా సంస్థలు (పంజాబ్ రోడ్‌వేస్/పీఆర్టీసీ/పన్‌బస్)సహా ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు పారిశుధ్యం, పరిశుభ్రత నిర్వహణ దిశగా పాటించాల్సిన పద్ధతులపై రాష్ట్ర ప్రభుత్వం ఒక సలహాపత్రం జారీచేసింది. రాష్ట్రంలో గోధుమ పంట దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా వచ్చిన నేపథ్యంలో కోవిడ్‌-19 పరిస్థితులు, దిగ్బంధం వంటి అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమ  సేకరణలో 100 లక్షల టన్నుల స్థాయిని విజయవంతంగా అధిగమించింది.
  • హర్యానా: రాష్ట్రంలో కోవిడ్‌-19 సంబంధిత ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించడంపై కేంద్ర ప్రభుత్వం హర్యానా సర్కారును ఎంతగానో అభినందించింది. కాగా, 2020 మార్చి 30 నుండి 2020 మే 6దాకా అందిన 2,827 ఫిర్యాదులలో ఇప్పటిదాకా  2,436 పరిష్కారమయ్యాయి. రాష్ట్రంలో ఉపాధి కల్పనతోపాటు ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజమివ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ దిశగా ఇప్పటికే https://saralharyana.gov.in/ పోర్టల్‌ద్వారా స్వయంచాలక అనుమతులు మంజూరు చేస్తోంది. దీంతో ఇప్పటివరకూ 19,626 యూనిట్ల పునఃప్రారంభానికి ఆమోదముద్ర వేయంగా, 11,21,287 మంది కార్మికులు పనిచేయడానికి అనుమతి పొందారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి సంబంధిత పరిస్థితులపై సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించారు. దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి వచ్చే రాష్ట్రవాసులు నిర్బంధ వైద్యపరిశీలన నిబంధనలను కచ్చితంగా పాటించే విధంగా చూడాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చే వ్యక్తులందరికీ తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాకే వారి వ్యవస్థాగత/గృహ నిర్బంధ పరిశీలనపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
  • కేరళ: బహ్రెయిన్ నుంచి 177 మంది, సౌదీ అరేబియా నుంచి 162మంది భారతీయులతో వస్తున్న రెండు విమానాలు ఇవాళ కొచ్చి, కోళికోడ్‌లలో దిగుతాయి. కాగా, 1,150మంది వలస కార్మికులతో ఒక శ్రామిక్‌ ప్రత్యేక రైలు ఈ సాయంత్రం త్రిస్సూర్ నుంచి ఉత్తరప్రదేశ్ బయల్దేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 25 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉండటం విశేషం.
  • తమిళనాడు: రాష్ట్రంలోని అనేక పలు ప్రాంతాల్లో ఇవాళ సామాజిక దూరం నిబంధనకు విరుద్ధంగా వేలాదిగా జనం మద్యం షాపులవద్ద బారులుతీరారు. మరోవైపు టాస్మాక్ దుకాణాలు తెరవడాన్ని వ్యతిరేకిస్తూ అనేకచోట్ల నిరసన ప్రదర్శనాలు సాగాయి. బస్సులలో 50 శాతం సీట్లలో మాత్రమే సాధారణ ప్రయాణానికి, కోవిడ్‌ యోధుల కోసం ప్రత్యేక వాహనాలను అనుమతించడంద్వారా దిగ్బంధం అనంతరం ప్రజారవాణాను పునఃప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  కాగా, రాష్ట్రంలో నిన్నటిదాకా మొత్తం కేసులు: 5,409, యాక్టివ్ కేసులు: 3,822, మరణాలు: 37, డిశ్చార్జ్ అయినవారు: 1,547గా ఉన్నారు. కాగా, ప్రస్తుత కేసులలో అధికశాతం కోయంబేడు మార్కెట్‌తో ముడిపడినవి కావడం గమనార్హం.
  • కర్ణాటక: రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎన్నడూలేని రీతిలో ఇవాళ ఒక్కరోజే 45 కొత్తకేసులు నమోదయ్యాయి. వీటిలో బెంగళూరు 7, బళ్లారి 1, బెళగావి 11, దావణగేరె 14, ఉత్తర కన్నడ జిల్లా 12 వంతున నమోదైనవి ఉన్నాయి. ఈరోజు 14మంది కోలుకోగా, ఒకరు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 750కిగాను ఇప్పటిదాకా 30 మంది మరణించగా 371మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు రాష్ట్రంలో రేపటినుంచి అన్ని మద్యం షాపులు, పబ్బులు, బార్ల తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
  • ఆంధ్రప్రదేశ్: చిత్తూరు జిల్లా నుంచి చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లివచ్చిన రైతులుసహా వస్తు సామగ్రి వాహనాలను నడిపిన డ్రైవర్లు, క్లీనర్ల జాడకోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. రాష్ట్రంలో 7,320 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో 24గంటల్లో 54 కొత్తకేసులు నమోదయ్యాయి. మరో 62 మంది డిశ్చార్జ్ కాగా, ముగ్గురు మరణించారు. ప్రస్తుతం మొత్తం కేసులు 1,887కిగాను యాక్టివ్‌ 1,004, కోలుకున్నవి: 842, మరణాలు: 41గా ఉన్నాయి. కేసుల సంఖ్యరీత్యా కర్నూలు 547, గుంటూరు 374, కృష్ణా 322 అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.
  • తెలంగాణ: జాతీయ దిగ్బంధం నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో బీహార్ నుంచి 225 మందితో కూడిన శ్రామిక్‌ ప్రత్యేక రైలు ఇవాళ తెలంగాణకు చేరుకుంది. కాగా, హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్లు-జీవ చికిత్స ఔషధాలు తయారుచేసే భారత్‌ బయటెక్‌ సంస్థ కోవిడ్-19 చికిత్స కోసం మానవ ప్రతిరోధకాలను అభివృద్ధి చేయనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 1,122కుగాను యాక్టివ్: 400, కోలుకున్నవి: 693, మరణాలు: 29గా ఉన్నాయి.
  • అసోం: రాష్ట్రంలో మరో ముగ్గురికి కోవిడ్‌-19 నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 56కు చేరింది. ఇందులో యాక్టివ్‌ కేసులు 21, డిశ్చార్జ్ అయినవారు 34మంది కాగా, ఒకరు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు. రాజధాని గువహటిలో కొత్త కేసుల దృష్ట్యా అమియోనగర్, చాంద్‌మరి, డాక్టర్ బి.బారువా కేన్సర్‌ ఆస్పత్రి సమీప ప్రాంతం, గువహటి వైద్య కళాశాల-ఆస్పత్రి పరిసరాలను నియంత్రణ ప్రదేశాలగా ప్రభుత్వం ప్రకటించింది.
  • మణిపూర్: రాష్ట్రంలో ఖరీఫ్-2020 సీజన్‌కు నిరుటి పరిమాణంతో సమానంగా యూరియా, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయ డైరెక్టరేట్ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అంగన్‌వాడీల కార్యకలాపాలతోపాటు లబ్ధిదారులకు రేషన్‌ పంపిణీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాల్లోని అంగన్‌వాడీ కార్మికులు, సూపర్‌వైజర్లకు ఐసీడీఎస్-కాస్ అప్లికేషన్‌గల స్మార్ట్‌ ఫోన్లను అందజేసింది.
  • మిజోరం: రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వకుండా మిజోరం తిరిగి వచ్చిన 150 మందికిపైగా వ్యక్తులను ప్రభుత్వం నిర్బంధ వైద్యపరిశీలన కేంద్రాలకు తరలించింది.
  • నాగాలాండ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 పరిస్థితిపై రోజువారీ కేసుల నివేదికల ఆధారంగా దిగ్బంధాన్ని దశలవారీగా సడలిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలోని పెన్షనర్లకు వారి బ్యాంకు ఖాతాలలో పెన్షన్‌ సొమ్ము నేరుగా జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్టేట్‌ బ్యాంకు శాఖలలో ఖాతాలు తెరవాల్సిందిగా పెన్షనర్లకు సూచించింది.
  • మహారాష్ట్ర: మహారాష్ట్రలో నిన్న 1,216 కొత్త కోవిడ్-19 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 17,974కు చేరింది. ఇందులో 11,394 కేసులు ముంబైలో నమోదైనవే. ఇక రాష్ట్రంలో నిన్న ఒకేరోజు అత్యధికంగా 43 మరణాలు నమోదవగా, మృతుల సంఖ్య 694కు పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో పరీక్షించినవారి సంఖ్య 2 లక్షలు దాటింది. కాగా, ఔరంగాబాద్‌వద్ద రైలు ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఒక్కొక్కరికి చెరో రూ.5 లక్షలవంతున నష్టపరిహారం ప్రకటించాయి. ఔరంగాబాద్‌ సమీపాన కర్మద్‌వద్ద రైలు పట్టాలపై నిద్రిస్తున్న 16మంది వలస కార్మికులు ఈ తెల్లవారుజామున గూడ్స్రైలు ఢీకొనడంతో మరణించారు.
  • గుజరాత్: రాష్ట్రంలో ఇవాళ 388 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 7,013కు చేరింది. బుధవారం రాత్రినుంచి నమోదైన 388 కేసులలో 275 ఒక్క అహ్మదాబాద్ జిల్లాకు చెందినవి కావడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో మొత్తం 425 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ బాధితులకు ఆస్పత్రుల్లో చేరేందుకు, వ్యాధి లక్షణాలు లేనివారిని నిర్బంధ వైద్య పరిశీలనలో ఉంచడానికి వీలుగా అహ్మదాబాద్ పురపాలక సంస్థ 800 పడకలుగల 8 ప్రైవేట్ ఆసుపత్రులను, 3,000 పడకలున్న 60 హోటళ్లను తన అధీనంలోకి తీసుకుంది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 26 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 3,453కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటిదాకా 1,596 మంది కోలుకున్నప్పటికీ, 97 మంది మరణించారు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 3,252కు పెరిగింది. ఇప్పటిదాకా 1,231 మంది కోలుకోగా, 193మంది మరణించారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు ఇండోర్, భోపాల్, ఉజ్జయిని నగరాల్లోనే నమోదయ్యాయి.

 

FACT CHECK

 

********



(Release ID: 1622321) Visitor Counter : 191