వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

లాక్‌డౌన్‌ సమయంలోనూ వేగంగా ఆహార ధాన్యాల సేకరణ

లక్ష్యంగా నిర్ణయించిన 400 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమల్లో సగానికి పైగా సేకరణ
45 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం సేకరణ, 30 లక్షల మెట్రిక్‌ టన్నులతో తెలంగాణ అగ్రస్థానం
పీఎంజీకేఏవై కింద రాష్ట్రాలు, యూటీలకు 70 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా
మూడు నెలల కాలానికి కేటాయించిన మొత్తంలో ఇది 58 శాతం

Posted On: 07 MAY 2020 6:52PM by PIB Hyderabad

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా రవాణా వ్యవస్థలో అడ్డంకులు ఉన్నా, ప్రస్తుత రబీ సీజన్‌లో గోధమ, వరిధాన్యం (రెండో పంట) సేకరణ వేగంగా సాగుతోంది. జాతీయ పూల్‌ కోసం గోధుమల సేకరణలో లక్ష్యంగా నిర్ణయించిన 400 లక్షల మెట్రిక్‌ టన్నుల్లో, 06.05.2020 నాటికి 216 లక్షల మెట్రిక్‌ టన్నులను సేకరించారు. గోధుమను ప్రధానంగా సేకరించే పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఏప్రిల్ 15 తర్వాతే పని ప్రారంభించినా, సేకరణ వేగంగా సాగుతోంది. వరిధాన్యం సేకరణ కూడా సాఫీగా సాగుతోంది. ఇప్పటివరకు 44.9 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని ప్రభుత్వ సంస్థలు సేకరించాయి.

గోధుమల సేకరణలో అగ్రస్థానంలో పంజాబ్‌
    గోధుమల సేకరణలో 104.28 లక్షల మెట్రిక్‌ టన్నులతో పంజాబ్ ముందుడగా, హర్యానా 50.56 లక్షల మెట్రిక్‌ టన్నులతో, మధ్యప్రదేశ్ 48.64 లక్షల మెట్రిక్‌ టన్నులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అకాల వర్షాల కారణంగా ఈ రాష్ట్రాల్లోని గోధుమ నిల్వలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో,  సేకరణ నిబంధనలు సడలించడం ద్వారా రైతులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనివల్ల గోధుమ సేకరణకు ఇబ్బందులు లేకుండా పోయాయి. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ కూడా జాతీయ పూల్‌ కోసం గోధుమల సేకరణలో పాల్గొని, పనులను వేగవంతం చేశాయి.

వరిధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ
    వరిధాన్యం విషయానికి వస్తే, తెలంగాణలో గరిష్టస్థాయిలో సేకరణ జరిగింది. ఈ రాష్ట్రంలో భారీ నీటిపారుదల పథకాలను అమల్లోకి తెచ్చిన కారణంగా ధాన్యం ఉత్పత్తిలో భారీగా పెరుగుదల నమోదైంది. కేంద్రం సేకరించిన 45 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యంలో, తెలంగాణ వాటా 30 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, మిగిలిన 10 లక్షల మెట్రిక్‌ టన్నులను ఆంధ్రప్రదేశ్‌ నుంచి సేకరించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, కేంద్రం, సంబంధిత రాష్ట్రాల సంయుక్త పనితీరు కారణంగా ధాన్యం సేకరణ వేగంగా సాగింది.

మూడు నెలలకు కేటాయించిన మొత్తంలో 58 శాతం పంపిణీ
    ఈ లాక్‌డౌన్‌ సమయంలో దేశంలోని పేదవారికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఉచితంగా సరఫరా చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేఏవై) కింద మూడు నెలలపాటు ఇవ్వనున్న రేషన్‌ సరఫరా, ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. దీనివల్ల 80 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతోంది. ఈ పథకం కింద కేంద్రం కేటాయించిన ఆహార ధాన్యాల్లో అన్ని రాష్ట్రాల్లో 70 లక్షల మెట్రిక్‌ టన్నులను ఇప్పటికే పంపిణీ చేశారు. ఇది మూడు నెలల కాలానికి కేటాయించిన మొత్తంలో ఇది 58 శాతం. ఏప్రిల్‌ కోటాను ప్రతి రాష్ట్రం ఇప్పటికే పూర్తి చేయగా, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 3 నెలల కోటాను పూర్తి చేశాయి. ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో పేదలకు ఆహార ధాన్యాలు అందించడం ద్వారా, ఆహార లభ్యతపై ప్రజలకు ఆందోళన లేకుండా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది.



(Release ID: 1621948) Visitor Counter : 281