PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
11 SEP 2020 6:34PM by PIB Hyderabad
- దేశంలో కోలుకున్నవారి సంఖ్య 35,42,663కు చేరిక; కోలుకునే సగటు 77.65 శాతం.
- నిత్యం కోలుకునేవారిలో 60 శాతం ఐదు రాష్ట్రాలకు చెందినవారే..
- దేశంలో ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య ఇవాళ 9,43,480గా నమోదు.
- వైద్యపరమైన ఆక్సిజన్ అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు వద్దని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
- కోవిడ్-19 విషయంలో అలసత్వం వద్దని, ముందుజాగ్రత్త చర్యలు కొనసాగించాలని ప్రజలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సలహా.
- పెన్షనర్ల జీవన ప్రమాణ పత్రం సమర్పణ గడువు పొడిగించిన ప్రభుత్వం.
- బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి ఊరటపై అంచనాలో సాయపడేందుకు నిపుణుల కమిటీ.
దేశవ్యాప్తంగా నిత్యం కోలుకునేవారిలో 60 శాతం 5 రాష్ట్రాలకు చెందినవారే; ఇప్పటిదాకా వ్యాధి నయమైన వారి సంఖ్య సుమారు 35.5 లక్షలు
దేశంలో కోవిడ్ బారినుంచి కోలుకునేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ మేరకు గత 24 గంటల్లో 70,880 మందికి వ్యాధి నయం కాగా, వీరిలో మహారాష్ట్రకు చెందినవారు 14,000 మందికిపైగా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇవాళ ఒకేరోజు 10,000 మందికిపైగా కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 35,42,663కు దూసుకెళ్లింది. ఈ లెక్కల ప్రకారం నేటిదాకా నమోదైన మొత్తం కేసులలో కోలుకున్నవారు 77.65 శాతంమేర ఉన్నారు. ఇలా నిత్యం కోలుకునేవారిలో 60 శాతం 5 ఐదు రాష్ట్రాలు... మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లకు చెందినవారే కావడం గమనార్హం. ఇక గత 24 గంటల్లో దేశమంతటా 96,551 కొత్త కేసులు నమోదవగా మహారాష్ట్రలో అత్యధికంగా 23,000 కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ 10,000కుపైగా కేసులు నమోదు కాగా, తాజా కేసులలో దాదాపు 57 శాతం కూడా ఈ రాష్ట్రాల్లోనివే. కొన్ని రాష్ట్రాల్లో ఇది 60 శాతంగానూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,43,480గా ఉంది. ఈ జాబితాలోనూ మహారాష్ట్ర 2,60,000 కేసులతో అగ్రస్థానంలో ఉండగా 1,00,000కుపైగా కేసులతో కర్ణాటక తర్వాతి స్థానంలో ఉంది. మొత్తంమీద చికిత్స పొందే కేసులలో దాదాపు 74 శాతం 9 తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ తొమ్మిదింటిలోనూ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటా 48 శాతానికి పైగా నమోదైంది. దేశంలో గడచిన 24 గంటల్లో 1,209 మరణాలు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 495, కర్ణాటకలో 129, ఉత్తరప్రదేశ్‌లో 94 వంతున ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653257
రాష్ట్రాల మధ్య ఆక్సిజన్ రవాణాపై ఆంక్షలు వద్దు; ప్రతి కోవిడ్ బాధితుడికీ ఆక్సిజన్ అందేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలదే: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
దేశంలోని కొన్ని రాష్ట్రాలు వైద్యపరమైన ప్రాణవాయువు అంతర్రాష్ట్ర రవాణా స్వేచ్ఛగా సాగకుండా రకరకాల చట్టాలకింద ఆంక్షలు విధిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దృష్టికి వచ్చింది. అంతేగాక తయారీ/సరఫరాదారులను కూడా సొంత రాష్ట్రాల్లోని ఆస్పత్రులకే ఆక్సిజన్ సరఫరాను పరిమితం చేయాలని ఆదేశిస్తున్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఆయా రాష్ట్రాల్లోని ఆస్పత్రులలో రోగులందరికీ తగుమోతాదులో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత వాటిదేనని స్పష్టం చేశారు. ఆ మేరకు ఆక్సిజన్ అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు విధించవద్దని, ఈ ప్రాణవాయువు అత్యవసర ప్రజారోగ్య వస్తువుగా పరిగణించబడుతున్నదని లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్రాణవాయువు తయారీ సంస్థలకు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోగల ఆస్పత్రులతో సరఫరా ఒప్పందాలు ఉంటాయని, వాటిని నెరవేర్చటం చట్టపరంగానూ అనివార్యమని గుర్తుచేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పటిష్ఠ వ్యూహాలవల్ల కోలుకునేవారి శాతం చురుగ్గా పెరుగుతోంది. పర్యవసానంగా నమోదిత కేసులలో మరణాల సగటు (ప్రస్తుతం 1.67 శాతం) కూడా క్రమంగా పతనమవుతోంది. అంతేకాకుండా ప్రస్తుత రోగులలోనూ 3.7 శాతంకన్నా తక్కువమందే ఆక్సిజన్ మద్దతుతో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653289
కరోనా వైరస్ (SARS-CoV-2)పై పోరాడే ప్రతిరోధకాల అన్వేషణ దిశగా లక్నోలోని CSIR-CDRI సెరోలాజికల్ పరీక్షలు
ప్రజలకు రోగ నిర్ధారణ పరీక్షల నిర్వహణద్వారా కరోనా వైరస్ (SARS-CoV-2)పై పోరాడే ప్రతిరోధకాల అన్వేషణ దిశగా సీఎస్‌ఐఆర్-సీడీఆర్‌ఐ (సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) ఒక పరిశోధన అధ్యయనం నిర్వహిస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ 9 నుంచి 11వ తేదీదాకా సెరోలాజికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష పూర్తి స్వచ్ఛందం కావడంతోపాటు ఉచితంగా నిర్వహిస్తారు. అలాగే CSIR సిబ్బంది, విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653497
జాతీయ విద్యావిధానం-2020కింద '21వ శతాబ్దంలో పాఠశాల విద్య'పై సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
జాతీయ విద్యావిధానం-2020 కింద “21 వ శతాబ్దంలో పాఠశాల విద్య" అంశంపై సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా- జాతీయ విద్యావిధానం 21వ శతాబ్దపు భారతదేశానికి సరికొత్త దిశను చూపనుందని ఆయన అన్నారు. ఆ మేరకు మన దేశ భవిష్యత్తు నిర్మణానికి పునాది వేస్తున్న క్షణంలో మనమూ భాగమవుతున్నామని పేర్కొన్నారు. గడచిన మూడు దశాబ్దాలుగా మన జీవితంలో ఏ అంశమూ ఒకేవిధంగా లేదని ఆయన గుర్తుచేశారు. కానీ, మన విద్యావిధానం మాత్రం పాత వ్యవస్థలోనే నడుస్తున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త జాతీయ విద్యా విధానమంటే నవ భారతం కోసం కొత్త ఆకాంక్షలను, సరికొత్త అవకాశాలను ఆవిష్కరించే మార్గమని ఆయన అన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653378
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోవిడ్ పరీక్ష చేయించుకున్న రాజ్యసభ చైర్మన్ శ్రీ వెంకయ్యనాయుడు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 2020 సెప్టెంబర్ 14న ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్యసభకు అధ్యక్షత వహించడానికి సిద్ధమవుతున్న చైర్మన్ శ్రీ ఎం.వెంకయ్యనాయుడు ఇవాళ కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. ఈ మేరకు సమావేశాలకు హాజరుకానున్న ప్రతి సభ్యుడూ తప్పనిసరిగా ఈ పరీక్ష (RT-PCR) చేయించుకోవాలని ఇప్పటికే ఆయన రాజ్యసభ సభ్యులందరికీ సూచించారు. ఈ మేరకు 72 గంటలు ముందుగా ప్రభుత్వ ఆమోదంగల ఏదైనా ఆస్పత్రి/ప్రయోగశాల లేదా పార్లమెంటు ప్రాంగణంలోని ప్రయోగశాలలో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కాగా, సభ్యుల సౌలభ్యం కోసం నేటినుంచి పార్లమెంటు అనుబంధ భవనంలో మూడు ప్రయోగ కేంద్రాలు పనిచేయడం ప్రారంభించాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653284
విలువలతో కూడిన విద్యాబోధనకు ఉపరాష్ట్రపతి పిలుపు; కోవిడ్-19 విషయంలో అలసత్వం వద్దని, జాగ్రత్తలు కొనసాగించాలని ప్రజలకు సూచన
వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి విలువలతో కూడిన విద్యాబోధన అవసరాన్ని ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు నొక్కిచెప్పారు. విద్యా కార్యకలాపాలకు మించి, విలువలు ప్రాతిపదికగాగల విద్యాబోధన మన విద్యావ్యవస్థలో భాగంగా కావాల్సి ఉందన్నారు. శ్రీ రామచంద్ర మిషన్, ఐక్యరాజ్యసమితి సమాచార కేంద్రం (భారత్-భూటాన్) సంయుక్తంగా ఆన్‌లైన్‌ద్వారా నిర్వహిస్తున్న "హార్ట్‌ఫుల్‌నెస్ అఖిలభారత వ్యాసరచన పోటీల"ను ఉప రాష్ట్రపతి ఇంటర్నెట్ మాధ్యమంద్వారా ప్రారంభించారు. ఏటా జూలై, నవంబర్ నెలల మధ్య ఐక్యరాజ్యసమితి యువజన దినోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తోంది. యువత మస్తిష్కాన్ని ఉత్తేజితం చేసి, వారు సానుకూలంగా ఆలోచించేలా ప్రేరేపించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జాతీయ విద్యావిధానం-2020విలువలతో కూడిన విద్యను అందించడంపై దృష్టిపెడుతున్నదని పేర్కొన్నారు. మన ప్రాచీన విద్యావిధానంలో చదువుతోపాటు విలువలకు సమాన ప్రాధాన్యం ఉండేదని గుర్తుచేశారు. మహమ్మారివల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒకరకమైన ఒత్తిడికి గురయ్యారని, దీన్నుంచి బయటపడేందుకు కుటుంబంతో విలువైన సమయం గడపడం, ధ్యానంవంటిది అలవరచుకోవడం మంచి మార్గమని సూచించారు. అలాగే కరనావైరస్ విషయంలో అలసత్వం వహించకుండా ప్రస్తుతం పాటిస్తున్న అన్ని జాగ్రత్తలనూ ఇకముందు కూడా అనుసరిస్తూ మహమ్మారిని నిర్మూలించాలని పిలుపునిచ్చారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653356
జీవన ప్రమాణ ధ్రువీకరణ సమర్పించే గడువును ప్రభుత్వం పొడిగించింది: డాక్టర్ జితేంద్ర సింగ్
దేశంలోని వృద్ధ పౌరులకు ఊరట కలిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి (స్వతంత్ర బాధ్యత), పీఎంవో, సిబ్బంది-శిక్షణ-ప్రజా సమస్యలు-పెన్షన్లు, అణుశక్తి శాఖల (స్వతంత్ర బాధ్యత) సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఈ మేరకు పెన్షనర్లు జీవన ప్రమాణ ధ్రువీకరణ సమర్పణకు విధించిన గడువును పొడిగించినట్లు ఆయన తెలిపారు. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు 2020 నవంబర్ 1 నుంచి 2020డిసెంబరు 31లోగా సమర్పించవచ్చు. సాధారణంగా పెన్షన్ కొనసాగింపు నిమిత్తం దీన్ని ఏటా నవంబరులో సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు 80 అంతకన్నా ఎక్కువ వయోవర్గంలోని పెన్షనర్లు 2020 నవంబర్ 1 నుంచి 2020డిసెంబరు 31లోగా సమర్పించవచ్చు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653498
గాంధీనగర్ జిల్లాలో, నగరంలో రూ.15.01 కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ప్రారంభించి ప్రజలకు అంకితమిచ్చిన దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
గాంధీ నగర్ జిల్లాలో, నగరంలో రూ.15.01 కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నిన్న దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రారంభించి, ప్రజలకు అంకితమిచ్చారు. అంతేకాకుండా రూ.119.63 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన కూడా చేశారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ఉద్యానాల విస్తరణ, రోడ్ల విస్తరణ, బాలికల పాఠశాలలో కొత్త తరగతి గదుల ఏర్పాటు తదితరాలు ఇందులో భాగంగా ఉన్నాయి. గుజరాత్‌లోని రూపాల్ గ్రామం నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ పటేల్ దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూ- "ప్రధానమంత్రి శ్రీ మోదీ నేతృత్వంలో మనమంతా గాంధీనగర్‌ను ఆదర్శ లోక్‌సభా నియోజకవర్గంగా రూపొందించేలా కృషి చేయగలమన్న విశ్వాసం నాకుంది" అన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653232
బాంకు రుణగ్రస్థులకు ఊరటపై అంచనాలో ప్రభుత్వానికి సహాయ కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు
వడ్డీ రద్దు, వడ్డీ మీద వడ్డీ రద్దు తదితర అంశాలలో ఊరట కోరుతూ గజేంద్ర శర్మ వర్సెస్ భారత ప్రభుత్వం-తదితరుల మధ్య ప్రస్తుతం జరుగుతున్న వ్యాజ్యంపై గౌరవనీయ సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోగలిగేలా పరిస్థితిని సంపూర్ణంగా అంచనా వేయటం కోసం ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ సీఏజీ శ్రీ రాజీవ్ మెహ్‌రిషి నేతృత్వంలో ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీ వారంలోగా తన నివేదికను సమర్పించనుంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653135
కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన సమస్యలకు పరిష్కారాల కోసం సమష్టిగా కృషిచేద్దాం: శ్రీ గంగ్వార్
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన సమస్యలకు సమష్టిగా పరిష్కారం అన్వేషిద్దామని కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన (స్వతంత్ర బాధ్యతగల) శాఖ మంత్రి శ్రీ సంతోష్ గంగ్వార్ జి-20 కూటమి సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. నిన్న జరిగిన కూటమి సభ్యదేశాల కార్మిక-ఉపాధికల్పన శాఖ మంత్రుల సమావేశంలో దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- ప్రపంచ ప్రజల దైనందిన జీవిత విధానాన్ని ఈ మహమ్మారి కొత్త మార్గంలోకి మళ్లించిందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి భారతదేశంలోని అన్నివర్గాల ప్రజలకు, పేదలకు ఉపశమనం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653285
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లోని మూడు వైద్య విద్యా సంస్థల పరిధిలోని ఆస్పత్రులలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలతోపాటు పడకల సంఖ్యను పెంచాలని, కోవిడ్ రోగుల విషయంలో వ్యక్తిగత శద్ధచూపాలని నగర పాలన యంత్రాంగాధిపతి ఆదేశించారు. అలాగే ప్రజా ప్రతినిధులందరూ తమతమ పరిధులలో రోగలక్షణాలున్న, అనుమానాస్పద కోవిడ్ కేసుల సమాచారం సేకరించి అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
- పంజాబ్: రాష్ట్రంలోని ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని పంజాబ్ ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్దూ ప్రజలకు ఉద్వేగభరిత రీతిలో విజ్ఞప్తి చేశారు. పరీక్షల్లో ఆలస్యంవల్ల రోగులు ఆస్పత్రుల్లో చేరడం కూడా జాప్యమవుతూ మహమ్మారిపై పోరాటం కష్టమవుతున్నదని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ఈ యుద్ధంలో తమవంతు పాత్ర పోషించాలని, ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
- మహారాష్ట్ర: రాబోయే రోజుల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన దృష్ట్యా ఆస్పత్రులకు 80 శాతం, పరిశ్రమలకు 20 శాతం వంతున ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. కాగా, రాష్ట్రంలో నిన్న రెండోసారి ఒకేరోజు అత్యధికంగా23,446 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,90,795కు చేరింది. కాగా, ప్రస్తుతం 2.61లక్షల చురుకైన కేసులున్నాయి.
- గుజరాత్: రాష్ట్రంలో 150 మందికిపైగా వైద్యులకు కోవిడ్ నిర్ధారణ అయింది. వీరిలో రాజ్‌కోట్‌లో 100 మందికిపైగా, అహ్మదాబాద్‌లో 50 మందికిపైగా వైద్యులున్నారు. కాగా, ప్రస్తుతం 1,800మంది కోవిడ్ విధుల్లో ఉన్నారు. గుజరాత్‌లో గురువారం 1,332 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుత చురుకైన కేసుల సంఖ్య 16,198గా ఉంది.
- రాజస్థాన్: రాష్ట్రంలో కోవిడ్-19 నిర్ధారిత కేసులు ఆగస్టులో 5 శాతం కాగా సెప్టెంబర్‌లో 6 శాతం దాటి పెరిగాయి. ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం... ప్రతి 100 పరీక్షలకు ఐదు వంతున ఆగస్టులో కేసులు నిర్ధారణ కాగా, సెప్టెంబరులో ఆరుగా నమోదయ్యాయి. ఇక ఆగస్టులో రోజువారీ సగటు పరీక్షలు 25,407 కాగా, సెప్టెంబర్‌లో 25,336గా ఉన్నాయి. గత 24 గంటల్లో రాజస్థాన్‌లో 740 కొత్త కేసులు నమోదవగా మొత్తం 98,116కు చేరుకున్నాయి. ఇందులో 16,427 క్రియాశీల కేసులున్నాయి.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్ సరఫరాకు కొరత ఏర్పడింది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం హోషంగాబాద్ వద్ద ఆక్సిజన్ తయారీకి కొత్త ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా అవసరాలకు తగినట్లుగా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించడానికి, రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఉత్పాదన పెంచడానికి తాత్కాలిక చర్యలు తీసుకుంది. కాగా, మహారాష్ట్రలోని ప్రాణవాయువు ఉత్పాదక సంస్థలు ఆక్సిజన్ ఎగుమతిని తగ్గించడంతోపాటు 80 శాతం రాష్ట్ర అవసరాల కోసం నిల్వచేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,433 చురుకైన కేసులున్నాయి.
- కేరళ: రాష్ట్రంలో రెండు శాసనసభ స్థానాల ఉప ఎన్నికను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 2021తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికైన శాసనసభ్యులు సమర్థంగా పనిచేయడానికి మూడు నెలల సమయం మాత్రమే ఉంటుందని నాయకులు ఈ మేరకు స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తీవ్రతసహా ఆర్థిక భారం గురించి కూడా వారు ఉదాహరించారు. కాగా, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఇ.పి.జయరాజన్‌కు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక కేరళలో నిన్న 3349 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 26,229 మంది క్రియాశీల రోగులుండగా మరో 2.04 లక్షల మంది నిర్బంధంలో ఉన్నారు. మృతుల సంఖ్య 396గా ఉంది.
- తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 504 కొత్త కేసులు నమోదవగా శుక్రవారం ఉదయం 10 గంటలకు ముగిసిన చివరి 24 గంటల్లో 12 మంది మరణించారు. ప్రస్తుతం 4878 క్రియాశీల కేసులుండగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 19026కు చేరింది. అలాగే ఇప్పటిదాకా సంభవించిన మరణాల సంఖ్య365కి పెరిగింది. తమిళనాడులో పరీక్షల అనంతరం రోగ నిర్ధారణ సగటు 10 శాతంకన్నా తక్కువేనని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్ చెప్పారు. కేసులు ఎక్కువగా ఉన్న ఇతర జిల్లాల్లో ప్రభుత్వం జ్వర వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. అలాగే పరీక్షల నిర్వహణను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.
- కర్ణాటక: రాష్ట్రంలో తొలి కోవిడ్ కేసు నమోదైన ఆరు నెలల తరువాత క్రియాశీల కేసుల సంఖ్య నిన్న 1,01,537కు చేరింది. కాగా, 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు ఉద్యోగులకు యజమానులు కనీస వేతనాల చట్టం ప్రకారం వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ చెల్లింపు వాయిదా వేయాలన్న కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టు నిలిపివేత ఉత్తర్వులిచ్చింది. కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో పరీక్షించాల్సిన కోవిడ్ నమూనాలు పేరుకుపోతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీనిపై అంతరజిల్లా సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప ఆదేశించారు.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని 5.34 కోట్ల జనాభాలో 20 శాతం కోవిడ్-19 రోగనిరోధక శక్తిని సంతరించుకున్నట్లు సెరోలాజికల్ అధ్యయనం వెల్లడించింది. ఇది పట్టణ ప్రాంతాల్లో 22.5 శాతం జనాభాలో, గ్రామీణ ప్రాంతాలలో 18.2 శాతం జనాభాలో కనిపించినట్లు సర్వే ఫలితాలు పేర్కొంటున్నాయి. ఇక నిర్ధారిత కేసులలో 90 నుంచి 100 శాతం లక్షణరహితమని సర్వే వెల్లడించడం ఆసక్తకరం. చిత్తూరు జిల్లాలో కోవిడ్-19 మరణాల పెరుగుదలపై విచారణ కోసం ఉన్నతాధికారులు నిపుణుల కమిటీని నియమించారు. జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 510 మరణాలు సంభవించగా, తిరుపతిలో 174 మంది ప్రాణాలు విడిచారు. కాగా, 50 ఏళ్లు పైబడినవారిని ఏకాంత గృహవాస చికిత్సకు అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
- తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2426 కొత్త కేసులు, 13 మరణాలు నమోదవగా 2324 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 338 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,52,602; క్రియాశీల కేసులు: 32,195; మరణాలు: 940; డిశ్చార్జి: 1,19,467గా ఉన్నాయి.కాగా, హైదరాబాద్-దుబాయ్ మధ్య అంతర్జాతీయ విమాన యానం తిరిగి ప్రారంభమైంది; దీంతో విమాన ప్రయాణాలకు భారీ ప్రోత్సాహం లభించనుంది. కాగా, పీజీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించగలిగే అవకాశాల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ హైకోర్టు తెలుసుకోగోరింది.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 127 కొత్త కేసులు నమోదవగా 99 మంది కోలుకున్నారు. లేఖీలోని కోవిడ్ సంరక్షణ కేంద్రంలో వైద్య పర్యవేక్షణలో గలవారికి మానసిక-సామాజిక తోడ్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని గువహటి హైకోర్టు ఇటానగర్ బెంచ్... ఇటానగర్ రాజధాని ప్రాంత జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
- అసోం: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2197 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటిదాకా 105701 మందికి వ్యాధి నయమైంది. ప్రస్తుతం అసోంలో 29687 క్రియాశీల కేసులున్నాయి.
- మణిపూర్: రాష్ట్రంలో 108 కొత్త కేసులు నమోదవగా కోలుకునే సగటు 77 శాతంతో 245 మందికి వ్యాధి నయమైంది. రాష్ట్రంలో ప్రస్తుత క్రియాశీల కేసుల సంఖ్య 1633 కాగా, గత 24 గంటల్లో నలుగురు మరణించారు.
- మేఘాలయ: రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య1434కు చేరింది. వీరిలో 272 మంది బీఎస్‌ఎఫ్-సాయుధ దళాలకు చెందినవారు. కాగా, మేఘాలయలో ఇప్పటిదాకా 1842 మంది కోలుకున్నారు.
- మిజోరం: రాష్ట్రంలోని ఐజాల్ పురపాలక సంస్థ పరిధిలో 2020 సెప్టెంబర్ 17 వరకు ప్రభుత్వం పాక్షిక దిగ్బంధం ప్రకటించింది. మిజోరంలో నిన్న 20 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1353కు చేరింది. ప్రస్తుతం 603 క్రియాశీల కేసులున్నాయి.
- నాగాలాండ్: రాష్ట్రంలో కొత్త కేసుల నమోదుతో కొహిమాలో మరిన్ని ప్రదేశాలను దిగ్బంధించారు. ఈ మేరకు జైనౌబాడ్జ్ కాలనీ, పి.ఖేల్, లోయర్ నాగా బజార్, ఆఫీసర్స్ హిల్, జైలు కాలనీలలోని ఇళ్లను దిగ్బంధంలో ఉంచారు.
FACTCHECK
***
(Release ID: 1653505)
Visitor Counter : 234