ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రాష్ట్రాల మధ్య వైద్య ఆక్సిజెన్ రవాణాకు ఆంక్షలు వద్దు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

ఆస్పత్రిలోని ప్రతి కోవిడ్ బాధితుడికీ ఆక్సిజెన్ అందే బాధ్యత రాష్ట్రాలదే

Posted On: 11 SEP 2020 12:24PM by PIB Hyderabad

కొన్ని రాష్ట్రాలు అంతర్-రాష్ట ఆక్సిజెన్ రవాణా స్వేచ్ఛగా జరగకుండా రకరకాల చట్టాలకింద ఆంక్షలు విధిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దృష్టికి వచ్చింది. అదే విధంగా తయారీదారులు/సరఫరాదారులను కూడా ఆయా సొంత రాష్ట్రాలలోని ఆస్పత్రులకే  ఆక్సిజెన్ సరఫరాను పరిమితం చేయాలని ఆదేశిస్తున్నట్టు కూడా తెలిసింది.

ఈ పరిస్థితి దృష్ట్యా కోవిడ్ చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులకు ఆక్సిజెన్ అవసరం గురించి ఆరోగ్యమంత్రిత్వశాఖ మరోమారు స్పష్టం చేసింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శఖ కార్యదర్శి ఒక లేఖ రాస్తూ, తగినంత ఆక్సిజెన్ అందుబాటులో ఉంచాలని, తీవ్ర కోవిడ్ లక్షణాలతో బాధపడేవారికి నిరాటంకంగా ఆక్సిజెన్ అందేలా చూడటం తప్పనిసరి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు వైద్యపరంగా వాడే ఆక్సిజెన్ రవాణామీద ఎలాంటి ఆంక్షలూ విధించరాదని ఆరోగ్య కార్యదర్శి స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చేరిన ప్రతి కోవిడ్ బాధితునికీ అవసరమైన ఆక్సిజెన్ ను అందించే బాధ్యత ఆయా రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలదేనన్న విషయం మరోమారు గుర్తుచేశారు.

వైద్యపరమైన ఆక్సిజెన్ అత్యవసర ప్రజారోగ్య సరకు కిందికి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. దేశంలో అన్ని ప్రాంతాలకూ ఆక్సిజెన్ సరఫరా సక్రమంగా జరగకపోతే చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల చికిత్సకు అది తీవ్ర అంతరాయం కలిగిస్తుందన్న విషయం గ్రహించాలని కోరారు. అందువల్ల ఒక ప్రాంతం వారు నిల్వ చేసుకుంటే మరోప్రాంతం సమస్యలో పడుతుందన్నారు. పైగా, అనేక ఆక్సిజెన్ తయారీ సంస్థలకు వేరు వేరు ప్రాంతాల్లోని ఆస్పత్రులతో ఒప్పందాలు ఉండటం వలన వాటిని నెరవేర్చటం చట్టపరంగా అనివార్యమని కూడా గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కోవిడ్ చికిత్స మార్గదర్శకాలు కూడా ప్రామాణిక చికిత్సా మార్గదర్శకాలమీద ఆధారపడి ఉన్నాయి.  ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రామాణికమైన, ఏకరూప వైద్య చికిత్స, ఆస్పత్రులతో సహా సౌకర్యాలు ఉండాలి. ఒక మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలుంటే తగినంత ఆక్సిజెన్ అందజేయాలి, సకాలంలో యాంటీ కొయాగ్యులెంట్స్ అందేట్టు చూడాలి. చౌకధరలో విస్తృతంగా దొరికే కార్టికో స్టెరాయిడ్ సైతం వాడాల్సి వస్తుంది. ఇవన్నీ నిబంధనలకు అనుగుణంగా జరిపే కోవిడ్ చికిత్సలో భాగాలు.

దేసవ్యాప్తంగా తగినంత ఆక్సిజెన్ అందుబాటులో ఉంచటం వలన ఆస్పత్రిలో తీవ్ర లక్షణాలతో బాధపడేవారికి ఇతర చర్యలతోబాటు సమర్థమైన చికిత్స అందించటం సాధ్యమవుతుంది. ఇలాంటి వ్యూహాత్మక విధానాలు అవలంబించటం వల్లనే కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా పెరుగుతూ మరణాల శాతం బాగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మరణాల శాతం 1.67% గా నమోదైంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నబాధితులలో 3.7%  లోపు వారికి మాత్రమే ఆక్సిజెన్ అవసరమవుతోంది.

****



(Release ID: 1653289) Visitor Counter : 226