ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ విద్యావిధానం- 2020 (ఎన్ఇపి- 2020) లో భాగం గా ‘‘21వ శతాబ్దం లో పాఠశాల విద్య’’ పై ఏర్పాటు చేసిన సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 11 SEP 2020 1:50PM by PIB Hyderabad

జాతీయ విద్యావిధానం- 2020 (ఎన్ఇపి- 2020) లో భాగం గా ‘‘21వ శతాబ్దం లో పాఠశాల విద్య’’ అనే అంశం పై ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.



ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, జాతీయ విద్యావిధానం 21వ శతాబ్దం లో భారతదేశానికి ఒక కొత్త దిశ ను అందిస్తుందని, మన దేశ భవిష్యత్తు సౌధానికి పునాది ని వేసే ఘడియ లో మనం భాగం పంచుకొంటున్నామన్నారు.  ఈ మూడు దశాబ్దాల్లో మన జీవితం లో ఏ దశ కూడా ఒకే రకం గా లేదని, అయినప్పటికీ మన విద్యావ్యవస్థ మాత్రం ఇంకా ఇప్పటికీ పాత విధానం లోనే నడుస్తోందని ఆయన అన్నారు.

నవ భారత్ నూతన ఆకాంక్షలను, నవీన అవకాశాలను నెరవేర్చుకొనేందుకు కొత్త జాతీయ విద్యావిధానం ఒక సాధనం అవుతుందని ఆయన చెప్పారు.

గత మూడు, నాలుగేళ్లలో ప్రతి ప్రాంతానికి చెందిన, ప్రతి రంగానికి చెందిన, ప్రతి భాష కు చెందిన ప్రజల కఠోర శ్రమ ఫలితమే ఎన్ఇపి- 2020 అని ప్రధాన మంత్రి అన్నారు. నిజమైన పని ఇప్పుడే, ఈ విధానాన్ని అమలుపరచడం తో మొదలవుతుంది అని ఆయన చెప్పారు.

జాతీయ విద్యావిధానాన్ని ప్రభావవంతంగా అమలుచేయడం కోసం ఉపాధ్యాయులంతా కలిసికట్టుగా కృషిచేయాలని ఆయన కోరారు.

ఈ విధానాన్ని ప్ర‌క‌టించిన త‌రువాత అనేక ప్ర‌శ్న‌లు త‌లెత్త‌డం న్యాయమే, ఈ విధానాన్ని అమ‌లు చేయడానికి ముందంజ వేయాలంటే ఆ త‌ర‌హా అంశాల‌న్నిటిని చ‌ర్చించ‌డం అవ‌స‌రం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

జాతీయ విద్యా విధానాన్ని అమ‌లు చేయడానికి ప్ర‌ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ చ‌ర్చ‌ లో ఎంతో ఉత్సాహం తో పాల్గొన‌డం చూస్తూ ఉంటే త‌న‌కు ఎంతో సంతోషం గా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  జాతీయ విద్యా విధానాన్ని అమ‌లు చేసే అంశం పై దేశ‌వ్యాప్తం గా ఉపాధ్యాయుల వ‌ద్ద నుంచి వారం రోజుల లోప‌లే 15 ల‌క్ష‌ల‌కు పైగా సూచ‌న‌లు అందాయ‌ని ఆయ‌న అన్నారు.

ఉత్సాహం తొణికిస‌లాడే యువ‌తీయువకులు దేశ అభివృద్ధి కి శోద‌క శ‌క్తులు అని ప్ర‌ధాన మంత్రి అభివ‌ర్ణిస్తూ, అయితే వారి పురోభివృద్ధి బాల్యం నుండే మొద‌లు కావాల‌న్నారు.  ఒక బాలుడు/ బాలిక భ‌విష్య‌త్తు లో ఏమ‌వుతారు?, వారి వ్య‌క్తిత్వం ఎలా  ఉండ‌బోతుంది? అనే అంశాలను బాల‌ల విద్య, వారి చుట్టుపక్క‌ల ఉండే ప‌రిస‌రాలు అనేవే చాలా వ‌ర‌కు నిర్దారిస్తాయని ఆయ‌న వివ‌రించారు.  ఈ దృష్టికోణానికి ఎన్ఇపి-2020 ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తుందని ఆయ‌న చెప్పారు.

బాల‌లు వారి మేధాశ‌క్తిని గ్ర‌హించడాన్ని, వారిలో దాగి ఉన్న నైపుణ్యాల‌ను చ‌క్క‌గా అర్థం చేసుకోవ‌డాన్ని ప్రి- స్కూల్ ద‌శ‌లోనే మొద‌లు పెడ‌తార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  దీని ని దృష్టి లో పెట్టుకొని స‌ర‌దాగా నేర్చుకొనే, ఆట‌లు ఆడుతూనే నేర్చుకొనే, ఆ ప‌ని - ఈ ప‌ని చేస్తూనే నేర్చుకొనే, కొత్త విష‌యాల‌ ను క‌నుక్కొని ఆ ప‌ద్ధ‌తి లో నేర్చుకొనే వాతావ‌ర‌ణాన్ని పిల్ల‌ల‌ కు అందించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉపాధ్యాయుల‌ కు, పాఠ‌శాల‌ల‌ కు ఎంతైనా ఉంద‌ని ఆయ‌న చెప్పారు. పిల్ల‌లు ఎదుగుతున్న కొద్దీ వారిలో మ‌రింత ఎక్కువ‌గా నేర్చుకోవాల‌నే త‌ప‌న ను, శాస్త్రీయంగా ఆలోచించ‌డాన్ని, తార్కికంగా ఆలోచించ‌డాన్ని విక‌సింపచేయ‌డం చాలా ముఖ్య‌మ‌ని ఆయ‌న అన్నారు. 

పాత 10 + 2 విధానానికి బ‌దులుగా 5 + 3 + 3 + 4 వ్య‌వ‌స్థ‌ ను ప్ర‌వేశ పెట్ట‌డానికి జాతీయ విద్యా విధానంలో  పెద్ద‌పీట వేసినట్లు ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  ఈ విధానం అమ‌లు లోకి వ‌చ్చిని తరువాత, న‌గ‌రాల‌ లో ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కే ప‌రిమిత‌ం అయిన ఆటలాడుతూ చదువుకునే ప్రి- స్కూల్ ప‌ద్ధ‌తి ఇక ప‌ల్లెల‌ కు సైతం అందుబాటులోకి వస్తుంద‌ని ఆయ‌న అన్నారు. 

ప్రాథ‌మిక విద్య పై శ్ర‌ద్ధ వ‌హించ‌డ‌మ‌నేది జాతీయ విద్యా విధానం లో అత్యంత ప్రాముఖ్యం గ‌ల అంశ‌మ‌ని ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్పారు.  జాతీయ విద్యా విధానం లో మౌలిక అక్ష‌ర జ్ఞానం, సంఖ్యల కు సంబంధించిన జ్ఞానం.. ఈ రెండిటిని విక‌సింప చేయ‌డాన్ని ఒక జాతీయ ఉద్య‌మం లాగా చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు.  బాల‌లు ముంద‌డుగు వేసి నేర్చుకోవ‌డం కోసం చ‌ద‌వాల‌ని, దీనికి గాను వారు చ‌ద‌వ‌డం అంటే ఏమిటి అనేది మొద‌ట నేర్చుకోవ‌ల‌సి అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు.  చ‌ద‌వ‌డాన్ని అభ్యసించే ద‌శ నుంచి, జ్ఞానం సంపాదించుకోవ‌డం కోసం చ‌దివే ద‌శ‌కు చేసే అభివృద్ధి ప్ర‌యాణం మౌలిక అక్ష‌రాస్య‌త‌ ద్వారా, సంఖ్యలను గురించిన ప‌రిజ్ఞానం ద్వారా పూర్తి అవుతుంద‌ని ఆయ‌న అన్నారు.

మూడో త‌ర‌గ‌తి పూర్తి చేసిన బాల‌లంతా ఒక నిమిషం లో 30 నుంచి 35 ప‌దాల‌ను ఇట్టే  చ‌దివేసేట‌ట్లు శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  వారు ఇత‌ర స‌బ్జెక్టుల లోని విష‌యాల‌ ను సులువుగా అర్థం చేసుకోవ‌డంలో ఇది సాయపడుతుంద‌ని ఆయ‌న అన్నారు.  ఇవ‌న్నీ కూడా చ‌దువుల‌ ను వాస్త‌వ ప్ర‌పంచం తో జోడించిన‌ప్పుడు మాత్ర‌మే సాధ్య‌ం అవుతాయ‌ని కూడా ఆయ‌న చెప్పారు.

విద్య ను ప‌రిస‌ర ప్రాంతాల లోని వాతావ‌ర‌ణం తో జోడించిన‌ప్పుడు, అది విద్యార్థి మొత్తం జీవితం పై, అలాగే యావ‌త్తు స‌మాజం పై ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. తాను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి గా ఉన్న కాలం లో చేప‌ట్టిన ఒక కార్య‌క్ర‌మాన్ని గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.  గ్రామం లో ఉన్న అతి పాత చెట్టు ను గుర్తించే ప‌ని ని అన్ని పాఠ‌శాల‌ ల విద్యార్థుల‌ కు అప్ప‌గించి, ఆ వృక్షాన్ని గురించి, అలాగే వారి గ్రామాన్ని గురించి ఒక వ్యాసం రాయవలసిందిగా సూచించడం జరిగింది.  ఈ ప్ర‌యోగం ఎంతో విజ‌య‌వంతం అయింద‌ని ఆయ‌న అన్నారు.  దీనితో పిల్ల‌ల‌కు వారి చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల స‌ంగతులు తెలియ‌డం తో పాటు వారి ఊరి కి చెందిన ఎంతో స‌మాచారాన్ని తెలుసుకొనే ఒక అవ‌కాశం కూడా ల‌భించింద‌ని ఆయ‌న వివ‌రించారు.


ఆ తరహా సులభమైన, నూతన పద్ధతుల ను మరిన్ని అనుసరించవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.  మన కొత్త తరం విద్యావిధానానికి - ఏదయితే పాలుపంచుకుంటూ, వెదుకుతూ, అనుభవాన్ని సంపాదిస్తూ, ఆ అనుభవాన్ని ఆచరణ లోకి తెస్తూ, రాణించడాన్ని గురించి చెప్తుందో - దానికి కేంద్ర స్థానం లో ఈ తరహా ప్రయోగాలు నిలుస్తాయని ఆయన అన్నారు.

విద్యార్థులు వారి ఆసక్తులకు తగ్గట్టు కార్యకలాపాలలో, సంఘటన లలో, ప్రాజెక్టుల లో పాలుపంచుకోవాలని శ్రీ నరేంద్ర మోదీ సూచించారు.  అప్పుడు బాలలు నిర్మాణాత్మక పద్ధతి లో వ్యక్తీకరించడాన్ని నేర్చుకుంటారని ఆయన అన్నారు.  పిల్లలను చారిత్రక ప్రదేశాలు, ఆసక్తి గల ప్రదేశాలు, వ్యవసాయం, పరిశ్రమలు మొదలైన ప్రాంతాలకు అధ్యయన పర్యటనలకు తీసుకుపోవాలని, అది వారికి ఆచరణాత్మక జ్ఞానాన్ని పంచుతుందని ఆయన చెప్పారు.  ఇది  అన్ని పాఠశాలల్లో జరగడం లేదని, ప్రధాన ఈ కారణంగా చాలా మంది విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానం అందడం లేదని ఆయన అన్నారు.  విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానాన్ని పరిచయం చేయడం ద్వారా వారిలో ఉత్సాహం, జ్ఞానం పెరుగుతాయని ఆయన అన్నారు.  నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులను చూసినప్పుడు విద్యార్థులు ఒక రకమైన భావోద్వేగానికి లోనై, వారితో మమేకం అవుతారు, వారి నైపుణ్యాలను అర్థం చేసుకుని, వారిని గౌరవిస్తారు.  ఈ పిల్లల్లో చాలా మంది పెరిగి పెద్దయ్యాక,  ఇటువంటి పరిశ్రమల్లో చేరే అవకాశం ఉంటుంది; ఒకవేళ వారు మరో వృత్తి ని ఎంచుకున్నప్పటికీ, వారు ఎంచుకున్న వృత్తిని మెరుగుపరచడానికి ఏమి ఆవిష్కరించవచ్చు అనే దానిపై వారి మనసు లో ఆలోచన ఉంటుంది అని వివరించారు.

పాఠ్యక్రమాన్ని తగ్గించి, ప్రాథమిక విషయాలపైన దృష్టి ని కేంద్రీకరించే విధంగా జాతీయ విద్యావిధానం రూపొందిందని ప్రధాన మంత్రి అన్నారు.  జ్ఞానార్జన పద్ధతుల ను ఒక చోటుకు తెచ్చి, బహుళ విషయాల ను బోధిస్తూ, సరదాలతో నిండివుండే, సంపూర్ణ అనుభూతిని పంచిపెట్టే ఒక జాతీయ పాఠ్యక్రమ స్వరూపాన్ని తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు.  దీనికిగాను సలహాలను స్వీకరిస్తారని, ఆధునిక విద్యా వ్యవస్థలన్నిటి సారాన్ని తీసుకొని, సిఫారసులను పరిశీలిస్తారని ప్రధాన మంత్రి చెప్పారు. భావి ప్రపంచం మనం ఇప్పుడు ఉంటున్న ప్రపంచం కన్నా పూర్తి వేరుగా ఉండబోతోంది అని ఆయన అన్నారు.

మన విద్యార్థులను 21 వ శతాబ్ద నైపుణ్యాల తో  ముందుకు తీసుకోపోవడానికి ఉన్న  ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.  కీలక ఆలోచనలు చేయడం, సృజనాత్మకత, సహకారం, కుతూహలం, కమ్యూనికేషన్ లు 21 వ శతాబ్ద నైపుణ్యాలు అని ఆయన అన్నారు.  విద్యార్థులు ఆరంభం నుంచే కోడింగును నేర్చుకోవాలి, కృత్రిమ మేధస్సు (ఎఐ) ను గురించి అర్థం చేసుకోవాలి, ఇంటర్ నెట్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్ లను గురించి క్షుణ్నం గా తెలుసుకోవాలని ఆయన సూచించారు.   మన ఇదివరకటి విద్యా విధానం చాలా పరిమితమైందని ఆయన అన్నారు.  అయితే, వాస్తవ ప్రపంచం లో, అన్ని విషయాలు ఒకదానితో మరొకటి సంబంధం ఉన్నవే అని ఆయన చెప్పారు.  కానీ ప్రస్తుత విధానం ఒక రంగం నుండి మరొక రంగానికి మారడానికీ, కొత్త అవకాశాల తో కలవడానికి వీలుగా లేదని ఆయన అన్నారు. చాలా మంది పిల్లలు మధ్యలో చదువు మానేయడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం.  అందువల్ల, జాతీయ విద్యా విధానం లో విద్యార్థులకు ఏ సబ్జెక్టు ను అయినా ఎంచుకునే స్వేచ్ఛ ను ఇవ్వడమైందని ప్రధాన మంత్రి వివరించారు. 

జాతీయ విద్యా విధానం మరో పెద్ద సమస్యను కూడా పరిష్కరిస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు.  మన దేశం లో నేర్చుకునే విద్య స్థానం లో మార్కుల జాబితా ఆధారిత విద్య ఆధిపత్యం వహిస్తోంది.  మార్కుల జాబితా ఇప్పుడు మానసిక ఒత్తిడి ని కలిగించే పత్రం లా మారిందని ఆయన పేర్కొన్నారు.  చదువుకోవడంలో ఒత్తిడి ని తొలగించడం జాతీయ విద్యా విధానం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.  పరీక్ష ఎలా ఉండాలంటే అది విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడి ని కలిగించకూడదు. కేవలం ఒక పరీక్ష ద్వారా విద్యార్థులను మదింపు చేయకూడదు,  మదింపు అనేది స్వీయ అంచనా పద్ధతి, తోటి విద్యార్థులతో పోల్చి అంచనా వేసే పద్ధతి వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉండాలన్నారు.  మార్కుల జాబితా కు బదులు ఒక సమగ్ర నివేదిక తో కూడిన కార్డు ను జాతీయ విద్యా విధానం ప్రతిపాదించినట్లు ప్రధాన మంత్రి చెప్పారు.  ఈ కార్డు లో- విద్యార్థుల విశిష్ట సామర్థ్యం, అభిరుచి, వైఖరి, ప్రతిభ, నైపుణ్యాలు, దక్షత, సాధికారత, అవకాశాల కు సంబంధించిన పూర్తి వివరాలు నమోదవుతాయి.  ఒక కొత్త జాతీయ అంచనా కేంద్రం “పరఖ్” ను ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా ఆయన తెలిపారు. 

భాష అనేది విద్య కు మాధ్యమం అని, భాష ఒక్కటి నేర్చుకుంటే చదువంతా చదివేసినట్లు కాదు అన్న సంగతిని అందరూ గ్రహించవలసివుందని ప్రధాన మంత్రి అన్నారు.  కొంతమంది ఈ తేడా ను మరచిపోతారని ఆయన చెప్పారు.  అందువల్ల, ఒక పిల్లవాడు తేలికగా నేర్చుకునే భాష ఏదయినా, అదే భాష చదువుకునే భాష గా ఉండాలి అని వివరించారు.  ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని, ప్రారంభ విద్య చాలా దేశాలలో మాదిరిగానే మాతృ భాష లో ఉండాలని ప్రతిపాదించడం జరిగిందన్నారు.  లేకపోతే, బాలలు వేరే భాషలో దేనినైనా వింటే, వారు దానిని మొదట వారి సొంత భాషలోకి అనువదించుకుంటారు, అప్పుడు దానిని అర్థం చేసుకుంటారని ఆయన చెప్పారు.  ఇది పిల్లవాడి మనసులో బోలెడంత గందరగోళాన్ని సృష్టిస్తుంది, అది చాలా ఒత్తిడి ని కలిగిస్తుంది. అందుకని, సాధ్యమైనంతవరకు, స్థానిక భాష ను, మాతృ భాష ను అయిదో తరగతి వరకు, కనీసంగా అయిదో తరగతి వరకైనా, విద్య కు మాధ్యమం గా ఉంచాలని జాతీయ విద్యావిధానం లో పేర్కొనడం జరిగిందని ప్రధాన మంత్రి వివరించారు.

ఈ అంశం పై సందేహాలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, మాతృ భాష కు అదనం గా ఏ భాష ను నేర్చుకోవడం పైన ఎలాంటి ఆంక్ష లేదన్నారు.  బాలలు ఇంగ్లిషు తో పాటు ఇతర విదేశీ భాషలను కూడా నేర్చుకోవచ్చని ఆయన అన్నారు.  అదే సమయం లో ఇతర భారతీయ భాషలను కూడా ప్రోత్సహించడం జరుగుతుందని, దీని తో మన యువత వివిధ రాష్ట్రాల భాషలను గురించి, అక్కడి సంస్కృతి ని గురించి తెలుసుకోవచ్చని ప్రధాన మంత్రి చెప్పారు.  జాతీయ విద్యావిధానం అమలుకు ఉపాధ్యాయులే మార్గదర్శులు అని ఆయన అన్నారు. అందువల్ల, ఉపాధ్యాయులంతా అనేక కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలని, అలాగే పాత అంశాలను వదిలేయాలన్నారు.  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి  2022 లో 75 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి, భారతదేశం లో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క విద్యార్థిని జాతీయ విద్యావిధానం లో సూచించిన ప్రకారం చదువుకునేటట్లు చూడటం మన అందరి బాధ్యత అని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ జాతీయ ఉద్యమం లో ఉపాధ్యాయులు, నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, తల్లితండ్రులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.




 

***


(Release ID: 1653378) Visitor Counter : 383