PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 16 JUL 2020 6:21PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 6,12,814కు చేరగా కోలుకునేవారి శాతం 63.25గా నమోదు
  • దేశవ్యాప్తంగా 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 20,783.
  • ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,31,146.
  • దేశంలోని మొత్తం యాక్టివ్‌ కేసులలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల వాటా 48.15 శాతం.
  • మరో 12 వారాల్లో రోజువారీ కోవిడ్‌-19 పరీక్షల సామర్థ్యాన్ని 10 లక్షలకు పెంచుతాం: డాక్టర్ హర్షవర్ధన్‌.
  • ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష కార్యక్రమంసహా 1234 ప్రయోగశాలల ద్వారా ప్రతి పది లక్షల జనాభాకు  (టీపీఎం) 9231కిపైగా నమూనాల పరీక్ష.
  • కోవిడ్‌-19పై భారత పోరాటానికి మద్దతు కోసం స్వచ్ఛంద సేవా కార్యకర్తల సంఖ్యను కోటికి చేర్చే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి: శ్రీ కిరణ్‌ రిజిజు.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం; ప్రస్తుత యాక్టివ్ కేసులు 3,31,146 మాత్రమే; మొత్తం కేసులలో 1/3వ వంతు; కోలుకున్న కేసులు 6.1 లక్షలకుపైగానమోదు

దేశ‌ంలో ప్రస్తుతం చికిత్స పొ్ందుతున్న కోవిడ్‌-19 రోగుల సంఖ్య 3,31,146కాగా, ఇది మొత్తం కేసులలో 1/3 వంతుకన్నా కాస్త (34.18శాతం) మాత్రమే అధికం. ఇక 2020 జూన్‌ మధ్య నుంచీ... అంటే- కోలుకునేవారు 50 శాతం దాటాక వ్యాధి నయమైనవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూ చురుకైన కేసుల సంఖ్య తగ్గుతూ కోలుకునేవారి శాతం 63.25కు చేరింది. అలాగే 2020 జూన్‌ మధ్యనాటికి 45 శాతంగా ఉన్న చురుకైన కేసులు తగ్గుతూ ప్రస్తుతం సుమారు 34.18 శాతానికి దిగివచ్చింది. గడచిన 24 గంటల్లో 20,783మంది కోలుకోగా మొత్తం న‌య‌మైన‌వారి సంఖ్య 6,12,814కు పెరిగింది. చికిత్సలో ఉన్నవారికన్నా కోలుకున్నవారి మధ్య అంతరం 2,81,668 మేర అధికంగా న‌మోదైంది. దేశంలోని చురుకైన కేసులలో 48.15 శాతం కేవలం 2 రాష్ట్రాలు... మహారాష్ట్ర, తమిళనాడులలోనే ఉన్నాయి. అలాగే 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకుగాను కేవలం 10 రాష్ట్రాల్లోనే చురుకైన కేసులలో 84.62 శాతం కేసులున్నాయి.

http://pibcms.nic.in/WriteReadData/userfiles/image/image001GO3V.png

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639151

ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష కార్యక్రమంసహా 1234 ప్రయోగశాలల ద్వారా ప్రతి పది లక్షల జనాభాకు  (టీపీఎం) 9231కిపైగా నమూనాల పరీక్ష

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న త్రిముఖ వ్యూహం “పరీక్ష, అన్వేషణ, చికిత్స”కు అనుగుణంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్షల సంఖ్య పెంపు దిశగా ప్రయోగశాలల సంఖ్యను పెంచేందుకు కృషి చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రయోగశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేసుల సత్వర గుర్తింపులో ఐసీఎంఆర్‌ నిర్దేశిత మార్గదర్శకాలు తోడ్పడ్డాయి. ఆ మేరకు నమోదిత వైద్యసేవా ప్రదాతలు కూడా కోవిడ్‌ పరీక్ష సిఫారసు చేసేందుకు అనుమతించబడ్డారు. దీనికితోడు నమూనాల పరీక్ష సంఖ్య పెరగడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ‘ఆర్టీ-పీసీఆర్‌, ట్రూనాట్‌, సీబీనాట్‌’ వంటి సదుపాయాలున్న ప్రయోగశాలల నెట్‌వర్క్‌ కూడా తోడ్పడింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 3,26,826 పరీక్షలు నిర్వహించగా, ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 1,27,39,490కి పెరిగింది. తదనుగుణంగా ప్రతి పది లక్షల జనాభాకు నిర్వహించే పరీక్షల సంఖ్య స్థిరంగా పెరుగుతూ నేటికి 9,231.5కు చేరింది. ప్రస్తుతం ప్రభుత్వరంగంలో 874, ప్రైవేట్‌ రంగంలో 360 వంతున మొత్తం 1,234 ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639149

ఢిల్లీలోని ‘ఎయిమ్స్‌’లో రాజ్‌కుమారి అమృత్‌కౌర్‌ ఓపీడీ బ్లాక్‌ను ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్‌

దేశానికి ప్రపథమ ఆరోగ్యశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు శ్రీమతి రాజ్‌కుమారి అమృత్‌కౌర్‌ పేరిట కొత్త ఔట్‌పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఓపీడీ)ను ప్రారంభించడం తనకెంతో సంతోషం కలిగిస్తున్నదని డాక్టర్‌ హర్షవర్ధన్‌ అన్నారు. కోవిడ్‌-19పై దేశంలో కొనసాగుతున్న సంయుక్త పోరాటం గురించి వివరిస్తూ- మహమ్మారిపై విజయం దిశగా మనం ‘క్రమేణా’ ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఐసీయూలలో చేరాల్సిన కోవిడ్‌ రోగుల సంఖ్య 2 శాతంకన్నా తక్కువకు దిగివచ్చిందని వివరించారు. అలాగే దేశంలో ప్రయోగశాలల నెట్‌వర్క్‌ వేగంగా వృద్ధి చెందుతూ ప్రస్తుతం 1,234 ప్రయోగశాలల స్థాయికి చేరగా, రోజుకు 3.26 లక్షల నమూనాలను పరీక్షించగల సామర్థ్యం ఏర్పడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న 12 వారాల్లో పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని రోజుకు 10 లక్షల స్థాయికి తీసుకెళతామని ఆయన ప్రకటించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639161

‘ఈకొసాక్‌’ అత్యున్నత స్థాయి విభాగం సదస్సునుద్దేశించి 2020 జూలై 17న ప్రసంగించనున్న ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 జూలై 17న న్యూయార్క్‌ నగరంలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరిగే సమితి అత్యున్నత విభాగమైన ‘ఆర్థిక-సామాజిక మండలి’ వార్షిక సదస్సునుద్దేశించి వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా కీలకోపన్యాసం చేస్తారు. ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం, పౌర-విద్యా సమాజాలలోని అత్యున్నతస్థాయి ప్రతినిధులు ఈ సదస్సులో పాలుపంచుకుంటారు. కాగా, ఈ ఏడాది “కోవిడ్‌-19 అనంతర బహుపాక్షికత: 75వ వార్షికోత్సవం సందర్భంగా ఐరాస స్వరూపం ఎలా ఉండాలి” అనే అంశం ఇతివృత్తంగా సదస్సు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639094

రాబడి పెంపు-వ్యయం తగ్గింపు, భద్రతకు ఊపు, ప్రస్తుత ఉద్యోగుల సంక్షేమం ప్రాతిపదికన రైల్వేలు సంయుక్తంగా దృష్టి సారించాలి: శ్రీ పీయూష్‌గోయల్‌

రైల్వే మంత్రిత్వశాఖ తొలిసారిగా ఆన్‌లైన్ “కార్మిక సదస్సు”ను నిర్వహించింది. దేశం నలుమూలల నుంచి రైల్వే సిబ్బంది సంఘాల  ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ- దేశవ్యాప్త దిగ్బంధం సమయంలో నిర్విరామ కర్తవ్య నిబద్ధత ప్రదర్శించిన రైల్వే సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అత్యున్నత స్థాయి నుంచి కింది స్థాయిదాకా అధికారులు, సిబ్బంది మొత్తం చిత్తశుద్ధితో హృదయపూర్వకంగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం కోవిడ్‌ మహమ్మారివల్ల భారత రైల్వే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులను అధిగమించే మార్గాన్వేషణ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది” అని మంత్రి  సిబంధి సంఘాల నాయకులకు సూచించారు. ఆ మేరకు రైల్వేల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు, సరుకు రవాణా వాటా పెంపువంటి చర్యలతో ఏ విధంగా ముందుకు సాగే వీలుందో యోచించాలని కోరారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638063

బ‌యోటెక్నాల‌జీ శాఖ తోడ్పాటుతో జైడ‌స్ సంస్థ రూపొందించిన కోవిడ్ టీకా ‘జైకోవ్–డి’పై తొలి/మ‌లి ద‌శ‌ల అనుస‌ర‌ణ ప్ర‌యోగ ప‌రీక్ష‌లు ప్రారంభం

కోవిడ్‌-19 నిర్మూల‌న కృషిలో భాగంగా జైడ‌స్ సంస్థ *జైకోవ్‌-డి* టీకాను రూపొందించిన‌ట్లు బ‌యోటెక్నాల‌జీ పారిశ్రామిక ప‌రిశోధ‌క స‌హాయ‌మండ‌లి (BIRAC) ప్ర‌క‌టించింది. ఇందుకోసం భార‌త ప్ర‌భుత్వ బ‌యోటెక్నాల‌జీ శాఖ (DBT) పాక్షికంగా నిధులు స‌మ‌కూర్చింది. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు టీకాపై ఆ సంస్థ తొలి/మ‌లిద‌శ ప్ర‌యోగ ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపింది. దేశీయంగా త‌యారైన ఈ తొలి టీకాను ప్ర‌స్తుతం సంపూర్ణ ఆరోగ్య‌వంతుల‌పై ప్ర‌యోగించ‌నున్న‌ట్లు పేర్కొంది. త‌ద‌నుగుణంగా టీకా భ‌ద్ర‌త‌, స‌హ‌ష్ణుత, రోగ‌నిరోధ‌క‌త‌ల‌పై అధ్య‌య‌నం సాగుతుంద‌ని బిరాక్ కార్య‌ద‌ర్శి-చైర్‌ప‌ర్స‌న్ డాక్ట‌ర్ రేణు స్వ‌రూప్ తెలిపారు. నేష‌న‌ల్ బ‌యోఫార్మా మిష‌న్ కింద దేశీయ టీకా స‌త్వ‌ర త‌యారీలో డీబీటీ భాగ‌స్వామ్యం వ‌హించిన‌ట్లు పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639075

భారత వృద్ధి పథంలో భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అమెరికా పెట్టుబడిదారులకు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ పిలుపు

కేంద్ర పెట్రోలియం-సహజవాయువు-ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న అమెరికా ఇంధనశాఖ మంత్రి డాన్ బ్రౌలెట్టీతో కలసి పారిశ్రామికవర్గ స్థాయి సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించారు. అమెరికా-భారత్ వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఈ వాస్తవిక సాదృశ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ- భారతదేశంలో ఆవిర్భవిస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా విరివిగా పెట్టుబడులు పెట్టాలని అమెరికా కంపెనీలను, పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ఇంధన రంగంలో అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో దృఢమైనదని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639072

కోవిడ్‌-19పై భారత పోరాటానికి మద్దతు కోసం స్వచ్ఛంద సేవా కార్యకర్తల సంఖ్యను కోటికి చేర్చే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి: శ్రీ కిరణ్‌ రిజిజు

కోవిడ్-19పై భారత పోరాటం ముమ్మరం చేయడంతోపాటు సమాజంలోని నిరుపేద వర్గాల్లో స్వయం సమృద్ధ భారతంపై అవగాహన కల్పన దిశగా యువజన మంత్రిత్వశాఖ పరిధిలోని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకెఎస్), నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్)సహా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద కార్యకర్తలను సమీకరించాలని కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల యువజన వ్యవహారాల-క్రీడాశాఖల మంత్రులు, సీనియర్ అధికారులకు పిలుపునిచ్చారు. దేశంలో క్రీడలు-యువజన కార్యకలాపాల పునరుద్ధరణ దిశగా మార్గ ప్రణాళిక రూపకల్పనపై చర్చ నిమిత్తం రెండు రోజులపాటు ఆయన దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫిట్‌ ఇండియా కార్యకలాపాలను ఆన్‌లైన్‌ద్వారా కొనసాగించాల్సిందిగా కోరారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638930

ఎయిరోస్పేస్‌, ఢిపెన్స్‌ తయారీ సాంకేతికతలపై సదస్సును ప్రారంభించిన రక్షణశాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాదనాయక్‌

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమంతోపాటు స్వయం సమృద్ధ భారతం కింద ప్రభుత్వం అనేక వినూత్న చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో భారత ఎయిరోస్పేస్‌, డిఫెన్స్‌ పరిశ్రమలు పరివర్తనాత్మకత ముంగిటకు చేరాయని రక్షణశాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాదనాయక్‌ అన్నారు. ఈ మేరకు నిన్న ఎయిరోస్పేస్‌-డిఫెన్స్‌ తయారీ రంగాల 5వ వార్షిక సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. రక్షణ ఉత్పత్తులలో దేశాన్ని స్వయం సమృద్ధం చేయడంతోపాటు 2025నాటికి 26 బిలియన్‌ డాలర్ల దేశీయ ఉత్పాదన లక్ష్య సాధన దిశగా భారత ఎయిరోస్పేస్‌-డిఫెన్స్‌ తయారీ పరిశ్రమలు బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638925

“ఔషధ ముడిప‌దార్థాల స‌మ్మేళ‌నాలు- స్థాయి, సమస్యలు, సాంకేతిక సంసిద్ధ‌త‌-సవాళ్లు”పై నివేదిక విడుదల చేసిన ‘టిఫాక్‌’

ఔష‌ధ ముడిప‌దార్థ స‌మ్మేళ‌నా (API)ల దేశీయ ఉత్పాద‌న‌ను గ‌ణ‌నీయంగా పెంచ‌డంతోపాటు ఉత్ప‌త్తిలో పొదుపు సాధ్య‌మయ్యేలా చూడాల్సిన‌ అవ‌స‌రం ఎంత‌యినా ఉంద‌ని ‘టెక్నాల‌జీ ఇన్ఫ‌ర్మేష‌న్ ఫోర్‌కాస్టింగ్ అండ్ అసెస్‌మెంట్ కౌన్సిల్’ (TIFAC) స్ప‌ష్టం చేసింది. అలాగే ఎలాంటి ఔషధ ముడిప‌దార్థాల‌కు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుపుతూ వాటి ప్రయోజనాల‌ను స‌వివ‌రంగా పేర్కొంది. ఈ మేర‌కు ఔషధ ముడిప‌దార్థాల స‌మ్మేళ‌నాలు- స్థాయి, సమస్యలు, సాంకేతిక సంసిద్ధ‌త‌-సవాళ్లుపేరిట ఒక నివేదిక‌ను విడుద‌ల చేసింది. కేంద్ర శాస్త్ర-సాంకేతికఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖల మంత్రి డాక్టర్ హర్షవ‌ర్ధ‌న్ ఈ నివేదిక‌తోపాటు కోవిడ్ అనంతరం ‘మేక్ ఇన్ ఇండియా’లో దృష్టి సారించాల్సిన అంశాల‌పై శ్వేతపత్రాన్ని కూడా ఇటీవ‌ల ఆవిష్కరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638896

‘ప‌శుసంవ‌ర్ధ‌క మౌలిక వ‌స‌తుల అభివృద్ధి నిధి’ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసిన కేంద్ర మ‌త్స్య‌-ప‌శుసంవ‌ర్ధ‌క-పాడిప‌రిశ్ర‌మశాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్

కేంద్ర మ‌త్స్య‌, ప‌శుసంవ‌ర్ధ‌క‌, పాడిప‌రిశ్ర‌మ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఇవాళ రూ15 వేల కోట్ల విలువైన ప‌శుసంవ‌ర్ధ‌క మౌలిక వ‌స‌తుల అభివృద్ధి నిధికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేశారు. స్వ‌యం స‌మృద్ధ భార‌తం కార్య‌క్ర‌మ ప్యాకేజీలో భాగంగా వివిధ రంగాల‌లో ప్ర‌గ‌తికి ఉద్దీప‌న దిశ‌గా 24.06.2020న కేంద్ర మంత్రిమండ‌లి ఈ నిధి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. మ‌రోవైపు పాడి ప్రాసెసింగ్ మౌలిక వ‌స‌తుల నిధి ఏర్పాటుతోపాటు స‌హ‌కార రంగంలో మౌలిక స‌దుపాయాల అభివృద్ధి ప‌థ‌కాన్ని కూడా అమ‌లు చేయ‌నున్న‌ద‌ని, ఎహెచ్ఐడిఎఫ్ ప‌థ‌కం ఈ దిశ‌గా ప్రైవేటు రంగానికి  తొలి ప‌థ‌క‌మ‌ని ఆయ‌న అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639176

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో విలేకరులతో ప్రత్యక్ష సమావేశాలవల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి ముప్పు అధికంగా ఉంటుందిగనుక ఇకపై ఈ భేటీలను పూర్తిగా నిలిపివేయాలని నగరపాలన యంత్రాంగాధిపతి ఆదేశించారు. పెళ్లి, దహన సంస్కారాలవంటి అసాధారణ పరిస్థితులకు మాత్రమే వర్తించే కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఎలాంటి సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించవద్దని అన్ని రాజకీయపార్టీలకూ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అలాంటివి జరిగితే కేసులు నమోదు చేయాలని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
  • పంజాబ్: కోవిడ్ సంక్షోభంపై పోరులో ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలకుగల ప్రాముఖ్యం నడుమ పొరుగుసేవల తరహాలో నిపుణులతో కూడిన 15 సామాజిక మాధ్యమ బృందాల ఏర్పాటుకు పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనావైరస్ మహమ్మారి సంబంధిత వివిధ అంశాలపై అవగాహన కల్పన కోసం ఫలిత-ఆధారిత పద్ధతిలో సమాచార ప్రదానం దిశగా ఈ చర్య చాలా ముఖ్యమైనదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
  • హర్యానా: కోవిడ్‌-19 మహమ్మారి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి హర్యానా సాహిత్య అకాడమీ ప్రచురించిన మాసపత్రిక 'హరిగంధ' ప్రత్యేక ఉమ్మడి సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సదరు ప్రత్యేక సంచికకుగల ప్రాధాన్యం, సమాచార వ్యాప్తి సమర్థత గురించి ఆయన వివరించారు, ఈ ప్రత్యేక సంచిక ద్వారా ప్రజలు కరోనా నిరోధంతోపాటు ఇతరత్రా అవసరమైన సమాచారం తెలుసుకునే వీలుంటుందన్నారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని ఆశా కార్మికులు మరింత సమర్థంగా, సజావుగా పనిచేసే పరిస్థితి కల్పించడంలో భాగంగా ముఖ్యమంత్రి వారికి స్మార్ట్ ఫోన్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా వైరస్‌ మహమ్మారిపై హిమాచల్ ప్రదేశ్‌ సమర్థంగా పోరాడుతోందని, దీని నియంత్రణలో ఆశా కార్మికులు కీలకపాత్ర పోషించారని ఆయన కొనియాడారు. అలాగే నిర్బంధవైద్య పర్యవేక్షణ నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించేలా చైతన్యపరచడంలోనూ సహాయపడ్డారని చెప్పారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,975 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 2,75,640కు చేరింది. అయితే, మహారాష్ట్రలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,11,801 మాత్రమే కావడం గమనార్హం. ఇక ముంబైలో యాక్టివ్ కేసులు 22,959 కాగా, రాష్ట్రవ్యాప్తంగా కోలుకునేవారి శాతం 55.37గానూ, మరణాలు 3.96 శాతంగానూ ఉన్నాయి. నాసిక్ జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం "మీ ఇంటివద్ద ఆరోగ్య సంరక్షణ సేవ" పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఏర్పాటైన 556 బృందాలు కోవిడ్ రోగుల జాడ తీయడంలో నిమగ్నమవుతాయి.
  • గుజరాత్: రాష్ట్రంలో బుధవారం 925 కొత్త కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,648కు చేరగా, వీరిలో 31,346 కోలుకున్న కేసులున్నాయి. మరోవైపు ఇప్పటిదాకా 2,081 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష విధానాన్ని ప్రభుత్వం బుధవారం సవరించింది. ఈ మేరకు ఇకపై ఎంబీబీఎస్ వైద్యుడి సిఫారసుపైనా కోవిడ్ పరీక్ష చేయవచ్చు.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 143 కొత్త కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కాగా, బుధవారం రాష్ట్రంలో రికార్డుస్థాయిన 866మందికి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేసుల సంఖ్య 26,580కి చేరగా, యాక్టివ్ కేసులు 6,459గా ఉన్నాయి.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 638 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 19,643కు చేరాయి. వీటిలో 5,053 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటిదాకా 13,908 మంది కోలుకోగా 682 మంది మరణించారు.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో 154 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 4,556కు పెరిగింది.  ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,212గా ఉంది.
  • గోవా: గోవాలో బుధవారం 198 కొత్త కేసులు నమోదయ్యాయి, రాష్ట్రంలో ఒకేరోజు ఇంత అధికంగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కేసులు 2,951కి పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1259గా ఉంది.
  • కేరళ: రాష్ట్రంలో ఇవాళ కన్నూరుకు చెందిన యువకుడొకరు మరణించడంతో కోవిడ్‌ మృతుల సంఖ్య 36కు చేరింది. కాగా, తిరువనంతపురం వైద్య కళాశాలలో నలుగురు డాక్టర్లకు కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో ముందుజాగ్రత్తగా శస్త్రచికిత్స యూనిట్‌లోని దాదాపు 30 మంది వైద్యులను నిర్బంధ వైద్య పరిశీలనకు పంపి ఆ వార్డును మూసివేశారు. ఇక ప్రతి జిల్లాలో ప్రథమశ్రేణి కోవిడ్‌ చికిత్స కేంద్రాలను 5,000 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేరళలో నిన్న నమోదైన 623 కొత్త కేసులలో 450 స్థానిక సంక్రమణవల్ల నమోదైనవి కాగా, మరో 37 అంటువ్యాధులతో సంబంధం లేనివి ఉన్నాయి. ప్రస్తుతం 4,880 మంది చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 1,84,601 మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 9 నెలల శిశువు మరణంతో మృతుల సంఖ్య 22కి చేరింది. మరోవైపు ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 147 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1,743కు చేరింది. ఇక ఇరాన్ నుంచి 40 మంది తమిళనాడు మత్స్యకారులు ఆ రాష్ట్ర రాజధాని చెన్నై చేరారు. కోయంబత్తూర్ జిల్లా కలెక్టరుకు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయంది. ఇక రాష్ట్రంలో నిన్న 4496 కొత్త కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. చెన్నై నుంచి 1291 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య: 1,51,820; యాక్టివ్‌ కేసులు:47,340; మరణాలు: 2167; చెన్నైలో యాక్టివ్ కేసులు: 15,606గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో విధించిన ఏడు రోజుల దిగ్బంధం ఇవాళ రెండో రోజుకు చేరింది. కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్న పౌరులు ప్లాస్మాను దానం చేసి, ఇతరుల ప్రాణాలు కాపాడాలని వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రక్తదాతలను ప్రశంసిస్తూ రూ.5000 వంతున ప్రోత్సాహకం అందిస్తామని ఆయన ప్రకటించారు. బెంగళూరు నగరంలో కోవిడ్ అవగాహన కోసం హోర్డింగ్‌లు, బ్యానర్‌లను ప్రదర్శించడానికి హైకోర్టు అనుమతించింది. ఇక బెంగళూరు నగరంలో 1975 కేసులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 3176 కొత్త కేసులు, 87 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 47,253; యాక్టివ్‌ కేసులు: 27,853; మరణాలు: 928గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో 2020 జనవరి 3 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న వైయస్ఆర్ ఆరోగశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి మరో ఆరు జిల్లాలకు విస్తరించారు. ఈ మేరకు విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కదప, కర్నూలు జిల్లాల్లో అమలు చేస్తారు. వచ్చే ఏప్రిల్ నాటికి అన్ని పంచాయతీలలో గ్రామ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో యాచకులకు మాస్కులు, రెండు సబ్బులతో కూడిన కోవిడ్-19 కిట్లను పంపిణీ చేస్తోంది. చిత్తూరు జిల్లాలోని పీలేరు సబ్ జైలును కోవిడ్-19 జైలుగా మార్చి, జిల్లాలోని వివిధ జైళ్ల నుంచి 138 మంది ఖైదీలను తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 2593 కొత్త కేసులు, 943 డిశ్చార్జ్, 40 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 38,044; యాక్టివ్‌ కేసులు: 18,159; మరణాలు: 492గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఐసీయూలో 20సహా 100 పడకలతో కూడిన కోవిడ్ ఏకాంత చికిత్స బ్లాక్ ప్రారంభమైంది. తెలంగాణలో నిన్న 1597 కొత్త కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి; కొత్త కేసులలో 796 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే. నిన్నటిదాకా మొత్తం కేసులు: 39,342, యాక్టివ్ కేసులు: 12,958, మరణాలు 386గా ఉన్నాయి.
  • అరుణాచల్ ప్రదేశ్: ఇటానగర్ లోని చింపూలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే అపార్టుమెంటులలో కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటుకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
  • అసోం: రాష్ట్రంలోని అజారాలోగల గిరిజానంద చౌదరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ త్వరలో 1000 పడకల సామర్థ్యంతో కోవిడ్‌-19 సంరక్షణ కేంద్రంగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు.
  • మణిపూర్: రాష్ట్రంలోని తౌబల్ జిల్లా ఉమెన్స్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (తౌబల్ ఇమా), లిరోంగ్‌థెల్ ఉమెన్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ అండ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ (CADA) వ్యతిరేక కూటమి తౌబాల్‌లోని లీరాంగ్‌థెల్ మాయి లైకాయ్ వద్ద కోవిడ్‌-19పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. మణిపూర్ బాప్టిస్ట్ కన్వెన్షన్ ఇంఫాల్ లోని ఎంబిసి సెంటర్ చర్చిలో ఒకరోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది.
  • మిజోరం: రాష్ట్రంలో ఇవాళ కోలుకున్న రోగి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 167గా ఉంది.
  • నాగాలాండ్: ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు జాగ్రత్త చర్యగా స్వీయ నిర్బంధ వైద్య పరిశీలనలోకి వెళ్లారు. అయితే, అక్కడినుంచే ఆయన తన విధులు నిర్వర్తిస్తారు.
  • సిక్కిం: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమంగ్ సహా ఆయన భార్య శ్రీమతి శారద, కుమారుడు- ఎమ్మెల్యే అయిన శ్రీ ఆదిత్య తమంగ్ కోవిడ్‌ పరీక్షల నిమిత్తం నమూనాలను ఇచ్చారు. అలాగే వారి భద్రత సిబ్బంది, నివాసంలోని సహాయ సిబ్బందిసహా మొత్తం 95 మంది నమూనాలను సేకరించారు.

FACTCHECK

 

 

******



(Release ID: 1639221) Visitor Counter : 211