రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

వైమానిక, రక్షణ రంగ తయారీ పరిజ్ఞానాలపై సదస్సును ఆవిష్కరించిన మంత్రి శ్రీ శ్రీపాద నాయక్

Posted On: 15 JUL 2020 8:25PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం ప్రకటించిన మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ఫలితంగా భారత రక్షణ, వైమానిక పరిశ్రమ ఈరోజు సరికొత్త మార్పులు చేసుకుంటున్నదని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద నాయక్ అన్నారు. వైమానిక, రక్షణ రంగ తయారీ పరిజ్ఞానాలమీద నేడు ఢిల్లీలో జరిగిన 5వ సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ తో భారత్ ను శక్తిమంతం చేయటం అన్నది ఈ సదస్సులో ముఖ్యాంశం.  


రక్షణ రంగ ఉత్పత్తులలో దేశాన్ని స్వయం సమృద్ధం చేసే బాధ్యతను రక్షణ, వైమానిక పరిశ్రమ తన భుజాలకెత్తుకోవాలని మంత్రి శ్రీ నాయక్ పిలుపునిచ్చారు.  2025  నాటికల్లా 2600 కోట్ల అమెరికా డాలర్ల స్వదేశీ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలన్నారు. రక్షణ ఉత్పత్తు విధానం లక్ష్యం కూడా అదేనని చెప్పారు.


కోవిడ్ సంక్షోభం  విసిరిన సవాళ్ళ గురించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అది తీవ్రమైన ఆర్థిక, సామాజిక సవాళ్లు విసిరిందన్నారు. జనాభా భారీగా ఉన్నప్పటికీ భారతదేశం గడిచిన నాలుగు నెల కాలంలో చేసిన కృషి ఫలితంగా పెద్ద ఎత్తున అవగాహన కల్పించగలిగామన్నారు. అదే విధంగా పరీక్షలు నిర్వహించటానికి తగినంత సామర్థ్యం పెంచుకుంటూ వైద్య సదుపాయాలు కల్పిస్తూ వైరస్ వ్యాప్తి శాతాన్ని అదుపు చేయగలిగామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటూ ఇప్పుడు జీవనోపాధి కల్పించటమనే రెండో దశలోకి ప్రవేశించామన్నారు. పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కోవిడ్ ముందునాటి పరిస్థితుల్లోకి వెళ్ళగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత కొన్నేళ్లలో రక్షణ రంగం విస్తృతంగా పెరిగిందని చెబుతూ 2008 నుంచి  2016 వరకు వార్షిక వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదైందన్నారు. దీంతో 2017-18లో 4283 కోట్ల డాలర్లకు చేరిందన్నారు. భారత్ లో ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమ 2030 నాటికి 7 వేల కోట్లకు చేరే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నామన్నారు. ఈ పరిశ్రమ  బాగా ఎదగటానికి అవకాశముందని, డిజైన్, తయారీ, ఇంజనీరింగ్, టెక్నాలజీ, అభివృద్ధి, సేవలకు కేంద్రంగా తయారై అంతర్జాతీయ పోటీలో నిలబడగల సామర్థ్యం కూడా ఉందని మంత్రి శ్రీ శ్రీపాద నాయక్ అభిప్రాయపడ్దారు.  
భారత విమానయాన మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో ఒకటి అని గుర్తు చేశారు. ఏటా విదేశీయుల రాక 20 శాతం చొప్పున పెరుగుతూ ఉందని, విమానాశ్రయాల మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాపెట్టుబడులు 2026  1.83 కోట్ల అమెరికా డాలర్లుగా నిర్ణయించటంతో పరిస్థితి ఆశావహంగా ఉందని చెప్పారు.  అంతర్జాతీయంగా విమానాల నిర్వహణ, మరమ్మతు, ఓవరాలింగ్ గురించి మాట్లాడుతూ, భారత మార్కెట్ ఇంకా పుంజుకోవాల్సి ఉందన్నారు.  భారత్ లో ఈ మార్కెట్ 80 కోట్ల డాలర్లు కాగా ఏటా సుమారు ఎనిమిది శాతం చొప్పున పెరుగుతోందన్నారు. ప్రపంచ సగటు నాలుగు శాతం మాత్రమే ఉండటాన్ని గుర్తు చేశారు. భారత్ పౌర విమానయాన మార్కెట్  ప్రస్తుతం 90 కోట్ల డాలర్లుండగా ఏటా 14-15  శాతం వృద్ధి నమోదు చేసుకుంటూ  2025 నాటికి 433 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశామన్నారు.
రక్షణ శాఖ కొన్ని ఏళ్ళుగా చేస్తున్న కృషిని శ్రీ శ్రీపాద నాయక్ ప్రస్తావిస్తూ, రక్షణ రంగ ఉత్పత్తిలో అనేక పరికరాలు తయారు చేయటానికి వీలుగా ఆర్డినెన్స్ ఫాక్టరీలు, ప్రభుత్వ రంగ రక్షణ సంస్థల ద్వారా విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయన్నారు. అదే సమయంలో ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ వెబినార్ ను తమిళనాడు టెక్నాలజీ డెవలప్ మెంట్ అండ్ ప్రమోషన్ సెంటర్, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చరర్స్, భారత పరిశ్రమల సమాఖ్య ఉమ్మడిగా ఏర్పాటు చేశాయి.


రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం కార్యదర్శి , డిఆర్ డి ఓ చైర్మన్ డాక్తర్ జి. సతీశ్ రెడ్డి, తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ సిఎండి కుమారి కాకర్ల ఉష, భారత రక్షణ రంగ తయారీదారుల సొసైటీ అధ్యక్షుడు శ్రీ జయంత్ పాటిల్, కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***(Release ID: 1638925) Visitor Counter : 129