పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
భారత్ అభివృద్ధి ప్రక్రియలో అందిన భారీ అవకాశాన్ని వినియోగించుకోండి
అమెరికా పెట్టుబడిదారులకు ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు
అమెరికా ఇంధన మంత్రితో కలసి ఎగ్జిక్యూటివ్ ఇండస్ట్రీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి
Posted On:
16 JUL 2020 10:47AM by PIB Hyderabad
కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం అమెరికా ఇంధనశాఖ మంత్రి డాన్ బ్రౌలెట్టీతో కలసి పారిశ్రామిక వర్గాల స్థాయి సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించారు. అమెరికా-భారత్ వాణిజ్య మండలి (యు.ఎస్.ఐ.బి.సి.) ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. 2020 జూలై 17న జరగనున్న భారత్, అమెరికా వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్య మంత్రుల స్థాయి సమావేశానికి సన్నాహంగా బుధవారం ఈ భేటీని నిర్వహించారు.
అమెరికా-భారత్ వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన పారిశ్రామిక స్థాయి సంప్రదింపుల సమావేశానికి కూడా కేంద్ర మంత్రి అధ్యక్షత వహించారు. ఆన్.లైన్ ద్వారా జరిగిన ఈ వర్చువల్ సమావేశంలో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్, అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సాంధు, ఉభయదేశాల ప్రభుత్వాల ఇంధన శాఖలకు సంబంధించిన పలువురు ప్రతినిధులు, ఉభయదేశాల కంపెనీల ప్రతినిధులు పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ,.భారతదేశంలో అందివచ్చిన కొత్త అవకాశాలను వినియోగించుకోవాలని, విరివిగా పెట్టుబడులు పెట్టాలని అమెరికా కంపెనీలకు, అమెరికా పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికారు. పెట్రోలియం రంగంలో పెట్టుబడులకు సంబంధించి భారత్, అమెరికా పరస్పర సహకారంతో ఇప్పటివరకూ కొంత కృషి జరిగిందని, అయితే ఈ కృషి వాస్తవ సామర్థ్యాలకు అనుగుణంగా లేదని మంత్రి అన్నారు. ఇంధన రంగంలో అమెరికా-భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో దృఢమైనదన్నారు.
ప్రస్తుత సంక్షోభ సమయంలో కూడా భారత్, అమెరికా సన్నిహితంగా, పరస్పర సహకార భావనతో పనిచేస్తూ వస్తున్నాయని, ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడంలోగానీ, కోవిడ్-19 వైరస్ నిర్మూలన కృషిలో గానీ ఉభయదేశాలు కలసికట్టుగా పనిచేస్తున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ నాటి సంక్షుభిత ప్రపంచంలో కూడా, ఉభయదేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యం కొనసాగుతోందని, ఇకపై కూడా నిరాటంకంగా సాగుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.
ఉభయదేశాల వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం గురించి మంత్రి మాట్లాడుతూ,..సహజ వాయు రంగంలో సహకారాన్ని ప్రాధాన్యతా అంశంగా గుర్తించినట్టు చెప్పారు. నౌకలకు ద్రవీకృత సహజవాయువు సరఫరా, ద్రవీకృత సహజవాయువుకు ఐ.ఎస్.ఒ. కంటెయినర్ రూపకల్పన, పెట్రో రసాయనాలు, జీవ ఇంధనాలు, కంప్రెస్డ్ బయోగ్యాస్ వంటి అంశాల్లో కొత్తగా అనేక అవకాశాలు అందుబాటులోకి రాబోతున్నాయని కేంద్రమంత్రి అన్నారు. అన్వేషణ, ఉత్పత్తి రంగంలో చోటు చేసుకుంటున్న పలు తీవ్రమైన మార్పులు, విధానపరమైన సంస్కరణల గురించి ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తావించారు. మనదేశపు చమురు, గ్యాస్ అనేషణ రంగంతోపాటుగా, సహజవాయు మౌలిక సదుపాయాల ఏర్పాటు రంగంలో 118 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని ఆయన చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశ ఆర్థికవ్యవస్థ అవసరాలకు తగినట్టుగా వచ్చే ఐదేళ్లలో గ్యాస్ సరఫరా, పంపిణీ వ్యవస్థలు విరివిగా అభివృద్ధికానున్నాయని మంత్రి చెప్పారు. చమురు, సహజవాయువు అన్వేషణ, సరఫరా రంగాల్లో మరిన్ని ఎక్కువ పెట్టుబడులతో భాగస్వామ్యం వహించాలని ఆయన అమెరికాకు విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక వర్గాల రౌండ్ సమావేశాలు సకాలంలోనే జరుగుతున్నాయని, ఈ సమావేశాల్లో జరిగే చర్చలు పెట్రోలియం పరిశ్రమ కోణంలో చాలా ఉపయోగకరం కాగలవని కేంద్రమంత్రి చెప్పారు.
****
(Release ID: 1639072)
Visitor Counter : 237
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam