యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 కి వ్యతిరేకంగా భారతదేశం చేసే పోరాటంలో సహాయపడటానికి వీలుగా ఒక కోటి స్వచ్చంధ కార్యకర్తలను సమీకరించడానికి కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయి : శ్రీ కిరణ్ రిజిజు.

Posted On: 15 JUL 2020 6:41PM by PIB Hyderabad

కోవిడ్-19 కి వ్యతిరేకంగా భారతదేశ పోరాటాన్ని తీవ్రతరం చేయడానికీ అలాగే సమాజంలోని నిరుపేద వర్గాలలో ఆత్మ నిర్భర్ భారత్ గురించి అవగాహన కల్పించడానికీ, యువజన మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన పథకాలైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్.‌వై.కె.ఎస్) మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్.ఎస్.ఎస్) తో పాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా పెద్ద సంఖ్యలో స్వచ్చంద కార్యకర్తలను సమీకరించడానికి కృషి చేయాలని కేంద్ర యువజన వ్యవహారాలూ, క్రీడల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువజన వ్యవహారాలూ, క్రీడల శాఖల మంత్రులు, సీనియర్ అధికారులకు పిలుపునిచ్చారు.  క్రీడలు, యువత వ్యవహారాలకు సంబంధించిన సమస్యల కోసం ఒక భాగస్వామ్య ప్రణాళికను రూపొందించడానికి కేంద్ర మంత్రి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలితప్రాంతాలతో రెండు రోజుల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వాలంటీర్లను సమీకరించవలసిన అవసరాన్ని గురించి శ్రీ రిజిజు మాట్లాడుతూ, “కోవిడ్ మహమ్మారి సమయంలో, ఎన్.వై.కె.ఎస్. మరియు ఎన్.ఎస్.ఎస్. యొక్క 60 లక్షలకు పైగా వాలంటీర్లు ముందు వరుసలో కోవిడ్ యోధులుగా నిలబడి, పౌరులకు  అవగాహన కల్పించారు, మాస్కులు పంపిణీ చేయడంతో పాటు వివిధ రకాలుగా సహాయ పడ్డారని పేర్కొన్నారు. వారి చురుకైన సహకారాన్ని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు సదస్సులో ప్రశంసించారు, రాబోయే నెలల్లో స్వచ్ఛంద కార్యకర్తల సేవకుల సంఖ్యను భారీగా పెంచుతామని కేంద్రం మరియు అన్ని రాష్ట్రాలు సంయుక్తంగా నిర్ణయించాయి. యువజన మంత్రిత్వ శాఖ పథకాల కింద ఒక కోటికి పైగా స్వచ్చంద కార్యకర్తలను సమీకరించే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు, కేంద్ర మంత్రి తెలిపారు. ఈ స్వచ్చంద కార్యకర్తలు కోవిడ్-19 కి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగించడంతో పాటు, ప్రధానమంత్రి ఆశయంతో రూపొందిన ఆత్మ నిర్భర్ భారత్ యొక్క ప్రయోజనాలను పొందటానికి కూడా సహాయపడతారని ఆయన చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ క్రింద ఉచిత రేషన్, వైద్య సహాయంతో పాటు మరెన్నో ప్రయోజనాలు నిరుపేదలకు నేరుగా అందుతున్నాయనీ, పేద ప్రజల కోసం కేటాయించిన వివిధ ప్రయోజనాల గురించి, మన స్వచ్చంద కార్యకర్తలు, వారికి, అవగాహన కల్పిస్తారనీ, ఈ కష్ట సమయాల్లో చాలా కుటుంబాలు గౌరవంగా జీవించడానికి వీలుగా ఉపయోగపడే సమాచారాన్ని, వారికి అందుబాటులో ఉండే విధంగా వీరు సహాయపడతారనీ, కేంద్ర మంత్రి వివరించారు. 

 

మొదటి లాక్ ‌డౌన్ ప్రకటించిన వెంటనే, 24.17 లక్షల మంది ఎన్.‌వై.కె.ఎస్. కు చెందిన స్వచ్చంద కార్యకర్తలూ, 18.01 లక్షల మంది ఎన్.‌ఎస్.‌ఎస్. కు చెందిన యువ కార్యకర్తలూ, క్షేత్రస్థాయిలో సేవలందించారు.  ఆ తర్వాత, దేశవ్యాప్తంగా విస్తృతంగా సేవలందించడానికి గాను ఈ స్వచ్చంద కార్యకర్తల సంఖ్యను 19.27 లక్షలకు పెంచారు. కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరుగుతున్నా యుద్ధానికి సంబంధించి, వివిధ కార్యకలాపాలలో సహాయపడటానికి 60 లక్షల మందికి పైగా స్వచ్చంద కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. 

 

కోవిడ్ కాలంలో ఫిట్ ఇండియా ఉద్యమం యొక్క ఔచిత్యం గురించి శ్రీ రిజిజు, ఈ సమావేశంలో మాట్లాడుతూ, వైరస్ ను  ఓడించడంలో ఫిట్ ఇండియా ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం రెండూ ముఖ్యమైన అంశాలని ఆయన పేర్కొన్నారు.  "కోవిడ్ సమయంలో ఆన్‌ లైన్‌లో ఫిట్ ఇండియా కార్యకలాపాలను కొనసాగించాలనీ, ఫిట్ ‌నెస్ సంబంధిత కార్యకలాపాల్లో సాధారణ ప్రజలను చేర్చాలనీ, నేను అన్ని రాష్ట్రాలను కోరుతున్నాను. పాఠశాలలను ఫిట్ ఇండియా పాఠశాలలుగా నమోదు చేయడం కూడా ఫిట్ ‌నెస్ విద్యార్థులకు జీవన విధానంగా మార్చడానికి సహాయపడుతుంది. ఒక పాఠశాల ఫిట్ ఇండియా పాఠశాలగా అర్హత సాధించడానికి చాలా ప్రమాణాలు పాటించవలసి ఉంటుంది, అయితే, రోజువారీ పాఠ్యాంశాల్లో తప్పనిసరి ఫిట్‌నెస్ కార్యకలాపాలను చేర్చడం వాటిలో ప్రాథమికమైనది.  పాఠశాలకు వెళ్లే పిల్లలకు వారి రోగనిరోధక శక్తిని పెద్ద ఎత్తున పెంచుకోవడానికి ఈ రోజువారీ ఫిట్ నెస్ ఎంతో సహాయపడుతుంది, ”అని ఆయన అన్నారు.

రాష్ట్రాల్లో క్రీడా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే అవకాశాన్ని సమీక్షించే సమయంలో శ్రీ రిజిజు మాట్లాడుతూ, “క్రీడా కార్యకలాపాలు మరియు శిక్షణా కార్యక్రామాలు ఎప్పుడు ప్రారంభించాలనే విషయాన్ని, రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే, పరిస్థితిని బట్టి 2 లేదా 3 నెలల తర్వాత ఏదో ఒక రకమైన క్రీడా కార్యకలాపాలను ప్రారంభించాలని నేను అన్ని రాష్ట్రాలను కోరుతున్నాను.  మనం పరిమిత పద్ధతిలో మరియు కాంటాక్ట్ కాని క్రీడల కోసం క్రీడా కార్యక్రమాలను ప్రారంభించవచ్చు.  అయితే, కొన్ని రాష్ట్రాలు, వారి క్రీడా సౌకర్యాలను ప్రారంభించాయి, అదే విధంగా, కొన్ని రాష్ట్రాలు క్రీడా శిక్షణా కార్యక్రమాలను కూడా చేపట్టాయి. పరిస్థితి మెరుగుపడటంతో, క్రీడా ప్రాంగణాల్లో క్రీడలను తిరిగి ప్రారంభించడానికి మనం ప్రయత్నించాలి. ” అని పేర్కొన్నారు. 

ఈ సదస్సు రెండవ రోజు పాల్గొన్న చాలా రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు, క్రీడా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయి. మరికొన్ని, దాని కోసం ప్రణాళికలు వేస్తున్నాయి.  ఢిల్లీ, సిక్కిం, లక్షద్వీప్, చండీగఢ్, గోవా రాష్ట్రాలు ఇప్పటికే టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, విలువిద్య, షాట్‌పుట్, జావెలిన్ త్రో వంటి కాంటాక్ట్ కాని క్రీడలతో క్రీడా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయి. ఫుట్‌బాల్ మరియు స్వదేశీ ఆటలలో జిల్లా స్థాయి టోర్నమెంట్లను ప్రారంభించడానికి నాగాలాండ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది,  జార్ఖండ్ సెప్టెంబరులో క్రీడలను ప్రారంభించాలని యోచిస్తోంది. కాగా, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ మరియు మిజోరాం రాష్ట్రాలు కూడా క్రీడలను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన నియమ, నిబంధనలను రూపొందించాయి. 

*****



(Release ID: 1638930) Visitor Counter : 157