PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 09 JUL 2020 6:30PM by PIB Hyderabad

పత్రికా సమాచార సంస్థ

సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ

 భారత ప్రభుత్వం

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: ప్రస్తుత కేసులకన్నా కోలుకునే కేసులు 1.75 రెట్లు అధికం. యాక్టివ్‌-కోలుకున్న కేసుల తేడా 2 లక్షలకుపైగానే; కోలుకునేవారి జాతీయ సగటు 62.09 శాతానికి చేరిక

కోవిడ్‌-19పై గణనీయ విజయంలో భాగంగా కోలుకున్న కేసుల సంఖ్య ఇవాళ 2,06,588 మేర యాక్టివ్ కేసుల సంఖ్య‌ను అధిగ‌మించి 1.75 రెట్లుగా న‌మోదైంది. ఈ మేర‌కు గత 24 గంటల్లో 19,547 మందికి వ్యాధి న‌యం కాగా, ఇప్ప‌టిదాకా కోలుకున్న‌వారి సంఖ్య 4,76,377కు పెరిగింది. ఇంటింటా ప‌రిచయాన్వేష‌ణపై స‌మ‌ర్థ నిఘా‌, రోగుల ముంద‌స్తు గుర్తింపు, ఏకాంత చికిత్సకు త‌ర‌లింపుస‌హా కోవిడ్‌-19 కేసుల సకాల, సమర్థ వైద్య నిర్వ‌హ‌ణ త‌దిత‌రాల‌పై దృష్టి కేంద్రీకరించిన ఫలితంగానే ఈ విజ‌యం సాధ్య‌మైంది. ఈ నేప‌థ్యంలో ప్రస్తుతం 2,69,789 మంది రోగులు చురుకైన వైద్య ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స పొందుతున్నారు. ఇక దేశ‌వ్యాప్తంగా  కోలుకుంటున్న‌వారి జాతీయ స‌గ‌టు కూడా క్ర‌మంగా పెరుగుతూ ఇవాళ 62.09 శాతానికి చేరింది.

మరిన్ని వివరాలకు 

డాక్టర్‌ హర్షవర్ధన్‌ అధ్యక్షతన కోవిడ్‌-19పై మంత్రుల బృందం 18వ సమావేశం

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవ‌ర్ధ‌న్ అధ్య‌క్ష‌త‌న ఇవాళ దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా కోవిడ్-19పై మంత్రుల బృందం 18వ సమావేశం జరిగింది. ఈ సంద‌ర్భంగా దేశంలోని మొత్తం  3,914 ఆస్ప‌త్రులు, ఆరోగ్య కేంద్రాల్లో 3,77,737 ఏకాంత చికిత్స (ఐసీయూ స‌దుపాయంలేని) ప‌డ‌క‌లు, 39,820 ఏకాంత చికిత్స పడకలు, 1,42,415 ప్రాణ‌వాయు స‌ర‌ఫ‌రాగ‌ల పడకలు, మ‌రో 20,047 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయ‌ని అధికార‌వ‌ర్గాలు మంత్రుల బృందానికి వివ‌రించాయి. ఇత‌ర‌త్రా సౌక‌ర్యాలకు సంబంధించి, 213.55 లక్షల  N95 మాస్కులు,  120.94  లక్షల పీపీఈలు, 612.57 లక్షల హెచ్‌సీక్యూ మాత్రలు అంద‌జేసిన‌ట్లు తెలిపాయి. కాగా, ప్ర‌పంచంలో కోవిడ్‌వ‌ల్ల అత్యంత తీవ్రంగా ప్ర‌భావిత‌మైన ఐదు దేశాల్లోని గ‌ణాంకాల‌తో భార‌త్‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితిని స‌మావేశం స‌మీక్షించింది. దీనికి సంబంధించి మ‌న దేశంలో ప్రతి 10 లక్షల జ‌నాభాకు కేసుల సంఖ్య  538 కాగా, మరణాలు 15 వంతున మాత్ర‌మే న‌మోద‌వుతున్న‌ట్లు గుర్తించారు. అయితే, అంతర్జాతీయంగా ప్ర‌తి 10 ల‌క్ష‌ల జ‌నాభాకు కేసులు 1,453, మ‌ర‌ణాలు 68.7 వంతున న‌మోద‌వుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఇక దేశంలో ప‌రిస్థితులను ప‌రిశీలిస్తే- ప్ర‌స్తుతం ఆస్ప‌త్రుల‌లో చికిత్స పొందుతున్న కేసుల‌లో 90 శాతం కేవ‌లం 8 రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాట‌క‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్) న‌మోదైన‌వి కాగా,  అందులో కేవలం 49 జిల్లాల్లో 80 శాతందాకా ఉన్నాయ‌ని గుర్తించారు. ఇక మొత్తం మరణాల సంఖ్య దృష్ట్యా 80 శాతం ఆరు రాష్ట్రాల (మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్)లో సంభవించినట్టు గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. మరిన్ని వివరాలకు

‘భారత అంతర్జాతీయ వారం’ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం; ప్రపంచ పునరుజ్జీవనంలో భారత్‌ కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ‘ఇండియా గ్లోబల్ వీక్’ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను ప్రస్తావిస్తూ- అంతర్జాతీయ పునరుజ్జీవనంలో కీలకపాత్ర పోషించేది భారతదేశమేనని స్పష్టం చేశారు. ఈ కృషి ప్రధానంగా రెండు అంశాలతో ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందులో మొదటిది... భారతదేశ ప్రతిభ కాగా,  రెండోది... సంస్కరణ-పునరుత్తేజ కల్పనలో భారత్‌కుగల సామర్థ్యమని ప్రధాని వివరించారు. ఆ మేరకు ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిభపాటవ శక్తి తోడ్పాటుకు... ప్రత్యేకించి భారత సాంకేతిక పరిశ్రమ, సాంకేతిక నిపుణులకు ఇప్పటికే గణనీయ గుర్తింపు ఉన్నదని గుర్తుచేశారు. భారతదేశం ప్రతిభా-సామర్థ్యాలకు నిలయమని, భారతీయులు సహజ సంస్కర్తలని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు సామాజిక, ఆర్థికపరంగా తలెత్తిన ఎలాంటి  సంక్షోభాలనైనా అధిగమించిందని చరిత్ర ఇప్పటికే రుజువు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ దృష్టిలో పునరుజ్జీవం అంటే:- సంరక్షణ, సహానుభూతిసహా పర్యావరణ-ఆర్థిక సుస్థిరతతో కూడినదిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 

‘ఇండియా గ్లోబల్‌  వీక్‌-2020లో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాస్యం పూర్తి పాఠం

మరిన్ని వివరాలకు

వారణాసిలోని ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలతో ప్రధానమంత్రి సంభాషణ

కోవిడ్‌-19 సంకోభ సమయాన వారణాసిలో ఉపశమన చర్యలు చేపడుతున్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సంభాషించారు. ఒకవైపు కరోనా మహమ్మారి పీడిస్తున్నప్పటికీ పవిత్ర, పుణ్యక్షేత్రమైన వారణాసి ప్రజానీకం ఉప్పొంగే ఉత్సాహంతో, ఆశాభావంతో నిలిచిందని

ప్రధానమంత్రి ప్రశంసించారు. వ్యాధి నిరోధం దిశగా చేపడుతున్న చర్యలు, వివిధ ఆస్పత్రుల స్థితిగతులు, నిర్బంధవైద్య సదుపాయాలు, వలసకార్మికుల సంక్షేమం తదితరాలకు సంబంధించి తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నదని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ పవిత్ర నగరంలో అనేక అధ్యాత్మిక కార్యకలాపాలకు ఆటంకం కలిగినా పేదలను, ఆర్తులను ఆహారం, ఔషధాలతో ఆదుకోవడంలోనేగాక, కరోనాపై పోరాటంలోనూ తామెవరికీ తీసిపోమని వారణాసి ప్రజలు నిరూపించారని కొనియాడారు. అలాగే ప్రభుత్వ, స్థానిక పాలన యంత్రాంగాలతో సంయుక్తంగా ప్రజల సంక్షేమానికి కృషిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలను కూడా ప్రధానమంత్రి అభినందించారు. అత్యల్ప వ్యవధిలో ఆహార సహాయకేంద్రాలు, సామాజిక వంటశాలల విస్తృత చట్రం సృష్టి, సహాయకేంద్రాల అభివృద్ధి, సమాచార సాంకేతిక వినియోగం, వారణాసి స్మార్ట్ సిటీ కంట్రోల్‌-కమాండ్‌ సెంటర్‌ను పూర్తిగా వాడుకోవడం వంటి చర్యలతో పేదలకు అన్ని స్థాయులలోనూ సాయం అందించడంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని ప్రశంసించారు. మరిన్ని వివరాలకు 

వారణాసిలోని ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలతో ప్రధాని సంభాషణ పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు

కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలపై దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా హర్షం; ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు

కరోనా విపత్కర సమయంలో దేశవ్యాప్తంగా ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదన్న ప్రధానమంత్రి దృఢ సంకల్పం ప్రశంసనీయమని దేశీయాంగశాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా ఆయనకు తన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (PMGKAY)ను నవంబరుదాకా పొడిగిస్తూ కేంద్ర మంత్రిమండలి నిన్నటి సమావేశంలో తీర్మానించడంపై హర్షం వ్యక్తంచేశారు. దీనివల్ల కోట్లాది పేదలకు నవంబరుదాకా ఉచిత ఆహారధాన్యాలు అందుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఉజ్వల యోజన కింద ఉచిత వంటగ్యాస్‌ సిలిండర్ల పంపిణీవల్ల సెప్టెంబరుదాకా 7.40 కోట్లమంది పేద మహిళలు లబ్ధిపొందుతారని తెలిపారు. మరిన్ని వివరాలకు 

రాష్ట్రపతికి నియామకపత్రాలు సమర్పించిన మూడు దేశాల రాయబారులు

భారత్‌లో న్యూజిలాండ్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఉజ్బెకిస్థాన్‌ దేశాల రాయబారులుగా నియమితులైన దౌత్యాధికారులు కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి పరిస్థితుల కారణంగా ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా తమ నియామకపత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూడు దేశాలో భారత్‌కు సౌహార్ద స్నేహ సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు

‘ఆపరేషన్‌ సముద్ర సేతు’ను విజయవంతంగా పూర్తిచేసిన భారత నావికాదళం

కోవిడ్‌-19 మహమ్మారి సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశం చేర్చేందుకు 2020 మే 5వ తేదీన ‘ఆపరేషన్‌ సముద్ర సేతు’ కింద భారత నావికాదళం ప్రారంభించిన కృషి విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు ఇప్పటిదాకా 3,992 మంది భారతీయులను సముద్రమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చింది. మొత్తం 55 రోజులపాటు సాగిన ఈ బృహత్కార్యంలో పాలుపంచుకున్న భారత నావికాదళ నౌకలు ‘జలాశ్వ, ఐరావత్‌, శార్దూల్‌, మగర్‌’ 23,000 కిలోమీటర్ల మేర సముద్ర ప్రయాణం చేశాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వైద్యులను, మందులు-వైద్యపరికరాల రవాణా కోసం భారత నావికాదళ ‘ఐఎల్‌-38, డోర్నియర్‌’ విమానాలను వినియోగించారు. మరిన్ని వివరాలకు 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • కేరళ:

తిరువనంతపురం నగరంలో మూడంచెల దిగ్బంధం నాలుగో రోజులోకి ప్రవేశించింది. పూంతురా మత్స్యకార గ్రామంలో వ్యాధి వ్యాప్తి నిరోధానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మూడు వార్డులను క్లిష్టమైన నియంత్రణ జోన్లుగానూ, మరో నాలుగు వార్డులను బఫర్ జోన్లుగానూ ప్రకటించారు. అలాగే చేపలవేట నిషేధించడంతోపాటు పరీక్షల సంఖ్యను పెంచారు. పథనంతిట్టలో మరో నాలుగు కొత్త కేసులకు మూలం తెలియని నేపథ్యంలో పరిస్థితి తీవ్రమవుతోంది. ఇక రాష్ట్రంలో పరిచయ  కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా చికిత్స సదుపాయాల పెంపుసహా నిర్బంధవైద్య పర్యవేక్షణ తిరిగి అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, కేరళలో నిన్న 301 కొత్త కేసులతో ఒకేరోజు అత్యధిక రికార్డు నమోదైంది. వీటిలో 90 స్థానిక సంక్రమణ కేసులున్నాయి.

 • తమిళనాడు:

ఆగస్టు 1 నుంచి కేరళలో చేపల వేటకు తమిళనాడు మత్సకారులను అనుమతించాలని ముఖ్యమంత్రి పళనిస్వామి కేరళ ముఖ్యమంత్రి విజయన్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా కేరళలోని వివిధ ఫిషింగ్ హార్బర్/ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం 350 యాంత్రిక ఫిషింగ్ బోట్లు, తమిళ మత్స్యకారులకు చెందిన 750 సంప్రదాయ పడవలు ఉన్నాయి. కాగా, తమిళనాడులో దిగ్బంధ కాలానికి సంబంధించి అధిక విద్యుత్ బిల్లులు రావడంపై దాఖలైన పిటిషన్లమీద తీర్పును మద్రాస్‌ హైకోర్టు వాయిదా వేసింది. కాగా, రాష్ట్రంలో బుధవారం 3,756 కేసులు నమోదవగా ఇందులో 1,261 చెన్నైకి చెందినవే. ఇక ఈ నెలారంభంలో ఒకేరోజు 2,000 కేసుల స్థాయిని దాటిన నేపథ్యంలో ఇది గణనీయ తగ్గుదలగా భావించవచ్చు. మరోవైపు నిన్న 3051 మంది కోలుకోగా, 64 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,22,350, యాక్టివ్ కేసులు: 46,480, మరణాలు: 1700, చెన్నైలో యాక్టివ్ కేసులు: 21,766గా ఉన్నాయి.

 • కర్ణాటక:

రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా, అధిక ప్రవాహ ఆక్సిజన్ వ్యవస్థల ఏర్పాటుసహా జిల్లా-తాలూకా ఆస్పత్రులు అన్నిటిలోనూ పడకల సంఖ్య పెంచడం కోసం రూ.207 కోట్లు కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్య పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలుకు ప్రభుత్వం రూ.81 కోట్లు మంజూరు చేసింది. వ్యాధి లక్షణరహిత, స్వల్ప లక్షణాలతో బాధపడేవారికి చికిత్స దిశగా హోటళ్ల సహకారంతో కోవిడ్ రక్షణ కేంద్రాలను నిర్వహించేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు సిద్ధమయ్యాయి. తదనుగుణంగా ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లతో కలిపి, ప్రైవేట్ ఆస్పత్రులు త్వరలో 6000 నుంచి 7000 పడకలను అదనంగా సమకూర్చనున్నాయి. కాగా, నిన్న రాష్ట్రంలో 2062 కొత్త కేసులు నమోదవగా, 778 మంది కోలుకున్నారు... 54 మంది మరణించారు. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య: 28,877, యాక్టివ్‌ కేసులు: 16,527 మరణాలు: 470గా ఉన్నాయి.

 • ఆంధ్రప్రదేశ్:

రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులలో కోవిడ్-19 చికిత్స ప్యాకేజీల ధరల పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఆరోగ్యశ్రీ పథకం కింద కోవిడ్-19కు సంబంధించి మొత్తం 15 విధానాలను చేర్చాలని ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రులను ఎ, బి, సి వర్గాలుగా విభజించిన నేపథ్యంలో ‘ఎ’ వర్గంలోని ఆస్పత్రులు ప్రత్యేకంగా కోవిడ్‌-19 రోగులకు మాత్రమే చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇక ‘బి’ వర్గం ఆస్పత్రులలో కోవిడ్-19తోపాటు ఇతర కేసులను చూడాల్సి ఉంటుంది. అలాగే ‘సి’ వర్గంలోని ఆస్పత్రులు కోవిడేతర కేసులకు వైద్యసేవలు అందించాలి. కాగా, కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కేంద్రాన్ని కోవిడ్ -19 ఆస్పత్రిగా మార్చారు. మరోవైపు జూలై 13 నుంచి 31 వరకు దూరదర్శన్‌లో 1-10 తరగతులకు ప్రత్యక్ష పాఠాలు నిర్వహరణకు ప్రభుత్వం కొత్త పాఠ్యాంశాల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 1555 కొత్త కేసులు నమోదవగా, 904 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 13మంది మరణించారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 23,814; యాక్టివ్ కేసులు: 11,383; డిశ్చార్జ్: 12,154 మరణాలు: 277గా ఉన్నాయి.

 • తెలంగాణ:

భారతదేశంలో ప్రజలకు దిగ్బంధాలు సరిపడవని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. కాగా- హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో గురువారం యాంటిజెన్ కిట్లతో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు ప్రారంభించినప్పటికీ ఎక్కువ సంఖ్యలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలపై ప్రభుత్వం ఇంకా విముఖంగానే ఉంది. రాష్ట్రంలో నిన్నటిదాకా నమోదైన కేసులు: 29,536; యాక్టివ్ కేసులు: 11,933; మరణాలు: 324; డిశ్చార్జెస్: 17,279గా ఉన్నాయి.

 • చండీగఢ్‌:

ఈ కేంద్రపాలిత ప్రాంతంలో అన్ని బయో మెడికల్ వ్యర్థాలు... ముఖ్యంగా పీపీఈలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించేలా చూడాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని చండీగఢ్‌ నగర పాలనాధికారి ఆదేశించారు. ఆరోగ్య తనిఖీ కోసం వెళ్లే బృఃదాలు ఆక్సిమీటర్‌ తీసుకెళ్లాలని, తద్వారా వ్యక్తుల ఆక్సిజన్ సంతృప్త స్థాయిని తక్షణం అంచనా వేసే వీలుంటుందని పేర్కొన్నారు. తద్వారా వ్యాధి సంక్రమించిన లక్షణాలు ఏవైనా ఉంటే సులభంగా పసిగట్టడం సాధ్యం కాగలదని పేర్కొన్నారు.

 • పంజాబ్:

రాష్ట్రంలో కోవిడ్‌-19 ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో గైనకాలజీ ఓపీడీసహా సాధారణ ఓపీడీ సేవల నిమిత్తం ఈ-సంజీవని ఓపీడీ వేళలను (సోమవారం నుంచి శనివారందాకా) ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 2:00 గంటలదాకా  పంజాబ్ ప్రభుత్వం పొడిగించింది. ప్రత్యేక వైద్య నిపుణుల సేవలద్వారా ఆన్‌లైన్ టెలి-కన్సల్టేషన్ సదుపాయాన్ని రోగులకు సకాలంలో అందుబాటులో ఉంచడానికి, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భద్రతకు భరోసాగా ఈ మేరకు నిర్ణయించింది.

 • హర్యానా:

రాష్ట్రంలో నవ్య కరోనా వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనడానికి చురుకైన వ్యూహాలు రూపొందిస్తున్నట్లు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. పటిష్ఠ నిఘా, కఠిన నియంత్రణ, సత్వర పరిచయాన్వేషణ, వైద్య నిర్వహణపై నిశిత దృష్టిసహా ముందస్తు సమాచార ప్రదానం-తద్వారా అవగాహన కల్పన కార్యకలాపాలతోపాటు కోవిడ్‌-19 నిర్వహణ సన్నాహాలను మరింత వేగవంతం చేయాలని ఆమె డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. నియంత్రణ జోన్లలో ప్రవేశ-నిష్క్రమణలను గట్టిగా పర్యవేక్షించాలని పోలీసులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు.

 • హిమాచల్ ప్రదేశ్:

కోవిడ్‌-19 మహమ్మారి  సంక్షోభం తమను భిన్నంగా ఆలోచిస్తూ తదనుగుణంగా పనిచేసేలా చేసిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పరీక్షా సమయంలో అంగన్వాడీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. కరోనావైరస్ సామాజిక వ్యాప్తి  నిరోధంలో వారు ఎంతో కృషిచేశారని ప్రశంసించారు. ఆ మేరకు సామాజిక దూరం పాటింపు, మాస్కుల వాడకం,  తదితర జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారని తెలిపారు. అంతేగాక నిర్బంధవైద్య పర్యవేక్షణ నిబంధనల అమలులో ఎంతగానో తోడ్పడ్డారని చెప్పారు.

 • మహారాష్ట్ర:

రాష్ట్రంలో 6,603 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,23,724కు పెరిగింది. వీరిలో ఇప్పటిదాకా 1,23,192 మంది కోలుకోగా, ప్రస్తుతం 91,065 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, మంగళవారం ముంబైలో 1,381 కొత్త కేసులు నమోదయ్యాయి.

 • గుజరాత్:

రాష్ట్రంలో గత 24 గంటల్లో 783 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 38,419కి చేరగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు, దీంతో గుజరాత్‌లో మృతుల సంఖ్య 1,995కు చేరింది. కొత్త కేసులలో గరిష్ఠంగా సూరత్‌లో 215, అహ్మదాబాద్‌లో 149 వంతున నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4.33 లక్షల నమూనాలను పరీక్షించారు.

 • రాజస్థాన్:

రాష్ట్రంలో ఈ ఉదయం వేళకు 149, బుధవారం 659 వంతున కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 22,212కు పెరిగింది. ఇవాళ్టి కొత్త కేసుల్లో అత్యధికంగా నాగౌర్‌లో 29, జైపూర్‌లో 25, అల్వార్‌లో 21 వంతున నమోదయ్యాయి.

 • మధ్యప్రదేశ్:

రాష్ట్రంలో బుధవారం 409 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 16,036కు పెరిగాయి.  ప్రస్తుతం 3,420 యాక్టివ్‌ కేసులుండగా, ఇప్పటిదాకా 11,987మంది కోలుకున్నారు. కాగా, 629 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులలో మొరెనా జిల్లానుంచి 115, భోపాల్ నుంచి 70, గ్వాలియర్ నుంచి 68, ఇండోర్ నుంచి 44 వంతున అత్యధికంగా నమోదయ్యాయి.

 • ఛత్తీస్‌గఢ్‌:

రాష్ట్రంలో 100 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,526కు పెరిగింది. ప్రస్తుతం 677 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.

 • గోవా:

గోవాలో బుధవారం 136 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 2,039కు చేరాయి. ప్రస్తుతం  యాక్టివ్‌ కేసుల సంఖ్య 824గా ఉంది.

 

A stamp with the word Fake on a press note which claims that CBSE has released result dates for Board exams and also lists 3 websites to view the results

 

***********

 (Release ID: 1637644) Visitor Counter : 45