రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

"ఆపరేషన్‌ సముద్ర సేతు"ను ముగించిన భారత నౌకాదళం

Posted On: 08 JUL 2020 6:33PM by PIB Hyderabad

 కొవిడ్‌-19 కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు, ఈ ఏడాది మే 5వ తేదీన ఆపరేషన్‌ సముద్ర సేతు ప్రారంభమైంది. దీనిద్వారా, 3,992 మంది భారతీయులను సముద్ర మార్గం ద్వారా భారత్‌ తీసుకొచ్చారు. నౌకాదళానికి చెందిన జలాశ్వ, ఐరావత్‌, శార్ధూల్‌, మగర్‌ నౌకలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. 55 రోజులపాటు 23 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి. భారత నౌకదళం ఇదే తరహాలో, 2006లో ఆపరేషన్ సుకూన్‌ (బీరూట్‌), 2015లో ఆపరేషన్‌ రహత్‌ (యెమన్‌) చేపట్టింది.

 కొవిడ్‌-19 నౌకలు, నౌకాదళాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి చేర్చే ఆపరేషన్‌ను భారత నౌకాదళం సవాలుగా తీసుకుంది. తరలింపు సమయంలో నౌకలో వైరస్‌ వ్యాపించకుండా చూడడమే నౌకాదళానికి అసలైన సమస్యగా మారింది. అందుకే నౌకాయన సమయంలో కఠిన చర్యలు తీసుకున్నారు. వైద్య, రక్షణ విధానాలను కచ్చితంగా పాటించారు. ఈ చర్యలతో 3,992 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చారు.

 కొవిడ్‌ సంబంధిత సామాజిక దూరం వంటి నిబంధనలు పాటించడానికి, వైద్య ఏర్పాట్లకు, ఎక్కువ మందిని తీసుకురావడానికి అనువైన నౌకలను సముద్ర సేతు ఆపరేషన్‌ కోసం ఎంచుకున్నారు. వీటిలో 'సిక్‌ బే' లేదా వైద్యశాలను కొవిడ్‌-19 సంబంధిత సామగ్రితో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మహిళా ప్రయాణీకుల కోసం మహిళా అధికారులు, మిలిటరీ నర్సులను కూడా ఓడలో నియమించారు. ప్రయాణీకులందరి కోసం కనీస వసతులు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మాతృదినోత్సవం రోజున, జలాశ్వ నౌకలో ప్రయాణించే సమయంలో, సోనియా జాకబ్‌ అనే గర్భిణి మగ శిశువుకు జన్మనిచ్చింది.

 జలాశ్వ, ఐరావత్‌, శార్ధూల్‌, మగర్‌ నౌకలు 23 వేల కిలోమీటర్లకుపైగా ప్రయాణించి, ప్రయాణీకులను సాఫీగా భారత్‌ తీసుకొచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

 

నౌక 

తరలింపు ప్రారంభ తేదీ

పోర్టు పేరు

పౌరుల సంఖ్య

తరలింపు ముగింపు తేదీ

గమ్యస్థానం

జలాశ్వ

మే 8 

మాలే 

698

మే 10 

కోచి

మగర్

మే 10

మాలే 

202

మే 12 

కోచి

జలాశ్వ

మే 15 

మాలే

588

మే 17 

కోచి

జలాశ్వ

జూన్ 1 

కొలంబో

686

జూన్ 2 

ట్యుటికోరిన్

జలాశ్వ

జూన్ 5 

మాలే 

700

జూన్ 7 

ట్యుటికోరిన్

శార్ధూల్

జూన్ 8 

బందర్‌ అబ్బాస్

233

జూన్‌ 11

పోరుబందర్‌

ఐరావత్‌

జూన్ 20

మాలే

198

జూన్ 23 

ట్యుటికోరిన్

జలాశ్వ

జూన్ 25

బందర్‌ అబ్బాస్

687

జూలై 1

ట్యుటికోరిన్

 ఇతర ప్రభుత్వ విభాగాల తరహాలోనే, ప్రజాసేవలో భారత నౌకాదళం కూడా ముందుంది. వైద్యులు, కొవిడ్‌ సంబంధిత సామగ్రిని దేశవ్యాప్తంగా తరలించడంలో, నౌకాదళానికి చెందిన ఐఎల్‌-38, డోర్నియర్‌ విమానం సేవలు అందించాయి. పీపీఈ కిట్‌ నవరక్షక్, చేతిలో ఇమిడే ఉష్ణోగ్రత సెన్సార్లు, శ్వాసకోశ సహాయక వ్యవస్థ, 3-డి ప్రింటెడ్ ముఖ కవచం, తరలించేందుకు వీలయ్యే మల్టీ ఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్, వెంటిలేటర్లు, విమానాల్లో ఉపయోగపడే స్ట్రెచర్లు, సామగ్రిని క్రిమిరహితం చేసే వ్యవస్థలు వంటివాటి తయారీలోనూ భారత నౌకాదళం పాలుపంచుకుంది. ఈ ఆవిష్కరణల్లో చాలావాటిని ఆపరేషన్‌ సముద్ర సేతులో ఉపయోగించారు. నౌకలు ఏ దేశానికి వెళితే ఆ దేశానికి వీటిని అందించారు.

 జలాశ్వ, మగర్‌, ఐరావత్‌, శార్ధూల్‌ నౌకలు ఆపరేషన్‌ సముద్ర సేతులో పాల్గొంటే, మరో నౌక కేసరి 'మిషన్‌ సాగర్‌'లో పాలుపంచుకుంది. 580 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య సామగ్రిని మాల్దీవులు, మారిషస్‌, మడగాస్కర్‌, కొమొరోస్ దీవులు,  సీషెల్స్‌కు చేరవేసింది. ఇందుకోసం 49 రోజులపాటు 14 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. మారిషస్‌, కొమొరోస్‌ దీవులకు ఒక్కో వైద్య బృందాన్ని తీసుకెళ్లింది.

 ఆపరేషన్‌ సముద్ర సేతు ద్వారా స్వదేశానికి తిరిగొచ్చిన 3,992 మంది భారతీయులు పై పట్టికలో చూపిన విధంగా వివిధ పోర్టులకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారి బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థల సమన్వయంతో ఆపరేషన్‌ సముద్ర సేతును చేపట్టారు.

 *******

 


(Release ID: 1637400) Visitor Counter : 328