ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం


చికిత్సలో ఉన్నవారి కంటే కోలుకున్నవారు 1.75 రెట్లు ఎక్కువ

కోలుకున్న, చికిత్సలో ఉన్నవారి మధ్య తేడా 2 లక్షల పైమాటే

జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 62.09% చేరిక

Posted On: 09 JUL 2020 6:20PM by PIB Hyderabad

కోవిడ్ బాధితులలో చికిత్స పొందుతున్నవారికంటే కోలుకున్నవారు 2,06,588 మంది ఎక్కువగా ఉండటం చెప్పుకోదగిన పరిణామం. కోలుకున్నవారు 1.75  రెట్లు ఎక్కువగా ఉండటమంటే దాదాపుగా రెండు రెట్లకు దగ్గరలో ఉన్నట్టు భావించాలి. గడిచిన  24  గంటల్లో మొత్తం19,547 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,76,377 కు చేరుకుంది. ఇంటింటికీ వైరస్ సోకిన వారి మీద నిఘా పెట్టటం, ముందస్తుగా బాధితులను గుర్తించటం, సకాలంలో తగిన చికిత్స అందించటం లాంటి చర్యలద్వారా ఈ విధమైన ఫలితం సాధించగలిగారు.

ప్రస్తుతం 2,69,789 మంది బాధితులుండగా వారందరికీ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది.

భారత్ లో కోలుకుంటున్న కోవిడ్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది.  ఆ విధంగా ఈరోజుకు కోలుకున్నవారి శాతం 62.09 శాతానికి పెరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలతో సంఖ్యా పరంగా  పోల్చుకున్నప్పుడు ప్రతి పది లక్షల మందిలో పాజిటివ్ కేసుల సంఖ్య భారత్ లో 195.5  నమోదు కావటం ప్రపంచంలోనే అత్యల్పం. ఎప్పటికప్పుడు కంటెయిన్మెంట్, బఫర్ జోన్లను గుర్తించి వేరుచేయటం, దూకుడుగా పరీక్షలు జరపటం, ముందుగా బాధితులను గుర్తించటం, చికిత్సావిధానాలకు కట్టుబడి ఉండటం , ఐసియు ఆస్పత్రులను సమర్థంగా నిర్వహించటం లాంటి చర్యల కారణంగా ప్రపంచ స్థాయిలో అత్యల్ప మరణాలు నమోదైన దేశాల్లోనూ భారత్ ఒకటిగా నిలిచింది. భారత్ లో ప్రతి పది లక్షలమందిలో  15.31  చొప్పున నమోదు కాగా మరణాల శాతం పరంగా చూస్తే అది 2.75%. అదే, ప్రపంచ స్థాయిలో ప్రతి పది లక్షలకూ 68.7 కావటం గమనార్హం.

రోజువారీ పరీక్షల సంఖ్య పెంచుకోవటంలోనూ భారత్ లో ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,67,061  శాంపిల్స్ పరీక్షించారు. దీంతో ఈ రోజు వరకు జరిపిన పరీక్షల సంఖ్య 1,07,40,832 కు చేరుకుంది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, భారత వైద్య పరిశోధనామండలి ఉమ్మడి కృషి ఫలితంగా టెస్టింగ్ లాబ్ ల నెట్ వర్క్ దేశంలో బాగా బలం పుంజుకుంది.దీంతో దేశంలోని మొత్తం లాబ్ ల సంఖ్య 1132 కి చేరుకోగా అందులో 805 ప్రభుత్వ ఆధ్వర్యంలోను, 327ప్రైవేట్ రంగంలోను ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

  • తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ :  603  (ప్రభుత్వ: 373  + ప్రైవేట్:  230)
  • ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 435 (ప్రభుత్వ: 400   + ప్రైవేట్: 35)
  • సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 94 (ప్రభుత్వ: 33  + ప్రైవేట్: 61)

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి


(Release ID: 1637619) Visitor Counter : 231