ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మీద డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశం


ప్రతి పదిలక్షల జనాభాలో మరణాలు భారత్ లో తక్కువ: మంత్రి

"మరణాలు అతి తక్కువగా ఉండేట్టు చూడటమే లక్ష్యం"

Posted On: 09 JUL 2020 1:41PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ నేతృత్వంలో కోవిడ్ మీద మంత్రుల బృందం 18వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు జరిగింది. ఆయనతోబాటు విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్, పౌర విమానయాన శాఖామంత్రి శ్రీ హర్ దీప్ ఎస్. పూరి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మాన్ సుఖ్ మాండవ్యా, నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు శ్రీ వినొద్ పౌల్ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితిని మంత్రులకు వివరించారు. ప్రపంచ స్థాయిలో అత్యధికంగా ప్రభావితమైన మొదటి ఐదు దేసాల స్థితితో పోల్చి చూశారు. ఇందులో భారతదేశంలో ప్రతి పది లక్షలకు కేసుల సంఖ్య  538 గాను, మరణాల సంఖ్య కూడా ప్రతి పది లక్షలకు 15 చొప్పున అతి తక్కువగాను నమోదైనట్టు గుర్తించారు. అంతర్జాతీయంగా కేసుల సంఖ్య 1453. మరణాల సంఖ్య 68.7 ఉన్నట్టు తెలుసుకున్నారు. దేశం లోపల ఎనిమిది రాష్ట్రాల్లో ( మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్) మొత్తం 90% కేసులు చికిత్సలో ఉన్నట్టు, అందులో కేవలం 49 జిల్లాల్లోనే 80%  కేసులు చికిత్సలో ఉన్నట్టు గుర్తించారు. మొత్తం మరణాల సంఖ్య దృష్ట్యా చూస్తే 80% మరణాలు ఆరు రాష్ట్రాల ( మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ) లో సంభవించినట్టు లెక్కలు చూపుతున్నాయి. జిల్లాల పరంగా చూస్తే 32 జిల్లాల్లోనే 80%  మరణాలు నమోదయ్యాయి. ఎక్కువ మరణాలు నమోదవుతున్న ప్రాంతాలలో ప్రత్యేక కృషి జరుగుతున్నట్టు మంత్రుల బృందానికి తెలియజేశారు.

దేశంలో కోవిడ్ సంబంధమైన ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతూ ఈ రోజు వరకూ దేశంలో ఉన్న పరిస్థితిని కూడా మంత్రులకు తెలియజేశారు. మొత్తం 3914 ఆస్పత్రులలో చికిత్స జరుగుతుండగా వాటిలో ఐసియు సౌకర్యం లేని 3,77,737  ఐసొలేషన్ పడకలు, 39,820 ఐసొలేషన్ పడకలు, 1,42,415 ఆక్సిజెన్ తో కూడిన పడకలు, 20,047  వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

సామగ్రి విషయానికొస్తే 213.55 లక్షల  ఎన్95 మాస్కులు,  120.94  లక్షల పిపిఇ లు, 612.57 లక్షల హెచ్ సి క్యు మాత్రలు పంపిణీ చేశారు.

లాక్ డౌన్ నిబంధనల సడలింపు మొదలయ్యాక కంటెయిన్మెంట్ జోన్ల లో నిఘా మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ ప్రాతాంలను ప్రత్యేకంగా విభజించటం, వాటి వివరాలను వెబ్ సైట్ లో ప్రకటించటం, పరిసరాలమీద గట్టి నిఘా పెట్టటం, కేవలం నిత్యావసరాలకు మాత్రమే అనుమతించటం, వైరస్ సోకే అవకాశం ఉన్నవాళ్ల ఆచూకీ తెలుసుకోవటం, ఇంటింటికీ తనిఖీలు జరపటం, కంటెయిన్మెంట్ జోన్ల కాని చోట్లలో బఫర్ జోన్లు గుర్తించటం తద్వారా, వైరస్ సోకే అవకాశమున్న వారిని గుర్తించటం లాంటి చర్యలు చేపట్టారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో అనేక చర్యలు చేపట్టిన విషయం కూడా మంత్రుల బృందం దృష్టికి వచ్చింది. ప్రజారోగ్య నిపుణులతో కూడిన కేంద్ర బృందాలు అనేక రాష్ట్రాలను సందర్శించటం, రాష్ట్రాలకు అవసరమైన సలహాలిస్తూ మార్గదర్శనం చేయటం , తద్వారా వ్యాధి విస్తరణను నియంత్రించటం లాంటి చర్యలు చేపట్టిన తీరును తెలియజేశారు. కాబినెట్ సెక్రటరీ ఎప్పటికప్పుడు బాగా ప్రభావితమైన రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు జరపటం, పరీక్షల సంఖ్య పెంచేలా చూడటం, మరణాలు తగ్గేందుకు కృషి చేయటం లాంటి అంశాలను కూడా మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళారు.

డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, " మనం ముందుకెళ్ళేకొద్దీ, వ్యాధి నియంత్రణమీద ప్రత్యేకంగా దృష్టిపెట్టటం, నిఘా పెంచటం, పూర్తి స్థాయి పరీక్షల సామర్థ్యాన్ని వాడుకోవటం, వృద్ధులలో దీర్ఘకాలిక వ్యాధులున్నవారిమీద ఒక కన్నేసి ఉంచటం, ఆరోగ్య సేతు లాంటి యాప్స్ సాయంతో రాబోయే హాట్ స్పాట్స్ ఏవో ముందుగా గుర్తించగలగటం రోగులను చేర్చుకోవటంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడటం, పడకలు, ఆక్సిజెన్, వెంటిలేటర్లు, ఇతర పరికరాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించటం మీదనే పనిచేస్తున్నాం" అన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో మరణాల రేటును వీలైనంత తక్కువ స్థాయిలో ఉంచటం, ఆరంభ దశలోనే బాధితులను గుర్తించటం. చికిత్స అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.

వ్యాధి నియంత్రణ జాతీయ కేంద్రం ( ఎన్ సి డి సి) డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కె సింగ్ ఈ సంక్షోభం కాలంలో చేపట్టిన నిఘా కార్యకలాపాలను సవివరంగా తెలియజేశారు. శ్వాస సంబంధమైన వ్యాధులున్నవారిని గుర్తించటం మీద వారికి నయం చేయటం మీద ప్రధానంగా దృష్టిపెట్టామన్నారు. సీరమ్ సేకరణ ద్వారా సర్వే చేయటం, దేశ వ్యాప్తంగా లాబ్ ల సంఖ్య పెంచి పరీక్షల సంఖ్య పెంచటం తగిన ఫలితాలనిచ్చిందన్నారు. ఎక్కువగా ప్రబలిన చోట్ల మరింత ఎక్కువగా పనిచేసి సకాలంలొ వైద్య సేవలు అందేలా చూదగలిగామని అధిక రిస్క్ ఉందనుకున్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తులపట్ల అప్రమత్తంగా వ్యవహరించామని చెప్పారు. ఆ విధంగా మరణాల శాతం తగ్గించగలిగామన్నారు.

ఎంపవర్డ్ గ్రూప్ చైర్మన్ శ్రీ అమిత్ ఖారే మంత్రుల బృందానికి వివరంగా అన్ని చర్యలనూ వివరించటంతో బాటు వారి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సమాచార వ్యాప్తిలోను, ప్రజలకు అవగాహన కల్పించటంలోను ఎంతో జాగ్రత్తగా వ్యవహరించినట్టు వివరించారు. మొత్తం 6,755 అబద్ధపు వార్తలకు గాను   5,890 విషయంలో సమాధానాలిచ్చామని, 17 విదేశీ మీడియా వార్తాకథనాలకు స్పందించి జవాబివ్వగా ప్రచురించాయని చెప్పారు. రోజువారీ కోవిడ్ బులెటిన్స్ 98  జారీచేయటాన్ని, 92  మీడియా సమావేశాలు నిర్వహించగా 2,482 పత్రికా ప్రకటనలు జారీచేయటాన్ని ప్రస్తావించారు. ఈ సంక్షోభ కాలంలో ప్రజల అవగాహన పెంచి వారి ప్రవర్తనను సరిదిద్దటంలో సమర్థంగా పనిచేసినట్టు తెలియజేశారు. అదే విధంగా రైతులకు, సూక్ష్మ, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలకోసం  ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ అభియాన్ లోని రాయితీలను వివరించటంలో కూడా తగిన పాత్ర పోషించామన్నారు. కోవిడ్ కారణంగా తలెత్తిన అనేక మానసిక సమస్యలమీద మీడియాలో కథనాలు వస్తున్న సమయంలో ఒక ప్రత్యేక వ్యూహం ద్వారా ప్రాంతీయ భాషల్లో తగిన సమాచారం అందిస్తూ వీలైనంత మందిని చేరుకోగలిగామన్నారు.

ఆరోగ్య శాఖ కార్యదర్శి కుమారి ప్రీతి సుదాన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఒ ఎస్ డి శ్రీ రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సీఈవో శ్రీ అమితాబ్ కాంత్, ఐసి ఎంఆర్ డిజి డాక్టర్ బలరామ్ భార్గవ, ఫార్మా విభాగం కార్యదర్శి శ్రీ పిడి వాఘేలా, షిప్పింగ్ కార్యదర్శి శ్రీ సంజీవ్ రంజన్, జౌళి శాఖ కార్యదర్శి శ్రీ రవి చోప్రా, డిడబ్ల్యు ఎస్ కార్యదర్శి శ్రీ పరమేశ్వరన్ అయ్యర్, ఎం ఇ ఐ టి వై  కార్యదర్శి శ్రీ అజయ్ ప్రకాష్ సాహ్నే, ఐటిబిపి ప్రతినిధులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

 

*****


(Release ID: 1637556) Visitor Counter : 257