PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
07 JUL 2020 6:24PM by PIB Hyderabad
పత్రికా సమాచార సంస్థ
సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: ప్రపంచంలో ప్రతి 10 లక్షల జనాభాకు కేసులు స్వల్పంగా నమోదయ్యే దేశాల్లో భారత్; కోలుకున్నవారు దాదాపు 4.4లక్షలు; ప్రస్తుత కేసులకన్నా 1.8 లక్షలు అధికంగా కోలుకున్నవారి సంఖ్య; కోలుకునే జాతీయ సగటు 61 శాతం
ప్రపంచంలో ప్రతి 10 లక్షల జనాభాకు కేసులు అతిస్వల్పంగా నమోదయ్యే దేశాల్లో భారత్ కూడా ఒకటని 2020 జూలై 6వ తేదీనాటి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 168వ స్థాయీ నివేదిక వెల్లడించింది. ఆ మేరకు ప్రతి 10 లక్షల మంది జనాభాకు అంతర్జాతీయ సగటు 1453.25కాగా, భారత్‌లో 503.37 మాత్రమేనని నివేదిక పేర్కొంది.
అలాగే భారత్‌లో ప్రతి 10 లక్షల జనాభాకు మరణాలు 14.27 మాత్రమే కాగా, ప్రపంచ సగటు 4 రెట్లకు మించి 68.29గా నమోదైనట్లు నివేదిక తెలిపింది.
దేశంలో కోవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా 1201 ఆస్పత్రులు, 2611 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, 9909 రక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గడచిన 24 గంటల్లో 15,515 మందికి వ్యాధి నయం కాగా, ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 4,39,947కు పెరిగింది. ఈ మేరకు ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారికన్నా కోలుకునేవారి సంఖ్య 1,80,390 మేర అధికంగా నమోదైంది. దీంతో కోలుకునేవారి జాతీయ సగటు 61.13 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 2,59,557 మంది కోవిడ్ బాధితులు చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,41,230 పరీక్షలు నిర్వహించగా, ఇప్పటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య 1,02,11,092కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రత్యేక రోగ నిర్ధారణ ప్రయోగశాలల సంఖ్య 1115కు చేరగా- ప్రభుత్వ రంగంలో 793, ప్రైవేటు రంగంలో 322 ఉన్నాయి. మరిన్ని వివరాలకు-I & మరిన్ని వివరాలకు-II
విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో పరీక్షల నిర్వహణకు దేశీయాంగ శాఖ అనుమతి
దేశవ్యాప్తంగాగల విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో పరీక్షల నిర్వహణకు దేశీయాంగ శాఖ అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి ఒక లేఖద్వారా సమాచారమిచ్చింది. విశ్వవిద్యాలయాల్లో పరీక్షలు-విద్యా కేలండర్ అనుసరణపై విశ్వవిద్యాలయ అనుమతుల సంఘం (UGC) మార్గదర్శకాల ప్రకారం తుది పరీక్షల నిర్వహణ తప్పనిసరి. ఈ నేపథ్యంలో దేశీయాంగ శాఖ అనుమతి లభించినప్పటికీ కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ ఆమోదిత ప్రామాణిక ప్రక్రియ పద్ధతిని కూడా పాటించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు
విశ్వవిద్యాలయాల్లో పరీక్షలు, విద్యా కేలండర్‌పై సవరించిన యూజీసీ మార్గదర్శకాలను విడుదల చేసిన హెచ్‌ఆర్‌డి మంత్రి
దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నడుమ విశ్వవిద్యాలయాల్లో పరీక్షలు, విద్యా కేలండర్‌పై సవరించిన యూజీసీ మార్గదర్శకాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (HRD) మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ 2020 జూలై 6వ తేదీ న్యూఢిల్లీలో విడుదల చేశారు. విద్యార్థులకు ఆరోగ్యం, భద్రత, సమాన-సముచిత అవకాశాలకు హామీ సూత్రాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీ పోఖ్రియాల్ ఈ సందర్భంగా వివరించారు. అదే సమయంలో అంతర్జాతీయంగా విద్యావ్యవస్థ విశ్వసనీయత, విద్యార్థులకు భవిష్యత్ అవకాశాలు, ప్రగతికి భరోసా ఇవ్వడం కూడా కీలకమేనని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నడుమ బోధన, అభ్యసన, పరీక్షలు, విద్యా కేలండర్ అనుసరణ తదితర సమస్యల పరిష్కారానికి యూజీసీ నిరంతర కృషి ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. మరిన్ని వివరాలకు
“మనల్ని నిలువరించే అవకాశం మహమ్మారికి ఇవ్వరాదు”; ద్వైపాక్షిక ఆరోగ్య సహకారంపై స్వీడన్ ఆరోగ్యశాఖ మంత్రితో డాక్టర్ హర్షవర్ధన్ చర్చ
భారత్-స్వీడన్ దేశాల మధ్య ఆరోగ్య-వైద్య రంగాల్లో సహకారంపై చర్చించడం కోసం స్వీడన్ ఆరోగ్య-సామాజిక వ్యవహారాల శాఖ మంత్రి లెనా హాలెన్‌గ్రెన్ ఇవాళ కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌తో డిజిటల్ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు. రెండు దేశాల్లో కోవిడ్-19 నియంత్రణ చర్యలు, ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్తులో మహమ్మారి నిర్వహణ వ్యూహంపై ఈ సందర్భంగా వారిద్దరూ చర్చించారు. కోవిడ్-19 మహమ్మారి నిర్వహణలో భారత్ అనుభవాలను గురించి డాక్టర్ హర్షవర్ధన్ వివరిస్తూ- “భారతదేశంలో కోలుకునేవారు 61 శాతంకన్నా అధికం... అలాగే 135 కోట్ల జనభాగల విశాల దేశంలో మరణాలు కేవలం 2.78 శాతం మాత్రమే. నిత్యం 2.5 లక్షల మంది ప్రజలకు రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కోవిడ్-19 నిర్ధారణకు నాలుగు నెలల కిందట దేశంలో ఒకేఒక్క ప్రయోగశాల ఉండగా, నేడు ఆ సంఖ్య 1100కు చేరింది” అని పేర్కొన్నారు. వాస్తవానికి నవ్య కరోనా వైరస్ విజృంభణను భారత్ ఒక అవకాశంగా మలచుకున్నదని డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. మరిన్ని వివరాలకు
గంగా పునరుజ్జీవన పథకానికి ఆర్థిక సహాయం పెంపులో భాగంగా ప్రపంచ బ్యాంకు నుంచి భారత్‌కు 400 మిలియన్ డాలర్ల రుణం
గంగానది పునరుజ్జీవనానికి ఉద్దేశించిన ‘నమామి గంగే’ కార్యక్రమానికి ఆర్థిక సహాయ పెంపులో భాగంగా ప్రపంచ బ్యాంకు-భారత ప్రభుత్వం మధ్య ఒక రుణ ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. ప్రతిష్ఠాత్మక గంగానదిలో కాలుష్యం తొలగింపుతోపాటు 500 మిలియన్ల ప్రజలకు ఆవాసమైన ఈ నదీ పరీవాహక ప్రాంతాన్ని బలోపేతం చేయడానికి రెండో జాతీయ గంగా నదీతీర పథకం (SNBGRB) చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు నుంచి లభించే 400 మిలియన్ డాలర్ల సాయంలో 381 మిలియన్లు రుణం కాగా, 19 మిలియన్ డాలర్లు ప్రతిపాదిత హామీ మొత్తంగా ఉంటుంది. ఆ మేరకు నదిలోకి కాలుష్య కారకాల ప్రవాహ నియంత్రణ దిశగా ఎంపిక చేసిన పట్టణ ప్రాంతాల్లో మురుగు పారుదల సదుపాయాల కల్పన, మురుగు శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు నదీతీర పథకం కింద ఆర్థిక సహాయం అందుతుంది. సదరు మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులు, వాటిద్వారా లభించే ఉపాధి అవకాశాలవల్ల కోవిడ్-19 సంక్షోభం నుంచి భారత్ ఆర్థికంగా కోలుకునే వీలు కలుగుతుంది. మరిన్ని వివరాలకు
జాతీయ ఔషధ మొక్కల బోర్డు-ఐసీఏఆర్ పరిధిలోని జాతీయ మొక్కల జన్యువనరుల సంస్థ మధ్య అవగాహన ఒప్పందం
ఆయుష్ మంత్రిత్వశాఖ పరిధిలోని జాతీయ ఔషధ మొక్కల బోర్డు (NMPB), వ్యవసాయ విద్య-పరిశోధన విభాగం కిందగల ఐసీఏఆర్ పరిధిలోని జాతీయ మొక్కల జన్యువనరుల సంస్థ (NBPGR) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఔషధ, సుగంధ మొక్కల జన్యు వనరులను పరిరక్షణ ఈ అవగాహన ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో జాతీయ జన్యు నిధిలోగల దీర్ఘకాలిక నిల్వ విభాగంలోని ఐసీఏఆర్-ఎన్‌బీపీజీఆర్ నిర్దేశిత ప్రదేశంలో లేదా ప్రాంతీయ కేంద్రంలోని మాధ్యమిక నిల్వ కేంద్రంలో వీటిని ఉంచుతారు. మొక్కల జీవద్రవ్య పరిరక్షణ పద్ధతులపై ఎన్‌ఎంపీబీ కార్యాచరణ బృందానికి ఇక్కడ శిక్షణ ఇవ్వడం కూడా ఒప్పందంలో భాగంగా ఉంటుంది. మరిన్ని వివరాలకు
ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్-19పై పోరు దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో చేయి కలిపిన బీఎస్‌ఐపీ
కోవిడ్-19 నిరోధం, నియంత్రణ, నిర్వహణ దిశగా దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి కేంద్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్-19పై పోరు దిశగా శాస్త్రవిజ్ఞాన-సాంకేతిక శాఖ (DST) పరిధిలోని బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్ (BSIP) రాష్ట్ర ప్రభుత్వంతో చేయి కలిపింది. కాగా, రాష్ట్రంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల నిర్వహణకు బీఎస్‌ఐపీ తొలుత చొరవ చూపింది. ఈ సంస్థలో పురాతన డీఎన్‌ఏ బీఎస్‌ఎల్-2ఎ (DNA BSL-2A) ప్రయోగశాల అందుబాటులో ఉండటంతో ఇక్కడ తక్షణ పరీక్షలకు వీలు కలిగింది. తదనుగుణంగా ఇక్కడి ప్రయోగశాల 24 గంటలూ పనిచేస్తూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అందే నమూనాలలో రోజుకు 400 వంతున పరీక్షించి ఫలితాలు వెల్లడిస్తోంది. ఈ మేరకు ఇప్పటిదాకా 12,000కుపైగా నమూనాలను పరీక్షించింది. మరిన్ని వివరాలకు
ఆరోగ్య రంగంపై ప్రపంచ బ్యాంకు, దాని ఉన్నతస్థాయి బృందంతో 15వ ఆర్థిక సంఘం సమావేశం
భారత ఆరోగ్య రంగ స్వరూప, స్వభావాల గురించి మరింత లోతైన అవగాహన దిశగానూ, ఆరోగ్య రంగంలో నిధుల వ్యయంపై పునఃప్రాధాన్యీకరణ అవసరంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం దృష్ట్యా 15వ ఆర్థిక సంఘం ఇవాళ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, నీతి ఆయోగ్, కమిషన్ ఉన్నతస్థాయి బృందం సభ్యులతో సమావేశమైంది. కాగా, ఆరోగ్య రంగానికి నిధులపై ఒక అధ్యాయం మొత్తాన్నీ ప్రత్యేకించడం ఇదే తొలిసారి అని కమిషన్ చైర్మన్ చెప్పారు. మరిన్ని వివరాలకు
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
నగరంలో ప్రవేశించే సమయంలో వెలుపలి వ్యక్తులకు ఆరోగ్య పరీక్షలతోపాటు వారి రాక సందర్భంగానూ, బసచేసే ప్రదేశంలోనూ వారితోగల పరిచయస్తులపై మరింత పర్యవేక్షణ పెట్టాలని కేంద్రపాలిత ప్రాంత పాలనాధికారి నొక్కిచెప్పారు. అలాగే రుతుపవన వర్షాల సంబంధిత వ్యాధులు విజృంభిచకుండా చూసుకోవాలని వైద్యులు, మునిసిపల్ అధికారులను కూడా ఆయన ఆదేశించారు. ఇక సామాజిక దూరం నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు క్యాంటీన్లలో లేదా కార్యాలయ గదులలో కలిసి భోజనం చేయడం మానాలని ఆదేశించారు. అలాగే టీ విరామ సమయంలోనూ ఉద్యోగులు మాస్కులు ధరించడంసహా సామాజిక దూరం పాటించాలని చెప్పారు.
రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులందరికీ పంజాబ్‌లో ఇ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. తదనుగుణంగా జారీచేసిన మార్గదర్శకాల మేరకు యాత్రికులు తమ ఇళ్లనుంచే ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకుని, ఇబ్బందుల్లేకుండా ప్రయాణించవచ్చు. సరిహద్దు తనిఖీ కేంద్రాలవద్ద రద్దీని, జనం బారులు తీరడాన్ని నివారించడంద్వారా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడటం లక్ష్యంగా ప్రభుత్వం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పద్ధతిని ప్రవేశపెట్టింది.
కోవిడ్-19 ప్రభావంతో ఇబ్బందుల్లో పడిన స్థిరాస్తి రంగాన్ని ఆదుకునే దిశగా హర్యానా ప్రభుత్వం 2020 మార్చి 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 వరకు 7 నెలలపాటు నిబంధనల పాటింపునుంచి మినహాయింపుసహా వడ్డీ చెల్లింపులపై తాత్కాలికంగా గడువు పొడిగింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అన్ని CLUలు, లైసెన్సులు తదితరాలకు వర్తిస్తుంది. ఆ మేరకు 2020 మార్చి 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 మధ్య వ్యవధిని శూన్యకాలంగా పరిగణిస్తామని ప్రకటించింది.
రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల మధ్య కూడా ఔషధ పరిశ్రమ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉందని, ఈ పరిశ్రమలలో తయారయ్యే మందుల ఇతర దేశాలకూ ఎగుమతి అవుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. కోవిడ్-19వల్ల చాలా రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమైన నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చడానికి ప్రయత్నాలు సాగాలని ఆయన సూచించారు. అయితే, అనేక రాష్ట్రాలతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది.
రాష్ట్రంలో మరో కోవిడ్ మరణం నమోదవడంతో మృతుల సంఖ్య 28కి చేరంది. మృతుడు కొళ్లం జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువకుడు.. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చి నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉండి, నిన్న తుదిశ్వాస విడిచాడు. ఈ నేపథ్యంలో అతడికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక కోళికోడ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో మరో ఆరుగురు నివాసులకు వ్యాధి నిర్ధారణ కావడంతో మొత్తం వ్యాధి పీడితుల సంఖ్య 11కు చేరింది. దీంతో ఇక్కడి నివాసితులు కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించడంలేదని తేలగా జిల్లా యంత్రాంగం కొత్త ఆదేశాలు జారీచేసింది. మరోవైపు రాష్ట్రానికి వెలుపల మరో ముగ్గురు కరోనా వైరస్‌కు బలయ్యారు. వీరిలో ఒకరు కువైట్‌లో, ఇద్దరు ముంబైలో మరణించారు. కాగా, ముంబైలో ఇప్పటిదాకా మరణించిన మలయాళీల సంఖ్య 40కి పెరిగింది. కేరళలో నిన్న 193 కొత్త కేసులు నమోదవగా, ప్రస్తుతం 2,252 మంది చికిత్సలో ఉన్నారు. మరో 1.83 లక్షల మంది నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉన్నారు.
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కోవిడ్-19 రోగుల సంరక్షణ కోసం ప్రైవేటు వైద్య కళాశాలలను ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోనుంది. కాగా, కోవిడ్-19 మహమ్మారి మరణాల గురించి జూలై 15లోగా సమగ్ర సమాచారం పంపాలని కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ)ను ఆదేశించింది. కోవిడ్-19 రోగులకు చికిత్స అందించే ఆరోగ్య కార్యకర్తల రక్షణ కోసం ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు నైలాన్ ఆధారిత నానో కోటెడ్ ఫిల్టర్‌ను అభివృద్ధి చేశారు; ఈ ప్రాజెక్టుకు డీఆర్‌డీవో నిధులు సమకూరుస్తోంది. ఇక రాష్ట్రంలో నిన్న 3827 కొత్త కేసులు నమోదవగా 3793మంది కోలుకున్నారు. మరో 61 మరణాలు నమోదయ్యాయి. కాగా, కొత్త కేసులలో చెన్నై నుంచి 1747 నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య: 1,14,978కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 46,833 మరణాలు: 1571 చెన్నైలో యాక్టివ్ కేసులు: 24,082గా ఉన్నాయి.
రాష్ట్రంలో కోవిడ్-19 ఆర్థిక ఉపశమన ప్యాకేజీలో భాగంగా చేనేత కార్మికుల కోసం ‘నేకర సమ్మాన యోజన’ పేరిట ప్రత్యక్ష లబ్ధి బదిలీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇక కోవిడ్ సంరక్షణ కేంద్రాల్లో తుది సంవత్సరం ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడం లేదంటూ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ముందువరుసలోగల కర్ణాటకలోని ఆశా కార్యకర్తలు జూలై 10 నుంచి విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నిన్న 1843 కొత్త కేసులు, 680 డిశ్చార్జెస్, 30 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య: 25,317 కాగా, యాక్టివ్ కేసులు: 14,385 మరణాలు: 401 డిశ్చార్జి: 10,527గా ఉన్నాయి.
రాష్ట్రంలోఇంజనీరింగ్-మెడిసిన్ ఎంట్రన్స్ (EAMCET) పరీక్షను పటిష్ఠ చర్యలతో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది; ఈ నేపథ్యంలో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సహాయంతో జూలై 19న నమూనా పరీక్ష నిర్వహించనున్నారు. నెల్లూరులో ఇద్దరు సహోద్యోగులు కోవిడ్-19కు బలికావడమేగాక మరికొందరికి వ్యాధి సోకడంతో ఏపీఎస్సార్టీసీ ఉద్యోగులు మంగళవారం విధులను బహిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 16,238 నమూనాలను పరీక్షించిన నేపథ్యంల 1178 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 762 మంది వ్యాధినుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 13 మంది మరణించారు. కొత్త కేసులలో 22 అంతర్రాష్ట్ర వాసులవి కాగా, ఒకటి విదేశాల నుంచి వచ్చినవారికి సంబంధించినది. ప్రస్తుతం మొత్తం కేసులు: 21,197, యాక్టివ్ కేసులు: 11,200 మరణాలు: 252 డిశ్చార్జి అయినవి: 9745గా ఉన్నాయి.
కోవిడ్ రోగుల చికిత్స, ఖర్చులకు సంబంధించి స్పష్టమైన ఆదేశాల కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ వైద్యకళాశాలలు ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ-ఆఫీస్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది, ఈ విధానం చాలాకాలం నుంచీ పెండింగ్‌లో ఉంది. కాగా, నిన్నటి వరకు మొత్తం కేసులు: 25,733, యాక్టివ్ కేసులు: 10,646 మరణాలు: 306, డిశ్చార్జెస్: 14,781గా ఉన్నాయి.
రాష్ట్రంలో 250 మందికిపైగా పోలీసులు కరోనావైరస్ బారినపడ్డారు, వారిలో 80 శాతం గువహటి నగరానికి చెందినవారేనని అసోం డీజీపీ శ్రీ భాస్కర్ జ్యోతి మహంత సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా ప్రకటించారు.
రాష్ట్రంలో దిగ్బంధం నిబంధనలను ఉల్లంఘిస్తూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని, సామాజిక దూరం నిబంధనను పాటించని 442మందితోపాటు 265 వాహనాలను కూడా మణిపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారినుంచి జరిమానా కింద రూ.57,500 వసూలు చేశారు.
రాష్ట్రంలో ఇవాళ 19 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం మిజోరంలో యాక్టివ్ కేసుల సంఖ్య 58కాగా, ఇప్పటిదాకా 139 మంది కోలుకున్నారు.
బెంగళూరు నుంచి 500మంది నాగాలాండ్ వాసులతో బయల్దేరిన ఒక ప్రత్యేక రైలు 2020 జూలై 9న రాష్ట్రంలోని దిమాపూర్ చేరుకోనుంది. కాగా, రాష్ట్రంలో 11 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 636కు చేరింది. వీటిలో 393 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకూ 243 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
రాష్ట్రంలో ‘మిషన్ బిగిన్ ఎగైన్’ కింద 5వ దశలో ప్రభుత్వం ఆంక్షలను క్రమక్రమంగా తొలగిస్తోంది. ఈ మేరకు నియంత్రణ జోన్ల వెలుపల హోటళ్లు, లాడ్జీలు, అతిథిగృహాలు రేపటినుంచి 33 శాతం సిబ్బందితో తిరిగి తెరిచేందుకు తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. మహారాష్ట్రలో 5,368 కొత్త కరోనావైరస్ కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 2,11,987కు చేరింది. కాగా, సోమవారం 3,522 మందికి వ్యాధి నయంకాగా, వారిని డిశ్చార్జ్ చేశారు, ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 1,15,262కు చేరగా, ప్రస్తుతం రాష్ట్రంలో 87,681 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో 735 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 36,858కి చేరింది. గుజరాత్‌లో వరుసగా మూడోరోజు 700కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు 17 మంది మరణించడంతో మృతుల సంఖ్య 1962కు పెరిగింది. కొత్త కేసులలో సూరత్ నుంచి గరిష్ఠం 201 కేసులు నమోదవగా 168 కేసులతో హ్మదాబాద్ తర్వాతి స్థానంలో ఉంది.
రాష్ట్రంలో ఈ ఉదయందాకా 234 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 20,922కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,949కాగా, కోలుకున్నవారి సంఖ్య 16,320కి పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కిల్ కరోనా’ ప్రచారోద్యమం కింద ఇప్పటిదాకా 56 లక్షలకుపైగా ఇళ్లలో సర్వే చేసి, సుమారు 2.9 కోట్ల మంది ప్రజలపై పరిశీలన నిర్వహించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 354 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 15,284కు చేరింది. ఇక సోమవారం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులనుంచి 168 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 11,579కు పెరిగింది.
ప్యాక్ట్ చెక్
*******
(Release ID: 1637121)
Visitor Counter : 303
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam