మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని విశ్వవిద్యాలయాల పరీక్షలు మరియు అకాడెమిక్ క్యాలెండర్‌ పై యు.జి.సి. సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసిన - కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి

Posted On: 07 JUL 2020 2:40PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని,  విశ్వవిద్యాలయాల పరీక్షలు మరియు అకాడెమిక్ క్యాలెండర్ పై యు.జి.సి సవరించిన మార్గదర్శకాలను, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్', 2020 జులై, 6వ తేదీన న్యూఢిల్లీ నుండి ఆన్ లైన్ ద్వారా విడుదల చేసింది.  విద్యార్థులకు ఆరోగ్యం, భద్రత, న్యాయమైన మరియు సమాన అవకాశాల సూత్రాలను పరిరక్షించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రీ పోఖ్రియాల్ చెప్పారు. అదే సమయంలో, ప్రపంచవ్యాప్తంగా విద్యా విశ్వసనీయత, ఉద్యోగ అవకాశాలు మరియు విద్యార్థుల భవిష్యత్ పురోగతిని నిర్ధారించడానికి ఇది చాలా కీలకమైనదని ఆయన పేర్కొన్నారు.  కోవిడ్-I9 మహమ్మారి యొక్క క్లిష్ట సమయాల్లో బోధన, అభ్యాసం, పరీక్షలు, అకాడెమిక్ క్యాలెండర్ మొదలైన వాటికి సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి యు.జి.సి. చేస్తున్న నిర్విరామ కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. 

 

పరీక్షలు మరియు అకాడెమిక్ క్యాలెండర్‌కు సంబంధించిన సమస్యలపై చర్చించి, సిఫార్సులు చేయడానికి విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ 2020 ఏప్రిల్ నెలలో ఒక  నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.  కమిటీ నివేదిక ఆధారంగా, యు.జి.సి. 2020 ఏప్రిల్ 29వ తేదీన పరీక్షలు మరియు అకడమిక్ క్యాలెండర్ పై మార్గదర్శకాలను జారీ చేసింది.  కోవిడ్ కేసుల సంఖ్య ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో, మార్గదర్శకాలను పునఃసమీక్షించి పరీక్షలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశాలు మరియు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ఎంపికలను సూచించాలని నిపుణుల కమిటీని యు.జి.సి. కోరింది.

కమిషన్ 2020 జులై, 6వ తేదీన నిర్వహించిన తన అత్యవసర సమావేశంలో కమిటీ సమర్పించిన నివేదికను అంగీకరించింది మరియు "కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని విశ్వవిద్యాలయాలకు పరీక్షలు మరియు అకాడెమిక్ క్యాలెండర్ల పై యు.జి.సి. సవరించిన మార్గదర్శకాలను"  ఆమోదించింది.

మార్గదర్శకాల లోని కొన్ని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి :

*          భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారికి సంబంధించి నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, విద్యార్థులకు ఆరోగ్యం, భద్రత, న్యాయమైన మరియు సమాన అవకాశాల సూత్రాలను పరిరక్షించడం చాలా ముఖ్యం.  అదే సమయంలో, ప్రపంచవ్యాప్తంగా విద్యా విశ్వసనీయత, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల భవిష్యత్ పురోగతిని నిర్ధారించడం కూడా చాలా కీలకం.  ఏ విద్యావ్యవస్థలోనైనా  విద్యార్థుల విద్యా మూల్యాంకనం చాలా ముఖ్యమైన మైలురాయి.  పరీక్షలలో వారి పనితీరు, విద్యార్థులకు విశ్వాసం, సంతృప్తి ఇస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా  ఆమోదానికి అవసరమైన సామర్థ్యం, పనితీరు మరియు విశ్వసనీయత యొక్క ప్రతిబింబంగా ఉంటుంది. 

*          చివరి సెమిస్టర్ (లు) / చివరి సంవత్సరం (లు) పరీక్షలను 2020 సెప్టెంబర్ చివరి నాటికి ఆఫ్‌ లైన్ (పెన్ను & కాగితం) / ఆన్ ‌లైన్ / రెండు రకాలు కలిపి (ఆన్‌ లైన్ + ఆఫ్ ‌లైన్) పద్ధతుల్లో నిర్వహిస్తారు.

*          బ్యాక్ ‌లాగ్ ఉన్న చివరి సెమిస్టర్ / చివరి సంవత్సరం విద్యార్థుల సాధ్యత, అనుకూలత ప్రకారం ఆఫ్‌ లైన్ (పెన్ను & కాగితం) / ఆన్ ‌లైన్ / రెండు రకాలు కలిపి (ఆన్ ‌లైన్ + ఆఫ్ ‌లైన్) పద్ధతుల్లో పరీక్షలు నిర్వహించడం ద్వారా  తప్పనిసరిగా మదింపు చేయాలి.

*          ఒకవేళ చివరి సెమిస్టర్ / చివరి సంవత్సరం విద్యార్ధి విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షల్లో హాజరు కాలేకపోతే, కారణం (లు) ఏమైనా కావచ్చు, అతను / ఆమెకు అలాంటి కోర్సు (ల) కోసం ప్రత్యేక పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఇవ్వవచ్చు. విశ్వవిద్యాలయానికి ఎప్పుడు సాధ్యమైతే అప్పుడు ఈ పరీక్షలను నిర్వహించవచ్చు. తద్వారా విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి / ప్రతికూలతకు గురికాకుండా ఉంటారు.  ఈ అవకాశం ప్రస్తుత విద్య సంవత్సరం 2019-20 కి మాత్రమే, ఒకసారి మాత్రమే వర్తిస్తుంది.

*          మధ్యంతర సెమిస్టర్ / సంవత్సర పరీక్షకు సంబంధించి, 29.04.2020 తేదీన జారీ చేసిన మార్గదర్శకాలలో ఎటువంటి మార్పు లేదు. 

*          అవసరమైతే, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశాలు, అకాడెమిక్ క్యాలెండర్ కు సంబంధించిన వివరాలు 2020 ఏప్రిల్ 29వ తేదీన జారీ చేసిన మునుపటి మార్గదర్శకాలలో పేర్కొన్న వాటి స్థానంలో విడిగా తిరిగి జారీ చేయబడతాయి.

2020 ఏప్రిల్,  29వ తేదీ నాటి యు.జి.సి. మార్గదర్శకాల కోసం, ఇక్కడ క్లిక్ చేయండి:

https://static.pib.gov.in/WriteReadData/userfiles/UGC%20Guidelines%20on%20Examinations%20and%20Academic%20Calendar.pdf

 

****

 



(Release ID: 1637008) Visitor Counter : 202