PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
03 JUL 2020 6:32PM by PIB Hyderabad
పత్రికా సమాచార సంస్థ
సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: కోలుకునేవారి శాతం 60కిపైగానే; గత 24 గంటల్లో గణనీయంగా పెరిగి 20,033కు చేరిన కోలుకున్న వారి సంఖ్య; యాక్టివ్‌తో పోలిస్తే నయమైనవారి సంఖ్య 1.5 లక్షలకుపైగానే; గత 24 గంటల్లో 2.4 లక్షల నమూనాల పరీక్ష
దేశంలో కోవిడ్-19 నిర్వహణ సన్నద్ధతపై కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి ఇవాళ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాగా, కోలుకునేవారి శాతం ఇవాళ 60.73గా నమోదైంది. కోవిడ్-19 కేసుల సత్వర అన్వేషణ, సకాల వైద్య నిర్వహణ ఫలితంగా కోలుకుంటున్నవారి సంఖ్య నిత్యం వృద్ధి చెందుతూనే ఉంది. ఈ మేరకు గడచిన 24 గంటల్లో గణనీయంగా పెరిగి 20,033గా నమోదైంది. దీంతో ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 3,79,891కి చేరింది. ప్రస్తుతం 2,27,439 మంది కోవిడ్ బాధితులు చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇక చికిత్స పొందుతున్న వారికన్నా కోలుకున్నవారి సంఖ్య ఇవాళ 1,52,452 మేర అధికంగా నమోదైంది. మరోవైపు రోజువారీ కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా స్థిరంగా పెరుగుతూ 93 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 2,41,576 కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 92,97,749కి పెరిగింది. కోవిడ్ ప్రత్యేక ప్రయోగశాలలు దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ్టికి 1074కు చేరగా- 775 ప్రభుత్వ రంగంలో, 299 ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నాయి. మరిన్ని వివరాలకు
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు 2 కోట్లకుపైగా ఎన్-95 మాస్కులు, కోటికిపైగా పీపీఈలు ఉచితంగా పంపిణీ
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆరోగ్య మౌలిక వసతుల బలోపేతంలో కేంద్ర ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ మేరకు 2020 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా మొత్తం 2.02 కోట్ల ఎన్-95 మాస్కులు, 1.18 కోట్ల పీపీఈ కిట్లను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు కేంద్రీయ సంస్థలకు ఉచితంగా పంపిణీ చేసింది. అంతేకాకుండా 6.12 కోట్ల హెచ్‌సీక్యూ మాత్రలను కూడా అందజేసింది. ఇవేకాకుండా నేటివరకూ 11,300 ‘మేక్ ఇన్ ఇండియా’ వెంటిలేటర్లను కూడా వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/కేంద్రీయ సంస్థలకు పంపింది. వీటిలో 6,154 ఇప్పటికే పలు ఆస్పత్రులకు అందాయి. దీంతో కోవిడ్ ఐసీయూ సదుపాయాలున్న చోట్ల వెంటిలేటర్ల కొరతను తీర్చడం సాధ్యమైంది. మరోవైపు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ (MoHFW), 1.02 లక్షల ప్రాణవాయు సిలిండర్లను కూడా రాష్ట్రాలకు/కేంద్రపాలిత ప్రాంతాలకు పంపింది. ఇందులో 72,293 ఇప్పటికే ఆక్సిజన్ ఆధారిత పడకలున్న ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు చేరాయి. కాగా, ఢిల్లీలో 7.81 లక్షల పీపీఈలు, 12.76 లక్షల ఎన్-95 మాస్కులు అందాయి. అలాగే మహారాష్ట్రకు 11.78 లక్షల పీపీఈలు, 20.64 లక్షల ఎన్-95 మాస్కులు సరఫరా చేయబడ్డాయి. అదేవిధంగా తమిళనాడుకు 5.39 లక్షల పీపీఈలు, 9.81 లక్షల ఎన్-95 మాస్కులను కేంద్ర ఆరోగ్యశాఖ అందించింది. మరిన్ని వివరాలకు
కోవిడ్-19 నడుమ 20 లక్షలమంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రూ.62,361 కోట్ల పన్ను వాపసు
కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నడుమ పన్ను చెల్లింపుదారులకు తోడ్పాటులో భాగంగా పెండింగ్‌లోగల ఆదాయపు పన్ను వాపసు మొత్తాల చెల్లింపునకు ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల మేరకు 2020 ఏప్రిల్ 8 నుంచి జూన్ 30 వరకు ఆదాయపు పన్ను శాఖ నిమిషానికి 76 వంతున అత్యంత వేగంగా పన్ను వాపసు అభ్యర్థనలను పరిష్కరించింది. ఆ మేరకు కేవలం 56 వారాంతపు రోజులలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) 20.44 లక్షలకుపైగా అభ్యర్థనలపై రూ.62,361 కోట్ల చెల్లింపునకు ఉత్తర్వులిచ్చింది. ఆదాయపు పన్ను విభాగం తమకు సన్నిహితం కావడాన్ని పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ప్రస్ఫుటంగా చూడగలుగుతున్నారు. అంతేగాక మహమ్మారి సంక్షోభ కష్టకాలంలోద్రవ్యలభ్యత సదుపాయ ప్రదాతగానూ గుర్తిస్తున్నారు. ఈ మేరకు ఆదాయపు పన్ను విభాగంద్వారా 19,07,853 వ్యక్తిగత అభ్యర్థనలకు సంబంధించి రూ.23,453.57 కోట్లు, కార్పొరేట్ పన్ను వాపసు సంబంధిత 1,36,744 అభ్యర్థనలపై రూ.38,908.37 కోట్ల వంతున పన్ను చెల్లింపుదారులకు తిరిగి చెల్లించింది. మరిన్ని వివరాలకు
జాతీయ రాజధాని ప్రాంతంలో కోవిడ్-19పై ఉమ్మడి వ్యూహం దిశగా ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో దేశీయాంగ శాఖ మంత్రి సమావేశం
జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో కోవిడ్-19పై ఉమ్మడి వ్యూహం దిశగా ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నిన్న సమావేశం నిర్వహించారు. ఎన్‌సీఆర్‌లో వ్యాధి సంక్రమణ శాతాన్ని తగ్గించే దిశగా కోవిడ్-19 అనుమానిత కేసుల విషయంలో పరీక్షల సంఖ్యను మరింత పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన నొక్కిచెప్పారు. ఆ మేరకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష కిట్ల వినియోగంద్వారా పరీక్షల నిర్వహణ చేపడితే వ్యాధి సంక్రమణను 10 శాతంకన్నా దిగువకు తగ్గించవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్లు శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. నిరుపేదలు, బలహీనవర్గాలవారి ప్రాణరక్షణలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఆ మేరకు రోగులను వీలైనంత త్వరగా ఆస్పత్రిలో చేర్చడంద్వారా మరణాల శాతం తగ్గించడంపైనా శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. ఎన్‌సీఆర్ పరిధిలో కరోనా వ్యాప్తిని సవ్యంగా గుర్తించేందుకు ‘ఆరోగ్య సేతు, ఇతిహాస్’ అనువర్తనాలను వాడుకోవాలని శ్రీ అమిత్ షా చెప్పారు. ఢిల్లీలోని అఖిలభారత వైద్యవిజ్ఞానశాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లోగల టెలిమెడిసిన్ సదుపాయంద్వారా కోవిడ్ రోగులకు వైద్య నిపుణులు సలహాలిస్తున్నారని మంత్రి వివరించారు. ఇదే విధానాన్ని ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోనూ అనుసరించవచ్చునని సూచించారు. కాగా, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు
కర్ణాటకలో 1.59 కోట్ల కుటుంబాలపై దుర్బలత గుర్తింపు అధ్యయనం నిర్వహించిన 42000 మంది ఆశా కార్యకర్తలు
కర్ణాటకలో కోవిడ్-19పై ప్రభుత్వ పోరాటం విజయవంతం కావడంలో 42,000మంది ఆశా (ASHA) కార్యకర్తలు మూలస్థంభంగా నిలిచారు. ఈ మేరకు కోవిడ్-19పై ఇంటింటి సర్వేతోపాటు అంతర్రాష్ట్ర ప్రయాణికులు, వలసకార్మికులు తదితరులకు సంబంధించి సామాజిక సంక్రమణ లక్షణాలను గుర్తించడంలో ఆశా కార్యకర్తలు చురుగ్గా భాగం పంచుకున్నారు. ఇందులో భాగంగా జనాభాలో కోవిడ్-19 బారినపడే అవకాశమున్న దుర్బలవర్గాలు, వృద్ధులు, ఇతరత్రా అనారోగ్యాలున్నవారు, రోగనిరోధకత తగ్గినవారు తదితరులను గుర్తించేందుకు నిర్వహించిన ఏకకాల అధ్యయనంలో 1.59 కుటుంబాల వివరాలను వారు పరిశీలించి అనుమానిత రోగుల వివరాలను నమోదు చేశారు. అంతేగాక తమ పరిధిలోని ప్రాంతాల్లో అధికముప్పుగల వారి విషయంలో నిరంతర పర్యవేక్షణ బాధ్యత వహిస్తున్నారు. అలాగే నియంత్రణ మండళ్ల పరిధిలో రోజులో ఒకసారి, ఇతర ప్రాంతాల్లో 15 రోజులకు ఒకసారి వంతున కేసుల అనుగమన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్ కేసులే కాకుండా రాష్ట్ర ఆరోగ్యశాఖ సహాయ కేంద్రాలకు ఫోన్ చేసే అధిక ముప్పుగల, ఐఎల్‌ఐ, ‘సారి’ (ILI, SARI) పీడితుల కేసులను కూడా ఆశా కార్యకర్తలు పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలకు
జల్ జీవన్ మిషన్: దిగ్బంధం సమయంలో 19 లక్షల కుటుంబాలకు మంచినీటి కొళాయి కనెక్షన్లు
దేశవ్యాప్తంగా కోవిడ్-19పై పోరాటం సాగుతున్న వేళ... ‘జల్‌జీవన్ మిషన్’ కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కొళాయి కనెక్షన్లద్వారా సురక్షిత మంచినీటి సరఫరా దిశగా కేంద్ర ప్రభుత్వం తనవంతు కర్తవ్యం నిర్వర్తించింది. దీనివల్ల గ్రామాల్లోని కొద్దిపాటి మంచినీటి వనరులవద్ద గ్రామీణ ప్రజలు బారులుతీరాల్సిన దుస్థితి తప్పడమేగాక స్థానికులకు, తిరిగివచ్చిన వలస కార్మికులకు ఉపాధి కూడా లభించి, తద్వారా గ్రామీణ ఆర్థికానికి ఉత్తేజం లభించింది. ఈ మేరకు 2020-21 తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా పలు గ్రామాల్లో 19 లక్షల కొళాయి కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. రాష్ట్రాల్లోనూ కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులతో ఒకవైపు పోరు కొనసాగిస్తూనే అక్కడి ప్రభుత్వాలు కూడా ఈ కృషిలో చురుగ్గా పాలుపంచుకున్నాయి. కాగా, జల్‌జీవన్ మిషన్ కార్యక్రమంలో రాష్ట్రాల భాగస్వామ్యం కూడా ఉంది. మరిన్ని వివరాలకు
ప్రాథమిక దశ విద్యాభ్యాసం దిశగా 8 వారాల ప్రత్యామ్నాయ విద్యా కేలండర్‌ను ఆవిష్కరించిన కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి
కోవిడ్-19 నేపథ్యంలో ఇళ్లవద్దనే ఉండిపోయిన ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులను అర్థవంతమైన విద్యాభ్యాస కార్యకలాపాల్లో నిమగ్నం చేసేదిశగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చొరవచూపింది. ఈ మేరకు తన మార్గనిర్దేశంలో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయుల సహకారంతో జాతీయ విద్యా-పరిశోధన-శిక్షణ మండలి (NCERT) ద్వారా 8 వారాలకు సరిపడా ప్రత్యామ్నాయ విద్యా కేలండరును తయారుచేయించింది. సదరు కేలండర్‌ను ఆ శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ఆహ్లాదకర, ఆసక్తికర మార్గాల్లో విద్యనందించడంలో భాగంగా అందుబాటులోగల వివిధ సాంకేతిక ఉపకరణాలు, సామాజిక మాధ్యమ సాధనాలపై ఈ కేలండర్ ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేస్తుంది. వీటిని అభ్యాసకులు, ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు ఇళ్లలో కూడా వాడుకునే వీలుంటుంది. మరిన్ని వివరాలకు
స్వయం సమృద్ధ భారతం సాకారానికి కోవిడ్-19 ఉపయోగపడుతుంది: డాక్టర్ రఘునాథ్ మషేల్కర్
స్వయం సమృద్ధ భారతం సాకారం దిశగా దేశంలో ప్రతి ఒక్కరిలోనూ స్వీయ పునరావిష్కరణ, పునర్నిర్మాణం, పునరుత్తేజం అవసరమన్న చైతన్యాన్ని కోవిడ్-19 తీసుకొచ్చిందని పద్మ విభూషణ్.. డాక్టర్ రఘునాథ్ అనంత్ మషేల్కర్ అన్నారు. “ఆత్మవిశ్వాసంతో స్వయం సమృద్ధ భారత నిర్మాణం” ఇతివృత్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. స్వావలంబన లేదా స్వయం సమృద్ధ భారత సాకారం కోసం సాగే కృషిలో ప్రపంచం నుంచి మనల్ని మనం వేరుగా చేసుకోవడం కుదరదని, అందుకుబదులు ప్రపంచ సరఫరా శృంఖలతో మమేకం కావాల్సి ఉంటుందని డాక్టర్ మషేల్కర్ స్పష్టం చేశారు. స్వయం సమృద్ధ భారతానికి “కొనుగోలు, తయారీ, మెరుగుదల కోసం కొనుగోలు, మెరుగైన కొనుగోలు కోసం తయారీ, సమష్టిగా తయారీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల నిర్మాణం)” ఐదు మూలస్తంభాలని ఆయన విశదీకరించారు. మరిన్ని వివరాలకు
భారత పురావస్తు శాఖ పరిధిలోని కేంద్రీయ రక్షిత స్మారకాల సందర్శన 2020 జూలై 6 నుంచి ప్రారంభం
దేశంలోని కేంద్ర సాంస్కృతిక-భారత పురావస్తు అధ్యయన మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్రీయ రక్షిత స్మారక ప్రదేశాల సందర్శనను అన్ని జాగ్రత్తలతో 2020 జూలై 6 నుంచి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర సంస్కృతి-పర్యాటక శాఖ సహాయ (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. అయితే, నియంత్రణ జోన్ల పరిధిలో లేని స్మారకాల సందర్శనకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. తదనుగుణంగా కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ, దేశీయాంగ మంత్రిత్వశాఖలు జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్రీయ రక్షిత స్మారకాలన్నిటివద్ద పరిశుభ్రత, సామాజిక దూరం తదితర ఆరోగ్య రక్షణ విధివిధానాలను తప్పక పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటితోపాటు ఆయా రాష్ట్రాల పరిధిలో ప్రభుత్వాలు-జిల్లా యంత్రాంగాలు జారీచేసిన నిర్దిష్ట ఉత్తర్వులను కూడా అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
రాష్ట్రంలో స్పష్టమైన మూలాలు లేని కోవిడ్-19 కేసుల దృష్ట్యా, రాజధాని తిరువనంతపురం జిల్లాలో ప్రభుత్వం త్వరలోనే యాంటిజెన్ పరీక్ష విధానాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు నగరంలో 18 వార్డులను నియంత్రణ జోన్లుగా ప్రకటించారు. ఇక VSSCలో మరిన్ని పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో సిబ్బందిలోని ఇద్దరికి రోగ నిర్ధారణ అయింది. రాష్ట్రం వెలుపన ఒక సన్యాసినిసహా ఆరుగురు కేరళీయులు కరోనా వైరస్‌కు బలయ్యారు. వీరిలో వివిధ రాష్ట్రాల్లో, గల్ఫ్ ప్రాంతంలో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో నిన్న 160 కొత్త కేసులు నమోదుకాగా, ఈ సంఖ్యను మించి కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 202గా నమోదు కావడం విశేషం. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 2,088 మంది చికిత్స పొందుతున్నారు.
పుదుచ్చేరిలో 93 ఏళ్ల మహిళ కోవిడ్-19కు బలికాగా, 24 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 824కు చేరింది. కొత్త కేసులలో 23 పుదుచ్చేరిలోనూ, ఒకటి కారైకల్‌లో నమోదయ్యాయి. ఇక తమిళనాడులోని మదురైలో కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా స్వల్ప లక్షణాలున్న రోగులు ప్రస్తుతం ఏకాంత గృహచికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఒకేరోజు 4,343కేసులు, 57 మరణాలు నమోదవగా- వీటిలో చెన్నైనుంచి 2027 నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 98,392 కాగా, వీటిలో 41047 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 1321 మంది మహమ్మారికి బలయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం... వ్యాధి లక్షణాలు లేని, ప్రాణవాయు సంతృప్తత 95 శాతం లేదా దానికి సమానంగా లేదా అంతకన్నా ఎక్కువగా నమోదయ్యే 50 ఏళ్లలోపుగల రోగులకు ఏకాంత గృహచికిత్సను సిఫారసు చేయవచ్చు. సేవల క్రమబద్ధీకరణకు తమ డిమాండ్‌ను నెరవేర్చడంలో ఆలస్యంపై జూలై 8 నుంచి సమ్మె చేస్తామని ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ కాంట్రాక్టు వైద్యులు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారి జీతాలను నెలకు రూ.45 వేలనుంచి రూ.60వేలకు పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో నిన్న 1502 కొత్త కేసులు నమోదవగా, 271 మంది కోలుకున్నారు. అలాగే 19 మరణాలు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 18,016, యాక్టివ్ కేసులు: 9406, మరణాలు: 272గా ఉన్నాయి.
ఐసీఎంఆర్-భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్వదేశీ కోవిడ్-19 టీకా (బిబివి 152 కోవిడ్ వ్యాక్సిన్) ప్రయోగాత్మక పరీక్షల కోసం ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 12 కేంద్రాల్లో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ కూడా ఉంది. ఈ మేరకు అన్ని ప్రయోగాత్మక పరీక్షలు పూర్తయ్యాక 2020 ఆగస్టు 15 నాటికి ప్రజారోగ్య వినియోగం కోసం ఈ టీకా అందుబాటులోకి రాగలదని భావిస్తున్నారు. కాగా, కరెన్సీ నోట్లు, ముఖ్యమైన పత్రాలు, ఇతర పరికరాలను రోగకారక క్రిమిరహితం చేయగల అతినీలలోహిత రేడియేషన్ ఆధారిత క్రిమిసంహారక మందును విశాఖపట్నం డీజిల్ లోకో-షెడ్ తయారుచేసింది. ఇందులోని అతి నీలలోహిత కాంతినుంచి రేడియో ధార్మికశక్తి వైరస్‌లను, గాలిలోని సూక్ష్మజీవులను, బీజరూప జీవులను 99.9 శాతందాకా నిర్మూలించగలదు. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల వ్యవధిలో 38,898 నమూనాలను పరీక్షించాక 837 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక 258 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా, 5 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులలో 46 అంతర్రాష్ట్ర వాసులకు చెందినవి కాగా, 2 విదేశాల నుంచి వచ్చినవారికి సంబంధించినవి. ప్రస్తుతం మొత్తం కేసులు: 16,934, యాక్టివ్ కేసులు: 9096, డిశ్చార్జెస్: 7632, మరణాలు: 206గా ఉన్నాయి.
రాష్ట్రంలో సంచార పరీక్షల నిర్వహణ ప్రయోగశాలలను ప్రవేశపెట్టే ఆలోచన లేదని, మరింత కచ్చితమైన ఫలితాలిచ్చే ఆర్టీ-పీసీఆర్ విధానాన్నే కొనసాగిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కాగా, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి కోవిడ్-19 టీకాను ఆగస్టు 15లోగా ప్రారంభం కాగలదని ఐసీఎంఆర్ భావిస్తోంది. మరోవైపు ‘కోవాక్సిన్’ టీకా మానవ ప్రయోగ పరిశీలన వేగంగా కొనసాగుతోంది. ఈ మేరకు నగరంలోని పంజాగుట్టలోగల నిమ్స్ ఒక కీలక పరీక్షా కేంద్రంగా ఉంది. ఇక నిన్నటిదాకా మొత్తం కేసులు: 18570కాగా, యాక్టివ్ కేసులు: 9226, మరణాలు: 275, డిశ్చార్జి అయినవి: 9069గా ఉన్నాయి.
రాష్ట్రంలో 6,330 కొత్త కేసులు నమోదైనప్పటికీ కోవిడ్-19 నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్షకుపైగా నమోదు కావడం విశేషం. కాగా, ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 1,86,626కు చేరగా, యాక్టివ్ కేసుల సంఖ్య 77260గా ఉంది. రాష్ట్రంలోని కొత్త కేసుల ముంబైకి చెందినవి 1554 కాగా, మొత్తం కేసుల సంఖ్య 80,262గా ఉంది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 681 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 33,999కి చేరింది. అలాగే 19 మంది మరణంతో మొత్తం మృతుల సంఖ్య 1,888కి పెరిగింది. కాగా, కొత్త కేసులలో అహ్మదాబాద్ నుంచి గరిష్ఠంగా 202 నమోదవగా సూరత్ 191 కేసులతో తర్వాతి స్థానంలో ఉంది. గుజరాత్‌లో ప్రస్తుతం 7,510 యాక్టివ్ కేసులుండగా రాష్ట్రంలో ఇప్పటిదాకా 3.88 లక్షల నమూనాలను పరీక్షించారు.
రాష్ట్రంలో ఈ ఉదయం వరకూ 123 కొత్త కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. కాగా, గురువారం 350 కొత్త కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 18,785కాగా, వీటిలో యాక్టివ్ కేసులు 3,307 మాత్రమే కావడం విశేషం.
రాష్ట్రంలో 245 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 14,106కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,702 కాగా, మరణాల సంఖ్య 589గా ఉంది.
రాష్ట్రంలో 72 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 3,013కు పెరిగాయి. తాజా సమాచారం మేరకు ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 637గా ఉంది.
రాష్ట్రంలో గురువారం 95 నమూనాల ఫలితాల మేరకు అందరికీ రోగ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,482కు చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 744గా ఉంది.
రాష్ట్రంలోని గువహటి జీహెచ్‌ఎంసీలో ఇవాళ ప్లాస్మా బ్యాంక్ ప్రారంభం కాగా, మహమ్మారి నుంచి కోలుకున్న డాక్టర్ లిథికేష్ దీనికి తొలి ప్లాస్మాదాతగా నిలిచారు.
రాష్ట్ర బాక్సింగ్ క్రీడాకారుడు, ఆసియా గేమ్స్ స్వర్ణపతక విజేత డింగ్‌కో సింగ్ కోవిడ్-19 మహమ్మారినుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ముగ్గురికి కోవిడ్-19 నిర్ధారణ కాగా, వీరిలో ఇద్దరు తూర్పు ఖాసీ హిల్స్ (BSF)కు చెందినవారు. మరొకరు అధికముప్పుగల ప్రాంతం ‘రి భోయ్’కి చెందిన వ్యక్తి. ఇప్పటివరకూ మేఘాలయలో 43 మంది కోలుకోగా, ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 18గా ఉంది.
రాష్ట్రంలో ఇవాళ ఒక కోవిడ్ రోగి కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 127కు చేరగా, మిజోరంలో మొత్తం 162 కేసులకుగాను ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 35గా ఉంది.
రాష్ట్రంలో కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 539కు పెరిగింది. వీటిలో 342 యాక్టివ్ కేసులు కాగా, ఇప్పటివరకూ 197 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు ఏకైక పరిశీలనాధారంగా పంజాబ్ కోవిడ్-19 వైద్య నిర్వహణ కరదీపికను ముఖ్యమంత్రి ఇవాళ విడుదల చేశారు. సమష్టిగా, సమన్వయంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల శాతాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా మహమ్మారిని అన్నికోణాల్లో నిలువరించడంలో ఇది తోడ్పడగలదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ ఫతే’ ఉద్యమానికి ఈ కరదీపిక ద్విగుణీకృత శక్తినివ్వగలదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అలాగే కోవిడ్ నిర్వహణలో ఇది జాతీయ విధివిధానాలకు, రాష్ట్ర అవసరాలకు మధ్య వారధిగా ఉంటుందన్నారు. కరోనావైరస్ రోగుల సంరక్షణ-నిర్వహణలో నిమగ్నమైన ఆరోగ్యసంరక్షణ ప్రదాతలు సదరు మహమ్మారిని చక్కగా నియంత్రించడంలో అవసరమైన ఉపకరణాల సులభ లభ్యతకు ఇది వీలు కల్పిస్తుందన్నారు.
*******
(Release ID: 1636293)
Visitor Counter : 280
Read this release in:
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam