మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ప్రాథమిక దశ కోసం 8 వారాల ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ విడుదల చేసిన కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రి


Posted On: 02 JUL 2020 6:08PM by PIB Hyderabad

కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులను.., వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సాయంతో విద్యలో నిమగ్నం చేయడానికి ప్రత్యామ్నాయ క్యాలెండర్‌ను రూపొందించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎమ్‌హెచ్‌ఆర్‌డీ) మార్గదర్శకాలతో 'ఎన్‌సీఈఆర్‌టీ' దీనిని రూపొందించింది. హెచ్‌ఆర్‌డీ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌, ప్రాథమిక దశ కోసం ఎనిమిది వారాల విద్యా క్యాలెండర్‌ను దిల్లీలో విడుదల చేశారు. గత ఏప్రిల్‌లో కూడా నాలుగు వారాల క్యాలెండర్‌ను మంత్రి విడుదల చేశారు.

 

విద్యార్థులకు ఆహ్లాదకర, ఆసక్తికరమైన మార్గాల్లో బోధించడానికి అందుబాటులో ఉన్న వివిధ సాంకేతిక, సామాజిక మాధ్యమ సాధనాల గురించిన మార్గదర్శకాలను ఉపాధ్యాయులకు ఈ క్యాలెండర్‌ అందిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇంట్లో ఉన్నప్పుడు కూడా వీటిని ఉపయోగించవచ్చని వెల్లడించారు. మనలో చాలామంది ఫోన్లలో ఇంటర్‌నెట్‌ లేదు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ వంటి సామాజిక మాధ్యమ సాధనాలను ఉపయోగించడం తెలీదు. అందువల్ల, ఫోన్‌ ద్వారా లేదా వాయిస్ కాల్ ద్వారా లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా తల్లిదండ్రులువిద్యార్థులకు మార్గనిర్దేశం చేసేలా, ఈ క్యాలెండర్ ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ క్యాలెండర్ అమలు చేయడానికి ప్రాథమిక దశ విద్యార్థులకు వారి తల్లిదండ్రులు సాయం అందిస్తారని భావిస్తున్నారు.

ఈ క్యాలెండర్, దివ్యాంగ చిన్నారులు సహా పిల్లలందరి అవసరాన్ని తీరుస్తుందని కేంద్ర మంత్రి పోఖ్రియాల్‌ చెప్పారు. ఇందులో వినే పుస్తకాలు, రేడియో, వీడియో కార్యక్రమాలకు సంబంధించిన లింకులు ఉన్నాయన్నారు. సిలబస్ లేదా పాఠ్యాంశాల నుంచి తీసుకున్న అంశాలకు సంబంధించి, ఆసక్తికర, సవాలు చేసే కార్యక్రమాలతో కూడిన వారంవారీ ప్రణాళిక ఈ క్యాలెండర్‌లో ఉందని అన్నారు. ఇది, అభ్యాస ఫలితాలను పాఠ్యాంశాలతో గుర్తిస్తుంది. విద్యార్థి అభ్యాస ప్రగతిని గమనించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఉపకరిస్తుంది. పాఠ్య పుస్తకాలను దాటి నేర్చుకోవడానికి తోడ్పడుతుంది.

కళలు, శారీరక వ్యాయామాలు, యోగా, వృత్తి నైపుణ్యాలు మొదలైన అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాలు కూడా ఈ క్యాలెండర్‌లో ఇమిడివున్నాయి. ఈ క్యాలెండర్‌లో హిందీ, ఆంగ్లం, ఉర్దూ, సంస్కృత భాషలకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఆతృతను తగ్గించే వ్యూహాలు కూడా ఉన్నాయి. ఈ-పాఠశాల, ఎన్‌ఆర్‌ఓఈఆర్, దిషా పోర్టల్‌లోని పాఠ్యాంశాల వారీ ఈ-కంటెంట్‌ లింకులను కూడా ఈ క్యాలెండర్‌ అందిస్తుంది.

ఎన్‌సీఈఆర్‌టీ, ఇప్పటికే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో స్వయంప్రభ టీవీ ఛానెల్‌ ద్వారా (కిశోర్‌ మంచ్‌) ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. (డీటీహెచ్ ఉచిత ఛానల్ 128, డిష్ టీవీ ఛానల్ # 950, సన్‌ డైరెక్ట్ # 793, జియో టీవీ, టాటా స్కై # 756, ఎయిర్‌టెల్ ఛానల్ # 440, వీడియోకాన్ ఛానల్ # 477), కిశోర్ మంచ్ యాప్ ( ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు), యూ ట్యూబ్ లైవ్ (ఎన్‌సీఈఆర్‌టీ అధికారిక ఛానెల్‌) లో ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు, ప్రాథమిక విద్యార్థుల కోసం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రాథమికోన్నత విద్యార్థుల కోసం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, ఇంటర్‌ విద్యార్థుల కోసం మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సోమవారం నుంచి శనివారం వరకు ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

ఈ క్యాలెండర్‌ను ఎస్‌సీఈఆర్‌టీలు/ఎస్‌ఐఈలు, డైరెక్టరేట్స్‌ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ సమితి, సీబీఎస్‌ఈ, స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డులకు పంపారు. విద్యా క్యాలెండర్ అమలుపై అన్ని ఎస్‌సీఈఆర్‌టీలతో వీడియో కాన్ఫరెన్స్‌ కూడా జరిగింది.

 

ఎనిమిది వారాల ప్రాథమిక దశ ఆంగ్ల విద్యా క్యాలెండర్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎనిమిది వారాల ప్రాథమిక దశ హిందీ విద్యా క్యాలెండర్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 

*****


(Release ID: 1636261) Visitor Counter : 222