హోం మంత్రిత్వ శాఖ

జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) కోసం ఒక ఏకీకృత కోవిడ్-19 వ్యూహానికి గాను ఢిల్లీ, హ‌ర్యానా, ఉత్త‌ర్‌ ప్ర‌దేశ్ ముఖ్యమంత్రులతో స‌మావేశం నిర్వ‌హించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా


'రాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌'ల‌ ద్వారా ఎక్కువ పరీక్షలపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని నొక్కిచెప్పిన శ్రీ అమిత్ షా

ప‌రీక్ష‌ల‌ ద్వారా ఎన్‌సీఆర్‌లో ఇన్‌ఫెక్షన్ రేటును తగ్గించవచ్చ‌న్న మంత్రి

రోగుల్ని త్వ‌ర‌గా ఆసుపత్రిలో చేర్చే విష‌య‌మై దృష్టి పెట్టడం ద్వారా మరణాల రేటు తగ్గించ‌వ‌చ్చ‌న్న‌ అమిత్ షా

మానవతా కోణంలో పేదల ప్రాణాలను కాపాడటం చాలా ముఖ్యం- కేంద్ర హోం మంత్రి

ఆరోగ్యా సేతు మరియు ఇతిహాస్ యాప్‌ల వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన శ్రీ అమిత్ షా

కోవిడ్ రోగుల సంప్రదింపుల కోసం ఎయిమ్స్ ఢిల్లీ చేప‌ట్టిన టెలిమెడిసిన్ నమూనాను ఉత్తర్‌ ప్రదేశ్, హర్యానాల‌లో కూడా అమ‌లు చేయాలి - శ్రీ అమిత్ షా

Posted On: 02 JUL 2020 8:16PM by PIB Hyderabad

జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సీ‌ఆర్) కోవిడ్ -19 క‌ట్ట‌డికి గాను ఏకీకృత వ్యూహం కోసం కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఢిల్లీ, హర్యానా, ఉత్తర్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో ఈ రోజు సమావేశం నిర్వహించారు. కోవిడ్-19 వైర‌స్ అనుమానితుల‌కు మరింత పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. తద్వారా ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్ రేటు తగ్గించవచ్చు అని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ల ద్వారా ఎక్కువ పరీక్షలను నిర్వ‌హించ‌డం, పాజిటివిటీ రేటును 10 శాతం కంటే తక్కువగా తగ్గించడంలో సహాయపడుతుందని కూడా శ్రీ అమిత్ షా అన్నారు. ఈ కిట్ల ద్వారా దాదాపు 90 శాతం స్క్రీనింగ్ సాధ్యమేనని మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలకు వారు కోరుకున్న సంఖ్యలో కిట్లను భారత ప్రభుత్వం అందిస్తుంద‌ని తెలిపారు.

పేదలు మరియు పేదవారి ప్రాణాలను కాపాడేందుకు మానవతా దృక్పథపు ప్రాముఖ్యతను కేంద్ర హోం మంత్రి నొక్కిచెప్పారు. కోవిడ్ రోగులను వీలైనంత త్వ‌ర‌గా ఆసుపత్రిలో చేర్పించే విష‌యంపై దృష్టి పెట్టాల‌ని తద్వారా మరణాల రేటు తగ్గించవచ్చ‌‌ని అన్నారు. ఎన్‌సీఆర్‌లో కోవిడ్‌-19 మ్యాపింగ్‌కు సహాయపడేందుకు ఆరోగ్య సేతు, ఇతిహాస్ యాప్‌ల‌ను విస్తృత ఉపయోగాన్ని శ్రీ అమిత్ షా ఈ స‌మావేశంలో నొక్కి చెప్పారు. కోవిడ్‌-19 రోగుల కోసం ఎయిమ్స్ ఢిల్లీ చేప‌ట్టిన టెలిమెడిసిన్ కన్సల్టేషన్ మోడల్‌ను ఉత్తర్ ప్రదేశ్, హర్యానాలో కూడా అమ‌ల‌య్యేలా చూడాల‌ని కేంద్ర హోంమంత్రి అన్నారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ‌మరియు హర్యానాలు ఎయిమ్స్-టెలిమెడిసిన్ కోవిడ్ సంప్రదింపులలో చేరవ‌చ్చ‌ని అన్నారు. త‌ద్వారా కోవి‌డ్ రోగులు నిపుణులైన వైద్యుల సలహా పొందవచ్చ‌ని తెలిపారు. టెలి-వీడియోగ్రఫీ సహాయంతో యుపీ, హర్యానాలో ఉన్న వివిధ చిన్న ఆసుపత్రులలోని వైద్యులకు ఎయిమ్స్ శిక్ష‌ణ‌ను అందిస్తామ‌ని తెలిపారు.

 ఈ స‌మావేశంలో నీతీ అయోగ్ స‌భ్యుడు డాక్టర్ వి.కె పాల్ ఎన్‌సీఆర్ ప్రాంతంలో కోవిడ్‌-19 పరిష్కర‌ వ్యూహాల్ని గురించి వివ‌రించారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో అవలంబిస్తున్న‌ ఉత్తమ పద్ధతుల‌ను, ముందున్న ‌మార్గాల్ని కూడా ఆయ‌న వివ‌రించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఉత్తర్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ క‌త్తర్, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటుగా భారత ప్రభుత్వం, ఉత్తర్‌ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాల‌కు చెందిన ఉన్నతాధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

 

*****



(Release ID: 1636264) Visitor Counter : 276