ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

2 కోట్లకు పైగా మాస్కులు. కోటికి పైగా పిపిఇ లు రాష్ట్రాలకు ఉచితంగా అందించిన కేంద్రం

Posted On: 03 JUL 2020 12:37PM by PIB Hyderabad

కోవిడ్ 19 నిరోధానికి, నియంత్రణకు, తీవ్రత తగ్గించటానికి కేంద్రప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో కేంద్రం తనవంతు పాత్ర పోషిస్తూ ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తోంది.

కోవిడ్ చికిత్సకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూనే కేంద్రం మందులు, పరికరాలు తదితర సామగ్రిని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందజేస్తోంది. అలా రాష్ట్రాలకు సరఫర చేసే సామగ్రిలో అధికభాగం మొదట్లో స్వదేశంలో తయారయ్యేవి కావు. అప్పట్లో ఈ వైరస్ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాటికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అంతర్జాతీయంగా కొరత ఉండేది.


అయితే, ఆరోగ్య, కుంటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, జౌళి మంత్రిత్వశాఖ, ఔషధ మంత్రిత్వశాఖ, పరిశ్రమలు, అంతర్గత వ్యాపారాభివృద్ధి శాఖ, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ( డి ఆర్ డి ఓ) తదితర విభాగాల ఉమ్మడి కృషి ఫలితంగా స్వదేశీ పరిశ్రమలు వృద్ధి చెందాయి. పిపిఇలు ఎన్95 మాస్కులు, వెంటిలేటర్లవంటి అత్యవసర సామగ్రి స్వయంగా తయారుచేయగలిగేవారిని ప్రోత్సహించటం ద్వారా స్వదేశీ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. ఆత్మ నిర్భర్, మేకిన్ ఇండియా నినాదాలు మరింత బలోపేతమవటంతో భారత ప్రభుత్వం అందించే కోవిడ్ సామగ్రిలో ఎక్కువభాగం స్వదేశంలోనే తయారవుతున్నాయి.


2020 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం 2.02 కోట్లకు పైగా ఎన్ 95 మాస్కులు, 1.18 కోట్లకు పైగా పిపిఇ కిట్లు ఉచితంగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, కేంద్ర సంస్థలకు పంపబడ్దాయి. అంతే కాకుండా, 6.12 కోట్లకు పైగా హెచ్ సి క్యు మాత్రల పంపిణీ కూడా జరిగింది.
పైగా, ఇప్పటివరకూ 11,300 మేకిన్ ఇండియా వెంటిలేటర్లను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు, కేంద్ర సంస్థలకు పంపారు. అందులో 6154 వెంటిలేటర్లు రాష్ట్రాలలోని వివిధ ఆస్పత్రులకు చేరాయి. వాటి పని ప్రారంభానికి కూడా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 1.02 లక్షల ఆక్సిజెన్ సిలిండర్లను కూడా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు, కేంద్ర సంస్థలకు అందజేస్తోంది.  వాటిలో ఇప్పటికే 72,293 సిలిండర్లను  అక్కడి ఆక్సిజెన్ పడకలకు అనుసంధానం చేశారు.
 

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇప్పటివరకు 7.81 లక్షల పిపిఇ లు, 12.76 లక్షల ఎన్ 95 మాస్కులు ఢిల్లీకి సరఫరా చేశారు. 11.78 లక్షల పిపిఇలు, 20.64 లక్షల ఎన్ 95 మాస్కులు మహారాష్ట్రకు అందజేయగా 5.39 లక్షల పిపిఇ లు, 9.81 లక్షల ఎన్ 95 మాస్కులు తమిళనాడు ప్రభుత్వానికి అందజేసింది.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.


కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి

 

*****

 



(Release ID: 1636193) Visitor Counter : 211