PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 01 JUL 2020 6:17PM by PIB Hyderabad

పత్రికా సమాచార సంస్థ

సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం

Coat of arms of India PNG images free download

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 

 

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: కోలుకునేవారి శాతం 59.43కు పెరుగుదల

దేశంలో కోవిడ్‌-19 నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ఇవాళ చికిత్స పొందుతున్న వారికన్నా 1,27,864 మేర అధికంగా నమోదవడంతో కోలుకునేవారి శాతం 59.43కు పెరిగింది. గ‌డ‌చిన 24 గంటల్లో 13,157 మంది కోలుకోగా ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 3,47,978కి చేరింది. ప్రస్తుతం 2,20,114 మంది కోవిడ్ బాధితులు చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో కోవిడ్‌ ప్రత్యేక ప్రయోగశాలల సంఖ్య 1056కు చేరగా- 764 ప్రభుత్వ రంగంలో, 292  ప్రైవేట్‌ రంగంలో ఉన్నాయి. దీంతో రోజువారీ పరీక్షించే నమూనాల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. తదనుగుణంగా గత 24 గంటల్లో 2,17,931 పరీక్షలు నిర్వహించగా, నేటిదాకా మొత్తం 88,26,585 నమూనాలను పరీక్షించారు. మరిన్ని వివరాలకు 

కోవిడ్‌-19పై తాజా సమాచారం

కేంద్ర ప్రభుత్వం అందజేసిన వెంటిలేటర్లలో ‘బై లెవెల్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్’ (BiPAP) సదుపాయలోపం లేనందున స‌మ‌స్యలు పెరుగుతున్నట్లు కొన్ని మాధ్య‌మాల్లో వ‌చ్చిన క‌థ‌నాలు కేంద్ర ఆరోగ్య‌-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ దృష్టికి వ‌చ్చాయి. గ్రేట‌ర్ జాతీయ రాజ‌ధాని ప్రాంతం ఢిల్లీస‌హా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అందజేసిన ‘మేక్ ఇన్ ఇండియా’  వెంటిలేటర్లు ఐసీయూల కోసం ఉద్దేశించినవి. అలాగే వీటికి సంబంధించి ప్రత్యేక పరిజ్ఞానంగ‌ల‌వారితో ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని సాంకేతిక నిపుణులకమిటీ అంద‌జేసిన సాంకేతిక ప్ర‌మాణాల‌కు త‌గిన‌ట్లు కోవిడ్ బాధితుల కోసం వెంటిలేట‌ర్లు త‌యారుచేయ‌బ‌డ్డాయ‌ని తెలిపింది. ఆ మేర‌కు స‌ద‌రు ప్ర‌మాణాల ప్ర‌కారం త‌యారుచేసిన వెంటిలేటర్లను మాత్రమే ప్ర‌భుత్వం కొనుగోలు చేసి, అంద‌జేసినట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు 

వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దేశవ్యాప్తంగాగల వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా సందేశమిచ్చారు. “వైద్యుల దినోత్సవం-2020 సందర్భంగా భరతజాతి వైద్యులకు వందనం చేస్తోంది. కోవిడ్-19పై మన వైద్యులు ముందువరుసన నిలిచి స్ఫూర్తిదాయక పోరాటం చేస్తున్నారు. రోగుల సంరక్షణలో వారు చూపుతున్న శ్రద్ధ అసాధారణం” అని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 

ఉత్త‌మ ఆస్ప‌త్రి నిర్వ‌హ‌ణ మార్గ‌ద‌ర్శ‌కాలు-అంత‌ర్జాతీయ విద్యార్థులకు ఎన్‌బీఈలో స‌భ్య‌త్వంపై క‌ర‌దీపిక‌-ప‌రిచ‌య ప‌త్రాలను ఆవిష్క‌రించిన డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

జాతీయ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ బోర్డు (NBE)లో అంత‌ర్జాతీయ విద్యార్థులు అధ్య‌య‌న స‌భ్య‌త్వం (FPIS) పొందే దిశ‌గా  ఉత్త‌మ ఆస్ప‌త్రి నిర్వ‌హ‌ణ మార్గ‌ద‌ర్శ‌కాలు-అధ్య‌య‌న కార్య‌క్ర‌మ స‌భ్య‌త్వంపై క‌ర‌దీపిక‌-ప‌రిచ‌య‌ప‌త్రాన్ని డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ వెబ్ వేదిక‌పై ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- తమ వృత్తిలో నైతిక ప్రవర్తనను అనుసరిస్తామ‌ని వైద్య సమాజం ప్రతిన‌బూనాల్సిందిగా మంత్రి సూచించారు. ఇవాళ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ దేశంలోని వైద్యులకు అభినంద‌న‌లు తెలిపారు. అలాగే ఏటా జూలై 1న డాక్టర్‌ బి.సి.రాయ్‌ జన్మదినంనాడు ఆయన గౌరవార్థం వైద్యుల దినోత్సవం పాటిస్తున్నామని గుర్తుచేస్తూ ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. “డాక్టర్‌ కావడం వ్యక్తిగత ప్రతిభతో ముడిపడిన విజయం. ఓ మంచి డాక్టర్‌ కావడం ఒక నిరంతర సవాలు. జీవితం గడవడం కోసం అటు సంపాదన ఇటు మానవాళి మొత్తానికీ సేవచేసే అవకాశం ఈ ఒక్క వృత్తిలోనే సాధ్యం” అన్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 మహమ్మారి సవాలు సమయంలో నిస్వార్థ సేవలందిస్తున్న వైద్యలోకానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి నిజ‌మైన క‌థానాయ‌కులు వారేన‌ని కొనియాడారు. మరిన్ని వివరాలకు 

వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు దేశీయాంగశాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా అభినందనలు.. కృతజ్ఞతలు

జాతీయ వైద్యుల దినోత్సవం-2020 సందర్భంగా దేశంలోని వైద్యులకు దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. కోవిడ్‌-19 మహమ్మారిపై జాతి పోరాటాన్ని ముందుండి నడుపుతున్న యోధులుగా వారిని కొనియాడారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశ ప్రజలను ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచడంలో వారు చూపుతున్న నిబద్ధత అనుపమానమని ప్రశంసించారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా వారి అంకితభావం, త్యాగాలకు జాతి అభివందనం చేస్తున్నదని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 

ఝార్ఖండ్‌ ‘సహియా’లు: సామాజిక ఆరోగ్య కార్యకర్తలందరికీ స్ఫూర్తి

ఝార్ఖండ్‌లో ‘సహియా’లుగా సుపరిచితులైన ‘ఆశా’ (ASHA) కార్యకర్తలు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలదాకా... ప్రత్యేకించి గిరిజనులకు ఆరోగ్య సంరక్షణ సేవలందించడంలో ప్రభుత్వానికి ఎనలేని మద్దతిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 42,000 మంది సహియాలుండగా వీరికి 2,260 మంది సహియా సాథీ(ఆశా ప్రేరకు)లు, 582 మంది సమితి స్థాయి శిక్షకులు, 24 మంది జిల్లాస్థాయి సామాజిక సమీకర్తలు, ఒక రాష్ట్రస్థాయి ప్రక్రియల మూల కేంద్రం తోడ్పాటునిస్తుంటాయి. ఈ నేపథ్యంలో 2020 మార్చి నుంచి వారు కోవిడ్‌-19 సంబంధిత వివిధ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ మేరకు వ్యాధి నిరోధం దిశగా తరచూ హస్త పరిశుభ్రత, బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటపుడు మాస్కు-ముఖ కవచ ధారణ వంటి ముందుజాగ్రత్తలతోపాటు తుమ్ము-దగ్గు వచ్చినపుడు పాటించాల్సిన పద్ధతులు తదితరాలపై ప్రజలకు అవగాహన కల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు. అలాగే రోగగ్రస్థులతో పరిచయాల అన్వేషణ, ప్రాంతాలవారీ రోగుల జాబితా, కోవిడ్‌-19 కేసుల అనుసరణ తదితర బాధ్యతల్లోనూ పాలుపంచుకున్నారు. మరిన్ని వివరాలకు  

జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను స్థూల వసూళ్లు రూ.90,917 కోట్లు

ఈ ఏడాది జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా రూ.90,917 కోట్లమేర వస్తుసేవల పన్ను (GST) స్థూల వసూళ్లు నమోదయ్యాయి. ఇందులో కేంద్ర జీఎస్టీ (CGST) రూ.18,980 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ (SGST) రూ.23,970 కోట్లు, సమీకృత జీఎస్టీ (IGST) రూ.40,302 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.15,709 కోట్లుసహా), అలాగే సెస్‌ కింద (వస్తు దిగుమతులపై రూ.607 కోట్లుసహా) రూ.7,665 కోట్లు వంతున వసూలయ్యాయి. నిరుడు ఇదే నెలతో పోలిస్తే ఈ జూన్‌లో రాబడి వసూళ్లు 91 శాతంగా నమోదయ్యాయి. కాగా, ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు కోవిడ్‌-19 వల్ల ప్రభావితమయ్యాయి. ఇందుకు మొదటి కారణంగా- ప్రపంచ మహమ్మారి ఆర్థిక ప్రభావం కాగా.. రెండో కారణం- రిటర్నుల దాఖలు, పన్ను చెల్లింపులు తదితరాల్లో ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు, రాయితీలు. ఏదేమైనా తాజా గణాంకాల మేరకు గత మూడు నెలల జీఎస్టీ రాబడి వసూళ్లు కోలుకున్నట్లే. మరిన్ని వివరాలకు 

క్రమంగా సాధారణ స్థాయికి చేరుతున్న పెట్రో ఉత్పత్తుల డిమాండు

దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల చివరి వారాల్లో కుప్పకూలిన పెట్రో ఉత్పత్తుల వినియోగం ప్రస్తుతం దిగ్బంధం ముందునాటి స్థాయికి స్థిరంగా పెరుగుతోంది. ఈ మేరకు జూన్‌’20లో ప్రభుత్వరంగ చమురు విక్రయ సంస్థల (IOC, BPC, HPC) అమ్మకాల గణాంకాల మేరకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగించే దేశమైన భారత్‌లో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు 2007 తర్వాత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం దిశగా దేశవ్యాప్తంగా దిగ్బంధం విధించడమే ఇందుకు కారణం. ప్రస్తుతం క్రమంగా దిగ్బంధం ఆంక్షల సడలింపు, దశలవారీగా ఆర్థిక వ్యవస్థను విముక్తం చేస్తుండటంతో పారిశ్రామిక కార్యకలాపాలు, జన సంచారం తిరిగి పూర్వస్థాయికి వస్తోంది. దీంతో 2019 జూన్ నెల (13.4 మిలియన్‌ టన్నుల) పెట్రో ఉత్పత్తుల వినియోగంతో పోలిస్తే 2020 జూన్‌లో వినియోగం (11.8 మిలియన్‌ టన్నుల) 88 శాతంగా నమోదైంది. ఇది ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక/పారిశ్రామిక/ రవాణాసహా దాదాపు అన్ని రంగాల్లోనూ కార్యకలాపాల పెరుగుదలను సూచిస్తోంది.  మరిన్ని వివరాలకు 

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ) పరీక్ష-2020... ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌-2020

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాను నిర్వహించే పరీక్షలు/నియామక టెస్టుల సవరించిన కార్యక్రమంపై 05.06.2020న ఇచ్చిన ప్రకటన మేరకు (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్ష-2020సహా) సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష-2020ని 04.10.2020 (ఆదివారం) నిర్వహించనుంది. (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్ష-2020సహా) సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష-2020కి పెద్ద సంఖ్యలో హాజరయ్యే అభ్యర్థులతోపాటు పరీక్ష కేంద్రాల మార్పు నిమిత్తం వారు సమర్పించిన విజ్ఞాపనలను దృష్టిలో ఉంచుకుని వారికి ఒక అవకాశం ఇవ్వాలని యూపీఎస్సీ నిర్ణయించింది. తదనుగుణంగా వారు తమకు నచ్చిన పరీక్ష కేంద్రం ఎంచుకునే వెసులుబాటు కూడా కల్పించాలని తాజాగా నిర్ణయించింది. మరిన్ని వివరాలకు 

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద 2020 ఏప్రిల్‌-నవంబరు కాలంలో ఆహారధాన్యాల పంపిణీ విలువ రూ.1,50,471 కోట్లుగా అంచనా

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (PMGKAY) అమలును 2020 నవంబరు నెలాఖరుదాకా పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న ప్రకటించారు. ఆ మేరకు 2020 జూలై నుంచి నవంబరు చివరిదాకా ఈ పథకం కొనసాగుతుందని తెలిపారు. ఈ ఐదు నెలల కాలంలో 80 కోట్లమందికిపైగా ప్రజలకు నెలనెలా తలా 5 కిలోల వంతున గోధుమ/బియ్యంతోపాటు 1 కిలో ముడి శనగలను ప్రతి కుటుంబానికీ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సదరు ఆహారధాన్యాలు (బియ్యం, గోధుమలు), పప్పుదినుసుల పంపిణీ విలువ దాదాపు రూ.1,50,471 కోట్లుగా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఆహారధాన్యాలపై రాయితీ, అంతర్రాష్ట్ర రవాణా, డీలర్ల (ఈ-పీవోఎస్‌ల వినియోగ సంబంధితంసహా) లాభశాతం తదితరాల రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ.46,601 కోట్ల వ్యయాన్ని భరించనుందని ఆయన వివరించారు. మరిన్ని వివరాలకు 

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనను నవంబరు వరకూ పొడిగించడంపై ప్రధానమంత్రికి అభినందనలు తెలిపిన దేశీయాంగశాఖ మంత్రి

ఈ మేరకు శ్రీ అమిత్‌ షా సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా ప్రధానమంత్రి నిర్ణయంపై హర్షం వ్యక్తంచేశారు. “ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన అమలును పొడిగించడం  పేదలపట్ల ప్రధానమంత్రికిగల ఆర్ద్రత, వారి సంక్షేమంపై ఆయన నిబద్ధతకు నిదర్శనం” అని కొనియాడారు.   మరిన్ని వివరాలకు 

అత్యుత్త‌మ వ్యవసాయ ప‌ద్ధ‌తులతో ఖరీఫ్‌లో గరిష్ఠ దిగుబడులు సాధించాలని రైతుల‌కు వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ పిలుపు

వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చ‌డం కోసం నేల‌తీరుకు అనుగుణంగా వివిధ రకాల పంటలు సాగు చేయాల్సిందిగా కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్న‌దాత‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు దేశంలోని రైతుల‌కు ఆయ‌న ఒక బ‌హిరంగ లేఖ రాశారు. రుతుప‌వ‌నాల విస్త‌ర‌ణ‌తో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్ప‌టికే విత్త‌నాలు వేయ‌డం పూర్తికాగా, మ‌రికొన్ని చోట్ల ఇంకా కొన‌సాగుతున్న‌ట్లు శ్రీ తోమ‌ర్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. దిగుబ‌డుల గ‌రిష్ఠ పెంపు ల‌క్ష్యంగా అత్యుత్త‌మ వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తులు పాటించాల‌ని కోర‌డం కోస‌మే తాను ఈ లేఖ రాస్తున్న‌ట్లు శ్రీ తోమ‌ర్ వివ‌రించారు. కోవిడ్-19 స‌మ‌యంలో దేశ రైతాంగం అంకితభావాన్ని ప్రశంసిస్తూ- దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వ్య‌వ‌సాయ ఉత్పాద‌క‌త ఇరుసు వంటిద‌ని శ్రీ తోమ‌ర్ వ్యాఖ్యానించారు. ఆ మేర‌కు స్వ‌యం స‌మృద్ధ భార‌తానికి వ్య‌వ‌సాయం, గ్రామాలే కేంద్ర బిందువుల‌ని త‌న లేఖ‌లోపేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 

కోవిడ్‌-19 సంక్షోభ సమయంలోనూ అన్నదాతకు ఎరువులు అందుబాటులో ఉంచిన ఆర్‌సీఎఫ్‌

దేశంలోని ఆర్‌సీఎఫ్‌ కర్మాగారాల్లో ఉత్పత్తి కొనసాగిన నేపథ్యంలో రైతులకు అవసరమైన పరిమాణంలో ఎరువులు సిద్ధమయ్యాయి. ఈ మేరకు తాను తయారుచేసిన ఎరువులతోపాటు వాణిజ్య కార్యకలాపాల ద్వారా ఈ ఖరీఫ్‌లో పంటల సాగుకోసం 2 లక్షల టన్నుల మేర ‘డీఏపీ, ఏపీఎస్‌ (20:20:0:13), ఎన్‌పీకే (10:26:26) మిశ్రమ ఎరువులను కూడా రైతులకు అందుబాటులో ఉంచింది.  మరిన్ని వివరాలకు  

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌:

ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిపై పర్యవేక్షణ మరింత చురుగ్గా సాగాలని నగర పాలనాధిపతి ఆదేశించారు. తద్వారా కేసులను తొలిదశలోనే గుర్తించే వీలుంటుందని పేర్కొన్నారు. అలాగే దుర్బలవర్గాలైన గర్భిణులు, సీనియర్ సిటిజన్లు, పిల్లలు తదితరులపై శ్రద్ధ పెట్టాలని ఆయన ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఇరుగుపొరుగున ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించగానే సమాచారమిస్తే వారికి సత్వరం చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుందని సూచించారు.

  • పంజాబ్:

రాష్ట్రంలో 01.07.2020 నుంచి 30.07.2020వరకు దశలవారీ దిగ్బంధ విముక్తిపై పంజాబ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే నియంత్రణ మండళ్ల వెలుపల క్రమక్రమంగా మరిన్ని కార్యకలాపాలను తిరిగి అనుమతించాలని నిర్ణయించింది. అయితే, అనుమతిగల కార్యకలాపాల్లో జనసమ్మర్దం, రద్దీ ఏర్పడే పక్షంలో తగిన నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఆ మేరకు కనీసం 6 అడుగుల సామాజిక దూరం పాటించేలా అన్ని కార్యకలాపాలను విభజించడం, చంక్రమణ పద్ధతిలో నిర్వహించడం, ఆఫీసులు-సంస్థల పనివేళలు మార్చడం తదితర చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధారణ, సామాజిక దూరం పాటించడంలో రాజీపడరాదని సూచించింది. ఈ మేరకు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

  • హిమాచల్ ప్రదేశ్:

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను ఈ ఏడాది నవంబర్ చివరిదాకా పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడాన్ని హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రశంసించారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ 5 కిలోల బియ్యం/గోధుమలతోపాటు ప్రతి కుటుంబానికి 1 కిలో ముడి పప్పు దినుసులు ఉచితంగా అందించాలని ప్రధానమంత్రి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు ఐదు నెలలపాటు 80 కోట్లమందికిపైగా ప్రజలకు ప్రయోజనం కల్పించే దిశగా ఆయన నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఈ నిర్ణయం ఒక వరం వంటిదన్నారు.

  • హర్యానా:

పశుసంవర్ధక-సంబంధిత సేవలను ప్రత్యేకించి కోళ్ల పెంపకాన్ని స్వయంసమృద్ధ భారతం ప్యాకేజి కింద సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల విభాగంలో చేర్చాలని హర్యాన ఉప ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా ఈ రంగానికి బ్యాంకులు రుణాలిచ్చే విధంగా అవసరమైన మార్గదర్శకాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖద్వారా జారీచేయించాలని విజ్ఞప్తి చేశారు.

  • కేరళ:

రాష్ట్రంలో బస్సు ఛార్జీలు పెంచేందుకు మంత్రిమండలి ఇవాళ ఆమోదం తెలిపింది. ఆ మేరకు కోవిడ్ సంక్షోభం ఉపశమించేదాకా పెంచిన చార్జీలు అమలు చేయాలని నిర్ణయించింది. రెండోదశ దిగ్బంధ విముక్తిపై కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అంగీకారం తెలిపింది. తదనుగుణంగా కేరళలో దిగ్బంధం ఆంక్షల సడలింపుసహా ఉత్తర్వు జారీచేసింది. రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ‘జాగ్రత్త’ పోర్టల్‌లో తప్పనిసరి నమోదు నిబంధనను కొనసాగించాలని నిర్ణయించింది. ఇక నియంత్రణ మండళ్లలో జూలై 31వరకు దిగ్బంధాన్ని కఠినంగా అమలు చేయనుంది. కాగా, వయనాడ్‌లోని కట్టనాయకర్‌ తెగకు చెందిన 40 ఏళ్ల గిరిజన మహిళకు కోవిడ్‌-19 సోకినట్లు తేలింది. గిరిజనాధిక్యం ఉన్న ఈ పంచాయతీలో వైరస్ బారినపడిన తొలి వ్యక్తి ఈమే కావడం గమనార్హం. మరోవైపు రాష్ట్రం వెలుపల మరో 9 మంది కేరళీయులు కరోనా వైరస్‌కు బలయ్యారు. రాష్ట్రంలో 131 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 10 స్థానిక సంక్రమణ కేసులు కాగా, ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో 2,112 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.

  • తమిళనాడు:

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో జూలై 1 బుధవారం నుంచి ప్రార్థన స్థలాలను ప్రజల కోసం తిరిగి తెరిచిన నేపథ్యంలో సంబంధిత ప్రామాణిక ప్రక్రియ విధివిధానాలను ప్రభుత్వం జారీచేసింది. అయితే, చెన్నైసహా కోవిడ్-19 కేసులు పెరుగుతున్న మదురై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో మాత్రం ప్రార్థన స్థలాలు తెరిచేందుకు అనుమతి లేదు. కాగా, ఇరాన్‌లో చిక్కుకున్న తమిళనాడుకు చెందిన 652 మందిసహా మొత్తం 687మంది భారతీయులు ‘ఐఎన్‌ఎస్‌ జలాశ్వ’ నౌకలో 6 రోజుల ప్రయాణం తర్వాత తూత్తుకుడికి చేరుకున్నారు. ఇక రాష్ట్రంలో నిన్న 3943 కొత్త కేసులు నమోదవగా, 2325 మంది కోలుకున్నారు; మరో 60 మంది మరణించారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 90167, యాక్టివ్ కేసులు: 38889, మరణాలు: 1201, చెన్నైలో యాక్టివ్ కేసులు: 22610గా ఉన్నాయి.

  • కర్ణాటక:

రాష్ట్రంలో రెండోదశ దిగ్బంధ విముక్తికి సంబంధించి జూలై 31దాకా అమలయ్యే విధంగా ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మేరకు జూలై నెల మొత్తం రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 5 గంటలవరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలకు 5 రోజుల పని వారం నిర్దేశించగా పాఠశాలలు మాత్రం మూసిఉంటాయి. బెంగళూరు, ఉడిపి ప్రాంతాల్లో జూలై 15 నుండి రక్త-రసి  అధ్యయనం (సీరో సర్వే) చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రయోగాత్మక సర్వే తర్వాత కర్ణాటక అంతటా ఈ సర్వే నిర్వహించనుంది. రాష్ట్రంలో మంగళవారం అత్యధికంగా 20 మరణాలు నమోదయ్యాయి. ఇక మొత్తం 947 కొత్త కేసులు నమోదవగా వీటిలో నిన్నటికి సంబంధించినవి 235 ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 15242, యాక్టివ్‌: 7074, మరణాలు: 246 డిశ్చార్జి అయినవి: 7918గా ఉన్నాయి.

  • ఆంధ్రప్రదేశ్:

రాష్ట్రంలో మౌలిక వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ అత్యవసర, గ్రామీణ సేవలందించే 108, 104 సరికొత్త వాహనాలను ముఖ్యమంత్రి ఇవాళ ప్రజలకు అంకితం చేశారు. ఈ మేరకు జెండా ఊపి మొత్తం 1088 అంబులెన్స్‌ వాహనాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపారు. ముఖ్యంగా కోవిడ్-19 కాలంలో ప్రజలకు వైద్యసేవలు వేగంగా అందించడం కోసం వీటిలో సకల సౌకర్యాలూ ఏర్పాటు చేశారు. కాగా, రాష్ట్రంలోని దిగువ కోర్టులన్నటిలో కేసుల విచారణ ఆపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే, అత్యవసర పరిస్థితులకు సంబంధించిన పిటిషన్లను ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు అనుమతించింది. ప్రకాశం జిల్లాలో 10 మంది పోలీసులతోపాటు ఒక ఆయుష్‌ వైద్యాధికారికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక గత 24 గంటల్లో 28,239 నమూనాలను పరీక్షించగా 657 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక  342మంది కోలుకోగా, ఆరు మరణాలు నమోదయ్యాయి. కొ్త్త కేసులలో 39 అంతర్రాష్ట్ర వాసులకు చెందినవి కాగా, ఏడు విదేశాలనుంచి వచ్చినవారికి సంబంధించినవి. ప్రస్తుతం మొత్తం కేసులు: 15,252, యాక్టివ్ కేసులు: 8071, డిశ్చార్జ్: 6988, మరణాలు: 193గా ఉన్నాయి.

  • తెలంగాణ:

రాష్ట్రంలోని కోవిడ్‌-19 రోగులకు చికిత్స చేయడం కోసం దక్షిణమధ్య రై్ల్వే తమ ఆసుపత్రిని సిద్ధం చేసింది; ఇక్కడ ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. రాష్ట్రంలోని నియంత్రణ జోన్లలో జూలై 31వరకు దిగ్బంధాన్ని ప్రభుత్వం పొడిగించగా, నియంత్రణ జోన్ల వెలుపల కార్యకలాపాలు క్రమక్రమంగా ప్రారంభించాలని ఆదేశించింది. నిన్నటిదాకా మొత్తం కేసులు: 16339, యాక్టివ్‌: 8785 మరణాలు: 260, డిశ్చార్జి: 7294గా ఉన్నాయి.

  • అరుణాచల్ ప్రదేశ్:

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా అరుణాచల్ ముఖ్యమంత్రి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్‌-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సమాజాలను ప్రభావితం చేస్తూనే ఉన్న నేపథ్యంలో మన వైద్యులు, ముందువరుస ఆరోగ్య కార్యకర్తలు ప్రజల ప్రాణరక్షణకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని ఆయన తన సందేశంలో కొనియాడారు. ఈ కృషిలో వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి నిస్వార్థ సేవలు అందిస్తున్నారని, వారి భద్రత కోసం దైవాన్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

  • అసోం:

రాష్ట్రంలో ప్రస్తుతం 13 కోవిడ్-19 నిర్ధారణ ప్రయోగశాలలు ఉన్నాయని, మరో 6 త్వరలో ఏర్పాటవుతాయని అసోం ఆరోగ్యశాక మంత్రి హిమంత బిశ్వశర్మ ట్వీట్ చేశారు.

  • మణిపూర్:

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్‌ సింగ్‌ డాక్టర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్‌-19తో పోరాటంలో ముందువరుసన నిలిచి విలువైన ప్రాణాలను కాపాడుతున్న వైద్యుల, ఆరోగ్య కార్యకర్తల నిస్వార్థ సేవలను కొనియాడారు.

  • మిజోరం:

రాష్ట్రంలో ఇవాళ ఒకరు కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 37కు తగ్గింది. కాగా, మిజోరంలో మొత్తం కేసుల సంఖ్య 160 కాగా, వీరిలో ఇప్పటిదాకా 123 మంది కోలుకున్నారు. ఇక పీఎంజీకేఏవై అమలును పొడిగించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు మిజోరం ముఖ్యమంత్రి జొరమ్‌తంగా కృతజ్ఞతలు తెలిపారు.

  • నాగాలాండ్:

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా, నాగాలాండ్ ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సకాలంలో ఆరోగ్య సంరక్షణ అందించడంలో... ప్రత్యేకించి అనూహ్య కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల నడుమ ప్రజలకోసం వారు చేసిన సేవలు, త్యాగాలు అపూర్వమని కొనియాడారు.

  • సిక్కిం:

కోవిడ్‌-19పై పోరులో ముందువరుసలోని ఆరోగ్య కార్యకర్తల నిస్వార్థ సేవ, అంకితభావాలపై ప్రేమ, గౌరవం, ప్రశంసలకు చిహ్నంగా సిక్కిం ముఖ్యమంత్రి వారికి నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఈ మేరకు డాక్టర్లకు రూ.20,000, నర్సింగ్‌ సిబ్బందికి రూ.10,000, సహాయక సిబ్బందికి రూ.5000 వంతున ఒకసారి పారితోషికం బహూకరిస్తారు.

  • మహారాష్ట్ర:

రాష్ట్రంలో 4878 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 174761కి చేరింది. కాగా, 1951 మంది కోలుకుని, మంగళవారం ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి  సంఖ్య 90911కి పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 75979 కాగా, గ్రేటర్ ముంబై ప్రాంతంలో 903 కేసులున్నాయి. 625 మంది కోలుకోగా మంగళవారం  36మంది మరణించారు. ముంబైలో ప్రస్తుత యాక్టివ్‌ కేసుల సంఖ్య 77197, కోలుకున్నవారు 44170, మరణాల సంఖ్య 4554. మరోవైపు రాష్ట్రంలోని 11 జైళ్లలో ఇప్పటిదాకా 361 మంది ఖైదీలకు వ్యాధి నిర్ధారణ కాగా, వీరిలో ప్రస్తుతం 106 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే జైలు సిబ్బందిలో 94 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, ఈ జైళ్లలో 4 మరణాలు  కూడా నమోదయ్యాయి.

  • గుజరాత్:

రాష్ట్రంలో గత 24 గంటల్లో 626 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 32,446కు చేరింది. మరోవైపు 20 మంది రోగులు మరణించడంతో మృతుల సంఖ్య 1,848కి పెరిగింది. సూరత్ నగరంలో గరిష్టంగా 183 కేసులు నమోదవగా తొలిసారి అహ్మదాబాద్‌ను అధిగమించింది. కాగా, అహ్మదాబాద్‌లో కొత్త కేసుల సంఖ్య 182గా ఉంది. గత 24 గంటల్లో 422 మంది కోలుకుని వివిధ ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 23670కు పెరిగింది. నేటిదాకా రాష్ట్రంలో మొత్తం 3.73 లక్షల నమూనాలను పరీక్షించారు. మరోవైపు రెండోదశ దిగ్బంధ విముక్తి మార్గదర్శకాలు నేటినుంచి అమలులోకి వచ్చాయి. ఈ మేరకు దుకాణాలు రాత్రి 8 గంటలవరకు, హోటళ్లు-రెస్టారెంట్లు రాత్రి 9 గంటలవరకు తెరిచి ఉంటాయి. కాగా, ఛాతీ ఎక్స్-రే సాయంతో కోవిడ్‌-19ను నిర్ధారించే కృత్రిమ మేధ ఆధారిత ఉపకరణాన్ని IIT-గాంధీనగర్ రూపొందించింది. వైద్య పరీక్షకు ముందు సత్వర ప్రాథమిక రోగ నిర్ధారణకు దీన్ని ఉపయోగించవచ్చు.

  • రాజస్థాన్:

రాష్ట్రంలో మంగళవారం 78 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 18092కు చేరాయి. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 14,232గా ఉంది. అల్వార్ జిల్లాలో 29, జైపూర్‌లో 25 వంతున కొత్త కేసులు నమోదయ్యాయి.

  • మధ్యప్రదేశ్:

రాష్ట్రంలో మంగళవారం 223 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 13,593కు పెరిగింది. ప్రస్తుతం 2626 మంది యాక్టివ్‌ కేసులుండగా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 10,395కు చేరింది. మరోవైపు మరణాలు 572గా ఉన్నాయి. హాట్‌స్పాట్ ఇండోర్‌లో మంగళవారం 45 కొత్త కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి, దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 4709కి చేరింది. రాజధాని నగరం భోపాల్‌లో మంగళవారం 25 కొత్త కేసులు, 3 మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో భోపాల్‌లో మొత్తం కేసుల సంఖ్య 2789గా ఉంది. అలాగే మొరెనా జిల్లాలో 59, గ్వాలియర్ 14, భింద్‌లో 12 వంతున కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 నేపథ్యంలో ‘కరోనా నిర్మూలన’ ఉద్యమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లేలా ఈ రోజు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో 11,400కుపైగా బృందాలు ఈ నెల 15వరకు ఇంటింటి సర్వే చేస్తాయి. ఈ సర్వేను నమోదు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సార్థక్‌’ (SARTHAK) అనువర్తనాన్ని ఉపయోగిస్తారు.

  •  ఛత్తీస్‌గఢ్‌:

రాష్ట్రంలో మంగళవారం 63 కొత్త కేసులు నమోదవగా 100 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2858కి చేరగా, వీటిలో ప్రస్తుతం 595 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2250కి పెరిగింది.

  • గోవా:

గోవాలో మంగళవారం 64 కొత్త కేసులు నమోదవగా, 72మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 1315కు పెరిగిన నేపథ్యంలో 716 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, ఇప్పటివరక రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 596కు పెరిగింది.

 

********

 



(Release ID: 1635787) Visitor Counter : 306