PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
26 JUN 2020 6:29PM by PIB Hyderabad
పత్రికా సమాచార సంస్థ
సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం
(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం: యాక్టివ్ కేసులకన్నా కోలుకున్నవారి సంఖ్య 96వేలకుపైగా అధికం; కోలుకునే శాతం 58.24కు చేరిక
కోవిడ్-19 నుంచి కోలుకున్నవారు ప్రస్తుత రోగులకన్నా 96,173 అధికంగా నమోదయ్యారు. ఈ క్రమంలో గడచిన 24 గంటల్లో 13,940 మంది కోలుకోగా, వ్యాధి నయమైనవారి సంఖ్య 2,85,636కి చేరడంతో కోలుకునేవారి శాతం 58.24కు పెరిగింది. ప్రస్తుతం 1,89,463 మంది చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
దేశంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష సదుపాయాల పెంచాలన్న లక్ష్యంలో భాగంగా ప్రయోగశాలల నెట్‌వర్క్ గణనీయంగా విస్తరిస్తోంది. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) గత 24 గంటల్లో 11 కొత్త ప్రయోగశాలలను ఏర్పాటు చేసింది. దీంతో భారత్‌లో ప్రయోగశాలల సంఖ్య ప్రస్తుతం 1,016కు చేరగా, ప్రభుత్వ రంగంలో 737, ప్రైవేటు రంగంలో 279 అందుబాటులో ఉన్నాయి. తదనుగుణంగా నిత్యం పరీక్షించే నమూనాల సంఖ్య స్థిరంగా పెరుగుతూండగా ఇప్పటివరకూ మొత్తం 77,76,288 నమూనాలను ఈ ప్రయోగశాలల్లో పరీక్షించారు. మరిన్ని వివరాలకు
కోవిడ్-19పై పోరాటంలో ఈశాన్యభారత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేయూత
కోవిడ్-19పై పోరాటంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో వైద్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా, బలమైన రీతిలో మద్దతునిచ్చింది. వాస్తవానికి దేశంలో కోవిడ్-19 కేసులతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో సాపేక్షంగా చాలా తక్కువగానే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3731 కాగా, కోలుకున్నవారి సంఖ్య 5715గా ఉండటం ఇందుకు నిదర్శనం. అలాగే మరణాల శాతం కూడా తక్కువగానే నమోదైంది. తదనుగుణంగా మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కింలలో ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం విశేషం. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహించడంతో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వ-ప్రైవేటు రంగాల్లో రోగ నిర్ధారణ ప్రయోగశాలల సంఖ్య 39కి చేరింది. దీంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఐసీయూ పడకలు, ప్రాణవాయు సరఫరాగల పడకలు, వెంటిలేటర్ల సంఖ్యను పెంచటంలోనూ కేంద్రం చురుగ్గా స్పందించింది. అలాగే ఎన్95 మాస్కులు, పీపీఈ కిట్లు, హెచ్‌సీక్యూ మాత్రలు తదితరాలను తగు పరిమాణంలో అందుబాటులో ఉంచింది. ఆ మేరకు కోవిడ్-19 కేసుల సమర్థ వైద్య నిర్వహణలో చురుకైన పాత్ర పోషించింది. మరిన్ని వివరాలకు
ప్రధాని చేతులమీదుగా ‘స్వావలంబన ఉత్తరప్రదేశ్ ఉపాధి కార్యక్రమం’ ప్రారంభం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీనుంచి దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ‘స్వావలంబన ఉత్తరప్రదేశ్ ఉపాధి కార్యక్రమానికి’ శ్రీకారం చుట్టారు. దీనికింద వలస కార్మికులకు ఉపాధి కల్పనతోపాటు స్థానికంగా ఔత్సాహిక పారిశ్రామికులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ- కోవిడ్ మహమ్మారి వల్ల కలిగే కష్టనష్టాలను ప్రతి ఒక్కరూ అధిగమించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. వైరస్ నిర్మూలనకు టీకా వచ్చేదాకా రెండు గజాల దూరం పాటించడం, మాస్కు ధరించడం అత్యుత్తమ జాగ్రత్తలని ఆయన నొక్కి చెప్పారు. మహమ్మారి విపత్తును అవకాశంగా మలచుకోవడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ చొరవను ప్రధానమంత్రి ప్రశంసించారు. ప్రస్తుత ‘స్వావలంబన ఉత్తరప్రదేశ్ ఉపాధి కార్యక్రమం’ ఇందుకు రుజువని, ఇతర రాష్ట్రాలు కూడా దీన్నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ ఓ పెద్ద ప్రపంచ సంక్షోభంగా మారిన సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శించిన వివేచన, ఆత్మస్థైర్యం ప్రశంసనీయమని ప్రధానమంత్రి కొనియాడారు. పరిస్థితి చక్కదిద్దడం, వైరస్ నియంత్రణలో రాష్ట్రం విజయవంతమైన తీరు అనూహ్యమం, ప్రశంసార్హమని పేర్కొన్నారు. ఈ కృషిలో తమవంతు పాత్ర పోషించిన డాక్టర్లు, అర్థవైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, ఆశా-అంగన్‌వాడీ కార్యకర్తలుసహా బ్యాంకులు, పోస్టాఫీసులు, రవాణా కార్మికులు తదితరులంతా ప్రశంసార్హులని అభినందించారు. మరిన్ని వివరాలకు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘స్వావలంబన ఉత్తరప్రదేశ్ ఉపాధి కార్యక్రమం’ ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
మరిన్ని వివరాలకు
గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన వెబ్ పోర్టల్ ప్రారంభం
కేంద్ర గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్, వ్యవసాయ-రైతు సంక్షేమశాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఇవాళ గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. భారీ ఉపాధికల్పనసహా గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన’కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 జూన్ 20న శ్రీకారం చుట్టారు. కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సొంత రాష్ట్రాలకు తిరిగివచ్చిన వలస కార్మికులకు రాబోయే 4 నెలలపాటు ఉపాధి కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. మరిన్ని వివరాలకు
ఢిల్లీలో కోవిడ్-19పై జూన్ 21న తీసుకున్న నిర్ణయాల అమలుపై దేశీయాంగ శాఖ కార్యదర్శి సమీక్ష సమావేశం
ఢిల్లీలో కోవిడ్-19పై జూన్ 21నాటి సమావేశంలో తీసుకున్న వివిధ నిర్ణయాలు సజావుగా, సమయానుసారం అమలవుతున్నట్లు ఈ సమీక్షలో స్పష్టమైంది. తదనుగుణంగా ఢిల్లీ కోసం ప్రత్యేకంగా కోవిడ్-19 ప్రతిస్పందన ప్రణాళికను ఖరారు చేశారు. అంతేకాకుండా కోవిడ్-19 సంబంధిత కార్యకలాపాల కోసం జిల్లాస్థాయి బృందాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నిర్దేశించిన వ్యవధి మేరకు ఢిల్లీలో కోవిడ్-19 తీవ్రంగాగల అన్ని సముదాయాలుసహా నియంత్రణ జోన్ల పునర్ వర్గీకరణ జూన్ 26నాటికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. అలాగే ఇంటింటి ఆరోగ్య సర్వేని కూడా జూన్ 30కల్లా పూర్తిచేస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు
కోవిడ్ -19 పరిస్థితుల దృష్ట్యా 2020 జూలై 1 నుంచి 15వరకు నిర్వహించాల్సిన 10, 12 తరగతుల పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్ఈ
దేశంలో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులతోపాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనల మేరకు 2020 జూలై 1నుంచి 15వరకు నిర్వహించాల్సిన 10, 12 తరగతుల పరీక్షల రద్దుకు కేంద్ర మాధ్యమిక విద్యాబోర్డు (CBSE) నిర్ణయించింది. ఈ ప్రతిపాదనతోపాటు 10, 12 తరగతి తుది పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభపై అంచనా దిశగా రూపొందించిన పథకానికి సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ ఆమోదం తెలిపింది. రద్దు చేసిన పరీక్షలకు సంబంధించి సీబీఎస్ఈ సాధికార కమిటీ నిర్దేశిత పథకం ప్రాతిపదికన 10, 12 తరగతి విద్యార్థుల ప్రతిభ అంచనా వేయబడుతుందని ఈ సందర్భంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ తెలిపారు. పరిస్థితులు అనుకూలించగానే 12వ తరగతి విద్యార్థులకు 2020 జూలై 1 నుంచి 15వరకు సీబీఎస్ఈ ఐచ్ఛిక పరీక్షలు నిర్వహిస్తుందని శ్రీ నిశాంక్ తెలిపారు. ప్రతిభ అంచనా పథకం కింద ఫలితాలు ప్రకటితమైన అభ్యర్థులు తమ ప్రతిభ మెరుగుకోసం ఈ ఐచ్ఛిక పరీక్షలు రాయదలిచే విద్యార్థులు హాజరుకావచ్చునని పేర్కొన్నారు. అయితే, 10వ తరగతి చదివే విద్యార్థులకు తదుపరి పరీక్షలేవీ ఉండవని అంచనా పథకం కింద సీబీఎస్ఈ ప్రకటించే ఫలితాలే అంతిమమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఫలితాలను 2020 జూలై 15లోగా ప్రకటిస్తామని, వాటి ఆధారంగా అభ్యర్థులు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు
విజ్ఞానాన్ని సంపదగా మార్చడమే భారత తయారీ రంగం ప్రగతికి కీలకం: శ్రీ నితిన్ గడ్కరీ
కేంద్ర ఎంఎస్ఎంఈ, రోడ్డు రవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ నిన్న దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి ప్రతినిధులతో సమావేశమయ్యారు. కోవిడ్ సంక్షోభానికి ముందు-తర్వాతి పరిస్థితుల నేపథ్యంలో ఈ రంగం వృద్ధిపై ఈ సందర్భంగా చర్చించారు. దేశవ్యాప్త దిగ్బంధం వల్ల ప్రతి రంగానికీ ఆర్థికంగా స్వల్పకాలిక సమస్యలు తలెత్తినప్పటికీ సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసంతో తాత్కాలిక వెనుకబాటును అధిగమించగలమని సూచించారు. దేశం నుంచి ఎగుమతులలో సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల రంగం వాటా ప్రస్తుతం 48 శాతంగా ఉందని ఆయన గుర్తుచేశారు. దీన్ని మరింత పెంచుకునే దిశగా సాంకేతిక ఉన్నతీకరణ, ఉత్పత్తుల అభివృద్ధి వంటివి అవసరమని పేర్కొన్నారు. రవాణా, కార్మిక, సదుపాయాల వ్యయాన్ని తగుమేర తగ్గించుకోవటం కూడా భారత్‌లో తయారీ రంగం ప్రగతికి దోహదం చేయగలవన్నారు. అలాగే ప్రపంచం ఇప్పుడిప్పుడే కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ప్యాకేజింగ్, సౌకర్యాల ప్రామాణీకరణ వంటి అంశాల్లోనూ మరింత మెరుగుదల కూడా ఎగుమతుల పెరుగుదలకు తోడ్పడగల ముఖ్యమైన అంశమని చెప్పారు. మరిన్ని వివరాలకు
‘ప్రవర్తన మార్పు’ ప్రచారోద్యమాన్ని, వెబ్‌సైట్‌ను ప్రారంభించిన నీతి ఆయోగ్; అందరూ ఫేస్ మాస్క్ ధరించడంపై దృష్టి
దేశంలో కోవిడ్-19 సంక్షోభం నడుమ “నవ్యశైలిలో జీవనయానం” (Navigating the New Normal) పేరిట సామాజిక ప్రవర్తన మార్పుపై ప్రచారోద్యమాన్ని, సంబంధిత వెబ్‌సైట్‌ను నీతి ఆయోగ్ ఇవాళ ప్రారంభించింది. ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (BMGF), సెంటర్ ఫర్ సోషల్ అండ్ బిహేవియరల్ ఛేంజ్ (CSBC), అశోక విశ్వవిద్యాలయంతోపాటు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ; మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి ‘దిగ్బంధ విముక్తి’ దశలో తదనుగుణ సురక్షిత పద్ధతులపై దృష్టి సారించి.. ముఖ్యంగా ఫేస్ మాస్క్ ధరించడం ప్రధాన ప్రచారాంశంగా దీన్ని మొదలుపెట్టింది. ఈ వాస్తవిక సాదృశ ప్రారంభ కార్యక్రమంలో దేశంలోని దాదాపు 92,000 ప్రభుత్వేతర స్వచ్ఛంద, పౌర సేవా సంస్థలు పాలుపంచుకున్నాయి. నీతి ఆయోగ్ సీఈవో సారథ్యంలోని భారత ప్రభుత్వ సాధికార బృందం-6 మార్గదర్శకాల మేరకు రూపొందిన ఈ కార్యక్రమంలో వెబ్ పోర్టల్ (http://www.covidthenewnormal.com/) మొదటి భాగంగా ఉంటుంది. ప్రస్తుత దిగ్బంధ విముక్తి దశలో కోవిడ్-సంబంధ సురక్షిత ప్రవర్తన విధానాలను తెలియజేసేందుకు ప్రవర్తనా విజ్ఞానం సూచించే వనరులతోపాటు సామాజిక కట్టుబాటు పద్ధతులను సున్నితంగా వినియోగించడం దీని లక్ష్యం. ఇక రెండోది మాస్కులు ధరించడంపై మాధ్యమాలద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం. ఈ మేరకు ప్రస్తుత దిగ్బంధ విముక్తి దశలో- “మాస్క్ ధారణ, సామాజిక దూరం, హస్త పరిశుభ్రత, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకుండా ఉండటం” అనే నాలుగు కీలక ప్రవర్తనలను సులువుగా అమలు చేయడంపై ఈ పోర్టల్ దృష్టి పెడుతుంది. మరిన్ని వివరాలకు
దేశంలో ఆహార తయారీ పరిశ్రమ సంబంధిత సవాళ్లను అవకాశాలుగా మలచుకోవాలని పెట్టుబడిదారులు/రాష్ట్రాలకు ఎఫ్‌పీఐ శాఖ మంత్రి ఆహ్వానం
కేంద్ర ఆహారతయారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీమతి హరిసిమ్రత్ కౌర్ బాదల్ ఇవాళ విశేష పెట్టుబడుల వేదిక నిర్వహించిన ఆహారతయారీ విభాగం రెండో సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త దిగ్బంధం ప్రకటించిన మరుక్షణం నుంచీ దేశం నలుమూలలా నిత్యావసరాలను... ప్రత్యేకించి ఆహార పదార్థాలను ప్రజలకు అందుబాటులో ఉంచడంవల్ల సదరు చర్య విజయవంతమైందని ఆమె అన్నారు. దేశంలోని సరికొత్త ‘ఆహారరంగ సూక్ష్మ తయారీ సంస్థల క్రమబద్ధీకరణ’ పథకాన్ని 2020 జూన్ 29న తమ శాఖ ప్రారంభించనుందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా సదరు పరిశ్రమలకు ఆధునిక పరిజ్ఞానం, సరళ రుణం, కొత్త విపణులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆహార తయారీ రంగంలో 74 శాతం ఉపాధి అవకాశాలు అసంఘటిత రంగంలోనే ఉన్నాయని వివరించారు. మరోవైపు మొత్తం 25 లక్షల తయారీ యూనిట్లలో 60 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే నడుస్తున్నాయని, వాటిలోనూ 80 శాతం కుటుంబ యాజమాన్యంలోనే కొనసాగుతున్నాయని వెల్లడించారు. భవిష్యత్ స్వయం సమృద్ధ భారతంలో ఈ రంగం పాత్ర ఎంతో కీలక పాత్ర పోషించి ఈ లక్ష్యాన్ని విజయవంతం చేయగలదన్నారు. మరిన్ని వివరాలకు
ఆపరేషన్ సముద్ర సేతు- ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నుంచి భారతీయులతో స్వదేశం బయల్దేరిన భారత నావికాదళ నౌక ’ఐఎన్ఎస్ జలాశ్వ’
భారత నావికాదళం చేపట్టిన “ఆపరేషన్ సముద్ర సేతు” కార్యక్రమంలో భాగంగా ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారత పౌరులను తీసుకొచ్చేందుకు ‘ఐఎన్ఎస్ జలాశ్వ’ నౌక 2020 జూన్ 24న సాయంత్రం అక్కడికి చేరుకుని, నిన్న ఉదయం బందర్ అబ్బాస్ రేవుకు చేరింది. నిబంధనల మేరకు ప్రయాణికులు వస్తువులు, వారికి వైద్య పరీక్షలవంటి అన్నిరకాల తనిఖీలు ముగిశాక 687మంది భారతీయులను ఎక్కించుకుని తిరిగి స్వదేశానికి బయల్దేరింది. అంతకుముందు విమానంలో తరలించే రోగుల కోసం భారత నావికాదళం దేశీయంగా రూపొందించిన రెండు తరలింపు మందసాలను నౌక అధికారులు ఇరాన్ అధికారులకు అందజేశారు. మరిన్ని వివరాలకు
తూర్పు రైల్వే సరుకుల రవాణా 12.304 మిలియన్ టన్నులకు చేరిక
కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్త దిగ్బంధం కొనసాగినప్పటికీ తూర్పు రైల్వే (ER) తన సరుకుల రవాణా సేవలను నిరంతరాయంగా కొనసాగించింది. ఈ మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు నిత్యావసరాలుసహా అవసరమైన సరఫరాలను అందించింది. తదనుగుణంగా 2020 ఏప్రిల్ నుంచి 2020 జూన్ 24వరకు 11.612 మిలియన్ టన్నుల లక్ష్యానికిగాను 12.304 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేసింది. ఇందులో ఒక్క బొగ్గు లోడింగ్ పరిమాణమే 7.963 మిలియన్ టన్నులు కాగా, మిగిలిన సరుకులు 4.341 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. మరిన్ని వివరాలకు
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
ఈ కేంద్రపాలిత ప్రాంతంలో అధికారులంతా అప్రమత్తతను పెంచాలని నగర పాలనాధికారి స్పష్టం చేశారు. అలాగే సామాజిక దూరం మార్గదర్శకాలను, ఇతర పరిశుభ్రత సూచనల పాటింపుపై పూర్తిస్థాయి నిఘాకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తదనునగుణంగా నిబంధనలను ఉల్లంఘించేవారికి జరిమానా విధించేలా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు.
కోవిడ్‌తో పోరాటంలో పంజాబ్ విజయం కోసం ప్రజల సహకారం ఎంతో అవసరమని రాష్ట్ర సామాజిక న్యాయం-సాధికారత-మైనారిటీల వ్యవహారాలశాఖ మంత్రి అన్నారు. జనం సహాయ సహకారాలు లేకుండా ఇది అసాధ్యమని స్పష్టం చేశారు. ఆ మేరకు సబ్బు లేదా శుభ్రక ద్రవంతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలన్నారు. ముఖ్యంగా ఏదైనా తాకిన తర్వాత అన్ని ఆరోగ్య పద్ధతులనూ పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తిచేశారు. కోవిడ్ వ్యతిరేక పోరాటంలో సామాజిక దూరం కొనసాగింపుసహా బయటకు వెళ్లే ప్రతిసారి మాస్కు ధరించడం చాలా ముఖ్యమని చెప్పారు.
వందే భారత్ మిషన్ కింద హిమాచల్ ప్రదేశ్‌కు ఇప్పటిదాకా 71 దేశాలు/నగరాల నుంచి 444 మందిని తీసుకువచ్చారు. వివిధ విమానాశ్రయాల నుంచి తీసుకొచ్చిన వీరందర్నీ అధికారులు సంస్థాగత నిర్బంధవైద్య పరిశీలన కేంద్రాలకు తరలించారు.
విదేశాలనుంచి ప్రవాస భారతీయులను తిరిగి కేరళ తీసుకొచ్చేందుకు రాష్ట్రం నిర్దేశించిన విధానాల అమలు వీలుకాదని విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళధరన్ స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రానికి తిరిగివచ్చే ప్రవాసులకు యాంటీబాడీ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇవాళ మొత్తం 21 విమానాలు కొచ్చికి చేరుతుండగా వీటిలో 20 గల్ఫ్ నుంచి, ఒకటి జార్జియా నుంచి వస్తున్నాయి. కాగా, విదేశాలకు వెళ్లి కేరళకు తిరిగివచ్చి కోట్టయంలో గృహనిర్బంధ వైద్య పరిశీలనలో ఉన్న ఒక యువకుడు మరణం కోవిడ్-19వల్ల సంభవించింది కాదని నిర్ధారణ అయింది. కాగా, కేరళలో కొత్త కేసుల నమోదు దాదాపు తగ్గిపోయిందని గతనెలలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, దిగ్బంధం సడలింపు తర్వాత ప్రవాస కేరళీయులు తిరిగి రావడం మొదలయ్యాక తాజా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ మేరకు నిన్న 123 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 3,726కు చేరాయి. ప్రస్తుతం 1,761మంది ఆస్పత్రుల్లో ఉన్నారు.
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 కొత్త కేసులు నమోదవడంతో స్వల్ప లక్షణాలున్నవారిని ఐజిఎంసిఆర్‌ఐ నుంచి సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఇవాళ 16 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లడంతో ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 203కు చేరగా, ఇప్పటివరకూ మొత్తం 9 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు తమిళనాడులో నిన్న 3,509 కొత్త కేసుల నమోదుతో మునుపెన్నడూ లేనన్ని ఎక్కువ కేసుల రికార్డు సృష్టించింది. దీంతో మొత్తం కేసులు 70,977కు చేరాయి. చెన్నైలో యాక్టివ్ కేసులు 18969కాగా, రాష్ట్రంలో నిన్నటవరకూ సంభవించిన మరణాల సంఖ్య 911గా ఉంది.
బెంగళూరు నగరంలో నిత్యం కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ తిరిగి దిగ్బంధం విధించరాదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, బెంగళూరులో పడకల సామర్థ్యాన్ని 10,000కు పెంచడంతోపాటు ప్రస్తుత దిగ్బంధం నిబంధనలనే అత్యంత కఠినంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని 400 నియంత్రణలో జోన్లలో నిత్యావసరాల సరఫరా తప్పక జరిగేలా చూడాలని కర్ణాటక హైకోర్టు బీబీఎంపీని కోరింది. ఇక 5వ తరగతి వరకు ఆన్‌లైన్ బోధనను నిషేధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సమర్థించింది. మరోవైపు 11 ప్రైవేట్ వైద్యకళాశాలలతోపాటు మరో ప్రభుత్వ కళాశాలలో కోవిడ్ చికిత్సకోసం 2,304 పడకలను కేటాయిస్తూ వైద్యవిద్యా శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక ILI, SARI కేసుల పరీక్ష కోసం అన్ని సామాజిక వైద్య కేంద్రాల్లో జ్వరచికిత్స క్లినిక్‌లను తెరవాలని ఆరోగ్యశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో నిన్న 442 కొత్త కేసులు, 6 మరణాలు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 10,560కి, మరణాల సంఖ్య 170కి చేరింది.
రాష్ట్రంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు (కర్నూలు) శాసనసభ్యుడు సుధాకర్‌కు జూన్ 25న వ్యాధి నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో వారం వ్యవధిలో కోవిడ్ బారినపడిన రెండో ఎమ్మెల్యేగా రికార్డులకెక్కారు. కాగా, రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యూహం, విధానం, చర్యలను యునైటెడ్ కింగ్‌డమ్ డిప్యూటీ హై-కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ శుక్రవారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో ప్రశంసించారు. మరోవైపు కర్నూలు వైద్యకళాశాల ఆస్పత్రిలో రక్తజీవద్రవ్య చికిత్స (ప్లాస్మా థెరపీ)కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 22,305 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో 605 కొత్త కేసులు, 191 డిశ్చార్జి కేసులతోపాటు 10 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులలో 34 అంతర్రాష్ట్ర వాసులకు చెందినవి కాగా, ఒకటి విదేశాల నుంచి వచ్చినవారిది. ప్రస్తుతం మొత్తం కేసులు: 11,489, యాక్టివ్ కేసులు: 6147, డిశ్చార్జ్: 5196, మరణాలు: 146గా ఉన్నాయి.
కోవిడ్-19 దిగ్బంధంవల్ల దోహాలో చిక్కుకున్న 153 మంది తెలంగాణవాసులు ఖతార్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. కాగా, రాష్ట్రంలో ఇవాళ ఒకేరోజు 920 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో నమూనాల పరీక్షలో కచ్చితత్వంపై తెలంగాణ ప్రభుత్వం సందేహం వ్యక్తంచేసింది. ఆ మేరకు ఐసీఎంఆర్ ఆమోదిత 7 ప్రైవేట్ ప్రయోగశాలల నుంచి వచ్చే కోవిడ్-19 నిర్ధారణ ఫలితాల కచ్చితత్వం సందేహాస్పదంగా ఉందని తీవ్ర అనుమానాలు వెలిబుచ్చింఇ. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసులు: 11,364, యాక్టివ్ కేసులు:6,446, డిశ్చార్జ్: 4,688గా ఉన్నాయి.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా గడచిన 24 గంటల్లో 4,841 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,47,741కి పెరిగింది. దీంతోపాటు 192 మరణాలు సంభవించగా మొత్తం మృతుల సంఖ్య 6,931కి చేరింది. దీంతో రాష్ట్రంలో మరణాల శాతం 4.69గా నమోదైంది. మహారాష్ట్రలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 63,342కాగా, ఇప్పటిదాకా 77,453 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 577 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 29,578కి చేరాయి. ఒక్క అహ్మదాబాద్ నగరంలోనే 225 కొత్త కేసులు నమోదవగా- సూరత్‌లో 152, వడోదరలో 44 వంతున నమోదయ్యాయి. గురువారం 410 మంది డిశ్చార్జ్ తర్వాత ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 21,506కు పెరిగింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకూ 3.45 లక్షల నమూనాలను పరీక్షించారు.
రాష్ట్రంలో ఈ ఉదయం 91 కొత్త కేసులతోపాటు ఒక మరణం నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,387కు చేరగా, యాక్టవ్ కేసుల సంఖ్య 3072గా ఉంది. ఇప్పటిదాకా 380 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులకుగాను కోటాలో గరిష్ఠంగా 23 నమోదవగా, భరత్‌పూర్ 17, జైపూర్ 15 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
రాష్ట్రంలో 147 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 12,595కు చేరింది. వీటిలో 2,434 యాక్టివ్ కేసులు కాగా, 9,619 మంది కోలుకున్నారు. ఇప్పటిదాకా 542 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో కరోనా సంక్రమణ వృద్ధి శాతం 1.46 కాగా, ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఇది అతి తక్కువ. ఇక కోలుకునేవారి శాతం 76.4 కాగా, రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
రాష్ట్రంలో 33 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,456కు చేరింది. వీటిలో 715 యాక్టివ్ కేసులు కాగా, ఇప్పటిదాకా 1729 మంది కోలుకున్నారు. కాగా, రాష్ట్రంలో క్లబ్బులు, షాపింగ్ మాల్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లను తిరిగి తెరవడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అనుమతించింది.
గోవాలో 44 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 995కి చేరింది. వీటిలో 658 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అసోం ప్రభుత్వం జూన్ 28 ఆదివారం, రాత్రి 7 గంటల నుంచి 2020 జూలై 12 వరకు గువహటిలో దిగ్బంధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలో ఇప్పటిదాకా 21,274 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 129గా ఉంది. వీరిలో 42 మంది కోలుకోగా, 1441 నమూనాల ఫలితాలు అందాల్సి ఉంది.
రాష్ట్రంలోని తమెంగ్‌లాంగ్ జిల్లాలో అత్యధికంగా 162 కేసులు నమోదయ్యాయి. చురాచంద్‌పూర్ 116, ఉఖ్రూల్ 111 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 702 కాగా, ఇప్పటివరకూ 354 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో 17 మంది కోలుకోగా ఇప్పటివరకూ డిశ్చార్జి అయినవారి సంఖ్య 47కు చేరింది. దీంతో మొత్తం 147 కేసులకుగాను ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 100కు తగ్గింది.
రాష్ట్రంలో 16 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 371కి చేరగా, వీటిలో 211 యాక్టివ్ కేసులు; మరో 160మంది కోలుకున్నారు.
****
(Release ID: 1634683)
Visitor Counter : 368