ప్రధాన మంత్రి కార్యాలయం

'‌ఆత్మ‌ నిర్భర్ ఉత్తర్ ప్ర‌దేశ్ రోజ్‌గార్‌ అభియాన్‌'‌ను ప్రారంభించిన ప్ర‌ధాని

Posted On: 26 JUN 2020 2:24PM by PIB Hyderabad

'ఆత్మనిర్భర్ ఉత్తర్ ప్రదేశ్ రోజ్‌గార్‌ అభియాన్' ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈ రోజు న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. దీని కింద స్థానిక వ్యవస్థాపకతను ప్రోత్సహించ‌డంతో పాటుగా వలస కార్మికులకు త‌గిన‌ ఉపాధి అవకాశాలు కల్పించ‌నున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి సృష్టిస్తున్న ఇబ్బందులను ప్ర‌తీ ఒక్క‌రూ అధిగమించగల‌ర‌ని అన్నారు. కోవిడ్ మ‌హ‌మ్మారికి టీకా అందుబాటులోకి వ‌చ్చేంత వ‌ర‌కు రెండు గ‌జాల దూరం, ముఖానికి మాస్క్ ధ‌రించ‌డంతో పాటుగా అన్ని మేటి జాగ్రత్తల‌ను తీసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. ఈ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఉత్తర్ ప్రదేశ్ విపత్తును అవకాశంగా మార్చిన తీరుపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో ప్రజలు నిమగ్నమైన తీరును కూడా ఆయ‌న ప్ర‌స్తుతించారు. ఇతర రాష్ట్రాలు కూడా 'ఆత్మనిర్భర్ ఉత్తర్ ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్' నుండి చాలా నేర్చుకొని ప్రేరణ పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. క‌రోనా రూపంలో ప్రపంచం ఇంత పెద్ద సంక్షోభంలో ఉన్నప్పుడు ఉత్తర్ ప్రదేశ్ చూపిన ధైర్యం, త‌గిన మేథ‌స్సును ప్రధాన మంత్రి ఈ సంద‌ర్భంగా ప్రశంసించారు. మ‌హ‌మ్మారి క‌ట్టడిలో రాష్ట్రం విజయవంతం అయిన విధానం, పరిస్థితిని నిర్వహించిన తీరు ఎంతో అపూర్వమైనదని, ప్రశంసనీయ‌మైన‌ది అని ఆయ‌న అన్నారు. ఉత్త‌ర్‌ ప్ర‌దేశ్‌లో వైద్యులు, పారామెడిక‌ల్ సిబ్బంది, ఇత‌ర  పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, ఆశా వ‌ర్క‌ర్లు, అంగన్‌వాడీ కార్మికుల‌తో పాటు బ్యాంకులు, పోస్టాఫీసులు, రవాణా సేవలు, కార్మికులు అందించిన‌ సహకారాన్ని ప్రధాని ప్రశంసించారు.

30 లక్షలకు పైగా వలస కార్మికులు సొంత గ్రామాల‌కు వందలాది శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో త‌గిన‌ సౌకర్యాల‌ను కల్పించడం ద్వారా యూపీకి చెందిన వలస కార్మికులను తిరిగి సొంత రాష్ట్రానికి తీసుకురావడానికి యుపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని ప్రశంసించారు. గత కొన్ని వారాల వ్య‌వ‌ధిలోనే దేశవ్యాప్తంగా 30 లక్షలకు పైగా వలస కార్మికులు యూపీలోని తమ సొంత ‌గ్రామాలకు తిరిగి వచ్చారని ఆయన అన్నారు. యుపీ ముఖ్యమంత్రి ప్ర‌స్తుత పరిస్థితి యొక్క తీవ్రతను బాగా అర్థం చేసుకున్నారని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప‌లు చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని ప్రధాని అన్నారు. పేదలు ఆకలితో ఉండకుండా చూసుకోవడానికి గాను యూపీ ప్రభుత్వం అపూర్వ కృషి చేసింద‌ని ప్రధాని ప్రశంసించారు. 'ప్రధాన్ మంత్రి గ‌రీబ్ కళ్యాణ్ అన్న‌ యోజన' కింద పేదలకు, వలస కార్మికులకు ఉచిత రేషన్లు ఇవ్వడంలో యుపీ ప్రభుత్వం చాలా వేగంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. రేషన్ కార్డులు లేని వారికి కూడా ఇది అందించిన‌ట్టుగా ఆయ‌న వివ‌రించారు. దీనికి తోడు సుమారు 5 వేల కోట్ల రూపాయలను నేరుగా ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన 75 లక్షల మంది పేద మహిళల జనధన్ ఖాతాకు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు.

ముద్ర యోజన కింద రూ.10,000 కోట్లు కేటాయింపు భారతదేశాన్ని ఆత్మనిర్భర్ మార్గంలో వేగంగా తీసుకెళ్లాలనే ప్రచారంతో పాటు గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్‌ అభియాన్‌లోనూ ఉత్త‌ర్‌ ప్రదేశ్ ముందుందని ప్రధాని అన్నారు. గ‌రీబ్ కళ్యాణ్ రోజ్‌గార్‌ అభియాన్ కింద కార్మికుల ఆదాయాన్ని పెంచడానికి గ్రామాల్లో అనేక పనులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరిలో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పథకాల కింద ఎంఎస్‌ఎంఈలలో సుమారు 60 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతే కాకుండా వేలాది మందికి స్వయం ఉపాధి కల్పించడానికి గాను ముద్ర యోజన కింద రూ.10,000 కోట్లు కేటాయించిన‌ట్టుగా తెలిపారు. ఆత్మ నిర్భర్ రోజ్‌గార్‌ అభియాన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇటువంటి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి పరిశ్రమల సమూహాలను సృష్టిస్తున్నప్పుడు యుపీకి ఎంతో ప్రయోజనం కలుగుతుందని శ్రీ మోడీ అన్నారు. వ్యవసాయంలో ఇటీవల ప్రకటించిన సంస్కరణలను ప్రధాన మంత్రి ఎత్తిచూపారు, ఇక్కడ రైతులు చట్టం ప్రకారం వివిధ ర‌కాల సంకెళ్ళ నుండి విముక్తి పొందారు.

రైతుల‌కు గ‌తంలో ఎన్న‌డూ లేని స్వేచ్ఛ‌ ఇప్పుడు రైతులు తమ ఉత్పత్తులను భారతదేశంలో ఎక్కడైనా విక్రయించడానికి స్వేచ్ఛగా ఉన్నారని, పంట‌ల‌ను విత్తుకునే సమయంలో తన ధరను నిర్ణయించుకొనే వెస‌లుబాటు ల‌భించిందని ఆయ‌న అన్నారు. మన పశుపోష‌ణ‌ కోసం అనేక కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. పశువుల, పాడి రంగానికి 15 వేల కోట్ల రూపాయల ప్రత్యేక మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేయ‌బ‌డిన‌ట్టుగా ఆయ‌న తెలిపారు. బౌద్ధ సర్క్యూట్‌ను ప్రోత్సహించే విషయంలో కుషినగర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించిన విష‌యాన్ని కూడా ప్రధాని మోడీ ఈ సంద‌ర్భంగా ప్రస్తావించారు. ఇది పూర్వంచల్‌లో ఎయిర్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంద‌ని మరియు దేశంలోనూ, విదేశాలలోనూ కోట్లాది మంది మహాత్మా బుద్ధ భక్తులు సులభంగా యుపీకి చేరుకొనే వెసులుబాటు ల‌భించ‌నుంద‌ని తెలిపారు.

30 లక్షలకు పైగా పక్కా ఇండ్లు కేవలం గ‌డిచ‌న మూడేళ్లలో పేదలకు 30 లక్షలకు పైగా పక్కా ఇండ్ల‌ను నిర్మించామని, యూపీని బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రంగా మార్చ‌గ‌లిగామ‌ని అన్నారు. 3 లక్షల మంది యువతకు పారదర్శకంగా యూపీ సర్కారు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని ప్రధాని చెప్పారు. రాష్ట్రంలో శిశు మరణాల రేటును తగ్గించడానికి తీసుకున్న చర్యలను, పూర్వాంచల్ ప్రాంతంలో ఎన్సెఫాలిటిస్ రోగుల సంఖ్య గత 3 సంవత్సరాల్లో 90 శాతం ఎలా త‌గ్గించ‌గ‌లిగారో కూడా శ్రీ మోడీ ఇక్క‌డ ప్రస్తావించారు. రాష్ట్రంలో విద్యుత్, నీరు, రోడ్లు వంటి ఇత‌ర ప్రాథమిక మౌలిక సదుపాయాలలో అపూర్వమైన అభివృద్ధిని గురించి ప్రధాని ఇక్క‌డ మాట్లాడారు. కార్య‌క్ర‌మంలో భాగంగా వివిధ ప‌థ‌కాల లబ్ధిదారులు మరియు వాటాదారులతో ప్రధాని సంభాషించారు. గోండాలో స్వయం సహాయక బృందానికి నాయకత్వం వహిస్తున్న శ్రీమతి వినీతా పాల్, బహ్రాయిచ్ జిల్లాకు చెందిన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుడు శ్రీ తిల‌క్ రామ్ సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన వ్యవస్థాపకుడు శ్రీ అమరేంద్ర కుమార్‌ల‌తో ప్ర‌ధాన మంత్రి ముచ్చ‌టించి వారి అనుభ‌వాల‌ను తెలుసుకున్నారు. ముంబ‌యికి వ‌ల‌స‌పోయి తిరిగి వచ్చిన శ్రీ కుర్బాన్ అలీ, గోరఖ్‌పూర్‌ జిల్లాకు వ‌ల‌స పోయి తిరిగి వ‌చ్చిన‌ శ్రీ నాగేంద్ర సింగ్, జలాన్ జిల్లా నుండి తిరిగి వ‌చ్చిన‌ శ్రీ దీపుతో పాటుగా ప‌లువురు యూపీకి తిరిగి వ‌చ్చిన వలసదారుల‌తో ఆయన సంభాషించారు.

********

 



(Release ID: 1634571) Visitor Counter : 302