గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ వెబ్ పోర్టల్ ను ప్రారంభించిన - కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్



ఈ పధకం జిల్లా వారీ, పని వారీ విభాగాల సమాచారాన్ని ఈ పోర్టల్ అందిస్తుంది; పనుల పురోగతి, పర్యవేక్షణ, పూర్తి అయిన పనుల సమాచారం కూడా ఈ పోర్టల్ ద్వారా లభిస్తుంది.


కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా స్వస్థలాలకు తిరిగి వచ్చిన లక్షలాది మంది నైపుణ్యం కలిగిన కార్మికులకు గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ ద్వారా నాలుగు నెలల పాటు మంచి ఉపాధి లభిస్తుంది : శ్రీ తోమర్.

Posted On: 26 JUN 2020 5:59PM by PIB Hyderabad

గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ వెబ్ పోర్టల్ ను - కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, ఈ రోజు, న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.  భారత ప్రభుత్వ భారీ ఉపాధి కల్పన-గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమం - గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ పధకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2020 జూన్ 20వ తేదీన ప్రారంభించారు.  కోవిడ్ -19 మహమ్మారి నుండి ఉత్పన్నమవుతున్న పరిస్థితి కారణంగా, తమ స్వస్ధలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు వచ్చే నాలుగు నెలల పాటు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.   ఈ వీడియో కాన్ఫరెన్స్ లో -  కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా,  గుర్తించిన జిల్లాల్లో అభియాన్ అమలును పర్యవేక్షించడానికి ప్రభుత్వం నియమించిన 116 కేంద్ర నోడల్ అధికారులతో పాటు,  ఈ పథకంతో సంబంధం ఉన్న మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ పోర్టల్ ప్రారంభించినందుకు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ కార్యక్రమం అమలులో ఉన్న వివిధ జిల్లాల వారీగా, పథకాల వారీగా ఉన్న పనుల గురించి ప్రజలకు సమాచారం ఇవ్వడంతో పాటు, చేపడుతున్న పనుల పురోగతిని పర్యవేక్షించడానికి కూడా ఈ పోర్టల్ సహాయపడుతుందనీ, 6 రాష్ట్రాలలోని 116 జిల్లాల్లో 50,000 కోట్ల రూపాయల నిధులతో ఈ పనులు చేపట్టడం జరుగుతోందనీ ఆయన చెప్పారు. ప్రతి జిల్లాలో సుమారు 25 వేలకు పైగా తిరిగి వచ్చిన వలస కార్మికులు ఉన్నారని కేంద్ర మంత్రి తెలిపారు.   కోవిడ్ -19 మహమ్మారి సృష్టించిన క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో విజయవంతంగా పనిచేసిందని, శ్రీ తోమర్ అన్నారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ యొక్క దూరదృష్టి నాయకత్వం కారణంగా, లాక్ డౌన్ సమయంలో కూడా, వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుకు సంబంధించిన కార్యకలాపాలు పేద ప్రజల జీవనోపాధి సమస్యలను తొలగించడానికి కొనసాగాయని ఆయన పేర్కొన్నారు.

శ్రీ తోమర్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,01,500 కోట్ల రూపాయల కేటాయింపుతో, నైపుణ్యం లేనివారికి ఉపాధి కల్పిస్తున్న గొప్ప పధకం, ఎం.జి.ఎన్.‌ఆర్.ఈ.జి.ఎ. అని అన్నారు.  లాక్ డౌన్ కారణంగా స్వస్థలాలకు తిరిగి వచ్చిన లక్షలాది మంది నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉపాధి కల్పించాలన్న ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, 50 వేల కోట్ల రూపాయల నిధితో, గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్,  2020 జూన్ 20వ తేదీన ప్రారంభమయ్యింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తూ, భారత ప్రభుత్వంలోని 12 ఇతర మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ కార్య్రక్రమాన్ని నిర్వహిస్తోంది. గుర్తించబడిన జిల్లాల్లో, ఈ కార్యక్రమం కింద, 25 రకాల పనులను చేపట్టి, 125 రోజుల్లో పూర్తిచేస్తారు.  షెడ్యూల్ ప్రకారం సాధారణ వేగంతో పురోగమిస్తున్న ఈ పనులు, ఇప్పుడు మహమ్మారి సృష్టించిన సవాలును, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ వ్యవధిలో మౌలిక సదుపాయాలను సృష్టించే అవకాశంగా మార్చుకుని, వేగం పుంజుకున్నాయని శ్రీ తోమర్ పేర్కొన్నారు.

వెబ్ పోర్టల్ ప్రారంభోత్సవం అనంతరం, గుర్తించబడిన 116 జిల్లాల కేంద్ర నోడల్ అధికారుల కోసం ఒక వర్క్‌షాప్ జరిగింది.  ఇందులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ మంత్రిత్వ శాఖలు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పాలనా యంత్రాంగాలు అభియాన్ కింద పనుల పురోగతిని సకాలంలో పూర్తిచేయడం కోసం వాటిని అమలు చేయడం మరియు పర్యవేక్షించడం వంటి విధులు, బాధ్యతలను వివరించారు. రైల్వేలు, రోడ్డు రవాణా, రహదారులు, గనులు,  నూతన మరియు పునరుత్పాదక ఇంధనం, త్రాగు నీటి సరఫరా, పారిశుధ్యం, పర్యావరణం, అడవులు,  పెట్రోలియం, సహజ వాయువు, టెలికాం, వ్యవసాయం, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖలతో పాటు, సరిహద్దు రహదారుల సంస్థ, వివిధ గ్రామీణాభివృధి శాఖలకు చెందిన  ప్రతినిధులు నోడల్ అధికారుల కోసం సవివరమైన ప్రదర్శనలు ఇచ్చారు.

 

 

*****



(Release ID: 1634651) Visitor Counter : 269