PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 08 JUN 2020 6:18PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • నిన్న 5,137మందిసహా కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 1,24,430కి పెరిగి, కోలుకునేవారి శాతం 48.49కి చేరింది.
  • 1,24,981 యాక్టివ్‌ కేసులు వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి.
  • కోవిడ్‌-19 కేసులు అత్యధికంగాగల  ఎంపిక చేసిన జిల్లాల పాలన, వైద్యాధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి చర్చలు.
  • ఇరాన్‌ నుంచి భారతీయుల తరలింపు ప్రారంభించిన భారత నావికాదళం
  • కోవిడ్-19 ప్రధానంగా ఆరోగ్యం-ముప్పు వర్తమానంపై స‌మాచార బ్రోచర్‌ ‘య‌ష్‌’ను విడుద‌ల చేసిన డీఎస్‌టీ.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; కోవిడ్‌-19 కేసులు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల కలెక్టర్లు, పురపాలక కమిషనర్లు, ప్రధాన వైద్యాధికారులతో ఆరోగ్యశాఖ కార్యదర్శి చర్చ

 

దేశంలో కోవిడ్‌-19 కేసులు అత్యధికంగా నమోదవుతున్న 10 రాష్ట్రాల్లోగల 38 జిల్లాలు, వాటి పరిధిలోని 45 పుర/నగరపాలికలకు సంబంధించిన కలెక్టర్లు, కమిషనర్లు, ప్రధాన వైద్యాధికారులు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రీతి సుడాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, గుజరాత్,మ్ముకశ్మీర్‌, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. ఉమ్మడి ప్రజా సదుపాయాల భాగస్వామ్య ప్రాంతాలుసహా జనసాంద్రతగల పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాధి వ్యాప్తి, ఇంటింటి సర్వేల ప్రాముఖ్యం, సకాలంలో పరీక్షలు, ఏకాంత చికిత్సకు తరలింపు, కేసుల వైద్య నిర్వహణ, అమలు చేయాల్సిన నియంత్రణ వ్యూహం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు.

ఈ మేరకు నిరంతర శ్రద్ధ చూపాల్సిన అంశాలకు సంబంధించి- సకాలంలో కేసులు కనుగొనడం, అధ్యయన బృందాల సంఖ్య పెంపు, సమర్థ అంబులెన్స్‌ నిర్వహణ, ఆస్పత్రులలో రోగుల సమర్థ వర్గీకరణ, పడకల నిర్వహణ, ఆస్పత్రికి చేరిన కేసులపై 24 గంటల వైద్య నిర్వహణ తదితరాలతో మరణాల శాతం తగ్గుదలకు భరోసానిస్తాయి. తదనుగుణంగా ఈ సమావేశంలో అధికారులకు కొన్ని సూచనలు చేయబడ్డాయి- నమూనాల పరీక్ష ఫలితాలను సకాలంలో అందజేసేలా ప్రయోగశాలలపై పర్యవేక్షణ, తద్వారా సకాలంలో రోగుల గుర్తింపు-చికిత్సకు వీలు కల్పిస్తుందని ప్రధానంగా వారికి సూచించారు. ఇక ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,24,430కి చేరింది. వీరిలో గడచిన 24 గంటల్లోనే 5,137 మందికి కోవిడ్‌-19 వ్యాధి నయమైంది. ఈ నేపథ్యంలో కోలుకునేవారి శాతం 48.49గా నమోదైంది. ప్రస్తుతం 1,24,981 యాక్టివ్‌ కేసులు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి.

 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630244

దిగ్బంధం స‌మ‌యంలో 3,965 స‌ర‌కుల‌ రైళ్ల‌ద్వారా 111.02 ల‌క్ష‌ల ట‌న్నుల ఆహార‌ధాన్యాల తరలింపు

దేశంలో 2020 మార్చి 24న దిగ్బంధం ప్రకటించిన నాటినుంచి ఇప్ప‌టిదాకా 3,965 గూడ్సు రైళ్ల‌ద్వారా సుమారు 111.02 ల‌క్ష‌ల ట‌న్నుల ఆహార ధాన్యాలు ర‌వాణా అయ్యాయి. రైలు మార్గంలోనేగాక ర‌హ‌దారి, జ‌ల‌మార్గాలద్వారానూ స‌ర‌కుల రవాణా సాగిన నేప‌థ్యంలో మొత్తం 234.51 ల‌క్ష‌ల ట‌న్నుల ఆహార‌ధాన్యాల‌ను చేర‌వేశారు. అలాగే 13 ఓడల ద్వారా 15,500 టన్నుల ఆహారధాన్యాలు రవాణా చేశారు. ఇక ఈశాన్య భార‌త రాష్ట్రాల‌కు 11.30 ల‌క్ష‌ల ట‌న్నుల ఆహార ధాన్యాలు ర‌వాణా చేశారు. మరోవైపు NFSAతోపాటు రాష్ట్ర ప్ర‌జాపంపిణీ ప‌థ‌కాల ప‌రిధిలోకిరాని సుమారు 8కోట్ల మంది వలసకార్మికులు, వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ఇత‌రుల‌కు, పేద‌ కుటుంబాలకు స్వ‌యం స‌మృద్ధ భార‌తం ప్యాకేజీ కింద 8 ల‌క్ష‌ల ట‌న్నుల‌ ‌ఆహార ధాన్యాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా వలస కార్మికులకు మే, జూన్‌ నెలలకుగాను  ఒక్కొక్కరికి 5 కిలోల వంతున ఉచితంగా పంపిణీ చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్ర‌భుత్వాలు 4.42 ల‌క్ష‌ల ట‌న్నుల ఆహార ధాన్యాలను తీసుకెళ్లాయి. ఇందులో 20.26 లక్షలమంది లబ్ధిదారులకు ఇప్ప‌టిదాకా 10,131 టన్నుల‌దాకా పంపిణీ చేశాయి. ఇక 1.96 కోట్లమంది వలస కుటుంబాలకు 39,000 ట‌న్నుల‌ పప్పుదినుసుల పంపిణీకి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630083

‘ఆప‌రేష‌న్ స‌ముద్ర సేతు’కింద ఇస్లామ్‌ గణతంత్ర ఇరాన్ నుంచి భార‌త పౌరుల త‌ర‌లింపు ప్రారంభించిన భార‌త నావికాద‌ళం

భారత నావికాదళం “ఆప‌రేష‌న్ సముద్ర సేతు” కింద 2020 మే 8 నుంచి విదేశాల్లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశం త‌ర‌లించ‌డం ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘ఐఎన్ఎస్‌ జలాశ్వ, మగర్’ నౌకలు ఇప్పటికే శ్రీ‌లంక‌, మాల్దీవ్స్ నుంచి 2,874మందిని కేర‌ళ‌లోని కోచ్చి, త‌మిళ‌నాడులోని ట్యుటికోరిన్ రేవులకు చేర్చాయి. త‌దుప‌రి ద‌శకింద ‘ఐఎన్ఎస్ శార్దూల్‌’ 2020 జూన్ 8 నుంచి ఇస్లామ్ గ‌ణ‌తంత్ర ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ రేవునుంచి గుజరాత్‌లోని పోర్‌బంద‌ర్ రేవుకు భారతీయుల‌ను తరలిస్తుంది. ఇందుకోసం అక్క‌డి భార‌త రాయ‌బార కార్యాల‌యం పౌరుల జాబితాను రూపొందిస్తోంది. అనంతరం వారి ప్రయాణ సౌల‌భ్యం దృష్ట్యా అవసరమైన వైద్య పరీక్షలు చేయించాక శార్దూల్‌ నౌక‌లో స్వదేశం పంపుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630179

మిషన్ సాగర్ - సీషెల్స్ లోని పోర్ట్ విక్టోరియా వద్ద ఐఎన్ఎస్ కేసరి

మిషన్ సాగర్‌లో భాగంగా, భార నావికాదళ నౌక ‘కేసరి’ 2020 జూన్ 07న సీషెల్స్‌ నగరంలోని  విక్టోరియా రేవుకు చేరింది. ప్రస్తుత సంక్లిష్ట సమయంలో కోవిడ్‌-19పై పోరాడుతున్న ఇరుగుపొరుగు మిత్రదేశాలకు భారత ప్రభుత్వం సౌహార్ద సహాయం అందిస్తోంది. ఇందులో భాగంగానే సీషెల్స్ ప్రజల కోసం ‘ఐఎన్‌ఎస్‌ కేసరికోవిడ్‌ సంబంధిత అత్యవవసర ఔషధ సామగ్రిని తీసుకువెళ్లింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630101

‘ఆప‌రేష‌న్ స‌ముద్ర సేతు’ – మాల్దీవ్స్‌ నుంచి 700 మంది భారతీయులను ట్యుటికోరిన్‌ రేవుకు చేర్చిన ‘ఐఎన్‌ఎస్‌ జలాశ్వ’

‘ఆపరేషన్‌ సముద్ర సేతు కింద భారత నావికాదళ నౌక ‘ఐఎన్‌ఎస్‌ జలాశ్వ’ మాల్దీవ్స్‌ నుంచి 700 మంది భారతీయులతో 2020 జూన్‌ 07న తమిళనాడులోని ట్యుటికోరిన్‌ రేవుకు చేరుకుంది. ఈ బృందాన్ని స్వదేశం చేర్చడంద్వారా విదేశాల్లోని భారత పౌరులను తిరిగి తీసుకొచ్చే ‘వందే భారత్‌ మిషన్‌’ కింద శ్రీలంక, మాల్దీవ్స్‌ నుంచి మొత్తం 2,672మంది ‘జలాశ్వ’ద్వారా భారత్‌ చేరుకున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630110

కోవిడ్-19 ప్రధానంగా ఆరోగ్యం-ముప్పు వర్తమానంపై స‌మాచార కరదీపిక య‌ష్‌ను విడుద‌ల చేసిన డీఎస్‌టీ

కోవిడ్-19పై ప్రధానంగా దృష్టి సారిస్తూ ఆరోగ్యం-ముప్పు వర్తమానంపై ఇటీవల ప్రారంభించిన ‘శాస్త్ర-ఆరోగ్య అవగాహన సంవత్సరం-య‌ష్‌’ (YASH) కార్యక్రమంపై శాస్త్ర-సాంకేతిక శాఖ (DST) పరిధిలోని జాతీయ శాస్త్ర-సాంకేతిక సమాచార మండలి (NCSTC) సమాచార కరదీపికను విడుదల చేసింది. దేశంలో కోవిడ్-19 మహమ్మారివల్ల ఎదురయ్యే ముప్పులు, సంక్షోభాలు, విపత్తులు, అనిశ్చిత పరిస్థితులవంటి సమస్యల పరిష్కారం దిశగా చేపట్టాల్సిన ఇలాంటి భారీ కార్యక్రమం అవసరాన్ని కరదీపికలో వివరించింది.  ప్రస్తుత, భవిష్యత్‌ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనగల మెరుగైన సంసిద్ధతసహా విజ్ఞానశాస్త్ర- ఆరోగ్య అంశాలపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630233

ఏకాంత ర‌వాణా కోసం గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ మంద‌సం (ARPIT) రూపొందించిన భారత వైమానిక దళం

భారత వైమానిక దళం “ఏకాంత ర‌వాణాకోసం గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ మంద‌సం” (ఎయిర్‌బోర్న్‌ రెస్క్యూ పాడ్‌ ఫర్‌ ఐసొలేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌-ARPIT) నమూనాను రూపొందించి, అభివృద్ధి పరచడంతోపాటు స్వయంగా తయారుచేసింది. ఎత్తయిన ప్రదేశాలు/ మారుమూల ప్రాంతాల్లో కోవిడ్‌-19సహా అంటువ్యాధులతో తీవ్రంగా బాధపడేవారిని గగనమార్గాన తరలించాల్సినపుడు ఈ మందసాన్ని (POD) ఉపయోగిస్తారు. ఇటువంటివారిని గగనమార్గంలో తరలించేటపుడు వ్యాధికారక జీవులు వాయుప్రసారంద్వారా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని, కోవిడ్‌-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో వైమానికదళం గ్రహించింది. ఈ మేరకు ఇలాంటి ముప్పు తప్పించడానికి తొలి ప్రయోగాత్మక నమూనాలను ‘3 బిఆర్‌డి ఏఎఫ్‌’లో రూపొందించి, అనేకరకాల మార్పుచేర్పులతో అభివృద్ధి చేశారు. అంతేకాకుండా స్వయం సమృద్ధ భారతంపై ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ మందసం నిర్మాణంలో పూర్తి దేశీయ సామగ్రిని వినియోగించారు. ఇలాంటి వ్యవస్థ దిగుమతికి రూ.60లక్షలదాకా వెచ్చించాల్సిన నేపథ్యంలో ఈ మందసం తయారీ ఖర్చు కేవలం రూ.60 వేలు కావడం విశేషం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630345

కోవిడ్ -19 వ్యాప్తిని నిరోధం కోసం పెద్ద ఎత్తున 3 డి సూక్ష్మక్రిమి నిరోధక ఫేస్-షీల్డ్స్ పారిశ్రామిక గ్రేడ్ తయారీ-వాణిజ్యీకరణ దిశగా నైపర్‌-గువహటి, హిందూస్థాన్‌ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం

కోవిడ్‌-19 ప్రాణాంతక వ్యాప్తిని నిరోధించగల వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ)ని తయారు చేయడంలో ప్రయోజనకర సహకార-పరిష్కరాల దిశగా కేంద్ర ఔషధశాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-(NIPER) గువహటి సిద్ధమైంది. ఈ మేరకు పుణోలని పింప్రిలోగల హిందూస్థాన్ యాంటీబయాటిక్స్‌ లిమిటెడ్ (కేంద్ర ఔషధశాఖ పరిధిలోని HAL)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద పెద్ద ఎత్తున “3డి సూక్ష్మక్రిమి నిరోధక ఫేస్-షీల్డ్స్” పారిశ్రామిక గ్రేడ్ తయారీ-వాణిజ్యీకరణను చేపడతారు. ఈ కవచాలకు సంబంధించి స్వరూప-తయారీలపై తాత్కాలిక హక్కు (ప్రొవిజనల్ పేటెంట్‌) కోరుతూ నైపర్‌-గువహటి భారత పేటెంట్‌ కార్యాలయానికి దరఖాస్తు చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630298

‘దేఖో అప్నాదేశ్‌’ సిరీస్‌ కింద ‘వైల్డ్‌ వండర్స్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌’ పేరిట 29వ వెబినార్‌ ద్వారా వర్చువల్‌ సఫారీని ప్రదర్శించిన పర్యాటక మంత్రిత్వ శాఖ

ప్రపచంలోని జీవవైవిధ్య సంపన్న ప్రాంతాల్లో ఒకటైన అద్భుత భారత హృదయసీమ మధ్యప్రదేశ్‌లోగల వన్యప్రాణి విశేషాల సందర్శన అనుభవాన్ని ఈ వెబినార్‌ద్వారా ప్రదర్శించిన వర్చువల్‌ సఫారీ కళ్లకు కట్టింది. పర్యాటకంపై కోవిడ్‌-19 ప్రభావం నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ పర్యాటక శాఖ ప్రత్యేక కారవాన్‌ వాహనాలను ఏర్పాటు చేసింది. పర్యాటకులు తమ సందర్శన కోసం హోటళ్లలో ఉండే అవసరం లేకుండా, సామాజిక దూరం పాటించడానికి వీలుగా ఈ వాహనాల్లో పడకలు, రిఫ్రిజిరేటర్‌, ఇతర అత్యవసరాలు ఉంటాయి. వీటిని పర్యాటకులు అద్దెకు తీసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630327

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • కేరళ: రాష్ట్రంలోని త్రిస్సూర్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న 43 ఏళ్ల మహిళ ఈ మధ్యాహ్నం మృతి చెందడంతో కేరళలో 17వ కోవిడ్-19 మరణం నమోదైంది. మరోవైపు కోవిడ్‌-19 వ్యాప్తి  నివారణా ప్రభుత్వానికి ప్రధానమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ చెప్పారు. ఈ కృషిలో ప్రజల సహకారంతోపాటు ప్రభుత్వ మార్గదర్శకాలను కఠినంగా పాటించడం చాలా కీలకమన్నారు. రాష్ట్రంలో 10 నుంచి 15 శాతం వ్యాధి వ్యాప్తికి కారణం వ్యక్తుల మధ్య సంబంధాలేనని ఆమె అన్నారు. కాగా, కోళికోడ్, పథనంతిట్టలలో నిర్బంధవైద్య కేంద్రంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించడంతో కోవిడ్ నిర్ధారణ కోసం వారి నమూనాలను సేకరించారు. ఇవాళ యూఏఈలోని దుబాయ్ చేరుకున్న కేరళవాసి ఒకరు వైరస్ బారినపడి మరణించారు. ఇక రాష్ట్రంలో నిన్న 107 కొత్త కేసులు నమోదవగా, ఒక మరణం సంభవించింది. ప్రస్తుతం 1,095మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాడు: దేశంలో కోవిడ్‌-19 నుంచి కోలుకుంటున్నవారి శాతం  తమిళనాడులోనే అత్యధికమని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే మరణాల సంఖ్య ప్రపంచ స్థాయిలో రాష్ట్రంలోనే అత్యల్పమని కూడా చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఆలయాలను ఇవాళ తెరవాల్సి ఉండగా కోవిడ్-19 కేసులు పెరగడంతో తెరవలేదు. ఇక ప్రైవేటు రంగంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష ఫీజును రూ.3,000కాగా; ఇంటివద్ద నమూనా సేకరణకు అదనంగా రూ.500 వసూలు చేసుకోవచ్చునని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షల నాణ్యత దిశగా ప్రయోగశాలలపై తనిఖీ ఉంటుంది. చెన్నై పరిసరాల్లోని మూడు జిల్లాలకు కొత్త నియంత్రణ వ్యూహం నిర్దేశించారు; ఈ మేరకు పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లోని కేసులపై సూక్ష్మ నిర్వహణ ప్రణాళికను అమలు చేస్తారు. తమిళనాడులో నమోదైన కేసుల్లో 70శాతం చెన్నైకి చెందినవే కావడం గమనార్హం. ఇక నిన్న 1515 కొత్త కేసులు నమోదవగా, 604 రికవరీలు, 18 మరణాలు నమోదయ్యాయి. చెన్నై నుండి 1155 కేసులు. మొత్తం కేసులు: 31667, యాక్టివ్ కేసులు: 14396, మరణాలు: 269, డిశ్చార్జ్: 16999 కాగా, చెన్నైలో యాక్టివ్ కేసులు 10982గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ ఆలయాలు, మసీదులు, చర్చిలు తదితర ప్రార్థన స్థలాలను తిరిగి తెరిచారు. అయితే, భారీ జన సమ్మేళనాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. మరోవైపు మార్కెట్లు, మాల్స్, హోటళ్ళు కూడా తెరిచారు. ఇక గృహ నిర్బంధవైద్య పర్యవేక్షణ సిఫారసు ఉన్నవారిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం కోసం బీబీఎంపీ ప్రామాణిక ప్రక్రియ విధివిధానాలను జారీ చేయడంతోపాటు 460 బృందాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 239 కొత్త కేసులు నమోదవగా, 143 మంది డిశ్చార్జి అయ్యారు. రెండు మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య: 5452, యాక్టివ్‌ కేసులు: 3257, మరణాలు: 61 కోలుకున్నవారు: 2132.
  • ఆంధ్రప్రదేశ్: తిరుమల ఆలయంలో దాదాపు 80 రోజుల విరామం తర్వాత భక్తుల దర్శన ప్రక్రియను ఇవాళ ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇక రాష్ట్రంలో ఖరీఫ్‌ పంటల సాధారణ సాగు లక్ష్యం 37.54 లక్షల హెక్టార్లు కాగా, ఈసారి 39.59 లక్షల హెక్టార్లుగా నిర్ణయించారు. పారిశ్రామిక అవసరాలను గుర్తించడంతోపాటు తగిన నైపుణ్యంగల కార్మికశక్తి అన్వేషణ దిశగా జిల్లాలవారీ ‘నైపుణ్య అంతరం’పై సర్వే చేపట్టనున్నారు. వలసకార్మికుల భారీ విస్ఫోటం నేపథ్యంలో చేపడుతున్న ఈ సర్వే ఈ నెల మధ్యనుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా, రాష్ట్రంలో 14,246 నమూనాలను పరీక్షించిన తర్వాత గత 24గంటల్లో 125 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 34 మంది డిశ్చార్జ్ కాగా, మరణాలేవీ సంభవించలేదు. మొత్తం కేసులు: 3843. యాక్టివ్: 1381, రికవరీ: 2387, మరణాలు: 75గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా ఇవాళ్టినుంచి ఆలయాలు తెరిచారు. విధి నిర్వహణలో భాగంగా కోవిడ్-19 బారినపడిన ఆరోగ్య కార్యకర్తలకు మద్దతు పలుకుతూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)ను సందర్శించారు. రాష్ట్రంలో జూన్ 7నాటికి మొత్తం కేసులు 3650. ఇప్పటిదాకా వలసదారులు, విదేశాలనుంచి తిరిగి వచ్చినవారిలో 448 మందికి కోవిడ్-19 నిర్ధారణ అయింది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో 3,007 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 85,975కు పెరిగింది. వీటిలో 43,591 యాక్టివ్‌ కేసులు కాగా, హాట్‌స్పాట్ ముంబైలో ఆదివారం 1,421 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 48,549కి చేరాయి. రాష్ట్రంలోని ప్రైవేట్ కార్యాలయాలు 10 శాతం సిబ్బందితో కార్యకలాపాలు ప్రారంభించగా, మిగిలినవారికి ఇంటినుంచి పనిచేసే వీలు కల్పించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం దిగ్బంధం 5.0 కొనసాగుతుండగా, నియంత్రణ, నియంత్రణేతర జోన్లను గుర్తించిన తర్వాత దశలవారీ సడలింపులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
  • గుజరాత్: రాష్ట్రంలో 480 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 20,070కి చేరింది. వీటిలో 5186 యాక్టివ్‌ కేసులున్నాయి. గత 24 గంటల్లో 30 మంది రోగులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1249కు చేరింది. గుజరాత్‌లోని ద్వారకాధీష్‌, శ్రీ సోమనాథ్ ఆలయాలను ఇవాళ తిరిగి తెరిచారు. అయితే, అందుబాటులోగల స్లాట్లలో ఆన్‌లైన్ బుకింగ్ తర్వాత భక్తులు జూన్ 12 తర్వాత సోమనాథ్ ఆలయాన్ని సందర్శించాలని అధికారులు సూచించారు. ఆపరేషన్ సముద్ర సేతులో భాగంగా ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ఓడరేవు నుంచి గుజరాత్‌లోని పోర్బందర్‌కు ఐఎన్‌ఎస్ శార్దూల్‌ ద్వారా ఇవాళ్టినుంచి భారత పౌరుల తరలింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇరాన్‌లోని భారత దౌత్య కార్యాలయం పౌరుల జాబితాను సిద్ధం చేస్తోంది. వీరి ప్రయాణ సౌలభ్యం కోసం అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో 97 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 10,696కు చేరాయి. వీరిలో 7814 మంది కోలుకున్నారు. రాజస్థాన్‌లో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, షాపింగ్ మాల్స్‌తోపాటు అన్ని వన్యప్రాణి అభయారణ్యాలు ఈ రోజునుంచి  ప్రారంభమయ్యాయి. అలాగే ASI ఆధ్వర్యంలోని చారిత్రక కట్టడాల సందర్శనకు పర్యాటకులను అనుమతించారు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 173 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 9,401కి పెరిగింది. వీటిలో 2658 యాక్టివ్‌ కేసులు. కాగా, కొత్త కేసులలో అధికశాతం భోపాల్‌లో నమోదవగా, ఇండోర్ రెండోస్థానంలో ఉంది.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలోని 76 కొత్త కేసులలో ఈ ఉదయం వరకు నమోదైనవి 31 ఉన్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,073కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 834గా ఉంది. మరోవైపు రాష్ట్రంలో మతపరమైన ప్రదేశాలన్నిటినీ తిరిగి తెరిచారు.
  • గోవా: ఆదివారం 33 కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 300కు చేరింది. వీటిలో 235 యాక్టివ్‌ కేసులు కాగా, కేంద్రంనుంచి 200 వెంటిలేటర్లను ప్రభుత్వం కోరింది, వీటిలో 100 రేపు అందే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి తెలిపారు.
  • మణిపూర్: మణిపూర్‌లో మరో 37 మందికి రోగ నిర్ధారణ కావడంతో వారిని ఇంఫాల్‌లోని కోవిడ్ సంరక్షణ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం మొత్తం కేసులు 209కాగా, ఇందులో 157 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • మిజోరం: రాష్ట్రం ముందుకెళ్లే మార్గాలపై ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలోని శాసనసభ్యులు, ప్రభుత్వాధికారులు, ప్రభుత్వేతర ఆస్పత్రుల ప్రతినిధులు, చర్చిల ప్రతినిధులు, గ్రామ-పట్టణ పాలన సంస్థల సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, కార్యాచరణ బృందాలతో సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. కాగా, మిజోరంలో ఈ అర్ధరాత్రి నుంచి దిగ్బంధాన్ని మరో 21రోజులు పొడిగించారు. పూర్తి అనివార్య పరిస్థితులలో మాత్రమే గృహ నిర్బంధవైద్య పర్యవేక్షణకు అనుమతి ఉంటుందని ముఖ్యమంత్రి జోరమ్‌తంగా చెప్పారు.
  • నాగాలాండ్: ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న పౌరులకు ఆర్థిక సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.24 కోట్లు పంపిణీ చేసింది. ఇక నాగాలాండ్‌లో 13 వేల మందికి సరపడా పడకల సామర్థ్యంతో 238 నిర్బంధ వైద్య పర్యవేక్షణ కేంద్రాలున్నాయి. కఠినమైన నిర్బంధవైద్య పర్యవేక్షణ నిబంధనల దృష్ట్యా జాతీయ స్థాయిలో రాష్ట్రం 5వ స్థానంలో ఉంది.

 

******



(Release ID: 1630352) Visitor Counter : 274