ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వైరస్ నియంత్రణ చర్యలు, నిర్వహణా కార్యకలాపాలపై సమీక్ష

కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాలపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషర్లు, ముఖ్య

వైద్యాధికారులులతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి చర్చ.

Posted On: 08 JUN 2020 2:06PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదవుతున్న పది రాష్ట్రాల పరిధిలోని 38 జిల్లాల్లో ఉన్న 45 పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. కేేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి రాజేశ్ భూషణ్, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లాల ఆసుపత్రుల ముఖ్య వైద్యాధికారులు, సూపరింటెండెంట్లు, ఆయా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లోని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో ఈ సమీక్ష జరిగింది.


కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఈ జిల్లాలు,..మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, జమ్ము కాశ్మీర్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లలో ఉన్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణ, నగర ప్రాంతాల్లో వైరస్ విస్తృత వ్యాప్తి, ఇంటింటి సర్వే ప్రాధాన్యత, అనంతరం తప్పనిసరిగా పరీక్షల, ఏకాంత చికిత్సల నిర్వహణ, ఆసుపత్రుల్లో కేసుల నిర్వహణ, వైరస్ వ్యాప్తి కట్టడికి అమలుచేయాల్సిన వ్యూహం తదితర ప్రధాన అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు.



వైరస్ కట్టడి ప్రాంతాల్లో కేసుల నియంత్రణ, నిర్వహణకు తీసుకోవలసిన చర్యలు, బఫర్ జోన్లలో కేసులపై అప్రమత్తత, కోవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలకు ప్రోత్సాహం తదితర అంశాలపై రాష్ట్రాల అధికారులకు ఈ సమావేశంలో తగిన సూచనలు చేశారు. కోవిడ్ వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో మరణాల రేటును తగ్గించే చర్యలపై కూడా ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. వైరస్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉండే వృద్ధుల రక్షణకు, ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారి రక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అంశం, మరణాలను నివారించేందుకు కాంట్రాక్ట్ ట్రేసింగ్ చర్యలు తదితర అంశాలపై కూడా జిల్లా అధికారులకు సూచనలు చేశారు. వైరస్ వ్యాప్తిపై అప్రమత్తతా చర్యలను మరింత చురుకుగా నిర్వహించడం, తగినన్ని వైద్యపరీక్షలు నిర్వహించడం, కేసులను సకాలంలో గుర్తించే చర్యలను ప్రోత్సహించడం, వైరస్ లక్షణాలు పెరగక ముందే రోగులను సకాలంలో చికిత్సకు తరలించడం వంటి చర్యలను ఈ సమావేశంలో సూచించారు.

 


కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని కట్టడికి వైద్యపరంగా తగిన మౌలిక సదుపాయాల ఏర్పాటుకోసం తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలని, అప్రమత్తంగా చర్యలు తీసుకునే బృందాలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైన పడకలు అందుబాటులో ఉండేలా వ్యవస్థను రూపొందించుకోవాలని జిల్లాల అధికారులకు సూచనలు చేశారు. కోవిడ్ పరీక్షా సదుపాయాల విస్తృతికోసం ఏర్పాటు చేసిన ప్రతిభా కేంద్రాల ద్వారా వైద్య సిబ్బందికి, సీనియర్ అధికారులకు తగిన మార్గదర్శకత్వం అందేలా చూడాలని, పౌరులకు అవసరానికి తగిన వైద్య సేవలు అందేలా చూడాలని కూడా సూచించారు.


క్షేత్రస్థాయి పరిపాలనా అంశాలకు సంబంధించిన చర్చ సందర్భంగా మున్సిపల్ పాలనా యంత్రాగాలకు కూడా పలు సూచనలు చేశారు. వైరస్ కట్టడికోసం మున్సిపల్ మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించడంలో మున్సిపల్ అధికారులు నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని ఇందుకోసం ప్రభుత్వ చర్యలను సంపూర్ణంగా వాడుకోవాలని సూచించారు. కోవిడ్-19 కట్టడి చర్యలతోపాటుగా, ఇతర మామూలు నిత్యావసర వైద్య సేవలు కూడా పౌరులకు అందుబాటులో ఉండేలా చూడాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది.
 


కేసులను సకాలంలో గుర్తించేందుకు వీలుగా ఇంటింటి సర్వే, సదరు సర్వే బృందాలను బలోపేతం చేయడం, అంబులెన్సులను సమర్థంగా నిర్వహించడం, ఆసుపత్రుల్లో రోగుల చికిత్సా క్రమాన్ని నిర్ణయించడం, పడకల నిర్వహణ, మరణాల రేటును తగ్గించేందుకు ఆసుపత్రుల్లో కేసులపై రొటేషన్ పద్ధతిలో బృందాలవారీగా నిరంతర నిర్వహణ వంటి అంశాలను కూడా చర్చించారు. కేసులను సత్వరం గుర్తించి, రోగులకు సకాలంలో చికిత్స అందించేందుకు వీలుగా లేబరేటరీలనుంచి సకాలంలో వైద్య పరీక్షా ఫలితాలు అందేలా చూడాలని సమావేశంలో సూచించారు. అందుబాటులో ఉన్న వైద్యసేవలపై ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలని, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ప్రజాప్రతినిధులు తగిన సహకారం అందించేలా చూడాలని సూచించారు. బఫర్ జోన్లలో SARI/ILI కేసులను గుర్తించేందుకు వీలుగా జ్వర చికిత్సాలయాలను క్రియాశీలకం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ, క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తున్న దృష్ట్యా,..రానున్న నెలల్లో పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లాలవారీగా తగిన ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు.
 


దేశవ్యాప్తంగా కోవిడ్ వైరస్ నుంచి ఇప్పటివరకూ లక్షా 24వేల 430మంది కోలుకున్నారు. గత 24గంటల్లోనే 5,137మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీనితో స్వస్థత (రికవరీ) రేటు 48.49శాతానికి చేరుకుంది. ప్రస్తుతం లక్షా 24వేల 981 మంది వైరస్ బాధితులకు చికిత్స అందుతోంది.

కోవిడ్-19కు సంబంధించిన అన్ని రకాల అధికారిక సమాచారం, నవీకరించిన సమాచారం, మార్గదర్శక సూత్రాలు, సూచనలకోసం https://www.mohfw.gov.in/, @MoHFW_INDIA సైట్లను సందర్శించవచ్చు.

 


కోవిడ్-19కు సంబంధించిన సాంకేతికపరమైన సందేహాలుంటే,..totechnicalquery.covid19[at]gov[dot]in పోర్టల్ కు పంపించుకోవచ్చు. ఇతర సందేహాలకు ncov2019[at]gov[dot]in and @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు..


కోవిడ్-19పై ఏవైనా సందేహాలు ఉంటే,..కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ +91-11-23978046కు లేదా 1075 నంబర్ కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్-19పై రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల
హెల్ప్ లైన్ నంబర్ల జాబతా కూడా https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf అనే వెబ్
అడ్రస్ లో అందుబాటులో ఉంటుంది.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/images/cleardot.gif

 



(Release ID: 1630244) Visitor Counter : 281