PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 30 MAY 2020 6:35PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 82, 369 కాగా... గడచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య: 11,624; కోలుకున్నవారి శాతం 47.4.
 • దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 86,422.
 • కోవిడ్‌-19 నిర్ధారణకు నిర్వహించిన పరీక్షలు: 36,12,242; నిన్నటి సంఖ్య: 1,26,842.
 • దేశవ్యాప్తంగా కూలీలు, వలస కార్మికులు, వీధివర్తకులుసహా పౌరులందరి కష్టాలు తీర్చేందుకు సమష్టిగా కృషి చేస్తున్నాం: ప్రధానమంత్రి
 • దిగ్బంధం సమయంలో పేదలకు ఉచిత ఆహారధాన్యాల రవాణా, పంపిణీపై ప్రభుత్వ భరోసా

 

గత 24 గంటల్లో11,264 మందికి కోవిడ్‌-19వ్యాధి నయం; కోలుకున్నవారి శాతం 47.40కుచేరి; ఒక్కరోజులో 4.51శాతం మెరుగు; యాక్టివ్‌ కేసులు 89,987 నుంచి 86,422కు తగ్గుదల

దేశంలో గడచిన 24గంటల్లో 11,264మందికి కోవిడ్‌-19 వ్యాధి నయంకాగా, ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా రోగులు కోలుకోవడం విశేషం. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 82,369కి చేరింది. ఫలితంగా కోలుకునేవారి శాతం 47.40కి పెరిగిన నేపథ్యంలో ముందు రోజుతో పోలిస్తే 24 గంటల్లో అత్యధికంగా 4.51 శాతంగా నమోదవడం గమనార్హం. కోలుకున్న వారి సంఖ్య పెరగడంతో మే 29వ తేదీన 89,987గా ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య ఇవాళ  ఒక్కసారిగా 86,422కు దిగివచ్చింది. ఈ రోగులందరికీ ఆస్పత్రులతో చికిత్స కొనసాగుతోంది.

   ఇక 2020 మే 30నాటి గణాంకాల ప్రకారం కేసులు రెట్టింపయ్యే వ్యవధి గత 14 రోజుల్లో 13.3 కాగా... గత 3 రోజుల్లో మెరుగుపడి 15.4కు పెరగగా, మరణాల శాతం 2.86గా  ఉంది. ఇక ఆస్పత్రుల్లోగల కోవిడ్‌-19 రోగులలో 2020 మే 29నాటికి 2.55 శాతం ఐసీయూలలో, 0.48శాతం వెంటిలేటర్లతో, 1.96శాతం ఆక్సిజన్‌ సరఫరాతో చికిత్స పొందుతున్నారు. దేశంలో పరీక్షల నిర్వహణ సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. ఈ మేరకు ప్రభుత్వపరంగా 462, ప్రైవేటుపరంగా 200 వంతున ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పటిదాకా 36,12,242 పరీక్షలు నిర్వహించగా, వీటిలో నిన్న ఒక్కరోజే 1,26,842 పరీక్షలు జరిగాయి.

 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627974

గౌరవనీయులైన ప్రధానమంత్రి లేఖ

“..... భారత్‌పై కరోనా దాడితో ప్రపంచానికి మన దేశం ఒక సమస్య కాగలదని చాలామంది ఆందోళనపడ్డారు. కానీ, మీ సంపూర్ణ ఆత్మవిశ్వాసం, ఎదురొడ్డి నిలిచే తెగువతో నేడు మనవైపు ప్రపంచం దృష్టిని పరివర్తనాత్మక రీతిలో మార్చేశారు. భారతీయుల సమష్ఠి శక్తి, తిరుగులేని సామర్థ్యం అసమానమైనవని, ప్రపంచంలోని శక్తిమంతమైన, సంపన్న దేశాలు కూడా మనతో సరితూగలేవని  మీరు రుజువు చేశారు. కరోనా యోధులను మనమంతా కరతాళ ధ్వనులతో అభినందించినా, దీపాలు వెలిగించి వారిపై గౌరవం ప్రకటించినా, భారత సాయుధ దళాలు గౌరవసూచక విన్యాసాలుసహా పలువిధాల కృతజ్ఞతలు తెలిపినా, జనతా కర్ఫ్యూ అయినా, దేశవ్యాప్త దిగ్బంధం నిబంధనలకు నిశ్చలంగా కట్టుబడటమైనా... ప్రతి సందర్భంలోనూ  మీరంతా ‘శ్రేష్ఠ భారతానికి అఖండ భారతం’ భరోసా అంటూ ముక్తకంఠంతో చాటారు.

ఇంతటి భారీ సంక్షోభం నడుమ ఎవరికీ కష్టం కలగలేదనో, ఎవరూ ఇబ్బంది పడలేదనో, ఏ అసౌకర్యానికీ గురికాలేదనో చెప్పడం అసాధ్యం. మన కూలీలు, వలస కార్మికులు, చేతి వృత్తులవారు, చిన్నతరహా పరిశ్రమల హస్త కళాకారులు, వీధి వర్తకులుసహా అలాంటి సహ భారతీయ సోదరులెందరో అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. వారి కష్టాలను తొలగించడానికి మనమంతా సమష్టిగా, దృఢదీక్షతో కృషిచేస్తున్నాం.

అయితే, మనకు ఎదురైన ఈ ఇబ్బందులు విపత్కరంగా పరిణమించకుండా మనం జాగ్రత్త వహించాలి. ఆ మేరకు సకల నిబంధనలు-మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించడం ప్రతి భారతీయుడి విధి. ఇప్పటిదాకా మనమెంతో సహనంతో ఉన్నాం... దీన్ని మరికొంత కాలం ఇలాగే కొనసాగిద్దాం. ప్రపంచంలోని ఇతరదేశాలతో పోలిస్తే భారత్‌ సురక్షితంగా, మెరుగైన స్థితిలో నిలవడానికిగల ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి! ఇదొక సుదీర్ఘ యుద్ధం... అయినప్పటికీ మనమిప్పుడు విజయపథంలో ముందడుగు వేస్తున్నాం... అంతిమ విజయమే ఇప్పుడు మన సమష్టి సంకల్పం..........”

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627802

దిగ్బంధం సందర్భంగా మన విస్తృత దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచిత ఆహారధాన్యాల సరఫరాకు రవాణా ఏర్పాట్లపై భారీ కసరత్తు; ఇది గత ఏడాదిలో మా మంత్రిత్వశాఖ సాధించిన భారీ విజయం: శ్రీ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌

కేంద్ర వినియోగదారు వ్యవహారాలు/ఆహార-ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ గడచిన ఏడాదిలో తమశాఖ సాధించిన విజయాలను ఇవాళ వివరించారు. దేశవ్యాప్త దిగ్బంధం కొనసాగుతున్న వేళ భారీ కసరత్తుతో విశాల భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఉచిత ఆహారధాన్యాలు అందించడాన్ని ఈ సంవత్సర కాలంలో సాధించిన అతిగొప్ప విజయమని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. వినియోగదారుల రక్షణ చట్టం-2019ని అమలులోకి తేవడం, కేంద్ర గిడ్డంగుల సంస్థ (CWC)  అత్యధిక టర్నోవర్‌ సాధించడం, భారత ఆహార సంస్థ (FCI) అధీకృత మూలధనం రూ.3,500 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు పెరగడం, ‘ఒకే దేశం – ఒకే కార్డు’ దిశగా ముందడుగు పడటంవంటివి NDA ఏడాది పాలనలో తమ మంత్రిత్వశాఖ సాధించిన గణనీయ విజయాలని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627917

భారత, అమెరికా రక్షణశాఖ మంత్రుల మధ్య టెలిఫోన్‌ద్వారా సంభాషణ

భారత రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ నిన్న అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్‌ టి.ఎస్పర్‌తో టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారిపై పోరాటంలో తమతమ దేశాల అనుభవాలను పరస్పరం వివరించుకున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుత అద్భుత ద్వైపాక్షిక సహకరాన్ని కొనసాగించేందుకు వారిద్దరూ నిశ్చయించారు. అలాగే రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాల ప్రగతిని సమీక్షించారు. దీనికి అనుగుణంగా రెండు దేశాలమధ్య రక్షణ భాగస్వామ్యంపై కట్టుబాటును పునరుద్ఘాటించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627845

బ్రిక్స్‌ కూటమి దేశాల పన్ను ప్రాధికార సంస్థల అధిపతుల సమావేశం

బ్రిక్స్‌ (BRICS) కూట‌మిలోని బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల పన్ను సంస్థ‌ల అధిపతుల సమావేశం 2020 మే 29న నిర్వ‌హించారు. భారత్ త‌ర‌ఫున కేంద్ర ఆర్థికశాఖ‌ కార్యదర్శి డాక్టర్ అజయ్ భూషణ్ పాండే ఇందులో పాల్గొన్నారు. కోవిడ్‌-19 దుష్ప్ర‌భావాల నుంచి పన్ను చెల్లింపుదారులకు ఉప‌శ‌మ‌నం దిశ‌గా ప్ర‌భుత్వం తీసుకున్న వివిధ చర్యలగురించి ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. ఈ మేర‌కు నిబంధ‌న‌ల పాటింపు వాయిదా, చెల్లింపుల్లో జాప్యంపై వడ్డీ త‌గ్గింపు, ఉద్యోగుల జీతాల కోత మొత్తాల‌పై వ‌డ్డీ త‌గ్గింపు వంటి అంశాలను ఆయ‌న విశ‌దీక‌రించారు. కోవిడ్‌-19 సంబంధిత ప‌న్ను విధాన చ‌ర్య‌ల‌పై ఆయా దేశాల ప‌న్నుపాల‌న యంత్రాంగాలు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచార ఆదాన‌ప్ర‌దానం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. త‌ద్వారా త‌మ‌త‌మ దేశాల్లో మ‌హ‌మ్మారి ప్రేరేపిత  ద్ర‌వ్య‌, ఆర్థిక ప్ర‌భావాల‌పై అవగాహ‌న పెరుగుతుంద‌ని చెప్పారు. అంతేకాకుండా  మ‌హ‌మ్మారి వ్యాప్తి నిరోధంస‌హా దాని దుష్ప్ర‌భావాల నుంచి బ‌య‌ట‌ప‌డటానికి ప్ర‌భుత్వం చేస్తున్న కృషికి స‌హాయ‌ప‌డే దిశ‌గా వివిధ అవ‌కాశాల‌పై అంచ‌నాల‌కు వీలు క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627848

కోవిడ్‌-19 పరిస్థితుల నడుమ అందిన 585 సమస్యలలో 581 పరిష్కరించిన కేంద్ర ఆహారతయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫిర్యాదుల విభాగం

కేంద్ర ఆహారతయారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ (MoFPI)లోని ఫిర్యాదుల విభాగం కోవిడ్‌-19 పరిస్థితుల నడుమ తమకు అందిన 585 సమస్యలపై సకాలంలో స్పందించి 581కి పరిష్కారాలు చూపింది. ఈ విభాగంలోని కార్యాచరణ బృందం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, సముచిత అధికారవర్గాలుసహా కేంద్ర ఆర్థిక, దేశీయాంగ శాఖల సహకారం, సమన్వయంతో ఈ మేరకు కృషిచేసింది. అలాగే ఆయా రాష్ట్రాల్లోని ఆహార తయారీదారులతో, అనుబంధ పరిశ్రమలతో, ప్రముఖ పారిశ్రామిక సంఘాలతో  ఈ బృందం నిరంతర సంబంధాలు నెరపుతూ వాటికి ఎదురయ్యే సమస్యలు/సవాళ్లను పరిష్కరించింది. తద్వారా ఆయా పరిశ్రమలు పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు దోహదపడింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627925

పర్యాటక-సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిని కలుసుకున్న ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెంట్లు

కేంద్ర పర్యాటక-సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌తో ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెంట్లు (OTA) న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. హోటళ్లు, వసతి గృహాలను క్రమపద్ధతిలో తిరిగి తెరవడంపై వారు ప్రధానంగా చర్చించారు. అలాగే దిగ్బంధం ముగిశాక భద్రత, వసతిగృహాల పరిశుభ్రతసహా ప్రయాణ సంబంధ కార్యకలాపాల దిశగా పాటించాల్సిన అంశాల‌తో విధివిధానాల జారీగురించి కూడా చ‌ర్చించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627771

పరిశోధన-ఆవిష్కరణలకు సౌల‌భ్యం: బయోటెక్నాలజీ శాఖ‌ద్వారా 4 కోవిడ్-19 బయో బ్యాంకుల స్థాపన

కోవిడ్-19 మహమ్మారి నుంచి ఉప‌శ‌మ‌నం కోసం సాగుతున్న కృషిలో భాగంగా ప‌రిశోధ‌న‌-అభివృద్ధి కార్య‌క‌లాపాలు ఇప్పుడు టీకాలు, రోగ నిర్ధారణ, ఔష‌ధ రూప‌క‌ల్ప‌న వైపు మ‌ళ్లాయి. ఈ మేర‌కు కోవిడ్-19 నిర్ధారిత వ్యక్తుల నమూనాలు ప‌రిశోధ‌న‌-అభివృద్ధికి విలువైన వ‌న‌రులు కానున్నాయి. ఈ నేప‌థ్యంలో కోవిడ్-19 సంబంధిత  పరిశోధనల కోసం జీవ న‌మూనాలతోపాటు స‌మాచార‌ ఆదాన‌ప్ర‌దానంపై నీతి ఆయోగ్ ఇటీవ‌ల మార్గదర్శకాలను జారీచేసింది. అలాగే కేంద్ర మంత్రిమండ‌లి కార్య‌ద‌ర్శి ఆదేశాలకు అనుగుణంగా భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ICMR) కోవిడ్-19 రోగుల వైద్య నమూనాలను సేకరించి, నిల్వచేసి, నిర్వ‌హించ‌డానికి 16 జీవప‌దార్థ భాండాగారా (Repository)ల‌ను గుర్తించి ప్ర‌క‌టించింది. వీటిని ఐసీఎంఆర్ (9), డీబీటీ (4), సీఎస్ఐఆర్ (3) నిర్వ‌హిస్తాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627956

కేంద్ర సాంస్కృతిక శాఖ ప‌రిధిలోని ‘గాంధీ స్మృతి-దర్శన్‌ సమితి’ ద్వారా కోవిడ్‌-19పై పోరు కోసం ఝార్ఖండ్‌కు ఉచితంగా పీపీఈ కిట్లు, ఇత‌ర సామ‌గ్రి ర‌వాణా

కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా న్యూఢిల్లీలోని ‘గాంధీ స్మృతి-దర్శన్‌ సమితి’, రాజస్థాన్‌లోని ‘లుపిన్‌ హ్యూమన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’ సంయుక్తంగా 2020 మే 29న జార్ఖండ్‌ రాష్ట్రంలోని కుంఠీ గిరిజన జిల్లా యంత్రాంగానికి 200 పీపీఈ కిట్లు, 50 జ్వరమానినులు, 10 వేల నైట్రైల్‌ చేతి తొడుగులు, 11 వేల మాస్కులు, 500 ముఖ కవచాలను ఉచితంగా అందజేశాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627849

కోవిడ్‌-19పై పోరులో భాగంగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి అంబులెన్స్‌ వాహనాలు, పీపీఈ కిట్లను అందజేయనున్న పీఎఫ్‌సీ

కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (PFC) ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి రూ.1.23 కోట్ల ఆర్థిక సహాయం అందించనుంది. కోవిడ్‌-19పై పోరులో ముందువరుసనగల వైద్య-ఆరోగ్య సిబ్బంది కోసం ఈ నిధులతో 500 పీపీఈ కిట్లను, ఆస్పత్రుల కోసం సకల సౌకర్యాలున్న 6 అంబులెన్స్‌ వాహనాలను కొనుగోలు చేసి ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ఆరోగ్యశాఖకు అప్పగించనుంది.   

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627923

జాతీయ పరిశోధనశాలలు, విశ్వవిద్యాలయాల్లో (చక్రం-ఆకుల నమూనా) కోవిడ్‌ పరీక్ష కేంద్రాల సంఖ్య పెంపు

దేశవ్యాప్తంగా రోగనిర్ధారణ కేంద్రాల సంఖ్య పెంపు, పరీక్షల అందుబాటు దిశగా “చక్రం-ఆకుల” నమూనాలో నగర/ప్రాంతీయ సముదాయాలను ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రభుత్వ సంస్థల్లో కోవిడ్‌-19 నమూనాల సేకరణ, పరీక్షల సామర్థ్యం పెంపు దీని లక్ష్యం. ఈ మేరకు నమూనాల సేకరణ, నిర్వహణ/విశ్లేషణ(BSL-2 సదుపాయం), పరీక్ష (RT-PCR) సామర్థ్యం, నైపుణ్యంగల సంస్థలు, ప్రయోగశాలలు (‘చక్రాల్లా’) సేవలందిస్తూ ఆర్‌టీ-పీసీఆర్‌ యంత్రాలు, తగిన సిబ్బందిగల ప్రయోగశాలలను అనుబంధ కేంద్రాలు (ఆకుల్లా)గా నియమిస్తాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627924

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • చండీగఢ్‌: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌కు విదేశాల నుంచి 116 మంది రాగా, అవసరమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిలో 29 మందిని ఇళ్లకు పంపామని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు. అలాగే దేశీయ విమాన సర్వీసులద్వారా మరో 281 మంది రాగా, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్లవద్దనే స్వీయ పర్యవేక్షణలో ఉండాల్సిందిగా వారికి సూచించినట్లు పేర్కొన్నారు. మరోవైపు తీవ్ర, స్వల్ప కోవిడ్‌ వ్యాధి లక్షణాలున్న వారికి చికిత్సకోసం 3,000 పడకలతో కూడిన సదుపాయాన్ని చండీగఢ్‌ యంత్రాంగం సిద్ధం చేసిందని పాలనాధికారి సలహాదారు తెలిపారు. కాగా, చికిత్సకు కావాల్సిన వెంటిలేటర్లు, ఆక్సిజన్, పీపీఈలు/మందులకు ఎలాంటి కొరత లేదని పాలన యంత్రాంగం ప్రకటించింది. నగరంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రమం తప్పకుండా కోవిడ్‌ పరీక్షల నిర్వహణతోపాటు నియంత్రణ జోన్లపై ప్రతివారం సమీక్షిస్తున్నట్లు తెలిపింది.
 • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 నియంత్రణ, నిర్వహణను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అదనపు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం జారీచేసిన సూచనలు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే విధించే జరిమానాల మొత్తాన్ని పెంచింది. కొత్త ఆదేశాల ప్రకారం... బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే రూ.500, స్వీయగృహ నిర్బంధం ఉల్లంఘిస్తే రూ.2,000, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ. 500, దుకాణాల/వాణిజ్య స్థలాల యజమానులు సామాజిక దూరం నిబంధనను అతిక్రమిస్తే రూ.2000, అలాగే బస్సుల యజమానులు రూ.3000, కార్ల యజమానులు: రూ .2000, ఆటో రిక్షాలు/ద్విచక్ర వాహనదారులు: రూ.500 వంతున జరిమానాల చెల్లించాల్సి ఉంటుంది.
 • హర్యానా: కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రోగులకు చికిత్సచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి హర్యానా పర్యాటక సంస్థ తమ పర్యాటక సముదాయాలలో ఉచితంగా భోజన-వసతి సదుపాయం కల్పించింది. కరోనా వైరస్‌ విజృంభణ ఫలితంగా 2020 మార్చి 24నుంచి దేశవ్యాప్త దిగ్బంధం విధించిన తర్వాత కోవిడ్‌ రోగులకు చికిత్సచేసే వైద్యులకు పర్యాటక సముదాయాలలో ఉచిత భోజన-వసతి సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్‌-19పై దృఢమైన పోరాటందిశగా ప్రభుత్వానికి హృదయపూర్వక సహకారం అందించిన పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా ఫార్మా పరిశ్రమకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, బల్క్ డ్రగ్స్- జెనెరిక్‌ ఔషధాల తయారీకి రాష్ట్రం ఒక ముఖ్యమైన కూడలిగా అవతరించిందని, దేశవిదేశాల ఔషధ విపణులలో అత్యధిక వాటా రాష్ట్రానిదేని ఆయన అన్నారు. కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో భవిష్యత్తులోనూ కీలకపాత్ర పోషించే “పీఎం కేర్స్‌” నిధితోపాటు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ‘HP SDMA COVID-19’కూ ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను కోరారు.
 • కేరళ: విదేశాల నుంచి తిరిగివచ్చిన ఒకవ్యక్తి కోళికోడ్‌లో నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉండగా మరణించారు. అయితే, కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలో ఆయనకు వ్యాధి సోకలేదని తేలడంతో అందరూ ఊరట చెందారు. కాగా, తిరువనంతపురం శివార్లలో నిర్బంధవైద్య పర్యవేక్షణలోగల 8 మంది పోలీసులకు నిర్వహించిన పరీక్షల్లో వ్యాధి సోకలేదని తేలింది. కాగా, బీహార్‌కు తిరిగి వెళ్లడం కోసం రైలు ఏర్పాటు చేయాలని కోరుతూ పథనంతిట్టలో వలస కార్మికులు రెండుచోట్ల నిరసన చేపట్టారు. ఇక కన్నూర్‌లో దిగ్బంధం నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మూడంచెల దిగ్బంధం విధించాలని అధికారులు యోచిస్తున్నారు. మరోవైపు గల్ఫ్ దేశాలలో కోవిడ్-19కు మరో ముగ్గురు కేరళవాసులు మరణించారు. రాష్ట్రంలో నిన్న 2 మరణాలు, 62 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 577 మంది చికిత్స పొందుతుండగా 1,24,167మంది నిఘాలో ఉన్నారు.
 • తమిళనాడు: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్ల కోవిడ్-19 సహాయ ప్యాకేజీని ప్రకటించింది. కాగా, చెన్నై-అండమాన్ మధ్య నౌకాయాన సేవలు తిరిగి మొదలయ్యాయి. నమక్కల్‌లో ఒక 47 ఏళ్ల లారీడ్రైవర్‌ ప్రాణాంతక వైరస్‌కు బలికావడంతో తొలి కోవిడ్-19 మరణం నమోదైంది.  కాగా, ఇప్పటివరకూ 78 కేసులు నమోదవగా 77 మందికి వ్యాధి నయమైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 90 నమూనాలకుగాను 40మంది ఖైదీలకు కోవిడ్‌-19 నిర్ధారణ అయింది. నిన్న 874 తాజా కేసుల నమోదుతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 20,246కు చేరింది. వీటిలో యాక్టివ్: 8,676, మరణాలు: 154, డిశ్చార్జ్:11,313. చెన్నైలో యాక్టివ్ కేసులు 6353గా ఉన్నాయి.
 • కర్ణాటక: రాష్ట్రంలోని  వివిధ రంగాలనుంచి అందిన అభిప్రాయాల మేరకు ఆదివారం సంపూర్ణ మూసివేత ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇక రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులందరూ ప్రైవేట్ ప్రయోగశాలల్లో కోవిడ్‌ పరీక్షలకోసం రూ.650 చెల్లించాలని నిర్ణయించింది. అలాగే ప్రయోగశాలలు సమూహ పరీక్షల పద్ధతిని పాటించాలని ఆదేశించింది. కర్ణాటకలో శుక్రవారం 248 కొత్త కేసుల నమోదుతో ఒకేరోజు అత్యధిక కేసుల రికార్డు పునరావృతమైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,781కి చేరగా, యాక్టివ్‌ కేసులు: 1,837, మరణాలు: 48, కోలుకున్నవి: 894గా ఉన్నాయి.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో 5 ఎకరాల భూమిగల రైతులకు రూ.13,500 వార్షిక నగదు ప్రోత్సాహక ప్రయోజనం అందించేందుకు 10,641 రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి ఇవాళ ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కౌలుదారులు కూడా ఈ పథకంకింద లబ్ధి పొందుతారు. ఈ మొత్తంలో పీఎం-కిసాన్‌ యోజన కింద కేంద్రం అందించే రూ.6,000 సాయం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంలోని 51 లక్షలమంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇక బోరుబావులున్న రైతులకు రోజులో ఒకేసారి 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తారు. రాష్ట్రంలో ఇవాళ 70 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక 9504 నమూనాలను పరీక్షించిన తర్వాత గత 24 గంటల్లో 55 మంది డిశ్చార్జ్ కాగా, మరణాలేవీ నమోదు కాలేదు; ప్రస్తుతం మొత్తం కేసులు: 2944. యాక్టివ్: 792, రికవరీ: 2092, మరణాలు: 60. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చినవారిలో మొత్తం కేసులు 406కాగా, యాక్టివ్‌ కేసులు 217. విదేశాల నుంచి వచ్చినవారిలో 111 కేసులు ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలోని పట్టణ జనాభాలో కరోనా వైరస్‌ (SARS-CoV-2) వ్యాప్తిని అవగతం చేసుకోవడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ సహకారంతో హైదరాబాద్‌లోని ఐదు నియంత్రణ జోన్లలో ఐసీఎంఆర్‌ ముమ్మర అధ్యయనం ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సహాయంతో ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్‌ బృందాలు శని, ఆదివారాల్లో 100 నమూనాలను సేకరిస్తాయి. కాగా మే 30 నాటికి తెలంగాణలో మొత్తం కేసులు 2425కాగా, ఇప్పటివరకూ 180 మంది వలసదారులు, 237మంది విదేశీయులకు వ్యాధి నిర్ధారణ అయింది.
 • అసోం: అసోంలోని సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఈఐఎస్‌టీ నిర్వహించే కోవిడ్‌-19 పరీక్ష ప్రయోగశాల ఇకపై జోర్హాట్‌లో పనిచేస్తుంది. రాష్ట్రంలో 49 కొత్త కోవిడ్‌-19 కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1100కు చేరింది. వీటిలో యాక్టివ్: 968, కోలుకున్నవి: 125, మరణాలు 4గా ఉన్నాయి.
 • మణిపూర్: మణిపూర్‌లో మరో కోవిడ్‌-19 కేసు నమోదైంది. దీంతో మొత్తం కేసులు 60కి పెరిగాయి.
 • మిజోరం: కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలు-1972 పరిధిలోకి రాని, విధి నిర్వహణలో ఉండి కోవిడ్‌-19తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 • నాగాలాండ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 మహమ్మారి సంక్షోభం దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల నుంచి పీజు వసూళ్లను నిలిపివేశాయి. దీనివల్ల వేలాది విద్యార్థులకు ఉపశమనం కలుగుతుందని పేర్కొంటూ విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. బెంగళూరు నుంచి నాగాలాండ్‌కు రావడం కోసం సిద్ధమైన రాష్ట్రవాసులు రైలు రద్దు కావడంతో అక్కడ చిక్కుకుపోయారు. వారికి ‘నాగా టాస్క్ ఫోర్స్- బెంగళూరు’ వారు ఆశ్రయం కల్పించారు.
 • సిక్కిం: రాష్ట్రంలోని ఎస్‌టీఎన్‌ఎం ఆస్పత్రిలో కేవలం ఒకేఒక కోవిడ్‌-19 రోగికి సేవలందిస్తున్న 32 మంది ఆరోగ్య కార్యకర్తల తొలి బృందాన్ని అధికారులు 14 రోజుల నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉంచారు.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో 692 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 62,228కి పెరిగింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 33,124 కాగా, రాష్ట్రంలో 2,098 మరణాలు సంభవించాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగం, ఉమ్మివేయడం, ధూమపానం నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 • గుజరాత్: రాష్ట్రంలో 372 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 15,944కు చేరింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా అహ్మదాబాద్‌లో 253 కేసులు నమోదవగా 16 జిల్లాల్లో శుక్రవారం ఒక్కొక్క కేసు మాత్రమే నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,355 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటిదాకా గుజరాత్ నుంచి 14 లక్షలమంది వలస కార్మికులను వివిధ రవాణా మార్గాలద్వారా వారి సొంత రాష్ట్రాలకు పంపారు, వీరిలో అధికశాతం ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లలో వెళ్లారు.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కేసుల సంఖ్య 7,645 కాగా, వీటిలో 3,042 యాక్టివ్‌ కేసులున్నాయి. కూలీలకు ఉపాధికోసం ప్రభుత్వం 'రోజ్‌గార్‌ సేతు' పేరిట వినూత్న పథకం ప్రారంభించింది. దీనికింద కార్మికులకు వారి నైపుణ్యానికి తగినట్లుగా పరిశ్రమలు, నిర్మాణ పనులు, ఇతర కార్యకలాపాలలో ఉపాధి కల్పిస్తారు.
 • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 49 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 8,414కు చేరింది. వీరిలో 5,290 మంది కోలుకోగా ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య స్థిరంగా ఉండటంతోపాటు గడచిన ఆరు రోజులలో కోలుకునేవారి శాతం పెరిగింది.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో తొలి కోవిడ్‌-19 మరణం నమోదైంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు: 314 కాగా, ఇప్పటివరకూ 100 మంది కోలుకున్నారు.

 

PIB FACT CHECK

 

 

 

*******(Release ID: 1628023) Visitor Counter : 90