సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జార్ఖండ్‌కు ఉచితంగా పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లోవ్స్
'గాంధీ స్మృతి, దర్శన్ సమితి', 'లుపిన్ హ్యూమన్ వెల్ఫేర్ అసోసియేషన్' ద్వారా పంపిణీ
జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎన్.ఎన్. సిన్హా
Posted On:
29 MAY 2020 9:45PM by PIB Hyderabad
న్యూదిల్లీలోని 'గాంధీ స్మృతి, దర్శన్ సమితి' (జీఎస్‌డీఎస్) మరియు రాజస్థాన్‌కు చెందిన 'లుపిన్ హ్యూమన్ వెల్ఫేర్ అసోసియేషన్' కలిసి.. కొవిడ్-19పై పోరాటంలో జార్ఖండ్‌కు చేయూత అందించాయి. 200 పీపీఈ కిట్లు, 50 థర్మోమీటర్లు, 10 వేల గ్లోవ్స్, 11 వేల మాస్కులు, 500 ఫేస్ షీల్డులను ఉచితంగా పంపించాయి. జార్ఖండ్‌లోని గిరిజన జిల్లా అయిన 'కుంతి' అధికారులకు వీటిని అందించాయి.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ ఎన్.ఎన్. సిన్హా , దిల్లీలోని 'కృషి భవన్'లో ఈ సామగ్రిని జెండా ఊపి ప్రారంభించారు. జీఎస్‌డీఎస్ డైరక్టర్ దీపాంకర్ గ్యాన్, 'లుపిన్ హ్యూమన్ వెల్ఫేర్ అసోసియేషన్' సీఈవో శ్రీ సీతారామ్ గుప్తా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలో లాక్‌డౌన్ విధించిప్పటి నుంచి జీఎస్‌డీఎస్, లుపిన్ సంస్థ కలిసి తరచూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లోవ్స్ వంటి రక్షణ సామగ్రిని ఉచితంగా అందిస్తున్నాయి. వివిధ సంస్థలు, ప్రభుత్వ శాఖలు, పేద ప్రజలకు వీటిని పంపిణీ చేస్తున్నాయి.
దిల్లీలోని జీఎస్‌డీఎస్ 'శ్రీజన్ కేంద్రం', దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 'శ్రీజన్ శిక్షణ, ఉత్పత్తి కేంద్రాల' ద్వారా మాస్కులను తయారు చేసి, ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వ శాఖలకు క్రమం తప్పకుండా మాస్కులను అందిస్తున్నారు.
(Release ID: 1627849)
Visitor Counter : 270