శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశ నలుమూలలకూ కొవిడ్ నిర్ధరణ పరీక్షలను విస్తరించే ప్రణాళిక
'హబ్ అండ్ స్పోక్' విధానంలో 19 నగర, ప్రాంతీయ క్లస్టర్లు ఏర్పాటు
దాదాపు లక్షా 70 వేల కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేసిన క్లస్టర్లు
మరో నెలలో క్లస్టర్ల సంఖ్యను 50కి పెంచే యోచన
Posted On:
30 MAY 2020 3:01PM by PIB Hyderabad
కరోనా వైరస్ పరీక్షల సంఖ్యను పెంచడం, దేశవ్యాప్తంగా పరీక్షలను మరింతగా విస్తరించడానికి.. 'హబ్ అండ్ స్పోక్' విధానంలో నగర, ప్రాంతీయ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థల్లో కొవిడ్-19 పరీక్షల సామర్థ్యాన్ని పెంచడం దీని ఉద్దేశం. నమూనాల సేకరణ, నిర్వహణ (బీఎస్‌ఎల్-2 సదుపాయం), పరీక్షించగల (ఆర్‌టీ-పీసీఆర్) సామర్థ్యం, నైపుణ్యం ఉన్న సంస్థలు, ప్రయోగశాలలు హబ్‌లుగా సేవలు అందిస్తాయి. ఆర్‌టీ-పీసీఆర్ యంత్రాలు, సరిపడా సిబ్బంది ఉన్న ల్యాబొరేటరీలను అవి తమ అనుబంధ పరీక్ష కేంద్రాలుగా చేసుకుంటాయి.
ఈ హబ్‌లు.. ఐసీఎమ్‌ఆర్ మార్గదర్శకాల ప్రకారం సంబంధింత మంత్రిత్వ శాఖలు, లేదా విభాగాల (డీబీటీ, డీఎస్‌టీ, సీఎస్‌ఐఆర్, డీఏఈ, డీఆర్‌డీవో, ఐసీఏఆర్ మొ.) ఆమోదం పొందిన ప్రభుత్వ ప్రయోగశాలలు. ఈ ప్రకారం.. బెంగళూరు, దిల్లీ/ఎన్‌సీఆర్, హైదరాబాద్, తిరువనంతపురం, ఛండీగర్/మొహాలి, భువనేశ్వర్, నాగ్‌పూర్, పుణె, ముంబయి, లక్నో, చెన్నై, కోల్‌కతా, ఈశాన్య ప్రాంతం, జమ్ము&కశ్మీర్, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బెనారస్, పాలంపూర్, దిల్లీ నగరంలో 19 నగర/ప్రాంతీయ క్లస్టర్లను ఏర్పాటు చేశారు.
ఇందులో.. దాదాపు 100 సంస్థలు భాగస్వాములై లక్షా 60 వేల నమూనాలను పరీక్షించాయి. ఏడు డీబీటీ స్వతంత్ర సంస్థలు హబ్‌లుగా ఐసీఎంఆర్ ఆమోదం పొందాయి. అవి (ఆర్‌జీసీబీ, టీహెచ్‌ఎస్‌టీఐ, ఐఎల్‌ఎస్, ఇన్‌స్టెమ్, ఎస్‌సీసీఎస్, సీడీఎఫ్‌డీ, ఎన్‌ఐబీఎమ్‌జీ) కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు చేస్తున్నాయి.
హబ్‌లు.. ఆయా నగరాలు/ప్రాంతాల్లో సేవలు అందించడంతోపాటు; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నాయి. సంబంధింత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ పరీక్ష నమూనాలను పొందుతున్నాయి. ఆ నమూనాల ఫలితాలను ప్రతిరోజు ఐఎస్‌ఎంఆర్‌కు నివేదిస్తున్నాయి. నాలుగు వారాల్లో ఈ క్లస్టర్లు దాదాపు లక్షా 70 వేల పరీక్షలు చేశాయి. వచ్చే నెలలోగా ఈ క్లస్టర్ల సంఖ్యను 50కి పెంచి, దేశ మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాలన్నది ప్రణాళిక.
(Release ID: 1627924)
Visitor Counter : 267