PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
14 MAY 2020 6:55PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- నేటిదాకా 78,003 కోవిడ్-19 కేసులకుగాను కోలుకున్నవారు 26,235 మంది (33.6 శాతం) కాగా- 2,549 మరణాలు నమోదయ్యాయి.
- గత 24 గంటల్లో 3,722 కొత్త కేసులు రాగా, కేసులు రెట్టింపయ్యే వ్యవధి దాదాపు 14 రోజులుగా నమోదైంది.
- కోవిడ్-19 పరీక్షల కోసం అత్యాధునిక “కోబాస్ 6800” ఏర్పాటు చేయబడింది.
- కోవిడ్-19పై పోరు దిశగా స్వయం సమృద్ధ భారత్ కార్యక్రమ రెండోవిడత అంశాలను ప్రకటించిన ఆర్థికమంత్రి.
- కోవిడ్-19పై పోరుకు “పీఎం కేర్స్ నిధి” ట్రస్టునుంచి రూ.3100 కోట్లు; వెంటిలేటర్ల కోసం రూ.2000 కోట్లు; వలస కార్మికుల సహాయార్థం రూ.1000కోట్లు; వాక్సిన్ అభివృద్ధికి రూ.100 కోట్ల వంతున కేటాయింపు.
- 15 రోజుల్లోపే 800 ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లు; సొంత రాష్ట్రాలకు చేరిన 10 లక్షల మందికిపైగా ప్రయాణికులు.
“కోబాస్ 6800” కోవిడ్-19 పరీక్షల యంత్రాన్ని ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్; గత మూడు రోజులుగా కేసుల రెట్టింపు వ్యవధి దాదాపు 14 రోజులుగా నమోదు
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్రం “కోబాస్ 6800”ను జాతికి అంకితం చేశారు. కోవిడ్-19 పరీక్షల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి యంత్రపరికరం కొనుగోలు చేయడం ఇదే ప్రథమం. కోబాస్ 6800 అత్యాధునిక యంత్రం మాత్రమేగాక రోబోటిక్ పరిజ్ఙానంతో కూడినది కావడంవల్ల అతి తక్కువ మానవ ప్రమేయంతో, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాధి సంక్రమణ భయం లేకుండా పరీక్షలు నిర్వహించగల వీలుంది. కాగా...
దేశంలోని సుమారు 500 ప్రయోగశాలల్లో ఇవాళ దాదాపు 20 లక్షల కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంద్వారా కొత్త మైలురాయిని అధిగమించామని డాక్టర్ వర్ధన్ చెప్పారు. కేసుల రెట్టింపు వ్యవధి గడచిన 14 రోజులలో 11.1 కాగా, గత 3 రోజులలో మెరుగుపడి 13.9కు చేరడం ఇవాళ్టి సంతోషదాయక సమాచారమని ఆయన పేర్కొన్నారు. ఇక మరణాలు 3.2 శాతంగా, కోలుకునేవారు 33.6శాతం (నిన్న 32.83శాతం)గా నమోదయ్యాయన్నారు. కాగా, మొత్తం కోవిడ్-19 రోగులలో 3.0 శాతం (నిన్నటివరకూ) ఐసీయూలలో ఉండగా, వెంటిలేటర్లపై ఉన్నవారు 0.39 శాతం, ప్రాణవాయువు సరఫరాగల వారు 2.7 శాతంగా ఉన్నట్లు వివరించారు. ఇవాళ దేశంలోని 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో గడచిన 24 గంటలుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. ఇక 2020 మే 14వ తేదీనాటికిగల 78,003 కేసులకుగాను 26,235మంది కోలుకోగా ఇప్పటివరకూ 2,549 మరణాలు సంభవించాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గడచిన 24 గంటల్లో 3,722 కొత్త కేసులు నమోదైనట్లు తెలిపారు.
“పీఎం కేర్స్ నిధి” ట్రస్టునుంచి కోవిడ్-19పై పోరుకు రూ.3100 కోట్లు కేటాయింపు
దేశవ్యాప్తంగా కోవిడ్-19పై పోరాటం కోసం “పీఎం కేర్స్” (అత్యవసర పరిస్థితుల్లో ప్రధానమంత్రి పౌర సహకార-సహాయ) నిధి ట్రస్టు రూ.3100 కోట్లు కేటాయించింది. ఇందులో సుమారు రూ.2000 కోట్లు వెంటిలేటర్ల కొనుగోలుకు, రూ.1000 కోట్లు వలసకార్మికుల సంరక్షణకు, రూ.100 కోట్లు వ్యాక్సిన్ అభివృద్ధికి మద్దతు కోసం వెచ్చించాలని నిర్ణయించారు. ఈ మేరకు పీఎం కేర్స్ నిధినుంచి కేటాయించిన రూ.2000 కోట్లతో ‘మేడ్ ఇన్ ఇండియా’ (దేశీయంగా ఉత్పత్తిచేసిన) 50000 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తారు. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రుల్లో కోవిడ్-19 రోగులకు మెరుగైన చికిత్స కోసం వీటిని అందజేస్తారు. ఇక పీఎం కేర్స్ నిధి నుంచి కేటాయించిన రూ.1000 కోట్లను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదలచేస్తారు. వలస కార్మికుల వసతి, ఆహారం, వైద్యం, రవాణా ఏర్పాట్ల కోసం ఈ నిధులను సంబంధిత జిల్లాల కలెక్టర్లు/పురపాలక కమిషనర్ల పరిధిలో ఉంచాలి. అలాగే కోవిడ్-19 వ్యాక్సిన్ రూపకర్తలు, అభివృద్ధి కృషిలో నిమగ్నమైన సంస్థలకు మద్దతు కోసం కేటాయించిన రూ.100 కోట్లను శాస్త్రవిజ్ఞాన ముఖ్య సలహాదారు పర్యవేక్షణలో ఖర్చుచేస్తారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623742
కోవిడ్-19పై పోరులో దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా స్వయంసమృద్ధ భారత్ కార్యక్రమం కింద రెండోవిడత అంశాలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
స్థిరాస్తి రంగంలో వ్యాపార సౌలభ్యంతోపాటు ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాల ప్రాధాన్యం-పరిరక్షణకు ప్రభుత్వ నిబద్ధత
దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగానికి వ్యాపార సౌలభ్య కల్పనతోపాటు ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాల ప్రాధాన్యం-పరిరక్షణకు ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నిన్న ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు వాటి పరిధిలోని స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థలకు ఒక సలహాపత్రం పంపింది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని రెరా (RERA) కింద నమోదైన స్థిరాస్తి ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ చెల్లుబాటు వ్యవధిని 6 నెలలపాటు స్వయంచలితంగా పొడిగించాలని అందులో సూచించింది. అవసరమైతే మరో 3 నెలలు కూడా పొడిగింపు ఇవ్వవచ్చునని స్పష్టం చేసింది. మరోవైపు ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం ఒక ప్రకృతి విపత్తు కావడంవల్ల దీన్ని అనివార్య పరిస్థితిగా పరిగణించవచ్చునని దేశీయాంగ శాఖ కూడా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు వాటి పరిధిలోని స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థలకు మరొక సలహాపత్రం జారీచేసింది. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో ఇళ్ల కొనుగోలుదారులు కొన్ని నెలలు ఆలస్యంగానైనా తమ ఫ్లాట్లు/ఇళ్లు సొంతం చేసుకునే వీలుందిగనుక వారి ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యం నెరవేరడమేగాక ప్రాజెక్టులన్నీ కచ్చితంగా పూర్తవుతాయన్న భరోసా లభిస్తుంది.
మూలంలో పన్నుకోత/మూలం నుంచి పన్నువసూళ్లలో పన్ను శాతం తగ్గింపు
కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి ప్రభావిత పరిస్థితుల నడుమ పన్ను చెల్లింపుదారులకు ద్రవ్య లభ్యత దిశగా మూలంలో పన్నుకోత/మూలంనుంచి పన్నువసూళ్ల శాతాలను ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు వేతనజీవులు కానివారికి నిర్దిష్ట చెల్లింపులపై మూలంలో పన్ను కోత/ నిర్దిష్ట వసూళ్లపై మూలం నుంచి పన్ను వసూలు (టీడీఎస్/టీసీఎస్) కింద కోతపెట్టే మొత్తాన్ని 25 శాతం వంతున తగ్గించింది. ఈ నిర్ణయం 2020 మే 14 నుంచి 2021 మార్చి 31వరకూ అమలులో ఉంటుంది.
‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లద్వారా 15 రోజుల్లోపే 10 లక్షలమందికిపైగా ప్రయాణికులను వారి సొంత రాష్ట్రాలకు చేర్చి ఓ మైలురాయిని అధిగమించిన రైల్వేశాఖ
భారత రైల్వేశాఖ 2020 మే 14నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య 800 ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లను నడిపింది. ఈ రైళ్లద్వారా మొత్తం 10 లక్షల మందికిపైగా ప్రయాణికులు తమ సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. కాగా, వలసకార్మికులను పంపించే, స్వీకరించే రాష్ట్రాల అంగీకారం మేరకే రైల్వేశాఖ ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తదనుగుణంగా ఇప్పటిదాకా నడిచిన 800 రైళ్లు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరం, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని గమ్యస్థానాలకు చేరాయి.
రైల్వేశాఖ 12.05.2020 నుంచి ప్రారంభించిన ప్రత్యేక రైళ్లకు వివిధ తరగతుల వెయిటింగ్‌లిస్ట్ టికెట్లు పరిమిత సంఖ్యలో జారీ
దేశవ్యాప్తంగా 12.05.2020 నుంచి పునఃప్రారంభించిన ప్రత్యేక రైళ్లలో ఆర్‌ఏసీ (రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సిలేషన్) ఉండదని రైల్వేశాఖ ప్రకటించింది. అంతకాకుండా ఈ రైళ్లలో గరిష్ఠ పరిమితికి లోబడి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీచేయాలని నిర్ణయించింది. అలాగే వెయిటింగ్ లిస్ట్ టికెట్ల విషయంలో ప్రత్యేక రైళ్లకు సంబంధించిన ఇతర నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. తత్కాల్/ప్రీమియం తత్కాల్ కోటా ఉండదని, సీనియర్ సిటిజెన్/దివ్యాంగ, మహిళా కోటాలపై ప్రస్తుత ఆదేశాల మేరకు ప్రకటన ఉంటుందని తెలిపింది. పైన పేర్కొన్న మార్పుచేర్పులన్నీ 2020 మే 22 నుంచి ప్రారంభించబోయే రైళ్లకు వర్తిస్తాయని, వీటికి టికెట్ల బుకింగ్ 2020 మే 15 నుంచి మొదలవుతుందని పేర్కొంది.
కామన్‌వెల్త్ ఆరోగ్యశాఖ మంత్రుల 32వ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ హర్షవర్ధన్
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా కామన్‌వెల్త్ ఆరోగ్యశాఖ మంత్రుల 32వ సమావేశంలో పాల్గొన్నారు. “కోవిడ్-19పై కామన్‌వెల్త్ సమన్వయాత్మక ప్రతిస్పందన” ఇతివృత్తంగా ఈ సమావేశం జరిగింది.
దేశంలోని బోధకులతో వెబినార్‌ద్వారా హెచ్‌ఆర్‌డి మంత్రి సంభాషణ
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ ఇవాళ దేశంలోని బోధకులతో వెబినార్ ద్వారా సంభాషించిన సందర్భంగా “ఆచార్య దేవోభవ” సందేశమిచ్చారు. కోవిడ్-19పై విద్యార్థులకు, మొత్తంగా సమాజానికి అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో రెండు ప్రధాన ప్రకటనలు చేశారు. జాతీయ అర్హత పరీక్ష (నెట్) నిర్వహణ తేదీని అతి త్వరలో ప్రకటిస్తామని ఒక ప్రశ్నకు జవాబుగా తెలిపారు. అంతేకాకుండా ఇప్పటికే నవోదయ విద్యాలయ ప్రక్రియను పూర్తిచేసిన ఉపాధ్యాయుల నియామకాలను దిగ్బంధం ముగిశాక చేపడతామని చెప్పారు. కాగా, దిగ్బంధం ముగిసేదాకా విద్యార్థుల విద్యా సంక్షేమం ప్రధానమని, ఉపాధ్యాయులంతా తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించాలని ఆయన కోరారు.
దిగ్బంధం నడుమ కొనసాగుతున్న పప్పుదినుసులు, నూనెగింజల కొనుగోళ్లు
దేశవ్యాప్తంగా 2020-21 రబీ సీజన్‌లో 277 లక్షల టన్నులకుపైగా గోధుమ దిగుబడి రాగా, ఇందులో 269 లక్షల టన్నులదాకా కొనుగోలు చేయబడింది. ఇక దిగ్బంధం కొనసాగుతున్నా పీఎం-కిసాన్ పథకంకింద సుమారు 9.25 కోట్ల రైతు కుటుంబాలకు రూ.18,500 కోట్ల మేర నిధులు పంపిణీ అయ్యాయి.
భారత నావికాదళం రూపొందించిన వినూత్న చౌకధర వ్యక్తిగత రక్షణ సామగ్రికి పేటెంట్ లభించడంతో సత్వర భారీ తయారీకి మార్గం సుగమం
భారత నావికాదళం వినూత్న చౌకధర వ్యక్తిగత వైద్యరక్షణ సామగ్రి (పీపీఈ) రూపొందించింది. ఈ రక్షణ మంత్రిత్వశాఖలోని మేధోసంపత్తి ప్రోత్సాహక విభాగం (IPFC), శాస్త్ర-సాంకేతిక విజ్ఞానశాఖ పరిధిలోని జాతీయ పరిశోధన-అభివృద్ధి సంస్థ (NRDC)లు సంయుక్తంగా దీనిపై ‘సంపూర్ణ హక్కు’ (పేటెంట్) కోసం దరఖాస్తు చేశాయి. దీంతో నావికాదళం రూపొందించిన వినూత్న సామగ్రిని భారీస్థాయిలో వేగంగా తయారు చేసేందుకు మార్గం సుగమం కానుంది.
“ఆపరేషన్ సముద్ర సేతు”– మాల్దీవ్స్‌కు ఐఎన్‌ఎస్ జలాశ్వ రెండోవిడత పయనం
“ఆపరేషన్ సముద్రసేతు” రెండో విడతలో భాగంగా భారత నావికాదళ యుద్ధనౌక ఐఎస్‌ఎస్ జలాశ్వ 2020 మే 15 తెల్లవారుజామున మాల్దీవ్స్ రాజధాని మాలే రేవు నగరానికి చేరనుంది. స్వదేశం వచ్చేందుకు అక్కడి భారత రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న భారతీయులను సముద్ర మార్గంలో స్వదేశం తీసుకురానుంది. ఈ మేరకు 700 మంది భారత పౌరులతో మాలే నుంచి బయల్దేరి 15వ తేదీ రాత్రి కోచ్చి చేరుతుంది.
‘స్థానిక ఉత్పాదన’కు మద్దతుగా ముందుకొచ్చిన కేవీఐసీ
“స్థానికతకు ఊనిక”... ఆపై “ప్రపంచస్థాయికి చేరిక” నినాదంతో ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో స్థానిక ఉత్పాదనకు చేయూతనివ్వడం కోసం ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) సన్నద్ధమైంది. తదనుగుణంగా స్థానిక ఉత్పత్తికి ఉత్తేజమిస్తూ- ఎన్95 మాస్కులు, వెంటిలేటర్లు లేదా వాటి విడిభాగాలు, వైద్యసిబ్బంది కోసం పీపీఈ కిట్లు, శానిటైజర్లు/హస్తపరిశుభ్రత ద్రవాలు, థర్మల్ స్కానర్లు, అగరువత్తులు, సబ్బులు తదితరాల ఉత్పత్తి దిశగా ప్రతి జిల్లాలో ఒక విభాగం ఏర్పాటుకు నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19పై పోరాటం కోసం పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
కోవిడ్-19 పరిస్థితుల్లో వృద్ధులు, దివ్యాంగులకు సవాళ్ల పరిష్కారం కోసం సహాయక పరికరాలు, సాంకేతికతలు, పరిజ్ఞానాలకు శాస్త్ర-సాంకేతిక శాఖ మద్దతు
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- మహారాష్ట్ర: రాష్ట్రంలో ఇవాళ ఒకే రోజు అత్యధికంగా 1,495 కొత్త కేసులు, 54 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,922కు, మరణాలు 975కు చేరుకున్నాయి. ఇక నిన్న ముంబైలోని ధారవిలో 66 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదవగా ఈ ఒక్క ప్రాంతంలోని మొత్తం కేసుల సంఖ్య 1,028కి పెరిగింది. రాష్ట్రంలో కార్యకలాపాల పునరారంభం కోసం 65,000 పరిశ్రమలకు అనుమతి ఇవ్వగా 35,000 ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయని, 9 లక్షల మంది ఉద్యోగులు పనులకు వస్తున్నారని పరిశ్రమల మంత్రి సుభాష్ దేశాయ్ తెలిపారు. ఇక మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు గత 5 రోజులలో దాదాపు 73,000 మంది వలస కార్మికులను రాష్ట్ర సరిహద్దులవద్ద విడిచివచ్చాయి. కాగా, వలస కార్మికులలో 42,000 మంది శ్రామిక్ స్పెషల్ రైళ్లలో సొంత రాష్ట్రాలకు బయల్దేరారు.
- గుజరాత్: రాష్ట్రంలో ఇవాళ 364 కేసులు నమోదవగా మొత్తం కోవిడ్ రోగుల సంఖ్య 9,267కు చేరింది. కాగా, నిన్నటి కొత్త కేసులలో ఒక్క అహ్మదాబాద్ నుంచే 292 నమోదయ్యాయి. దిగ్బంధం తర్వాత రాష్ట్రంలో ఆర్థిక పునరుద్ధరణ చర్యలపై సిఫారసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఈ మేరకు మధ్యంతర నివేదికను రెండు వారాల్లోగా, తుది నివేదికను నెలలోగా సమర్పించాలని కమిటీని కోరింది. కోవిడ్-19వల్ల వాటిల్లే నష్టాలను ఈ కమిటీ రంగాలవారీగా అంచనా వేస్తుందని, తదనుగుణంగా ఆయా రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై సిఫారసులతో నివేదిక అందజేస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి అశ్వనీకుమార్ తెలిపారు.
- రాజస్థాన్: రాష్ట్రంలో 66 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 4394కు చేరింది. ఇప్పటివరకు 2575 మంది రోగులు కోలుకోగా, ఇప్పటివరకూ 122 మరణాలు నమోదయ్యాయి. కోలుకున్న వారిలో 28 మంది మహిళలు చికిత్స తర్వాత కోలుకొని తమ పిల్లలతో ఇంటికి వెళ్లారు. ఆరు కీలక విభాగాల దుకాణాలు, వాణిజ్య సంస్థలను తిరిగి తెరవడానికి రాజస్థాన్ ప్రభుత్వం అనుమతించింది. వీటిలో తినుబండారాలు, మిఠాయి షాపులు, హైవేలపైగల ధాబాలు, హార్డ్‌వేర్ షాపులు, నిర్మాణ సామగ్రి, ఎలక్ట్రిక్-ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ షాపులు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, తినుబండారాల, మిఠాయి దుకాణాలలో ప్రత్యక్ష అమ్మకాలు ఉండవు... ఇళ్లకు పార్శిళ్లు మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 187 మందికి కరోనావైరస్ సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 4,173కు పెరిగింది. కాగా, రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని 884 మంది రోగులలో 531 మంది... 60 శాతం కోలుకుని ఇళ్లకు వెళ్లడం శుభ సంకేతంగా భావిస్తున్నారు. అలాగే ఇండోర్‌లో 45 శాతం, ఉజ్జయినిలో 48 శాతం, ఖడ్గావ్‌లో 57 శాతం, థార్‌లో 46 శాతం, ఖాండ్వాలో 48 శాతం వంతున రోగులు ఇప్పటిదాకా వ్యాధి నయం చేసుకుని ఇళ్లకు వెళ్లిన నేపథ్యంలో ఇది జాతీయ సగటుకన్నా ఎక్కువ కావడం విశేషం.
- గోవా: దిగ్బంధం ఆంక్షలు సడలించడంతో తిరిగివచ్చిన వారిలో ఏడుగురికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఒక్కరోజు గడిచేసరికి మొత్తం కేసుల సంఖ్య రెట్టింపు స్థాయికి పెరిగి 14కు చేరింది. వీరందరూ ఈ ఉదయం నుంచి దక్షిణ గోవాలోని కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధ వైద్యపర్యవేక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్న అధికారులకు సహకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రజలకు పిలుపునిచ్చారు, దిగ్బంధాన్ని సడలించినప్పటికీ అన్ని నిరోధక, నివారణ చర్యలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
- అసోం: ముంబై నుంచి రాష్ట్రానికి వచ్చి నిర్బంధ వైద్యపర్యవేక్షణలో ఉన్న 7మంది రోగులతోపాటు వారి వెంటవచ్చిన మరో ఏడుగురికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 86 కాగా, 39 మంది డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసులు 44 కాగా, 2 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు.
- మణిపూర్: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, మినీ అంగన్‌వాడీ కార్మికులకు గౌరవ వేతనాన్ని నెలకు రూ.3000 నుంచి 4,500కు; రూ.2,250 నుంచి 3,500కు; రూ.1,500 నుంచి రూ .2,250కి పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
- మేఘాలయ: రాష్ట్ర శాసన సభాపతి మెట్బా లింగ్డో ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్-19పై సమష్టిగా పోరాడాలన్న సంకల్పాన్ని ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాలు పునరుద్ఘాటించాయి.
- మిజోరం: కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో దిగ్బంధం, రాష్ట్ర ప్రణాళికలపై సంప్రదింపుల నిమిత్తం స్వచ్ఛంద సంస్థలు, చర్చిలు, రాజకీయ పార్టీలు, గ్రామ-స్థానిక పాలన మండళ్లు, గ్రామస్థాయి కార్యాచరణ బృందాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
- నాగాలాండ్: రాష్ట్రంలో స్థానికంగా చిక్కుకున్నవారి ప్రయాణంలో రెండోదశ ముగిసింది. ఈ నేపథ్యంలో 64 మంది వలస కార్మికులను 4 సహాయ శిబిరాల్లో ఉంచారు. మరో 720 మంది రోజుకూలీలు, పేదలకు ఆహారం అందిస్తున్నారు.
- సిక్కిం: కోవిడ్-19కు సంబంధించి... రోగుల చికిత్స, నిర్బంధ వైద్య పర్యవేక్షణ కార్యకలాపాల సందర్భంగా వెలువడే వ్యర్థాల నిర్వహణ-శుద్ధి-నిర్మూలన సంబంధిత మార్గదర్శకాలను కచ్చితంగా అమలుచేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలనూ ఆదేశించింది.
- చండీగఢ్: దిగ్బంధం కారణంగా కొందరు వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు తదితరులు నగరంలో చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా, సౌకర్యంగా, సజావుగా స్వస్థలాలకు పంపడం కోసం నగరపాలన యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ISBT-43 వద్ద ప్రయాణిక నిర్వహణ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాలలో వ్యక్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య ధ్రువీకరణ పత్రాలిస్తారు. ఆ మేరకు వారు ధ్రువీకరణపత్రంతో ప్రయాణించాల్సి ఉంటుంది. నిర్వహణ కేంద్రాలవద్ద ఆహార ప్యాకెట్లు ఇస్తారు. అలాగే రైల్వేస్టేషన్ వద్ద కేటాయించిన బోగీల్లో ఎక్కేముందు నీళ్లసీసాలతోపాటు రాత్రి భోజనంకోసం ఆహార ప్యాకెట్లను అందిస్తారు.
- పంజాబ్: పంజాబ్‌లో చిక్కుకున్న ఇతర రాష్ట్రాలవారిని స్వస్థలాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటివరకు పంజాబ్ నుంచి 90కిపైగా రైళ్లు దాదాపు 1,10,000 మంది ఇతర రాష్ట్రాల వలసదారులతో వెళ్లాయి. వీరందరి ప్రయాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నేటివరకూ రూ.6 కోట్లకుపైగా ఖర్చుచేసింది. కోవిడ్-19 నేపథ్యంలో 50 రోజులుగా మూసి ఉన్న ఆహార దుకాణాల్లోని ఆహార పదార్థాలన్నిటినీ నాశనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే గడువుతేదీ దాటిన ప్యాకేజీ ఆహార పదార్థాలను కూడా ధ్వంసం చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
- హర్యానా: దేశంలోని ఎంఎస్‌ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల మేర హామీ అవసరంలేని రుణం ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో హర్యానాలోని సుమారు 50 వేల ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు సుమారు రూ.3000 కో్ట్లదాకా లబ్ధి కలుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.20,000 కోట్ల అనుబంధ రుణాలిస్తామని శ్రీమతి నిర్మల సీతారామన్ ప్రకటించిన మేరకు హర్యానాలో సుమారు 3000 యూనిట్లకు ఈ ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. కాగా, దిగ్బంధం వల్ల వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన రాష్ట్రవాసుల కోసం 2020 మే 15 నుంచి ఎంపిక చేసిన మార్గాల్లో ప్రత్యేక బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బస్సులు హర్యానా రాష్ట్ర పరిధిలో మాత్రమే నడవనుండగా, తీవ్ర కోవిడ్-19 ప్రభావిత ప్రాంతాలకు బస్సులు నడపబోమని స్పష్టం చేసింది.
- హిమాచల్ ప్రదేశ్: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కోసం రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో స్వయం సమృద్ధి దిశగా భారత్‌లో తయారయ్యే దేశీయ ఉత్పత్తులను వివిధ సంస్థలద్వారా విక్రయించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. దీనివల్ల జాతీయ, రాష్ట్ర స్థాయులలో ఉత్పత్తిరంగానికి ఉత్తేజమిస్తుందన్నారు.
- కేరళ: కోవిడ్-19 సోకిన రోగి ఒకరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను, ఇద్దరు ఎమ్మెల్యేలను స్పర్శించిన నేపథ్యంలో వారు నిర్బంధ వైద్యపర్యవేక్షణ కేంద్రానికి వెళ్లాలని ప్రభుత్వం కోరింది. కేరళీయులు రాష్ట్రంలో ప్రవేశించకుండా వలయార్‌లోని సరిహద్దు తనిఖీ కేంద్రంవద్ద అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వీరు నిరసన తెలిపిన సందర్భంగా కోవిడ్ రోగితో స్పర్శకు దారితీసి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో పోలీసు అధికారులు, ఆర్డీవో, జర్నలిస్టులు సహా 400 మందికిపైగా వ్యక్తులను ప్రభుత్వం నిర్బంధ వైద్యపర్యవేక్షణ కేంద్రాలకు పంపింది. మరోవైపు వయనాడ్‌లోని మనంతవాడి పోలీస్ స్టేషన్‌లోని ముగ్గురు అధికారులకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో మిగిలినవారందర్నీ నిర్బంధ వైద్య పర్యవేక్షణకు పంపారు. కాగా, రాష్ట్రంలో నిన్న 10 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది. ఇక కువైట్‌లోని ఒక మలయాళీ నర్సు కోవిడ్-19తో ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటిదాకా విదేశాల్లో మరణించిన కేరళవాసుల సంఖ్య 120 దాటింది.
- తమిళనాడు: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి, విద్యార్థులకు ప్రయాణ సదుపాయంపై ప్రభుత్వం మే 19న ప్రకటన చేస్తుందని విద్యాశాఖ మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 30 పడకలుగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎంపిక చేసినవాటిని కోవిడ్ సంరక్షణ కేంద్రాలుగా ప్రకటిస్తారు. రాష్ట్రంలో రాష్ట్రంలో నిన్న 509 కొత్త కేసులు నమోదు కావడంతో తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 9,227కు చేరింది. యాక్టివ్ కేసులు: 6984, మరణాలు: 64, డిశ్చార్జ్ అయినవారు: 2176మంది. చెన్నైలో యాక్టివ్ కేసులు 5262.
- కర్ణాటక: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు 22 కొత్త కేసులు నమోదయ్యాయి: వీటిలో బెంగళూరు 5, బీదర్, మాండ్యా, గడగ్‌లలో 4 వంతున, దావణగేరెలో 3, బాగల్‌కోట్, బెళగావిలలో ఒక్కొక్కటి ఉన్నాయి. ఇవాళ కల్బుర్గిలో ఒకరు, దక్షిణ కన్నడ జిల్లాలో 80 ఏళ్ల మహిళ, బెంగళూరులో 60 ఏళ్ల పురుషుడు మరణించారు. ఇప్పటివరకు మొత్తం కేసులు 981. మరణాల సంఖ్య 35కి పెరిగిన నేపథ్యంలో 456 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర ప్రభుత్వం దిగ్బంధం నిబంధనలను మరింత సడలించింది. కిరాణా దుకాణాలు తెరచి ఉంచే సమయాన్ని పొడిగించింది. ఈ మేరకు నియంత్రణ, ముందుజాగ్రత్త జోన్లలో మినహా మిగిలిన జోన్లలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలవరకు దుకాణాలను తెరచి ఉంవచ్చు. ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సులద్వారా హైదరాబాద్‌లో చిక్కుకున్నవారిని తిరిగి తీసుకురావడంపై ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, రాష్ట్రంలో 36 తాజా కేసులు నమోదయ్యాయి (మహారాష్ట్ర, ఒడిసా బెంగాల్‌కు చెందిన వలసదారులలో మరో 32 కేసులున్నాయి); ఇక 9256 నమూనాలను పరీక్షించాక గత 24 గంటల్లో 50 మంది డిశ్చార్జ్ కాగా, ఒక మరణం సంభవించింది. కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 2100కి పెరిగింది. యాక్టివ్ కేసులు: 860, కోలుకున్నవి: 1192, మరణాలు: 48. కేసుల సంఖ్యరీత్యా... కర్నూలు (591), గుంటూరు (404), కృష్ణా (351) జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
- తెలంగాణ: అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి 312 మందితో వచ్చిన రెండు విమానాలు గురువారం హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాయి. రాష్ట్రంలో నిన్నటిదాకా మొత్తం కేసుల సంఖ్య 1367 కాగా, కోలుకున్నవారు; 939 మంది, యాక్టివ్ కేసులు 394, మరణాలు 34గా నమోదయ్యాయి.
FACT CHECK

********
(Release ID: 1623951)
|