శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

దివ్యాంగులు, వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లపై పోరాటానికి సహాయక సాధనాల సృష్టి

ప్రస్తుత కొవిడ్‌-19 పరిస్థితులకు అనుగుణంగా పరికరాల రూపకల్పన
శాస్త్ర, సాంకేతిక విభాగం మద్దతుతో పెద్దమొత్తంలో ఉత్పత్తికి ప్రణాళిక

Posted On: 13 MAY 2020 6:37PM by PIB Hyderabad

దివ్యాంగులు, వృద్ధులపై కొవిడ్‌-19 ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) అనేక చర్యలు తీసుకుంటోంది. వాళ్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు గుర్తించి సాంకేతిక పరిష్కారాలను కనుగొంటోంది. డీఎస్‌టీ విభాగమైన "సైన్స్‌ ఫర్‌ ఈక్విటీ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌" (ఎస్‌ఈఈడీ‌) మద్దతు ఇస్తున్న సంస్థలు వివిధ సహాయక సాధనాలు, సాంకేతికతలు, పద్ధతులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించాయి. టెక్నాలజీ ఇన్వెన్షన్స్‌ ఫర్‌ డిజేబుల్డ్‌ అండ్‌ ఎల్డర్లీ (టీఐడీఈ) కార్యక్రమం ద్వారా, భారతీయులు ఆర్థికంగా భరించగలిగిన, అనుకూలమైన పరికరాలను రూపొందించాయి. దివ్యాంగులు, వృద్ధుల సమగ్రత, సార్వత్రిక సౌలభ్యం కోసం ఆయా పరికరాలను సృష్టించాయి.

 

frontpage

    వృద్ధులు, దివ్యాంగుల్లో అవగాహన కల్పించడానికి, ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి టీఐడీఈ కార్యక్రమం కింద ఒక ఈ-టూల్ రూపొందించారు. మేధో వైకల్యం ఉన్నవారు తమ ఒంటరితనాన్ని అధిగమించేందుకు విద్య, వినోద కార్యక్రమాలను కూడా ఇది అందిస్తుంది. చెన్నైలోని రాజ్యలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాల దీనిని రూపొందించింది. మేధో వైకల్యాలు ఉన్న వ్యక్తులు మొబైళ్లు, ట్యాబుల ద్వారా సరదా పద్ధతిలో నేర్చుకోవడానికి ఈ-టూల్‌ సాయం చేస్తుంది. ఈ-టూల్‌ను వ్యవహారిక భాషల్లోకి కూడా మార్చుకోవచ్చు. ఈ-టూల్‌ బీటా వెర్షన్‌ను 200 మంది దివ్యాంగ చిన్నారులు వినియోగిస్తున్నారు.

    డీఎస్‌టీ కార్యదర్శి ప్రొ.అషుతోష్‌ శర్మ మాట్లాడుతూ, దివ్యాంగులు, వృద్ధులకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని కల్పించడానికి ఆర్థికంగా భరించగలిగే, సాంకేతికంగా సాధ్యమయ్యే పరిష్కారాలను మరింత అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఆ సాంకేతిక పరిష్కారాలు సమీకృత సమాజ సృష్టికి అవసరమన్నారు.


 
సాఫ్ట్‌వేర్‌, యాప్‌లోని వివిధ భాగాలను చూపించే ఈ-టూల్‌ స్క్రీన్‌ షాట్‌

    ఒంటిపై ధరించగలిగే సెన్సార్‌ పరికరాన్ని కోయంబత్తూరులోని పీఎస్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ రూపొందించింది. ఒంటరిగా లేదా క్వారంటైన్లు లేదా ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంటున్న దివ్యాంగులు, వృద్ధుల కదలికలను ఈ సెన్సార్‌ గమనిస్తుంటుంది. వృద్ధుల్లో ఆరోగ్య బలహీనతలను ఇది ముందే ఊహించి హెచ్చరిస్తుంది. ఈ పరికరాన్ని పెద్ద మొత్తంలో తయారు చేయగలిగితే ఒక్కొక్కదాన్ని రూ.1500లకు అందించవచ్చు.

Top View

    ధరించగలిగే సాధనం                                                                  సెన్సార్ కాన్ఫిగరేషన్
 
    ఒంటిపై ధరించగలిగిన పునరావాస బ్యాండ్‌ను దివ్యాంగులైన వృద్ధుల కోసం తయారు చేశారు. అనారోగ్య పరిస్థితి, అలవాట్ల నుంచి వారు కోలుకునే ప్రక్రియను రియల్‌ టైమ్‌లో ఈ బ్యాండ్‌ పర్యవేక్షిస్తూ, విశ్లేషించిన సమాచారాన్ని అందిస్తుంది. పునరావాస సమయంలో వైద్యులు, ఫిజియోథెరపిస్టుల ప్రత్యక్ష, శారీరక జోక్యం అవసరం లేకుండా, వృద్ధుల కండరాల బలం, సాగే గుణం, ఓర్పును వృద్ధి చేసుకోవడంలో గణనీయమైన ఫలితాలు వచ్చేలా ఈ పరికరం సాయపడుతుంది. 
  

 



    ధరించగలిగిన సాధనం                                                         మొబైల్‌ యాప్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌

    ఈ పరికరాలు ప్రస్తుత కొవిడ్‌-19 పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయబడ్డాయి. వస్తువులు, ఇతర సహాయక పరికరాలను దివ్యాంగులు తాకాల్సిన అవసరం లేకుండా, వస్తువులు, దూరాలు, పరిసరాలు, వ్యక్తులను గుర్తించే యాప్‌ల వృద్ధి ప్రక్రియ కొనసాగుతోంది. డీఎస్‌టీకి చెందిన సాంకేతిక వ్యాపార అంకుర సంస్థల ద్వారా ఈ పరికరాలను పెద్దమొత్తంలో ఉత్పత్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక ప్రారంభమైంది. కేంద్ర దివ్యాంగుల సాధికారత విభాగం దీనిని మరింత ముందుకు తీసుకెళ్లనుంది.

(మరిన్ని వివరాల కోసం, డీఎస్‌టీ శాస్త్రవేత్త డా.కొంగ గోపీకృష్ణను సంప్రదించగలరు. ఈమెయిల్‌: k.gopikrishna[at]nic[dot]in, ఫోన్‌: 011 26590298‌)


(Release ID: 1623714) Visitor Counter : 276