PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 12 MAY 2020 6:21PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • నేటిదాకా 70,756 కోవిడ్‌-19 కేసులకుగాను 22,455మందికి నయంకాగా- కోలుకున్నవారు 31.74 శాతం.
  • గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,604 కొత్త కేసులు నమోదయ్యాయి.
  • గత 14 రోజుల వ్యవధిలో కేసుల రెట్టింపు వేగం 10.9 కాగా, గడచిన 3 రోజుల్లో 12.2గా మెరుగుపడింది.
  • కోవిడ్‌-19పై పోరాటంలో భవిష్యత్‌ ప్రణాళికపై ముఖ్యమంత్రులతో చర్చించిన ప్రధానమంత్రి; గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి విస్తరణ నిరోధమే మన ప్రస్తుత కర్తవ్యమని ప్రధాని సూచన.
  • ఈ ఉదయందాకా పలు రాష్ట్రాల నుంచి నడిచిన 542 ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లు.
  • ఇవాళ 8 రైళ్లలో ప్రయాణిక రైలు సేవలను ప్రారంభించిన భారత రైల్వేశాఖ.
  • వందే భారత్‌ మిషన్‌ కింద గత 5 రోజులలో విదేశాల నుంచి 6037 మంది భారతీయుల తరలింపు.

హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లలో కోవిడ్‌-19 నిర్వహణలో భాగంగా చేపట్టిన నియంత్రణ చర్యలు, సన్నద్ధతపై డాక్టర్ హర్షవర్ధన్‌ సమీక్ష

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇవాళ జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు పెద్దసంఖ్యలో తిరిగి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ మేరకు తిరిగివచ్చే ప్రతి ఒక్కరి విషయంలోనూ కోవిడ్‌-19 సంబంధిత నిఘా, సంబంధాల జాడ అన్వేషణ, తగురీతిలో పరీక్షలు, సకాలంలో చికిత్స తదితరాలపై శ్రద్ధపెట్టాలని సూచించారు. విదేశాల నుంచి తిరిగివచ్చేవారి విషయంలోనూ ఇదే జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు.

  కాగా, 2020 మే 12వ తేదీనాటికి దేశంలో మొత్తం 70,756 కేసులకుగాను 22,545 మంది కోలుకోగా ఇప్పటివరకూ 2,293 మరణాలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో 3,604 కొత్త కేసులు నమోదవగా 1,538 మంది కోలుకున్నారు. ఇక కేసుల రెట్టింపు వ్యవధి గడచిన 14 రోజులలో 10.9 కాగా, గత 3 రోజులలో మెరుగుపడి 12.2కు చేరింది. ఇక మరణాలు 3.2 శాతంగానూ, కోలుకునేవారు 31.74 శాతంగానూ నమోదయ్యారు. ఏదేమైనా కోవిడేతర అత్యవసర కేసుల విషయంలోనూ తగిన శ్రద్ధాసక్తులు చూపాలని డాక్టర్ హర్షవర్ధన్‌ రాష్ట్రాలకు సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623367

అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి చర్చాగోష్ఠి

కోవిడ్ -19 మ‌హ‌మ్మారిపై భార‌త్ పోరాటంలో భాగంగా భవిష్య‌త్ కార్యాచ‌ర‌ణ దిశ‌గా అన్నిరాష్ట్రాలు/ కేంద్ర‌పాలిత ప్రాంతాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన‌మంత్రి చ‌ర్చాగోష్ఠి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ- ప్ర‌స్తుతం రెండంచెల స‌వాళ్ల‌ను దేశం ఎదుర్కొంటున్న‌ద‌ని చెప్పారు. ఇందులో వ్యాధి విస్త‌ర‌ణ శాతాన్ని త‌గ్గించ‌డం మొద‌టిది కాగా, అన్నిర‌కాల మార్గ‌ద‌ర్శ‌కాలను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తూ క్ర‌మ‌క్ర‌మంగా ప్ర‌జా కార్య‌క‌లాపాల‌ను పెంచ‌డం రెండోద‌ని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడిక గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ -19 వ్యాప్తి నిరోధంపై దృష్టి కేంద్రీక‌రించాల్సి ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి స్ప‌ష్టం చేశారు. కోవిడ్ త‌ద‌నంత‌ర శ‌కం ఎన్నో అవ‌కాశాల‌ను మ‌న‌ముందుకు తెస్తుంద‌ని, వాటిని భార‌త్ చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి అనంత‌రం ప్ర‌పంచంలో ప్రాథ‌మికంగా మార్పు వ‌చ్చింద‌ని చెప్పారు. ఆ మేర‌కు ప్ర‌పంచ యుద్ధాల త‌ర‌హాల్లో ఇక‌పై “క‌రోనాకు ముందు- క‌రోనాకు త‌ర్వాత” అనే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని వివ‌రించారు. మ‌నమిక‌ ఎలా ప‌నిచేయాల‌న్న‌ది ఈ మార్పులే నిర్దేశిస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌న జీవ‌న విధానం ‘వ్య‌క్తి నుంచి మాన‌వాళి’ అంత‌టికీ వ‌ర్తించేలా “జ‌నం నుంచి జ‌గందాకా” అనే సూత్రానికి అనుగుణంగా ఉంటుంద‌ని చెప్పారు. కాబ‌ట్టి ముందున్న వాస్త‌వ జ‌గ‌త్తును దృష్టిలో ఉంచుకుని మ‌న ప్ర‌ణాళిక‌ల‌కు రూప‌క‌ల్ప‌న చేసుకోవాల్సి ఉంద‌న్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623182

దేశవ్యాప్తంగా 2020 మే 12 (09:30)దాకా 542 ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లను నడిపిన రైల్వేశాఖ

భారత రైల్వేశాఖ 2020 మే 12నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య 542 ‘శ్రామిక్‌ ప్రత్యేక’ రైళ్లను నడిపింది. వీటిలో 448 రైళ్లు ఇప్పటికే గమ్యస్థానాలు చేరగా, మరో 94 రైళ్లు మార్గమధ్యంలో ఉన్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు చేరిన రైళ్ల సంఖ్య ఇలా ఉంది... ఆంధ్రప్రదేశ్ (1), బీహార్ (117), ఛత్తీస్‌గఢ్‌ (1), హిమాచల్ ప్రదేశ్ (1), జార్ఖండ్ (27), కర్ణాటక (1), మధ్యప్రదేశ్ (38), మహారాష్ట్ర (3), ఒడిశా (29), రాజస్థాన్ (4), తమిళనాడు (1), తెలంగాణ (2), ఉత్తర ప్రదేశ్ (221), పశ్చిమ బెంగాల్ (2) వంతున ఉన్నాయి. ఈ శ్రామిక్ స్పెషల్ రైళ్లు ఎక్కే ముందు ప్రయాణికులకు సముచిత ఆరోగ్య ప‌రీక్షలు త‌ప్ప‌నిస‌రి.  ప్రయాణ సమయంలో వారికి ఉచిత భోజనం, నీరు అంద‌జేస్తారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623296

ప్రయాణిక రైలుసేవలను దశలవారీ పద్ధతిలో పునరుద్ధరించిన రైల్వేశాఖ

రైల్వేశాఖ ప్రయాణిక సేవలను దశలవారీ పద్ధతిలో ఇవాళ 8 రైళ్లతో పురుద్ధరించింది. ప్రస్తుతం పునఃప్రారంభమైన ఈ రైళ్లు న్యూఢిల్లీ, ముంబై, హౌరా, అహ్మదాబాద్‌, పాట్నా, బెంగళూరు మార్గాల్లో నడుస్తాయి. ఇందులో భాగంగా కోవిడ్‌-19 కారణంగా రైళ్ల రద్దుతర్వాత నం.02442 న్యూఢిల్లీ-బిలాస్‌పూర్‌ రైలు ఇవాళ తొలి పునరారంభ ప్రత్యేక రైలు రూపంలో న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌ నుంచి బయల్దేరింది. మొత్తంమీద ఢిల్లీనుంచి ఇవాళ 3 ప్రత్యేక రైళ్లు 3,400 మందికిపైగా ప్రయాణికులతో ప్రయాణం ప్రారంభించాయి. ఇక ఇతర నగరాలనుంచి ఢిల్లీవైపు మరో 5 రైళ్లు బయల్దేరుతాయి. భారత రైల్వేశాఖ నడుపుతున్న శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లకు ఈ ప్రత్యేక రైళ్లు ఇది అదనం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623312

వందే భారత్‌ మిషన్‌ కింద 2020 మే 7 నుంచి విదేశాల్లోగల 6,037మంది భారతీయులు 31 విమానాల్లో స్వదేశం తరలింపు

విదేశాల్లో చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 మే 7వ తేదీన వందేభారత్‌ మిషన్‌ పేరిట బృహత్కార్యక్రమం ప్రారంభించింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంద్వారా పౌర విమానయాన శాఖ భారతీయులను మాతృభూమికి తీసుకొస్తోంది. ఈ కృషిలో భాగంగా అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, సౌదీ అరేబియా, కువైట్‌, ఫిలిప్పీన్స్‌, యూఏఈ, మలేషియా తదితర 12 దేశాల నుంచి ఎయిరిండియా (42), దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (24) 64 విమానాలద్వారా తొలిదశలో 14,800 మంది భారతీయులను తీసుకురానున్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623276

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులకు ప్రధాని కృతజ్ఞతలు

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా దేశంలోని నర్సులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మన భూగోళాన్ని ఆరోగ్యవంతంగా నిలపడం కోసం రాత్రింబ‌వ‌ళ్లు శ్రమిస్తున్న అసాధారణ నర్సుల సేవలపై కృత‌జ్ఞత వెలిబుచ్చే విశిష్ట సంద‌ర్భం ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్స‌వం. ప్రస్తుతం వారంతా కోవిడ్-19ని త‌రిమికొట్టేందుకు త‌మ‌వంతు కృషిచేస్తున్నారు. అందుకే నర్సులు, వారి కుటుంబాల‌కు మ‌న‌మంతా ఎంతో కృత‌జ్ఞుల‌మై ఉండాలి’’ అని ప్రధానమంత్రి  తన సందేశంలో పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623364

దేశవ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాలు

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇవాళ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలలో కేంద్ర దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ సందర్భాన్ని “నర్సులు-మంత్రసానుల సంవత్స”గా ప్రకటించడం ఈ నర్సుల దినోత్సవానికి మరింత ప్రాముఖ్యం తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో నర్సింగ్‌ వృత్తినిపుణుల అంకితభావాన్ని, నిస్వార్థ సేవానిరతిని  డాక్టర్ హర్షవర్ధన్‌ కొనియాడారు. ఆరోగ్య సంరక్షణ సేవాప్రదానంలో వారు బలమైన, కీలక స్తంభాలని పేర్కొన్నారు. “విధినిర్వహణలో మీ నిజాయితీ, శ్రమలను వర్ణించడానికి మాటలు చాలవు. మీ అంకితభావం అటువంటిది. మీ కరుణాభావానికి, నిబద్ధతకు, చల్లని స్పర్శకు, ఎంత కష్టతరమైనా రోగులకు ప్రథమ ప్రాధాన్యమిచ్చే కర్తవ్యదీక్షకు జోహార్లు” అని కొనియాడారు. ప్రస్తుత ప్రపంచ మహమ్మారి సంక్షోభ సమయంలో వారందిస్తున్న అమూల్యమైన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623276

‘గాంధీ శాంతిబహుమతి-2020’కి ప్రతిపాదనల సమర్పణ గడువును 15.6.2020దాకా పొడిగించిన ప్రభుత్వం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623098

‘అసోచామ్‌’ నిర్వహించిన ‘ఇండో-బంగ్లాదేశ్‌’ దృశ్యమాధ్యమ సమావేశంలో డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ప్రసంగం

కోవిడ్‌ అనంతర కాలంలో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటాయని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖ సహాయ (ఇన్‌చార్జి)మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అన్నారు. ఆ మేరకు ఆర్థిక, వాణిజ్య, శాస్త్రీయ పరిశోధన తదితర అనేక విభిన్న రంగాల్లో వినూత్న పురోగమనానికి విస్తృత అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623153

తక్షణ పరిమాణాత్మక సూక్ష్మ పీసీఆర్‌ వ్యవస్థ సంబంధిత కీలక విడిభాగాలు తయారుచేస్తున్న సాంకేతిక కేంద్రాలు

కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాక పరిధిలో భువనేశ్వర్‌, జంషెడ్‌పూర్‌, కోల్‌కతా నగరాల్లోగల సాంకేతిక కేంద్రాలు విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌ (ఏఎంటీజడ్‌) కోసం తక్షణ పరిణామాత్మక సూక్ష్మపీసీఆర్‌ వ్యవస్థ సంబంధిత కీలక విడిభాగాలను తయారుచేస్తున్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623155

కోవిడ్ -19 చికిత్స‌కోసం 36 రోజుల్లో ‘బైపాప్ నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్’ స్వస్థ‌‌వాయును అభివృద్ధి చేసిన బెంగ‌ళూరులోని సీఎస్ఐఆర్‌-నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (ఎన్‌ఏఎల్)

ఎన్ఏబిఎల్ గుర్తింపుగ‌ల ధ్రువీక‌ర‌ణ సంస్థ‌లు అత్యంత క‌ఠిన‌మైన జీవ‌వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం ఈ వ్యవస్థ భద్రత, పనితీరు సామ‌ర్థ్యాన్ని నిర్ధారించాయి. ఈ ‘బైపాప్ నాన్ ఇన్వేసివ్ వెంటిలేట‌ర్’ ఒక సూక్ష్మ ప్రాసెస‌ర్ ఆధారిత క‌చ్చిత‌మైన లూప్ అనుస‌ర‌ణ నియంత్రిత వ్య‌వ‌స్థ‌. వైర‌స్ వ్యాప్తి భ‌యాల‌ను తొల‌గించ‌డంలో ఇది త‌ప్ప‌క తోడ్ప‌డ‌గ‌ల‌దు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623181

ఛాంపియ‌న్స్ పోర్ట‌ల్‌ను ప్రారంభించిన‌ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ‌శాఖ

కేంద్ర ఎంఎస్ఎంఈ  మంత్రిత్వ‌శాఖ ఛాంపియన్స్‌ పోర్టల్‌ www.Champions.gov.inను ప్రారంభించింది. ఇది టెక్నాల‌జీ ఆధారిత కంట్రోల్ రూమ్-క‌మ్-మేనేజే్‌మెంట్ వ్యవస్థ. అత్యాధునిక ఐసీటీ ఉప‌క‌ర‌ణాలద్వారా భార‌త ఎంఎస్ఎంఈలు జాతీయ, అంత‌ర్జాతీయ పోటీదారులుగా ఎదిగేందుకు ఈ వ్యవస్థ దోహ‌ద‌ప‌డుతుంది.

మరిన్ని వివరాలకు... http://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623261

‘పీఎం కేర్స్‌’ నిధికి రూ.25 లక్షల విరాళమిచ్చిన బీపీపీఐ

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623368

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్: వలస కార్మికుల ప్ర‌యాణం కోసం “శ్రామిక్ స్పెష‌ల్” రైళ్లు ఏర్పాటు చేయడంలో చండీగ‌ఢ్ పాల‌న యంత్రాంగం కృషిని న‌గ‌ర పాల‌నాధికారి ప్ర‌శంసించారు. ప్రయాణికులకు తగినంత‌ ఆహారం, నీరు త‌దిత‌రాల‌ను అందించడంతోపాటు రైలు టిక్కెట్లుస‌హా మొత్తం ఖర్చులను యంత్రాంగం భరించ‌డంపై ఆయన హ‌ర్షం వ్యక్తం చేశారు.
  • పంజాబ్: నెల రోజుల‌నుంచీ ఢిల్లీలోని ‘మ‌జ్నూ కా తిల్లా’ గురుద్వారాలో ఉంటున్న‌వారు స‌హా న‌గ‌రంలో చిక్కుకున్న 336 మంది పంజాబీలను తిరిగి తీసుకురావడం కోసం పంజాబ్ ప్ర‌భుత్వం 13 రాష్ట్ర రోడ్డుర‌వాణా సంస్థ బ‌స్సుల‌ను పంపించింది. కాగా, రాష్ట్రానికి తిరిగివ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రూ రాష్ట్ర ఆరోగ్య విధానం ప్ర‌కారం... తప్పనిసరిగా నిర్బంధ వైద్య ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండ‌వ‌త‌ప్ప‌దు. మ‌రోవైపు ప్రభుత్వ సంస్థలతోపాటు వ్యాపారులు ఇవాళ 26వ రోజు రాష్ట్రంలో 1,50,918 టన్నుల గోధుమలను కొనుగోలు చేశారు. ఇందులో ప్రభుత్వ సంస్థలు 1,50,771 ట‌న్నులు సేక‌రించ‌గా, వ్యాపారులు 147 టన్నులు కొన్నారు.
  • హర్యానా: ప్ర‌‌పంచ మహమ్మారి, కోవిడ్‌-19 సృష్టించిన విచిత్ర పరిస్థితులవ‌ల్ల రాష్ట్రంలో చిక్కుకున్న వలస కార్మికుల బాధల‌ను సానుభూతితో అర్థం చేసుకుని, స్వ‌స్థ‌లాల‌కు వెళ్ల‌ద‌ల‌చిన వారిని పంపేందుకు త‌న‌వంతు కృషిచేస్తోంది. ఇందులో భాగంగా నిన్న రేవారి నుంచి 1,208 మంది, అంబాలా కంటోన్మెంట్ నుంచి 1,188మంది వంతున వవలస కార్మికులు తమ కుటుంబాలతో “శ్రామిక్ స్పెషల్” రైళ్ల‌లో బ‌య‌ల్దేరారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో మూలధన వ్యయాన్ని తగ్గించబోమ‌ని, అయిన‌ప్ప‌టికీ ప్రభుత్వం నిరుత్పాదక, వృథా ఖ‌ర్చుల‌ను అరిక‌ట్ట‌డంద్వారా పొదుపు చ‌ర్య‌లు పాటిస్తుంద‌ని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా, పట్టణ ప్రాంతాల్లోన ప్రతి కుటుంబానికీ నైపుణ్యంతో నిమిత్తంలేని 120 రోజుల ఉపాధి హామీ ప‌నులు కల్పించ‌డం కోసం ‘ముఖ్య‌మంత్రి షహ‌రీ ఆజీవిక గ్యారంటీ యోజన’ను ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు.
  • కేరళ: రాష్ట్రంలోకి రోడ్డు, రైలుమార్గాల ద్వారా చేరుకోవ‌డంలో ఇబ్బంది లేకుండా కేరళ ప్రభుత్వం వివరణాత్మక మార్గదర్శకాలు జారీచేసింది. కాగా, పాస్ లేకుండా వచ్చేవారు తప్పనిసరిగా నిర్బంధ వైద్యప‌ర్య‌వేక్ష‌ణ‌ను ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసింది. కాగా, కేంద్ర-రాష్ట్రాల మార్గ‌ద‌ర్శ‌కాల మ‌ధ్య‌ వైరుధ్యాలను గమనించిన నేప‌థ్యంలో రాష్ట్రానికి తిరిగి వచ్చే ప్రవాసుల నిర్బంధ వైద్య ప‌ర్య‌వేక్ష‌ణపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవాళ గల్ఫ్‌లో ఐదుగురు కేరళీయులు కోవిడ్ -19తో మరణించారు. ఇక గల్ఫ్ నుంచి ఈ రాత్రి 4 విమానాలు రాష్ట్రానికి వస్తాయి. మ‌రోవైపు మాల్దీవ్స్ నుంచి రెండో నౌక 202 మంది భారతీయులతో ఈ సాయంత్రం కోచ్చికి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 27 యాక్టివ్ కోవిడ్ -19 రోగుల‌కు చికిత్స కొన‌సాగుతోంది. రాష్ట్రంలో 34 హాట్ స్పాట్స్ ఉన్నాయి.
  • తమిళనాడు: రాష్ట్రంలోని తిరున‌ల్వేలి  నుంచి బీహార్‌కు 1,140 మంది వలసకార్మికుల‌తో ప్రత్యేక రైలు బ‌య‌ల్దేరింది. ఒక డ్రైవరుకు కోవిడ్ -19 సోకిన‌ట్లు నిర్ధార‌ణ కావ‌డంతో కుంభ‌కోణం మార్కెట్‌ను కూడా మూసివేశారు. కాగా, కోవిడ్ -19 చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటు కోసం ప్రైవేట్ ఆస్తులను గుర్తించాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలోని అంద‌రు కార్డుదారుల‌కూ జూన్ నెల ఉచిత రేష‌న్ పంపిణీ కోసం ప్ర‌భుత్వం రూ.219 కోట్లు కేటాయించింది. మద్రాస్ మెడికల్ కాలేజీలో ప్లాస్మా చికిత్స ప్ర‌క్రియ‌ను ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించ‌నున్నారు. ఇప్పటిదాకా మొత్తం కేసులు: 8002, యాక్టివ్ కేసులు: 5895, మరణాలు: 53, డిశ్చార్జ్: 2051. చెన్నైలో యాక్టివ్ కేసులు 4371.
  • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 42 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, గ్రీన్ జోన్‌లోగ‌ల‌ హసన్ జిల్లాలో తొలిసారి 5 కేసులు నమోదయ్యాయి. వీటిలో బాగల్‌కోట్ 15, ధార్వాడ్ 9, హసన్ 5, బెంగళూరు 3, యాదగిరిలో రెండుబీదర్, దక్షిణ కన్నడ, చిక్కబళ్లాపూర్, మాండ్యా, బళ్లారి, కల్బుర్గిల‌లో ‌ఒక్కొక్కటి వంతున ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 904, మరణాలు 31; ఇప్ప‌టిదాకా 426 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ సంక్షోభం నేప‌థ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆర్థికశాఖ అధికారులతో ముఖ్య‌మంత్రి ఇవాళ సమావేశం నిర్వహించారు.
  • ఆంధ్రప్రదేశ్: రాజధానిని విశాఖపట్నానికి మార్చడంపై ప్ర‌భుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖ‌లు చేసింది.  ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 58 పేజీల నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి SCERT సమర్పించింది. రాష్ట్రంలో తాజాగా 33 కేసులు నమోదయ్యాయి; గ‌డ‌చిన 24 గంట‌ల్లో 10,730 నమూనాలను పరీక్షించిన తర్వాత 58 మంది డిశ్చార్జ్ కాగా, ఒక మరణం సంభవించింది. మొత్తం కేసులు 2051కి పెరిగాయి. క్రియాశీల కేసులు: 949, కోలుకున్నవి: 1056, మరణాలు: 46. కేసుల సంఖ్య‌రీత్యా కర్నూలు (584), గుంటూరు (387), కృష్ణా (346), చిత్తూరు (131), అనంతపురం (115) , నెల్లూరు (111) అగ్ర‌స్థానంలో ఉన్నాయి.
  • తెలంగాణ: యునైటెడ్ కింగ్‌డ‌మ్ నుంచి హైదరాబాద్ వెళ్లే నాలుగో 'వందే భారత్ మిషన్' విమానం ఈ తెల్లవారుజామున 331 మంది ప్రయాణికులతో హైద‌రాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. దిగ్బంధం ముగిశాక తర్వాత భౌతిక దూరం పాటించేలా బస్సుల సీటింగ్ సామర్థ్యాన్ని తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) యోచిస్తోంది. కాగా, రాష్ట్రంలో నిన్నటికి మొత్తం కేసులు 1275 కాగా, యాక్టివ్ కేసులు 444, డిశ్చార్జ్ అయిన‌వారు 801 మంది, మరణాలు 30గా ఉన్నాయి.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,401గా ఉంది; కాగా, ముంబైలో తొలికేసు నమోదైన సరిగ్గా రెండు నెలల తర్వాత ఇవాళ‌ మొత్తం కేసుల సంఖ్య 14,355కి చేరింది. మ‌రోవైపు రాష్ట్రంలోని పోలీసు సిబ్బందిలో కోవిడ్‌-19 బారిన ప‌డుతున్న‌వారి సంఖ్య పెరుగుతోంది. ఈ మేర‌కు ఇప్పటిదాకా 106 మంది అధికారులు, 901 మంది కానిస్టేబుళ్లు వైరస్ బారినపడ్డారు. నాగ్‌పూర్‌లోనూ కోవిడ్ కేసులు 300కు చేరాయి. ఇవాళ మరో రెండు కేసులు నమోదవ‌గా, ఈ క‌మ‌లాఫ‌లాల న‌గ‌రంలో కరోనావైరస్ సంక్రమణవ‌ల్ల‌ ఇప్పటివరకూ నాలుగు మరణాలు సంభవించాయి.
  • గుజరాత్: రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం ప్రకారం... కొత్త కేసులు 347 కాగా, 20 మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,541 కాగా, 513 మరణాలు జ‌రిగాయి. కొత్త కేసులలో 268 అహ్మదాబాద్‌లో, 29 వడోదరలో, 19 సూరత్‌లో, 10 గాంధీనగర్‌లో న‌మోద‌య్యాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన కేసులు 68 కాగా, వీటిలో 32 కేసులు ఒక్క ఉదయపూర్‌లోనే న‌మోద‌య్యాయి. ఇక జైపూర్, జోధ్‌పూర్‌ల‌లో రోగులు గరిష్ట సంఖ్య‌లో ఉండ‌గా ఉదయపూర్ ఇప్పుడు మూడో స్థానంలోకి వ‌చ్చింది. కేసుల రెట్టింపు శాతం ప్ర‌స్తుతం 18 రోజులు కాగా, కోలుకున్న‌వారి శాతం 60గా ఉంది. రాష్ట్రంలో మొత్తం కేసులు 3,988; వీటిలో యాక్టివ్: 1,551; 2,059 మంది డిశ్చార్జ్ అయ్యారు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో నిన్న 171 కొత్త కేసులు నమోదవ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 3,785కు చేరింది. కొత్త కేసుల‌లో 30 భోపాల్‌లో, 81 ఇండోర్ న‌గ‌రంలో న‌మోద‌య్యాయి.
  • గోవా: మూడో దశ దిగ్బంధం ముగిశాక మే 17న ఆక్షంల‌ను తొల‌గించాల‌ని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సూచించిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ముఖ్యంగా అంతర్రాష్ట్ర ప్రజా రవాణాపై మరికొన్ని సడలింపులు ఉండ‌వ‌చ్చున‌ని ఆశిస్తున్నారు. కాగా, గోవాలో కోవిడ్ యాక్టివ్ కేసు ఒక్క‌టి కూడా లేదు.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని నహర్‌లాగన్‌లో రెండో కోవిడ్-19 పరీక్షా కేంద్రాన్ని ఆరోగ్యశాఖ‌ మంత్రి ఇవాళ ప్రారంభించారు; ఇక్క‌డ TRUENAT సంస్థ‌ పరీక్షలు నిర్వ‌హిస్తుంది.
  • అసోం: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని న‌ర్సుల సేవ‌లను ముఖ్య‌మంత్రి కొనియాడారు. కోవిడ్‌-19పై పోరాటంలో ముందువ‌రుస‌న నిలిచి నిరంతరం అంకితభావంతో కృషి చేసి, కరోనావైరస్‌పై రాష్ట్ర పోరాటంలో వెన్నెముకగా నిలిచార‌ని పేర్కొన్నారు.
  • మణిపూర్: రాష్ట్రానికి తిరిగి వచ్చినవారి కోసం ప్రతి జిల్లాలో కేంద్రీకృత ప‌రీక్ష కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యాధి లక్షణాలు లేనివారంద‌రినీ అధికారిక నిర్బంధ వైద్య ప‌ర్య‌వేక్ష‌ణ‌ కేంద్రాల్లో 14 రోజులపాటు ఉంచ‌డంతోపాటు ఫ్లూవంటి లక్షణాలుంటే ఏకాంత చికిత్స వార్డులో ఉంచి పర్యవేక్షిస్తారు.
  • మిజోరం: దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న మిజోరం వాసుల భద్రత బాధ్య‌త రాష్ట్ర ప్రభుత్వానిదేన‌ని ముఖ్యమంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో వివిధ ప్రభుత్వ సంస్థలకు సహకరించాలని అభ్యర్థించారు.
  • నాగాలాండ్: దిమాపూర్‌లో ఇవాళ తొలిరోజున స‌రి-బేసి వాహ‌న నిబంధ‌న‌ను ఉల్లంఘించిన 746 వాహ‌న‌దారుల నుంచి పోలీసులు రూ.1.41 లక్షల జరిమానా వసూలు చేశారు.
  • సిక్కిం: రాష్ట్రంలోని సాయుధ బ‌లగాల సిబ్బందిలో ఒక్క కోవిడ్-19 కేసు కూడా లేద‌ని బ్లాక్ క్యాట్ డివిజన్ జీవోసీ మేజర్ జనరల్ ఆర్.సి.తివారీ సిక్కిం గవర్న‌ర్‌కు తెలిపారు. ఇవాళ ఆయ‌న‌ను క‌లుసుకున్న సంద‌ర్భంగా తాము చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలు, భద్రత విధానాల గురించి వివ‌రించారు.

 

FACT CHECK

 

********

 


(Release ID: 1623417) Visitor Counter : 331